ప్రతిభ ఉన్నా ప్రోత్సాహమేదీ..?
► వెయిట్ లిఫ్టింగ్‌లో రాణిస్తున్న లలిత
► పట్టించుకోని క్రీడాశాఖాధికారులు
► క్రీడా మంత్రి ఉన్నా అందని చేయూత
నరసన్నపేట: నేతింటి లలిత.. నరసన్నపేట పట్టణానికి చెంది న ఈ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి అడుగుపెట్టిన ప్రతి టోర్నీలోనూ పతకాలు కొల్లగొడుతూ శభాష్ అనిపించుకుంటోంది. నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అరకొర వసతులతో ఉన్న వ్యాయామ శాలలో శిక్షణ పొందుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తాచాటుతోంది. పలు పతకాలను కైవసం చేసుకుంటూ జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్న నేతింటి లలితకు క్రీడాశాఖ అధికారుల నుంచి ప్రోత్సాహం కరువవుతోంది.
పతకాలతో మెరుస్తున్నా కనీస ఆర్థిక సాయం చేయడం లేదు. కొంతమంది క్రీడాకారులకు అదే పనిగా నజరానాలు ప్రకటిస్తున్న ప్రభుత్వాలు, క్రీడా శాఖాధికారులు లలిత లాంటి పేద క్రీడాకారిణులకు భరోసా కల్పించలేకపోతున్నారు. క్రీడా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లాలోనే గ్రామీణ క్రీడాకారు ల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే మిగిలిన జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
లలిత సాధించిన విజయాల్లో కొన్ని..
ఈ ఏడాది ఫిబ్రవరి 18, 19వ తేదీల్లో కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సీనియర్ విభాగంలో స్వర్ణ పతకం.
పంజాబ్ రాష్ట్రం చండీఘడ్‌లో జనవరిలో జరిగిన అఖిలభారత విశ్వ విద్యాలయాల స్థాయి పోటీల్లో నాలుగో స్థానం.
2016 డిసెంబరులో భువనేశ్వర్‌లో జరిగిన ఓపెన్ జూనియర్ జాతీయ స్థాయి పోటీల్లో కాంస్య పతకం.
నవంబర్‌లో విజయనగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సీనియర్, జూనియర్ విభాగాల్లో రెండు స్వర్ణ పతకాలు.
2015లో బీహార్ రాష్ట్రం పాట్నాలో గత ఏడాది జరిగిన జూనియర్ విభాగం పోటీల్లో మూడు కాంస్య పతకాలు.
ఏలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రెండు స్వర్ణ పతకాలు.
ఈ విధంగా ప్రతి పోటీలోనూ పతకం సాధిస్తూ జిల్లా, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న లలితను ఆర్థి కంగా ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావడంలేదు. ఇప్పటికైనా క్రీడాశాఖ అధికారులు స్పందించి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
అవార్డు ఇవ్వాలి
లలిత నిరు పేదకుటుంబానికి చెందిన అమ్మాయి. మంచి శిక్షణ ఇస్తే మరిన్ని పతకాలు సొంతం చేసుకుని జిల్లా, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తుంది. లలితను ఆర్థికంగా ఆదుకొని రాష్ట్ర మనీ అవార్డు ఇవ్వాలి. – అప్పలరామయ్య, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జాయింట్ కార్యదర్శి
స్టైఫండ్ ఇవ్వాలి
ఒలింపిక్, ఇతర ప్రపంచ స్థాయి పోటీల్లో ఏమాత్రం ప్రతిభ చూపినా కాసులు కురిపిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధిస్తున్నా క్రీడాకారులను పట్టించుకోవడం లేదు. గ్రామీణ క్రీడాకారులకు నెలవారీ స్టైఫండ్ ఇవ్వాలి. –గొద్దు చిట్టిబాబు, వైఎంసీఏ అధ్యక్షుడు, నరసన్నపేట