అందమైన ప్రయాణం.. జీర్ణించుకోలేని ఓటమి.. ఇకపై: పీవీ సింధు | Paris Olympics 2024: PV Sindhu Shares Emotional Note On Social Media, Makes Future Plan Clear | Sakshi
Sakshi News home page

PV Sindhu Viral Post: అందమైన ప్రయాణం.. జీర్ణించుకోలేని ఓటమి.. ఇకపై

Published Fri, Aug 2 2024 4:39 PM | Last Updated on Fri, Aug 2 2024 6:19 PM

Paris Olympics: PV Sindhu Shares Emotional Note Makes Future Plan Clear

‘‘ప్యారిస్‌లో అందమైన ప్రయాణం.. కానీ... జీర్ణించుకోలేని ఓటమి. నా కెరీర్‌లో అత్యంత కఠినమైన సమయం. జరిగినదాన్ని నా మనసు అంగీకరించేందుకు ఎంతకాలం పడుతుందో తెలియదు. ఏదేమైనా గతాన్ని మరిచి ముందుకు సాగాల్సిందే.

ఈ ప్రయాణంలో ఓ యుద్ధమే చేయాల్సి వచ్చింది.  రెండేళ్ల పాటు గాయాలతో సతమతమయ్యాను. సుదీర్ఘకాలం పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ సవాళ్లన్నంటినీ అధిగమించి.. ఇక్కడి దాకా వచ్చి.. విశ్వ క్రీడల్లో మూడోసారి నా అందమైన, అద్భుతమైన దేశానికి ప్రాతినిథ్యం వహించడం నిజంగా నాకు దక్కిన గొప్ప అదృష్టం.

ఓ తరానికి స్ఫూర్తిగా నిలిచానంటూ మీరు పంపే సందేశాలు.. ఇలాంటి కష్టకాలంలో నాకెంతో ఊరట కలిగిస్తున్నాయి. ప్యారిస్‌ 2024లో నేను, నా జట్టు అత్యుత్తమంగా రాణించేందుకు శాయశక్తులా కృషి చేశాం. ఎలాంటి పశ్చాత్తాపమూ లేదు.

ఇక.. నా భవిష్యత్‌ ప్రణాళికల విషయానికొస్తే... ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నేను కచ్చితంగా ఆటలో కొనసాగుతా. అయితే, కొంతకాలం బ్రేక్‌ తీసుకుంటా. ఇది కేవలం చిన్న విరామం మాత్రమే.

నా శరీరం.. ముఖ్యంగా నా మనసుకు ఇది చాలా అవసరం. ఇకపై మరింత జాగ్రత్తగా ఉంటాను. నా కెరీర్‌ ప్లానింగ్‌ విషయంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వను. నాకెంతగానో ఇష్టమైన క్రీడను మరింతగా ఆస్వాదిస్తూ ముందుకు సాగుతాను’’ అని భారత బ్యాడ్మింటన్‌ పూసర్ల వెంకట సింధు ఉద్వేగపూరిత నోట్‌ షేర్‌ చేసింది.

రెండుసార్లు ఒలింపిక్‌ పతకాలు గెలిచి
ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో తన ప్రయాణం అర్ధంతరంగా ముగిసిపోవడం పట్ల సింధు విచారం వ్యక్తం చేసింది. అయితే, ఓటమి తనను కుంగదీయలేదని.. వేగంగా తిరిగి వస్తానని.. ఆటను కొనసాగిస్తానని స్పష్టం చేసింది. కాగా తెలుగు తేజం పీవీ సింధు ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్‌ పతకాలు గెలిచిన విషయం తెలిసిందే.

పసిడి పతకం గెలుస్తానని ధీమా
రియో ఒలింపిక్స్‌-2016లో రజతం గెలిచిన ఈ స్టార్‌ షట్లర్‌.. టోక్యో ఒలింపిక్స్‌- 2020లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈ క్రమంలో భారీ అంచనాల నడుమ ప్యారిస్‌ ఒలింపిక్స్‌ బరిలో దిగింది పీవీ సింధు. ఆమె గత రికార్డుల దృష్ట్యా మహిళల సింగిల్స్‌ విభాగంలో పతకం ఖాయమని విశ్లేషకులు భావించారు. సింధు సైతం ఈసారి పసిడి పతకం గెలుస్తానని ధీమా వ్యక్తం చేసింది.

చేదు అనుభవం
అయితే, రౌండ్‌ ఆఫ్‌ 16లోనే ఆమె పోరాటం ముగిసిపోయింది. గురువారం నాటి ప్రిక్వార్టర్స్‌లో అనూహ్య రీతిలో 29 ఏళ్ల పీవీ సింధు ఓటమిపాలైంది. వరల్డ్‌ నంబర్‌ 13 ర్యాంకర్‌ అయిన సింధు.. రౌండ్‌ ఆఫ్‌ 16లో ప్రపంచ 9వ ర్యాంకర్‌ హి బింగ్‌జియావో (చైనా)తో తలపడింది. 

ప్రత్యర్థి చేతిలో 19–21, 14–21తో  ఓడిపోయింది. కాగా 2020 టోక్యో ఒలింపిక్స్‌ సెమీస్‌లో హి బింగ్‌జియావోతోనే పోటీపడిన సింధు.. ఆమెను ఓడించి కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి మాత్రం బింగ్‌జియావో సింధుపై పైచేయి సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement