వచ్చే కామన్వెల్త్ క్రీడల్లో హాకీతోపాటు షూటింగ్, రెజ్లింగ్, క్రికెట్ తదితర పదమూడు క్రీడాంశాలను పక్కన బెట్టాలని నిర్వాహకులు చూస్తున్నారు. ఈ అంశంపై కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్) ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ బయటికి మాత్రం వెల్లడించడం లేదని మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) కూడా దీనిపై స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. కాగా 1998 కామన్వెల్త్ గేమ్స్‌లో హాకీని చేర్చాక ఇప్పటివరకు ఆ క్రీడను కొనసాగించారు.
అయితే 2026లో మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చే గ్లాస్గో (స్కాట్లాండ్) బడ్జెట్‌ను తగ్గించుకునే పనిలో భాగంగా హాకీకి మంగళం పాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో 19 క్రీడాంశాలను నిర్వహించగా, వీటిని కుదించాలని గ్లాస్గో ఆర్గనైజింగ్ కమిటీ కసరత్తు చేస్తోంది. కేవలం నాలుగు వేదికల్లో కుదించిన క్రీడాంశాలను నిర్వహించడం ద్వారా బడ్జెట్‌ను చాలా వరకు తగ్గించుకోవచ్చని భావిస్తోంది.
ఇక 2026 ఏడాదిలో జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు ఈ కామన్వెల్త్ గేమ్స్ ఉండగా, రెండు వారాల్లోపే ప్రపంచకప్ హాకీ కూడా ఉండటం కూడా సాకుగా చూపే అవకాశముంది. బెల్జియం, నెదర్లాండ్స్‌లు సంయుక్తంగా నిర్వహించే ప్రపంచకప్ హాకీ టోర్నీ ఆగస్టు 15 నుంచి 30 వరకు జరుగుతుంది.
హాకీ ఆటను తొలగించాలనుకుంటున్న వార్తలపై స్పందించిన ఎఫ్‌ఐహెచ్ త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని చెప్పింది. మంగళవారం క్రీడాంశాల విషయమై ప్రకటన వెలువడుతుందని చెప్పింది. 2022 బరి్మంగ్‌హామ్ గేమ్స్‌లో పురుషుల విభాగం ఆస్ట్రేలియా జట్టుకు స్వర్ణం లభించగా... భారత జట్టుకు రజతం దక్కింది.
కాగా తొలగించేక్రీడల జాబితాలో హాకీ, క్రికెట్, రగ్బీ సెవన్స్, డైవింగ్, బ్యాడ్మింటన్, బీచ్ వాలీబాల్, రోడ్ సైక్లింగ్, మౌంటేన్‌బైకింగ్, రిథమిక్, జిమ్నాస్టిక్స్, స్క్వాష్ , టేబుల్ టెన్నిస్/పారా టేబుల్ టెన్నిస్, ట్రైయథ్లాన్/పారాట్రైయథ్లాన్, రెజ్లింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment