కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవంలో భారత బృందం - రాణీ రెండవ ఎలిజబెత్
గ్లాస్గో: స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో 20వ కామన్వెల్త్ క్రీడలు భారత బృందం ముందు నడవగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వారి సంస్కృతిని ప్రతిబింభించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. క్రీడలు ప్రారంభమైనట్లు రాణీ రెండవ ఎలిజబెత్ ప్రకటించారు. ఈ వేడుకల్లో ప్రధాని డేవిడ్ కామెరూన్, స్కాట్లాండ్ ప్రభుత్వ మొదటి మంత్రి అలెక్స్ సాల్మండ్, కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రిన్స్ ఇమ్రాన్ టుంకు, బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ పాల్గొన్నారు. ఆ తరువాత క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఒలింపిక్స్ తర్వాత అతి పెద్ద ఎత్తున నిర్వహించే ఈ కామన్వెల్త్ క్రీడలు ఆగస్టు 3వ తేదీ వరకు జరుగుతాయి.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ యూనిసెఫ్ ప్రతినిధిగా గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవంలో డిజిటల్ స్క్రీన్ మీద మెరిశాడు. ప్రపంచం అంతటా పేద పిల్లల జీవన పరిస్థితులు మెరుగుపడటం కోసం డొనేషన్లు అందజేయమని విజ్ఞప్తి చేశారు. వివిధ దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులతో గ్లాస్గోలో పండగ వాతావరణం నెలకొంది. క్రీడాభిమానులతో నగరం కళకళలాడుతోంది. కామన్వెల్త్ క్రీడలకు స్కాట్‌లాండ్ ఇంతకు ముందు రెండు సార్లు ఆతిథ్యమిచ్చింది. ఇది మూడవసారి.