సంతోషికి అభినందనల వెల్లువ
విజయనగరం మున్సిపాలిటీ/నెల్లిమర్ల రూరల్: స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో 53 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో కాంస్యపతకం దక్కించుకున్న నెల్లిమర్ల మండలం కొండ వెలగాడ గ్రామానికి చెందిన మత్స సంతోషిని అదృష్టం తలుపుతట్టి వరిస్తోంది. ఇన్నాళ్లూ కష్టించిన ఆమెను అదృష్టదేవత పలకరిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న ఆమెకు రజతం పతకం దక్కింది. ఇదే విభాగంలో స్వర్ణం దక్కించుకున్న క్రీడాకారిణి డోపింగ్ టెస్ట్‌లో దొరికిపోవడంతో ఆమెకు దక్కిన పతకాన్ని రద్దుచేశారు. దీంతో రజతం దక్కించుకున్న క్రీడాకారిణికి నిర్వాహకులు స్వర్ణం ప్రకటించడంతో కాంస్యం దక్కించుకున్న సంతోషి రజతపతకం కైవసం చేసుకున్న ట్లయింది. ఈ మేరకు జిల్లాలో మరోసారి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె.మనోహర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన.అయ్యలు, కార్యదర్శి సిహెచ్.వేణుగోపాలరావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు దన్నాన తిరుపతిరావు సంతోషికి అభినందనలు తెలిపారు. గ్లాస్గో నుంచి హైదరాబాద్ వస్తున్న సంతోషికి స్వాగతం పలికేందుకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె.మనోహర్ హైదరాబాద్ బయలుదేరారు. మత్స సంతోషి కామన్వెల్త్ గేమ్స్‌లో అనూహ్య పరిస్థితుల్లో రెండవ స్థానానికి వెళ్లి రజత పతకం సాధించినట్లు తెలియడంతో ఆమె తల్లిదండ్రులు, కోచ్ చల్లా రాము, సహచరు లు, వివిధ రాజకీయ పార్టీలకు చెం దిన నాయకులు, వివిధ సంఘాలు, అభిమానులు, కొండవెలగాడ గ్రామస్తుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సం తోషి ప్రతిభను కొనియాడుతున్నారు.