వైభవంగా ముగింపు | the exposition The end of | Sakshi
Sakshi News home page

వైభవంగా ముగింపు

Published Wed, Feb 17 2016 1:16 AM | Last Updated on Sun, Sep 3 2017 5:46 PM

వైభవంగా ముగింపు

వైభవంగా ముగింపు

అట్టహాసంగా ముగిసిన దక్షిణాసియా క్రీడలు
అన్నింటిలో భారత్‌దే ఆధిపత్యం
ఆఖరి రోజూ పసిడి పంచ్

  
గువాహటి : క్రీడాభిమానులను 12 రోజుల పాటు అలరించిన దక్షిణాసియా క్రీడలు మంగళవారం ఘనంగా ముగిశాయి. భారత సంస్కృతిని ప్రతిబింబిస్తూ చేసిన నృత్య కార్యక్రమాలతో పాటు మిరుమిట్లుగొలిపే ఫైర్‌వర్క్‌తో ఇందిరాగాంధీ అథ్లెటిక్ స్టేడియం మార్మోగిపోయింది. మ్యూజిక్ లైవ్ షో, డాన్సులు, వివిధ రంగాల్లోని ప్రముఖులు తమ గాత్ర మాధుర్యాలతో అభిమానులను ఆకట్టుకున్నారు. బాలీవుడ్ రాక్‌స్టార్ షాన్... బాలీవుడ్ పాటలతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్, అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్, మేఘాలయ క్రీడల మంత్రి జెనిత్ ఎం సంగ్మా, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు ఎన్. రామచంద్రన్‌లు పాల్గొన్నారు. స్టేడియంలో నిరంతరాయంగా మండుతున్న కలడ్రాన్ ఆర్పివేయడం ద్వారా క్రీడలు అధికారికంగా ముగిసినట్లు సోనోవాల్ ప్రకటించారు. తర్వాత దక్షిణాసియా ఒలింపిక్ కౌన్సిల్ పతాకాన్ని అవనతం చేస్తూ... దాన్ని ఐఓఏ అధ్యక్షుడు రామచంద్రన్‌కు ఇచ్చారు. ఐఓఏ చీఫ్ దాన్ని.. 13వ దక్షిణాసియా క్రీడలకు వేదికైన నేపాల్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ జీవన్ రామ్ శ్రేష్టకు అందజేశారు.


మరోవైపు షిల్లాంగ్‌లో ఆఖరి రోజు జరిగిన క్రీడల్లోనూ భారత బాక్సర్ల ‘పంచ్’ పవర్ అదిరింది. అందుబాటులో ఉన్న మూడు స్వర్ణాలను క్లీన్‌స్వీప్ చేసి సత్తా చాటారు. మహిళల 51 కేజీల ఫైనల్లో స్టార్ బాక్సర్ మేరీకామ్... టెక్నికల్ నాకౌట్ (టీఓకే) ద్వారా అనుషా కొడితువాక్క్ (శ్రీలంక)పై గెలిచింది. 75 కేజీల బౌట్‌లో పూజా రాణి కూడా ‘టీఓకే’ ద్వారా నీలాంతి అందర్‌వీర్ (శ్రీలంక)ను ఓడించింది. ఇక ఏడాది నిషేధం తర్వాత బరిలోకి దిగిన లైష్రామ్ సరితా దేవి... 60 కేజీల టైటిల్ పోరులో 39-36తో విదుషికా ప్రబాది (శ్రీలంక)పై నెగ్గింది. ఓవరాల్‌గా ఈ ముగ్గురి ప్రదర్శనతో భారత్ బాక్సర్లు గేమ్స్‌లో మొత్తం 10 స్వర్ణాలను సాధించారు.  


జూడోలోనూ భారత క్రీడాకారుల ‘పట్టు’ అదిరింది. పురుషుల 90 కేజీల బౌట్‌లో అవతార్ సింగ్... మొహమ్మద్ ఇస్మాయిల్  (అఫ్ఘానిస్తాన్)పై నెగ్గి స్వర్ణం సాధించగా, మహిళల 70 కేజీల్లో పూజా... బీనిష్ ఖాన్ (పాకిస్తాన్)ను ఓడించి కనకంతో మెరిసింది. మహిళల 78 కేజీల ఫైనల్లో ఫౌజియా ముంతాజ్ (పాకిస్తాన్) చేతిలో ఓడిన భారత క్రీడాకారిణి అరుణ  రజతంతో సంతృప్తి పడింది. పురుషుల 100 కేజీల ఫైనల్లో కూడా శుభమ్ కుమార్... షా హుస్సేన్ చేతిలో పరాజయం చవిచూసి రజతంతో సరిపెట్టుకున్నాడు. ఓవరాల్‌గా అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టిన భారత క్రీడాకారులు మొత్తం 308 (188 స్వర్ణాలు+90 రజతాలు+30 కాంస్యాలు) పతకాలతో వరుసగా 11వ సారి అగ్రస్థానంలో నిలిచారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement