పీవీ సింధుకు బ్యాడ్మింటన్లో కాంస్యం
కామన్వెల్త్ బ్యాడ్మింటన్లో సింధు కాంస్యపతకం సొంతం చేసుకుంది. బ్రాంజ్ కోసం కొనసాగిన పోరులో మలేసియా క్రీడాకారిణి జింగ్ ఇ టిపై వరుసగా రెండు గేమ్లను సొంతం చేసుకున్న సింధు.. కాంస్యపతక విజేతగా నిలిచింది. వరుసగా రెండు గేమ్లను 23-21, 21-9 తేడాతో గెలిచి భారత ఖాతాలో మరో పతకాన్ని జోడించింది.
హోరాహోరీగా సాగిన తొలి గేమ్ను సింధు 23-21తో గెలుచుకుంది. చాలావరకు ఆధిపత్యం కనబర్చిన సింధు, అనుకోకుండా ఒకటి రెండు పొరపాట్లు చేయడంతో ఈ గేమ్ గెలుచుకోడానికి చెమటోడ్చాల్సి వచ్చింది. మలేసియా క్రీడాకారిణి జింగ్ కంటే ఎత్తుఎక్కువగా ఉండటం సింధుకు అడ్వాంటేజ్గా మారింది. కోర్టు నలుమూలలకూ చురుగ్గా కదలడంలో సింధు ముందంజలో ఉంది. దాంతోపాటు ప్లేస్మెంట్లు వేయడంలో కూడా మిచి పరిణితితో వ్యవహరించింది. కోచ్ గోపీచంద్ వెన్నంటి ఉండి సింధుకు మంచి ప్రోత్సాహం అందించారు. రెండో గేమ్లో మాత్రం సింధు పూర్తి ఆధిక్యం కనబర్చింది. ఎక్కడా పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకపోవడానికి తోడు జింగ్ను ముప్పుతిప్పలు పెట్టింది. జింగ్ మధ్యలో ఓ సమయంలో కాస్త తేరుకున్నట్లు కనిపించినా, సింధు మాత్రం ఆమె ఆట సాగనివ్వలేదు.