అవరోధాలను ఎత్తిపడేసింది!
విజయాన్ని అందరూ కోరుకుంటారు. కానీ కొందరు మాత్రమే దాన్ని తెచ్చి ఒళ్లో వేసుకుంటారు. మత్స సంతోషి ఈ రెండో కోవకు చెందిన అమ్మాయి. విజయాన్ని పొందడమే కాదు... దాన్ని తన ఇంట్లో కట్టి పారేసిందామె. తన ఇంటి అల్మరాలో ఉండే మెడళ్లు, అవార్డులు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. సాధన చేయడం, సాధించి తీరడం ఆమెను చూసే నేర్చుకోవాలి ఎవరైనా. తాజా కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకాన్ని సాధించిన సంతోషి ఇంతవరకూ చేసిన ప్రయాణం... స్ఫూర్తిదాయకం!
ఏదైనా సాధించాలంటే ఏం కావాలి... డబ్బా? పలుకుబడా? కాదు. ఆత్మవిశ్వాసం, అకుంఠిత దీక్ష. అవి మత్స సంతోషికి మెండుగా ఉన్నాయి. అందుకే ఆమె అనుకున్నది సాధించింది. ఎవరూ ఊహించని విజయాన్ని అందుకుంది. క్రీడాకారిణిగా లెక్కలేనన్ని పతకాలు సాధించింది.
విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామం సంతోషిది. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. తండ్రి రామారావు జూట్ మిల్లులో కార్మికుడు. తల్లి రాములమ్మ గృహిణి. నలుగురు పిల్లలు. ముగ్గురు ఆడపిల్లల్లో మూడవది సంతోషి. చురుకైనది. హుషారైనది. ఆమె ఈ రోజు ఈ స్థాయికి చేరుకోవడానికి పునాది వేసినవి ఆ లక్షణాలే.
సంతోషి ఐదో తరగతి చదువుతున్నప్పుడు ఆ గ్రామానికి చెందిన వల్లూరి శ్రీనివాసరావు అంతర్జాతీయ పతకాన్ని సాధించారు. ఆయనకు సంతోషి చదువుతున్న పాఠశాలలో సన్మానం జరిగింది. అది సంతోషి చిన్ని మనసు మీద పెద్ద ప్రభావమే చూపించింది. ‘నన్నూ ఇలా సత్కరిస్తే బాగుణ్ను, ఎప్పటికైనా అలా జరుగుతుందా’ అనుకునేది. 2005లో అదే గ్రామానికి చెందిన వెయిట్ లిఫ్టింగ్ కోచ్ చల్లా రాము సంతోషిలోని ఉత్సాహాన్ని గమనించారు. ‘నువ్వు మంచి వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌వవుతావని నా నమ్మకం, ప్రయత్నించు’ అన్నారు. దాంతో తను మొదట వేయాల్సిన అడుగేంటో అర్థమైంది సంతోషికి.
కష్టాలకు ఎదురీది...
పల్లెటూరు... లోకజ్ఞానం తక్కువ. దానికి తోడు పేదరికం. ఇలాంటి పరిస్థితుల్లో కలను సాకారం చేసుకునే దిశగా సాగడం అంత తేలికేమీ కాదు. రాము ఆధ్వర్యంలో సంతోషి సాధన ప్రారంభించే నాటికి ఆ ఇంట్లో ఒక్క ఆడపిల్లకి మాత్రమే పెళ్లయ్యింది. మిగతా పిల్లల్ని పెంచడానికి తండ్రి నానా ఇబ్బందులూ పడుతున్నాడు. మూడు వేల జీతంతో అయిదుగురి జీవితాలను నడుపుతున్నాడు. ఆయనకు అండగా ఉండేందుకు సంతోషి చిన్నక్క ఓ ఆసుపత్రిలో పని చేసేది. వేణ్నీళ్లకు చన్నీళ్లలా తండ్రి సంపాదనకు తన సంపాదనను జోడించేది. అయినా తీరని కష్టాలు వారివి.
అందుకే సంతోషి లక్ష్యసాధనకు ఆటంకాలు ఎక్కువగానే వచ్చాయి. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం అవసరమా అని ఆలోచించేది. వాళ్లకు కూడా ఇది అదనపు భారమే. అయితే రాము వారిని ఒప్పించారు. సంతోషి భవిష్యత్తు బాగుంటుందని భరోసా ఇచ్చారు. దాంతో వారు సరే అన్నారు.
ఆ వెంటనే సంతోషి సాధన మొదలుపెట్టింది. మొదటి సంవత్సరంలోనే రాష్ట్రస్థాయిలో బంగారు పతకాన్ని సాధించింది. దాంతో ఆత్మవిశ్వాసం హెచ్చింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదల పెరిగింది. కానీ చదువు విషయంలో ఇబ్బంది పడేది. 2010లో 10వ తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే అదే ఏడాది ఏషియన్ వెయిట్‌లిప్టింగ్ చాంపియన్‌షిప్ ఉండడంతో 2009 నుంచి కోచింగ్ కోసం పంజాబ్‌లో ఉండిపోవడంతో పరీక్షలకు హాజరు కాలేకపోయింది.
2011లో రాసి పాసయ్యింది. 2012లో నెల్లిమర్లలోని సీకేఎం ప్రభుత్వ జూనియర్ జూనియర్ కళాశాలలో ఇంటర్‌లో హెచ్‌ఇసీ గ్రూపులో చేరింది సంతోషి. అయితే తరచూ ప్రాక్టీసుకు వెళ్లడంతో హాజరు చాలక, ఫైన్ కట్టాల్సి వచ్చింది. కోచింగ్ కోసం వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఆహ్వాన పత్రాలను కాలేజీ వారికి చూపించినా వారు ప్రోత్సహించలేదు. పీడీ బొమ్మన రామారావు ఒక్కరే సంతోషికి సహకరించేవారు. చివరికి ద్వితీయ సంవత్సరం సంతోషిని రెగ్యులర్ విద్యార్థినిగా కాకుండా ప్రైవేటు విద్యార్థినిగా చేశారు. ఇవన్నీ ఆమెను బాధ పెట్టేవి. కానీ దిగులు పడేది కాదు. ఎలాగోలా నెట్టుకొచ్చేది.
దానికి తోడు ఆర్థికావసరాలు కూడా అడ్డుపడుతుండేవి. మొదటి నేషనల్ పోటీలకు మణిపూర్ వెళ్లేందుకు డబ్బులు లేకపోతే తల్లి తన చెవి కమ్మలు అమ్మి డబ్బులు ఇచ్చింది. రాము ఆమెకు కొన్ని విషయాల్లో సహాయపడేవారు. ఏదైనా పోటీలో ప్రైజ్ మనీ వస్తే, తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా ఆ సొమ్ముతో తన ఆటకు అవసరమైన వాటిని సమకూర్చుకునేది. ఆ కష్టం ఊరికే పోలేదు. ఈరోజు సంతోషి తల్లిదండ్రుల కళ్లు బాధతోనో, కష్టం వల్లనో కాదు... తమ కూతురు సాధించినదాన్ని చూసి గర్వంతో తడుస్తున్నాయి.
- నడిపేన బంగారు నాయుడు, సాక్షి, విజయనగరం
ఫొటోలు: డి.సత్యనారాయణమూర్తి
ఈ స్థాయికి చేరుకోవడానికి తల్లిదండ్రులతో పాటు తన కోచ్ రాము కూడా ఎంతో తోడ్పడ్డారని అంటుంది సంతోషి. ఆయనే కనుక తన టాలెంట్‌ని గుర్తించి ఉండకపోతే ఇవన్నీ సాధించగలిగేదాన్ని కాదు అంటుంది... తనకొచ్చిన మెడల్స్‌ని చూపిస్తూ! స్పాన్సర్స్ ఎవరూ లేకపోయినా... లయన్స్ క్లబ్ తరఫున తనకు వ్యక్తిగతంగా ప్రోత్సాహాన్ని అందిస్తోన్న డాక్టర్ బీఎస్‌ఆర్ మూర్తికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతోందామె!