South Sports
-
వైభవంగా ముగింపు
♦ అట్టహాసంగా ముగిసిన దక్షిణాసియా క్రీడలు ♦ అన్నింటిలో భారత్‌దే ఆధిపత్యం ♦ ఆఖరి రోజూ పసిడి పంచ్ గువాహటి : క్రీడాభిమానులను 12 రోజుల పాటు అలరించిన దక్షిణాసియా క్రీడలు మంగళవారం ఘనంగా ముగిశాయి. భారత సంస్కృతిని ప్రతిబింబిస్తూ చేసిన నృత్య కార్యక్రమాలతో పాటు మిరుమిట్లుగొలిపే ఫైర్‌వర్క్‌తో ఇందిరాగాంధీ అథ్లెటిక్ స్టేడియం మార్మోగిపోయింది. మ్యూజిక్ లైవ్ షో, డాన్సులు, వివిధ రంగాల్లోని ప్రముఖులు తమ గాత్ర మాధుర్యాలతో అభిమానులను ఆకట్టుకున్నారు. బాలీవుడ్ రాక్‌స్టార్ షాన్... బాలీవుడ్ పాటలతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్, అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్, మేఘాలయ క్రీడల మంత్రి జెనిత్ ఎం సంగ్మా, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు ఎన్. రామచంద్రన్‌లు పాల్గొన్నారు. స్టేడియంలో నిరంతరాయంగా మండుతున్న కలడ్రాన్ ఆర్పివేయడం ద్వారా క్రీడలు అధికారికంగా ముగిసినట్లు సోనోవాల్ ప్రకటించారు. తర్వాత దక్షిణాసియా ఒలింపిక్ కౌన్సిల్ పతాకాన్ని అవనతం చేస్తూ... దాన్ని ఐఓఏ అధ్యక్షుడు రామచంద్రన్‌కు ఇచ్చారు. ఐఓఏ చీఫ్ దాన్ని.. 13వ దక్షిణాసియా క్రీడలకు వేదికైన నేపాల్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ జీవన్ రామ్ శ్రేష్టకు అందజేశారు. మరోవైపు షిల్లాంగ్‌లో ఆఖరి రోజు జరిగిన క్రీడల్లోనూ భారత బాక్సర్ల ‘పంచ్’ పవర్ అదిరింది. అందుబాటులో ఉన్న మూడు స్వర్ణాలను క్లీన్‌స్వీప్ చేసి సత్తా చాటారు. మహిళల 51 కేజీల ఫైనల్లో స్టార్ బాక్సర్ మేరీకామ్... టెక్నికల్ నాకౌట్ (టీఓకే) ద్వారా అనుషా కొడితువాక్క్ (శ్రీలంక)పై గెలిచింది. 75 కేజీల బౌట్లో పూజా రాణి కూడా ‘టీఓకే’ ద్వారా నీలాంతి అందర్వీర్ (శ్రీలంక)ను ఓడించింది. ఇక ఏడాది నిషేధం తర్వాత బరిలోకి దిగిన లైష్రామ్ సరితా దేవి... 60 కేజీల టైటిల్ పోరులో 39-36తో విదుషికా ప్రబాది (శ్రీలంక)పై నెగ్గింది. ఓవరాల్‌గా ఈ ముగ్గురి ప్రదర్శనతో భారత్ బాక్సర్లు గేమ్స్‌లో మొత్తం 10 స్వర్ణాలను సాధించారు. జూడోలోనూ భారత క్రీడాకారుల ‘పట్టు’ అదిరింది. పురుషుల 90 కేజీల బౌట్లో అవతార్ సింగ్... మొహమ్మద్ ఇస్మాయిల్ (అఫ్ఘానిస్తాన్)పై నెగ్గి స్వర్ణం సాధించగా, మహిళల 70 కేజీల్లో పూజా... బీనిష్ ఖాన్ (పాకిస్తాన్)ను ఓడించి కనకంతో మెరిసింది. మహిళల 78 కేజీల ఫైనల్లో ఫౌజియా ముంతాజ్ (పాకిస్తాన్) చేతిలో ఓడిన భారత క్రీడాకారిణి అరుణ రజతంతో సంతృప్తి పడింది. పురుషుల 100 కేజీల ఫైనల్లో కూడా శుభమ్ కుమార్... షా హుస్సేన్ చేతిలో పరాజయం చవిచూసి రజతంతో సరిపెట్టుకున్నాడు. ఓవరాల్‌గా అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టిన భారత క్రీడాకారులు మొత్తం 308 (188 స్వర్ణాలు+90 రజతాలు+30 కాంస్యాలు) పతకాలతో వరుసగా 11వ సారి అగ్రస్థానంలో నిలిచారు. -
భారత్ ‘బంగారు గురి’
► షూటింగ్లో క్లీన్‌స్వీప్ ► ఎనిమిదో రోజు తొమ్మిది స్వర్ణాలు ► దక్షిణాసియా క్రీడలు గువాహటి: అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్న భారత క్రీడాకారులు దక్షిణాసియా క్రీడల్లో తమ జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. పోటీల ఎనిమిదో రోజు శనివారం భారత క్రీడాకారులు తొమ్మిది స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. షూటింగ్లో ఆరు పసిడి పతకాలు లభించగా... ట్రయాథ్లాన్లో రెండు స్వర్ణాలు, తైక్వాండోలో ఒక బంగారు పతకం దక్కింది. ప్రస్తుతం భారత్ 156 స్వర్ణాలు, 85 రజతాలు, 27 కాంస్యాలతో కలిపి మొత్తం 268 పతకాలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. శ్రీలంక 25 స్వర్ణాలు, 55 రజతాలు, 83 కాంస్యాలతో కలిపి మొత్తం 163 పతకాలతో రెండో స్థానంలో ఉంది. షూటింగ్లో భారత ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. శనివారం జరిగిన ఆరు ఈవెంట్స్‌లో భారత్ స్వర్ణాలతో క్లీన్‌స్వీప్ చేసింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లో ఓంకార్ సింగ్... టీమ్ ఈవెంట్లో ఓంకార్ సింగ్, గుర్ప్రీత్ సింగ్, జితేంద్ర విభూతేలతో కూడిన బృందానికి బంగారు పతకాలు దక్కాయి. మహిళల 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో రాహీ సర్నోబాత్, అన్నురాజ్ సింగ్, అనీసా సయ్యద్‌లతో కూడిన భారత జట్టు స్వర్ణం సొంతం చేసుకోగా... వ్యక్తిగత విభాగంలో రాహీ, అన్నురాజ్, అనీసాలకు వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు దక్కాయి. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత ఈవెంట్లో అంజుమ్, సుసాన్ కోషి ఎలిజబెత్, లజ్జా గోస్వామిలకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభించాయి. టీమ్ ఈవెంట్లో ఈ ముగ్గురితో కూడిన భారత్‌కే పసిడి పతకం దక్కింది. పురుషుల తైక్వాండో 87 కేజీల విభాగంలో పి.కుమార్ భారత్ తరఫున ఏకైక స్వర్ణాన్ని సాధించాడు. ఫైనల్లో హుస్సేని (అఫ్ఘానిస్తాన్)పై కుమార్ గెలిచాడు. పురుషుల ట్రయాథ్లాన్ (స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్)లో దిలీప్ కుమార్... మహిళల ట్రయాథ్లాన్లో పల్లవి రేతివాలా పసిడి పతకాలు గెలిచారు. పురుషుల కబడ్డీ లీగ్ మ్యాచ్‌ల్లో తొలుత భారత్ 30-17తో బంగ్లాదేశ్‌ను... ఆ తర్వాత 9-8తో పాకిస్తాన్‌ను ఓడించింది. మహిళల కబడ్డీ లీగ్ మ్యాచ్‌ల్లో తొలుత భారత్ 56-23తో పాకిస్తాన్‌పై, ఆ తర్వాత 43-11తో బంగ్లాదేశ్‌పై గెలిచింది. పురుషుల ఫుట్‌బాల్ ఈవెంట్లో భారత్ 3-0తో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. -
‘బంగారు’ చేపలు
* స్విమ్మింగ్‌లో భారత్‌కు ఏడు స్వర్ణాలు * దక్షిణాసియా క్రీడలు * ఆర్చరీ, అథ్లెటిక్స్‌లో ఐదేసి పసిడి పతకాలు గుహవాటి / షిల్లాంగ్: దక్షిణాసియా క్రీడల్లో భారత క్రీడాకారుల ఆధిపత్యం కొనసాగుతోంది. మంగళవారం స్విమ్మింగ్‌లో సంచలన ప్రదర్శనతో చెలరేగిన స్విమ్మర్లు ఏడు స్వర్ణాలతో మెరవగా, ఆర్చరీ, అథ్లెటిక్స్‌లో చెరో ఐదు పసిడి పతకాలతో కనువిందు చేశారు. ఓవరాల్‌గా నాలుగో రోజుకు భారత్ 124 (78 స్వర్ణాలు, 36 రజతాలు, 10 కాంస్యాలు) పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. స్విమ్మింగ్‌లో 400 మీ. ఫ్రీస్టయిల్లో సౌరభ్ సంగ్వేకర్ (3:58.84 సెకన్లు) గేమ్స్ రికార్డుతో తొలి స్వర్ణాన్ని అందించాడు. మహిళల కేటగిరీలో మాల్విక (4:30.08 సెకన్లు) మీట్ రికార్డుతో పసిడిని సాధించింది. పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో సాజన్ ప్రకాశ్ (2:03.08 సెకన్లు), మహిళల్లో దామిని గౌడ (2:21.12 సెకన్లు) స్వర్ణాలు నెగ్గారు. పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో పీఎస్. మధు (28.26 సెకన్లు) స్వర్ణం గెలిచాడు. 4ఁ200 మీటర్ల ఫ్రీస్టయిల్లో పురుషుల, మహిళల జట్లకు పసిడి పతకాలు లభించాయి. ఆర్చరీలో మహిళల రికర్వ్‌లో దీపికా, లక్ష్మీరాణి, బాంబేలాదేవి బృందం, పురుషుల్లో తరుణ్‌దీప్ రాయ్, గురుచరణ్ బెస్రా, జయంత్ తాలుక్దారుల జట్టు స్వర్ణాలు గెలిచాయి. రికర్వ్ మిక్స్డ్ పెయిర్లో తరుణ్‌దీప్, దీపిక స్వర్ణం నెగ్గారు. మహిళల వ్యక్తిగత రికర్వ్‌లో దీపిక, పురుషుల రికర్వ్‌లో తరుణ్‌దీప్ బంగారు పతకాలు నెగ్గారు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లోనూ భారత అథ్లెట్ల హవా కొనసాగింది. తొమ్మిది ఈవెంట్లలో ఐదు స్వర్ణాలు, ఆరు రజతాలు, మూడు కాంస్యాలతో సత్తా చాటారు. మహిళల షాట్‌పుట్‌లో మన్‌ప్రీత్ కౌర్ (17.94 మీటర్లు)కు స్వర్ణం, మన్‌ప్రీత్ కౌర్ జూనియర్ (15.94 మీటర్లు) రజతం దక్కాయి. పురుషుల హామర్ త్రోలో నీరజ్ కుమార్ (66.14 మీటర్లు), మహిళల లాంగ్ జంప్‌లో మయూకా జానీ (6.43 మీటర్లు) స్వర్ణాలతో మెరిశారు. జానీ సహచరిణి శ్రద్ధ (6.19 మీటర్లు) రజతం నెగ్గింది. పురుషుల 5 వేల మీటర్లలో మాన్ సింగ్ (14:02.04 సెకన్లు) కనకం, సురేష్ కుమార్ (14:02.70 సెకన్లు) రజతం సాధించారు. మహిళల్లో సూర (15:45.75 సెకన్లు), స్వాతే గధావే (16:14.56 సెకన్లు) వరుసగా స్వర్ణం, రజతం సంపాదించారు. పురుషుల హైజంప్‌లో తేజస్విన్ శంకర్ (2.17 మీటర్లు) రజతం, మహిళల 800 మీటర్లలో గౌతమి (2:19.99 సెకన్లు), పురుషుల్లో అజయ్ కుమార్ (2.17 మీటర్లు) కాంస్యాలను గెలుచుకున్నారు. -
భారత్ ‘కనక’ వర్షం
* రెండో రోజు 16 స్వర్ణాలు * రెజ్లింగ్, స్విమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకాల పంట * దక్షిణాసియా క్రీడలు గువాహటి: సొంతగడ్డపై జరుగుతోన్న దక్షిణాసియా క్రీడల్లో భారత క్రీడాకారులు దుమ్మురేపుతున్నారు. బరిలోకి దిగిన ప్రతి ఈవెంట్లో అదరగొడుతూ పతకాల పంట పండిస్తున్నారు. పోటీల తొలి రోజు శనివారం 14 స్వర్ణాలను సాధించిన భారత ఆటగాళ్లు... రెండో రోజూ మరింత చెలరేగి ఏకంగా 16 పసిడి పతకాలతో అదుర్స్ అనిపించారు. ప్రస్తుతం భారత్ 30 స్వర్ణాలు, 12 రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెజ్లింగ్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణాలు, రజతం దక్కాయి. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో అమిత్ ధన్కర్ (70 కేజీలు), ప్రదీప్ (61 కేజీలు)... మహిళల విభాగంలో మమత (53 కేజీలు), మంజూ కుమారి (58 కేజీలు) స్వర్ణ పతకాలను సాధించారు. పురుషుల 86 కేజీల విభాగంలో భారత రెజ్లర్ గోపాల్ యాదవ్ రజతంతో సంతృప్తి పడ్డాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో నాలుగు స్వర్ణాలు లభించాయి. మహిళల విభాగంలో సరస్వతి రౌత్ (58 కేజీలు)... రాఖీ హలెర్ (69 కేజీలు)... పురుషుల విభాగంలో సంబూ లాపుంగ్ (69 కేజీలు), అజయ్ సింగ్ (77 కేజీలు) పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు. వుషు క్రీడాంశంలోని చాంగ్‌స్వాన్ ఈవెంట్లో సప్నా దేవి (భారత్) స్వర్ణం దక్కించుకుంది. మహిళల సైక్లింగ్ 40 కిలోమీటర్ల క్రయిటీరియమ్ ఈవెంట్లో లిదియామోల్ సన్నీ భారత్‌కు బంగారు పతకాన్ని అందించింది. స్విమ్మింగ్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణాలు లభించాయి. పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో సందీప్ సెజ్వాల్... 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో అరవింద్... 1500 మీటర్ల ఫ్రీస్టయిల్లో సజన్ ప్రకాశ్... మహిళల 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో సయానీ ఘోష్ భారత్‌కు బంగారు పతకాలను అందించారు. టేబుల్ టెన్నిస్ (టీటీ) పురుషుల, మహిళల టీమ్ ఈవెంట్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకాలు దక్కాయి. మహిళల ఫైనల్లో భారత్ 3-0తో పాకిస్తాన్‌పై, పురుషుల ఫైనల్లో భారత్ 3-0తో శ్రీలంకపై గెలిచాయి. భారత్ 24 - నేపాల్ 0 మహిళల హాకీలో భారత జట్టు గోల్స్ వర్షం కురిపించింది. నేపాల్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 24-0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. తెలంగాణ క్రీడాకారిణి యెండల సౌందర్య (15వ, 52వ, 62వ, 64వ నిమిషాల్లో), పూనమ్ బార్లా నాలుగేసి గోల్స్ చేయగా... రాణి, జస్ప్రీత్ కౌర్, నేహా గోయల్, దీపిక మూడేసి గోల్స్ నమోదు చేశారు. గుర్జీత్ కౌర్, ప్రీతి దూబే రెండేసి గోల్స్ సాధించారు. పురుషుల లీగ్ మ్యాచ్‌లో భారత్ 4-1తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. బ్యాడ్మింటన్‌లో భారత పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. -
ఫిబ్రవరి 6 నుంచి దక్షిణాసియా క్రీడలు
గువహటి, షిల్లాంగ్ ఆతిథ్యం గువహటి: దక్షిణాసియా క్రీడలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 16 వరకు జరగనున్నాయి. గువహటి, షిల్లాంగ్ నగరాలు ఈ క్రీడలకు ఆతిథ్యమివ్వనున్నాయి. భారత్‌తో పాటు అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, భుటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలు ఇందులో పాల్గొంటాయి. మొత్తం 25 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయని ఆదివారం జరిగిన సమావేశంలో అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ తెలిపారు. అథ్లెట్లు, అధికారులతో కలిపి మొత్తం 4 వేల మంది ఈ పోటీలకు వస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఇతర భాగస్వాములతో కలిసి క్రీడలను అద్భుతంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తామన్నారు. 17 క్రీడాంశాలకు గుహవటి, 8 క్రీడాంశాలకు షిల్లాంగ్ వేదిక కానుంది. ఈసారి టెన్నిస్‌కు కూడా దక్షిణాసియా క్రీడల్లో స్థానం కల్పించారు.