
కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన రాహుల్
ఒకవైపు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ లేకున్నా... మరోవైపు ఫిజియో సేవలు అందుబాటులో లేకున్నా ... ఇంకోవైపు గాయాలు వేధిస్తున్నా... కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ల పతకాల వేట మాత్రం నిరాటంకంగా కొనసాగుతోంది. తొలి రెండు రోజుల్లో మహిళల విభాగంలో మీరాబాయి చాను, సంజిత చాను పసిడి పతకాలతో మెరవగా... మూడో రోజు పురుషుల విభాగంలో రాగాల వెంకట్ రాహుల్, సతీశ్ కుమార్ శివలింగం ‘స్వర్ణ’ కాంతులు విరజిమ్మారు. వీరిద్దరి ప్రతిభతో మూడో రోజు పోటీలు ముగిసేసరికి భారత్ నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి మొత్తం ఆరు పతకాలతో నాలుగో స్థానానికి చేరుకుంది.
గోల్డ్‌కోస్ట్: తమపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ భారత వెయిట్‌లిఫ్టర్లు కామన్వెల్త్ గేమ్స్‌లో అద్వితీయ ప్రదర్శన చేస్తున్నారు. తమ ప్రతిభతో వరుసగా మూడో రోజు భారత్ ఖాతాలో రెండు పతకాలను జమ చేశారు. తొలి రోజు స్వర్ణం, రజతం... రెండో రోజు స్వర్ణం, కాంస్యం రాగా... మూడో రోజు మాత్రం రెండూ స్వర్ణాలే కావడం విశేషం. పురుషుల 77 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సతీశ్ కుమార్ 317 కేజీలు (స్నాచ్‌లో 144+క్లీన్ అండ్ జెర్క్‌లో 173) బరువెత్తి విజేతగా నిలిచాడు. 85 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా స్టువర్ట్‌పురం ప్రాంతానికి చెందిన రాగాల వెంకట్ రాహుల్ 338 కేజీలు (స్నాచ్‌లో 151+క్లీన్ అండ్ జెర్క్‌లో 187) బరువెత్తి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. డాన్ ఒపెలోగ్ (సమోవా–331 కేజీలు) రజతం... ఫజ్రుల్ (మలేసియా–328 కేజీలు) కాంస్య పతకాలు గెల్చుకున్నారు. మహిళల 63 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ వందన గుప్తా ఐదో స్థానంలో నిలిచింది.
పోటాపోటీ...
గతేడాది ఇదే వేదికపై జరిగిన కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన రాహుల్ ఏడాదిలోపే మళ్లీ పసిడితో మెరిశాడు. స్నాచ్ తొలి ప్రయత్నంలో 147 కేజీలు ఎత్తిన రాహుల్... రెండో ప్రయత్నంలో 151 కేజీలు ఎత్తబోయి విఫలమయ్యాడు. చివరిదైన మూడో ప్రయత్నంలో సఫలమయ్యాడు. స్నాచ్ ఈవెంట్ ముగిశాక రాహుల్, డాన్ ఒపెలోగ్ 151 కేజీలతో సమంగా నిలిచారు. అనంతరం క్లీన్ అండ్ జెర్క్‌లో రాహుల్ తొలి ప్రయత్నంలో 182 కేజీలు, రెండో ప్రయత్నంలో 187 కేజీలు బరువెత్తాడు. మూడో ప్రయత్నంలో 191 కేజీలకు ప్రయత్నించి విఫలమయ్యాడు. రాహుల్‌కు గట్టిపోటీనిచ్చిన సమోవా లిఫ్టర్ డాన్ ఒపెలోగ్ స్వర్ణం సాధించేందుకు చివరి ప్రయత్నంగా ఒపెలోగ్ ఈసారి 191 కేజీలకు వెళ్లి ఫెయిల్ కావడంతో రాహుల్‌కు స్వర్ణం ఖాయమైంది. మరోవైపు తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన 25 ఏళ్ల సతీశ్‌కిది కామన్వెల్త్ గేమ్స్‌లో రెండో స్వర్ణం. 2014 గ్లాస్గో గేమ్స్‌లోనూ అతను పసిడి పతకం గెలిచాడు. సతీశ్ తండ్రి శివలింగం కూడా మాజీ వెయిట్‌లిఫ్టర్. ప్రస్తుతం ఆయన వీఐటీ యూనివర్సిటీ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. సతీశ్ సాధించిన ఘనతలతో తానెంతో గర్వపడుతున్నానని అన్నారు.
రూ. 50 లక్షలు నజరానా
సతీశ్ ప్రదర్శనకు ప్రోత్సాహకంగా తమిళనాడు ప్రభుత్వం అతనికి రూ. 50 లక్షలు నగదు పురస్కారం ప్రకటించింది.
గవర్నర్, వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: స్వర్ణం నెగ్గిన ఏపీ లిఫ్టర్ రాహుల్‌ను గవర్నర్ నరసింహన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందించారు. తన ప్రదర్శనతో భారత్ పేరు నిలబెట్టాడని ప్రశంసించారు.
గత ఏడాది మోకాలికి గాయమైంది. కొన్నాళ్ల క్రితం కామెర్లు రావడంతో ఒక్కసారిగా 20 కిలోల బరువు తగ్గిపోయాను. వీటన్నింటిని అధిగమించి ఇక్కడ పతకం గెలవడం చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో ఇది అత్యంత విలువైన విజయం. అమ్మ మెట్టెలను అదృష్టంగా భావించాను. అందుకే వాటిని ధరించాను. ఆమె నా తోడుండి ఆశీర్వదించినట్లుగా అని పించింది.
- రాహుల్
Comments
Please login to add a commentAdd a comment