భారత్ ‘బంగారు గురి’
► షూటింగ్‌లో క్లీన్‌స్వీప్
► ఎనిమిదో రోజు తొమ్మిది స్వర్ణాలు
► దక్షిణాసియా క్రీడలు
గువాహటి: అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్న భారత క్రీడాకారులు దక్షిణాసియా క్రీడల్లో తమ జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. పోటీల ఎనిమిదో రోజు శనివారం భారత క్రీడాకారులు తొమ్మిది స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. షూటింగ్‌లో ఆరు పసిడి పతకాలు లభించగా... ట్రయాథ్లాన్‌లో రెండు స్వర్ణాలు, తైక్వాండోలో ఒక బంగారు పతకం దక్కింది. ప్రస్తుతం భారత్ 156 స్వర్ణాలు, 85 రజతాలు, 27 కాంస్యాలతో కలిపి మొత్తం 268 పతకాలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. శ్రీలంక 25 స్వర్ణాలు, 55 రజతాలు, 83 కాంస్యాలతో కలిపి మొత్తం 163 పతకాలతో రెండో స్థానంలో ఉంది.
షూటింగ్‌లో భారత ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. శనివారం జరిగిన ఆరు ఈవెంట్స్‌లో భారత్ స్వర్ణాలతో క్లీన్‌స్వీప్ చేసింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లో ఓంకార్ సింగ్... టీమ్ ఈవెంట్‌లో ఓంకార్ సింగ్, గుర్‌ప్రీత్ సింగ్, జితేంద్ర విభూతేలతో కూడిన బృందానికి బంగారు పతకాలు దక్కాయి. మహిళల 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో రాహీ సర్నోబాత్, అన్నురాజ్ సింగ్, అనీసా సయ్యద్‌లతో కూడిన భారత జట్టు స్వర్ణం సొంతం చేసుకోగా... వ్యక్తిగత విభాగంలో రాహీ, అన్నురాజ్, అనీసాలకు వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు దక్కాయి. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత ఈవెంట్‌లో అంజుమ్, సుసాన్ కోషి ఎలిజబెత్, లజ్జా గోస్వామిలకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభించాయి. టీమ్ ఈవెంట్‌లో ఈ ముగ్గురితో కూడిన భారత్‌కే పసిడి పతకం దక్కింది.
పురుషుల తైక్వాండో 87 కేజీల విభాగంలో పి.కుమార్ భారత్ తరఫున ఏకైక స్వర్ణాన్ని సాధించాడు. ఫైనల్లో హుస్సేని (అఫ్ఘానిస్తాన్)పై కుమార్ గెలిచాడు. పురుషుల ట్రయాథ్లాన్ (స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్)లో దిలీప్ కుమార్... మహిళల ట్రయాథ్లాన్‌లో పల్లవి రేతివాలా పసిడి పతకాలు గెలిచారు. పురుషుల కబడ్డీ లీగ్ మ్యాచ్‌ల్లో తొలుత భారత్ 30-17తో బంగ్లాదేశ్‌ను... ఆ తర్వాత 9-8తో పాకిస్తాన్‌ను ఓడించింది. మహిళల కబడ్డీ లీగ్ మ్యాచ్‌ల్లో తొలుత భారత్ 56-23తో పాకిస్తాన్‌పై, ఆ తర్వాత 43-11తో బంగ్లాదేశ్‌పై గెలిచింది. పురుషుల ఫుట్‌బాల్ ఈవెంట్‌లో భారత్ 3-0తో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది.