భారత్ ‘కనక’ వర్షం
* రెండో రోజు 16 స్వర్ణాలు
* రెజ్లింగ్, స్విమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకాల పంట
* దక్షిణాసియా క్రీడలు
గువాహటి: సొంతగడ్డపై జరుగుతోన్న దక్షిణాసియా క్రీడల్లో భారత క్రీడాకారులు దుమ్మురేపుతున్నారు. బరిలోకి దిగిన ప్రతి ఈవెంట్‌లో అదరగొడుతూ పతకాల పంట పండిస్తున్నారు. పోటీల తొలి రోజు శనివారం 14 స్వర్ణాలను సాధించిన భారత ఆటగాళ్లు... రెండో రోజూ మరింత చెలరేగి ఏకంగా 16 పసిడి పతకాలతో అదుర్స్ అనిపించారు.
ప్రస్తుతం భారత్ 30 స్వర్ణాలు, 12 రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెజ్లింగ్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణాలు, రజతం దక్కాయి. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో అమిత్ ధన్‌కర్ (70 కేజీలు), ప్రదీప్ (61 కేజీలు)... మహిళల విభాగంలో మమత (53 కేజీలు), మంజూ కుమారి (58 కేజీలు) స్వర్ణ పతకాలను సాధించారు. పురుషుల 86 కేజీల విభాగంలో భారత రెజ్లర్ గోపాల్ యాదవ్ రజతంతో సంతృప్తి పడ్డాడు.
వెయిట్‌లిఫ్టింగ్‌లో నాలుగు స్వర్ణాలు లభించాయి. మహిళల విభాగంలో సరస్వతి రౌత్ (58 కేజీలు)... రాఖీ హలెర్ (69 కేజీలు)... పురుషుల విభాగంలో సంబూ లాపుంగ్ (69 కేజీలు), అజయ్ సింగ్ (77 కేజీలు) పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు. వుషు క్రీడాంశంలోని చాంగ్‌స్వాన్ ఈవెంట్‌లో సప్నా దేవి (భారత్) స్వర్ణం దక్కించుకుంది. మహిళల సైక్లింగ్ 40 కిలోమీటర్ల క్రయిటీరియమ్ ఈవెంట్‌లో లిదియామోల్ సన్నీ భారత్‌కు బంగారు పతకాన్ని అందించింది.
స్విమ్మింగ్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణాలు లభించాయి. పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో సందీప్ సెజ్వాల్... 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో అరవింద్... 1500 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో సజన్ ప్రకాశ్... మహిళల 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో సయానీ ఘోష్ భారత్‌కు బంగారు పతకాలను అందించారు. టేబుల్ టెన్నిస్ (టీటీ) పురుషుల, మహిళల టీమ్ ఈవెంట్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకాలు దక్కాయి. మహిళల ఫైనల్లో భారత్ 3-0తో పాకిస్తాన్‌పై, పురుషుల ఫైనల్లో భారత్ 3-0తో శ్రీలంకపై గెలిచాయి.
భారత్ 24 - నేపాల్ 0
మహిళల హాకీలో భారత జట్టు గోల్స్ వర్షం కురిపించింది. నేపాల్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 24-0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. తెలంగాణ క్రీడాకారిణి యెండల సౌందర్య (15వ, 52వ, 62వ, 64వ నిమిషాల్లో), పూనమ్ బార్లా నాలుగేసి గోల్స్ చేయగా... రాణి, జస్‌ప్రీత్ కౌర్, నేహా గోయల్, దీపిక మూడేసి గోల్స్ నమోదు చేశారు. గుర్జీత్ కౌర్, ప్రీతి దూబే రెండేసి గోల్స్ సాధించారు. పురుషుల లీగ్ మ్యాచ్‌లో భారత్ 4-1తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. బ్యాడ్మింటన్‌లో భారత పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి.