Commonwealth Games 2018
-
Cricket: 1998 కామన్వెల్త్ గేమ్స్ విజేత ఎవరు..? టీమిండియాది ఎన్నో స్థానం..?
Commonwealth Games: బర్మింగ్‌హామ్ వేదికగా ఈనెల (జులై) 28 నుంచి ప్రారంభంకానున్న కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌కు తొలిసారి అవకాశం లభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ క్రీడల్లో 24 ఏళ్ల క్రితమే పురుషుల క్రికెట్‌కు ప్రాతినిధ్యం లభించిందన్న విషయం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. కౌలాంలంపూర్ వేదికగా జరిగిన 1998 కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌కు తొలిసారి ప్రాతినిధ్యం లభించగా.. అందులో దక్షిణాఫ్రికా స్వర్ణ పతకం నెగ్గింది. 50 ఓవర్ల ఫార్మాట్లో జరిగిన ఈ పోటీల్లో మొత్తం 16 జట్లు 4 గ్రూప్‌లుగా విభజింపబడి పోటీపడగా.. సఫారీలు స్వర్ణాన్ని.. ఆసీస్ రజతాన్ని.. కివీస్ కాంస్య పతకాన్ని గెలిచాయి. ఆస్ట్రేలియా, కెనడా, అంటిగ్వా అండ్ బార్బుడా దేశాలతో పాటు గ్రూప్ బిలో తలపడిన భారత్ గ్రూప్ దశలోనే (3 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే గెలుపు) నిష్క్రమించి ఓవరాల్‌గా 9వ స్థానంలో నిలిచింది. నాటి టీమిండియాకు అజయ్ జడేజా సారధ్యం వహించగా.. అనిల్ కుంబ్లే వైస్ కెప్టెన్‌గా.. సచిన్, లక్ష్మణ్ కీలక ప్లేయర్లుగా ఉన్నారు. కీలక ప్లేయర్లు పాకిస్థాన్‌తో సహారా కప్ ఆడుతుండటంతో బీసీసీఐ రెండో జట్టును కామన్వెల్త్ గేమ్స్‌కు పంపింది. చదవండి: CWG 2022: క్రికెట్లో గోల్డ్ మెడల్ సాధించగల సత్తా ఉన్న మూడు జట్లు ఇవే..! -
ప్రదీప్... కొత్త రకం డోపీ
న్యూఢిల్లీ: భారత క్రీడా రంగంలో కుదుపు! 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో 105 కేజీల విభాగంలో రజత పతకం నెగ్గిన భారత వెయిట్‌లిఫ్టర్ ప్రదీప్ సింగ్ సరికొత్త డోపింగ్‌కు పాల్పడ్డాడు. హ్యూమన్ గ్రోత్ హార్మోన్ (హెచ్‌జీహెచ్) డోపింగ్‌లో ఈ పంజాబ్ లిఫ్టర్ దొరికిపోయాడు. ఈ హెచ్‌జీహెచ్ కేసు ప్రపంచానికి ముందే పరిచయమైనా... భారత్‌లో ఇదే తొలి కేసు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పరీక్షల్లో లాక్‌డౌన్‌కు ముందే మార్చిలో పట్టుబడినప్పటికీ ‘బి’ శాంపిల్‌తో ధ్రువీకరించుకున్న తర్వాత ‘నాడా’ తాజాగా వెల్లడించింది. అథ్లెట్లు అత్యంత అరుదుగా ఈ తరహా మోసానికి పాల్పడతారు. ఇది మామూలు ఉత్ప్రేరకం కాదు. మెదడులోని గ్రంథి స్రావాల ద్వారా ఉత్తేజితమయ్యే ఉత్ప్రేరకం. రైల్వేస్‌కి చెందిన వెయిట్‌లిఫ్టర్ ప్రదీప్ హెచ్‌జీహెచ్‌కు పాల్పడినట్లు తేలడంతో భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య నాలుగేళ్ల నిషేధం విధించింది. దీనిపై ‘నాడా’ డైరెక్టర్ నవీన్ అగర్వాల్ మాట్లాడుతూ ‘ఇలాంటి డోపింగ్ కేసు మన దేశంలో మొదటిది. మార్చిలోనే సంబంధిత సమాఖ్యకు సమాచారమిచ్చాం. నిజానికి పోటీల్లేని సమయంలో డిసెంబర్లో అతని నుంచి నమూనాలు సేకరించాం. ‘వాడా’ గుర్తింపు పొందిన ‘దోహా’ ల్యాబ్‌కు పంపి పరీక్ష చేయగా దొరికిపోయాడు’ అని తెలిపాడు. ఫిబ్రవరిలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో ప్రదీప్ 102 కేజీల కేటగిరీలో పాల్గొని స్వర్ణం గెలిచాడు. మార్చిలో డోపింగ్‌లో దొరికిన వెంటనే ‘నాడా’ ఇచ్చిన సమాచారం మేరకు భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య అతన్ని శిబిరం నుంచి తప్పించింది. హెచ్‌జీహెచ్ అంటే... కొన్ని రకాల మెడిసిన్ ద్వారా హెచ్‌జీహెచ్ శరీరంలోకి ఉత్పత్తి అవుతుంది. మానవ శరీరాన్ని అత్యంత చాకచక్యంగా ఉత్తేజితం చేస్తుంది. ఎముక, ఇతర దెబ్బతిన్న అవయ వం పెరుగుదలకు దోహదం చేస్తుంది. ఎముకశక్తిని పటిష్టపరుస్తుంది. కండరాల సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతర్జాతీయ డోపిం గ్ నిరోధక సంస్థ (వాడా) ప్రకారం 2010 నుంచి ఈ తరహా డోపింగ్‌కు పాల్పడింది కేవలం 15 మందే. ఇందులో ఇద్దరు లండన్ ఒలింపిక్స్ సమయంలో దొరికిపోయారు. -
బీజేపీలోకి రెజ్లర్ బబిత
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం, పలు అంతర్జాతీయ పోటీల్లో విజ యాలు సాధించి సత్తా చాటిన రెజ్లర్ బబితా ఫొగాట్, ఆమెకు శిక్షణ నిచ్చిన ఆమె తండ్రి మహవీర్‌సింగ్ ఫొగాట్‌లు సోమవారం బీజేపీలో చేరారు. వీరిద్దరి విజయాలు స్ఫూర్తిగా ‘దంగల్’ పేరుతో ఆమిర్‌ఖాన్ హీరోగా బాలీవుడ్లో ఓ సినిమా కూడా రూపొందిన విషయం తెలిసిందే. కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజుజు, హరియాణా రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ అనిల్ జైన్ సమక్షంలో వారు బీజేపీ తీర్థం పుచ్చుకు న్నారు. యువశక్తికి బబిత నిదర్శనంగా నిలిచిం దని కిరణ్ రిజిజు ప్రశంసించారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఫొగాట్‌ల చేరిక పార్టీకి కొత్త శక్తినిస్తుందని బీజేపీ పేర్కొంది. బబిత చేరిక హరియాణా బీజేపీకి మంచిరోజు అని అనిల్ అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ప్రధాని మోదీ చరిత్రను తిరగరాశారని బబిత ప్రశంసించారు. -
‘వివాదాలు కాదు.. ముందు ఆటపై దృష్టి పెట్టు’
కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించడంతో పాటు పలు అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాల పంట పండించిన హర్యానా యువ షూటర్ మను బాకర్ తీరును ఆ రాష్ట్ర క్రీడా శాఖా మంత్రి అనిల్ విజు విమర్శించారు. కామన్వెల్త్ క్రీడల్లో పసిడి సొంతం చేసుకున్న మనుకు ప్రభుత్వం రెండు కోట్ల రూపాయల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా తనకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని పేర్కొంటూ... ‘ మీరు ప్రకటించిన నజరానా నిజమా లేదా అంతా ఉత్తిదేనా’ అంటూ ఆమె ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో మను బాకర్ ట్వీట్‌కు స్పందించిన అనిల్ విజు.. ‘ ఈ విషయమై సోషల్ మీడియాలో ప్రస్తావించే ముందు.. మను బాకర్ మొదట క్రీడా శాఖను సంప్రదించాల్సింది. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే క్రీడాకారులకు అత్యధిక అవార్డులు అందిస్తున్న రాష్ట్రం మనదే. నేను ట్వీట్ చేసినట్లుగానే.. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఆమెకు రూ. 2 కోట్లు అందజేస్తాం. ఆటగాళ్లకు కాస్త క్రమశిక్షణ అవసరం. ఇలా వివాదం సృష్టించినందుకు ఆమె చింతించాలి. తనకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. ఇవన్నీ మాని ఆటపై దృష్టిపెడితే బాగుంటుంది’ అని హితవు పలికారు. Sir Please confirm if it is correct... Or just Jumla... @anilvijminister pic.twitter.com/AtxpLKBSYV — Manu Bhaker (@realmanubhaker) January 4, 2019 Manu Bhaker should have first confirmed it from the Sports Deptt. before going to public domain. It is disgusting to denounce a State Govt which is giving highest awards in the Country. Bhaker will will will get 2 crores as tweated by me and as per notification at that time. — ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) January 5, 2019 There should be some sense of decipline in players. Bhaker should feel sorry for creating this controversy. She has a long way to go. She should focus on her game only. — ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) January 5, 2019 -
2018.. భారత్ ఆట.. పతకాల వేట
-
పూనమ్ యాదవ్‌పై సస్పెన్షన్ వేటు
న్యూఢిల్లీ: గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన వెయిట్ లిఫ్టర్ పూనమ్ యాదవ్‌ను భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) జాతీయ క్యాంప్ నుంచి సస్పెండ్ చేసింది. ఈ ఏడాది జరుగనున్న ఆసియా క్రీడల కోసం పాటియాలాలో ఏర్పాటు చేసిన జాతీయ క్యాంప్‌లో శిక్షణ పొందుతున్న పూనమ్ అక్కడి అధికారుల అనుమతి లేకుండా క్యాంప్ నుంచి పలుమార్లు బయటకు వెళ్లింది. దీంతో ఐడబ్ల్యూఎఫ్ ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ‘ప్రస్తుతం జరుగుతోన్న జాతీయ క్యాంప్‌లో పూనమ్ ఐడబ్ల్యూఎఫ్ నిబంధనలను బేఖాతరు చేసింది. ఆమె పలుమార్లు నిబంధనలను అతిక్రమించింది. 15 రోజుల వ్యవధిలో అనుమతి లేకుండా రెండు సార్లు క్యాంప్ నుంచి బయటకు వెళ్లింది. ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించబోం’ అని ఐడబ్ల్యూఎఫ్ ఆమెకు ఓ లేఖ ద్వారా తెలిపింది. ఆమెపై నిషేధం విధించడానికి ముందే షోకాజ్ నోటీసులు పంపినా లాభం లేకపోయిందని పేర్కొంది. ఈ అంశంపై ఐడబ్ల్యూఎఫ్ కార్యదర్శి సహదేవ్ యాదవ్ స్పందిస్తూ... ‘రాబోయే ఆసియా క్రీడల్లో పూనమ్ స్థానం భర్తీ చేయలేనిది. గత కొన్నేళ్లుగా పూనమ్ చాలా కఠినమైన శిక్షణ తీసుకుంటోంది. కానీ ఈ విధంగా క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతూ క్యాంప్‌నకు గైర్హాజరు అయితే తిరిగి పుంజుకోవడం కష్టం’ అని తెలిపారు. ఆమె తిరిగి క్యాంప్‌లో చేరాలంటే... ‘నాడా’ ఆధ్వర్యంలో డోపింగ్ టెస్ట్ పాసవ్వాల్సి ఉంటుంది. -
మీ ప్రతిభతో భారత్ ఉప్పొంగిపోయింది
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన పతక విజేతలు సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలను కలిశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రామ్‌నాథ్ కోవింద్ పతకాలు గెలిచిన క్రీడాకారులందరితో కరచాలనం చేసి అభినందించారు. భవిష్యత్తులోనూ రాణించి యువతకు స్ఫూర్తిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. అంతకుముందు ప్రధాని నివాసంలో మోదీని కలువగా ఆయన వారితో కాసేపు ముచ్చటించారు. ‘అంతర్జాతీయ క్రీడల్లో సత్తాచాటిన మీరు అందరికీ ప్రేరణగా నిలిచారు. మీ ప్రతిభతో భారత్ ఉప్పొంగిపోయింది. మీ పతకంతో భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు’ అని ప్రధాని మోదీ వారిని కొనియాడారు. భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్టార్ మహిళా బాక్సర్ మేరీ కోమ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. గోపీనుద్దేశించి ఓ విజయవంతమైన ప్లేయర్‌గా కెరీర్ ముగించుకున్నప్పటికీ అంతటితో సంతృప్తి చెందక... కోచ్‌గా విరామమెరుగని కృషితో యువ క్రీడాకారులను అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో విజేతలుగా నిలుపుతున్నారని అభినందించారు. దశాబ్దాలపాటు విజేతగా నిలవొచ్చని మేరీకోమ్ చాటిందన్నారు. ఎంపీ అయ్యాక కూడా ఆమె పతకం గెలిచిందన్నారు. అథ్లెట్లతో పాటు భారత క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ కూడా వారితో పాటు ఉన్నారు. గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన మెగా ఈవెంట్లో భారత్ 26 స్వర్ణాలు, 20 చొప్పున రజత, కాంస్యాలతో మొత్తం 66 పతకాలు సాధించింది. స్వర్ణ విజేతకు భారత క్రీడాశాఖ తరఫున రూ. 30 లక్షలు, రజతానికి రూ. 20 లక్షలు, కాంస్యానికి రూ. 10 లక్షలు నజరానా అందజేశారు. ఈ కార్యక్రమంలో పతక విజేతలు మేరీకోమ్ (బాక్సింగ్), సుశీల్ కుమార్ (రెజ్లింగ్), సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్), మీరాబాయి చాను, రాగాల వెంకట్ రాహుల్ (వెయిట్‌లిఫ్టింగ్), హుసాముద్దీన్ (బాక్సింగ్) తదితరులు పాల్గొన్నారు. -
దేశం గర్వపడేలా చేశారు..!
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల ప్రదర్శన దేశాన్ని గర్వపడేలా చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నాలుగు మెడల్స్ సాధించిన టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా సహా.. సైనా, సింధు తదితర క్రీడాకారులను ఆయన ప్రశంసించారు. ఆటగాళ్ల నిరంతర శ్రమకు ప్రతిఫలమే ఈ ఫలితాలన్నారు. మాసాంతపు మన్‌కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జాతినుద్దేశించి మోదీ మాట్లాడారు. వచ్చే ఏడాది అక్టోబర్ 2న మహాత్ముని 150వ జయంతి ఉత్సవాలకు ముందే.. దేశ స్వచ్ఛతపై నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు యువత నడుం బిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఇందుకోసం వేసవి సెలవుల్లో ప్రభుత్వం చేపట్టిన ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. నీటి సంరక్షణ, వాజ్‌పేయి జై విజ్ఞాన్ నినాదం తదితర అంశాలపై మోదీ మాట్లాడారు. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా మహ్మద్ ప్రవక్తను, బుద్ధ పౌర్ణిమ నేపథ్యంలో గౌతమ బుద్ధుడిని గుర్తుచేసుకున్నారు. క్రీడాకారులకు అభినందనలు కామన్వెల్త్ క్రీడల్లో భారత పతాకాన్ని రెపరెపలాడించిన క్రీడాకారులందరికీ ప్రధాని అభినందనలు తెలిపారు. మరీ ముఖ్యంగా ఎక్కువ పతకాలు సాధించిన మహిళా క్రీడాకారులు చూపిన పోరాటపటిమను ప్రధాని ప్రశంసించారు. పతకాలు సాధించిన తర్వాత త్రివర్ణపతాకాన్ని భుజాన వేసుకుని జాతీయగీతాలాపన వింటుంటే గర్వంగా ఉంటుందన్నారు. ఇదే అభిప్రాయాన్ని పలువురు క్రీడాకారులు తనతో పంచుకున్నారన్నారు. బ్యాడ్మింటన్ ఫైనల్స్‌లో ఇద్దరు భారతీయ క్రీడాకారిణుల (సైనా నెహ్వాల్, పీవీ సింధు) మధ్యే పోటీ నెలకొన్నా.. మ్యాచ్‌పై ఎంతో ఆసక్తి పెరిగిందన్నారు. ‘గత నెల మన్‌కీ బాత్‌లో దేశ ప్రజలందరినీ.. ‘ఫిట్ ఇండియా’లో పాల్గొనాలని కోరాను. అనారోగ్యం దరిచేరకుండా నిరోధించేందుకు ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. సినీనటుడు అక్షయ్ కుమార్ సహా చాలా మంది.. ఫిట్నెస్ అవసరాన్ని తెలుపుతూ వీడియోలు, ఫొటోలు పోస్టు చేశారు. అందరికీ కృతజ్ఞతలు’ అని మోదీ తెలిపారు. ఫిట్‌గా ఉండటం, మానసిక, శారీరక సంతులకోసం యోగా చాలా ప్రత్యేకమైందన్నారు. రంజాన్, బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు ఉపవాసం ఉండటం ద్వారా ఎదుటివారి ఆకలిని అర్థం చేసుకోవచ్చని, దాహంగా ఉన్నప్పుడే ఇతరుల దాహం అర్థమవుతుందన్న మహమ్మద్ ప్రవక్త సందేశాన్ని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మే 15నుంచి రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా దేశవాసులందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధ భగవానుడు శాంతి, సామరస్యం, సోదరభావాన్ని బోధించారని.. ఈ విలువలే నేటి ప్రపంచానికి చాలా అవసరమన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కూడా తన ఆలోచనల్లో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పదాలను కూడా బుద్ధ భగవానుడి బోధనలనుంచే గ్రహించినట్లు చెప్పిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. మే 29న బుద్ధ పౌర్ణిమ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1998లో మే 11న (బుద్ధ పౌర్ణిమ) నాటి ప్రధాని వాజ్‌పేయి నిర్వహించిన అణుపరీక్షలను మోదీ గుర్తుచేశారు. నవభారత నిర్మాణం కోసం జై జవాన్, జై కిసాన్లతోపాటు వాజ్‌పేయి సూచించిన ‘జై విజ్ఞాన్’ నినాదంలోని అంతరార్థాన్ని నేటి యువత గుర్తించాలని ప్రధాని కోరారు. మే 7న రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. స్వచ్ఛత కోసం ఇంటర్న్‌షిప్ వేసవి సెలవుల్లో ‘స్వచ్ఛ భారత్’లో భాగంగా నిర్వహిస్తున్న ‘సమ్మర్ ఇంటర్న్‌షిప్–2018’ కార్యక్రమంలో పాల్గొనాలని యువతను కోరారు. తద్వారా సమాజంతో మమేకమవటంతోపాటు సానుకూల మార్పు తీసుకురావటంలో భాగస్వాములం అవుతామన్నారు. ఇందులో పాల్గొన్న యువతకు సర్టిఫికెట్లు ఇస్తారని.. ఇందులో రాణించిన వారికి యూజీసీ రెండు క్రెడిట్ పాయింట్లు కూడా ఇస్తుందన్నారు. ‘మైగవ్’ యాప్ ద్వారా ఇంటర్న్‌షిప్‌కు రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. మన పూర్వీకులు కూడా జల సంరక్షణను ఓ ఉద్యమంలా చేపట్టారని.. పలు దేవాలయాల్లో ఇప్పటికీ ఈ శాసనాలను గమనించవచ్చన్నారు. మూడున్నరేళ్లలో జల సంరక్షణకు రూ. 35వేల కోట్లు వెచ్చించామన్నారు. దీని ద్వారా కోటిన్నర ఎకరాల భూమికి మేలు జరిగిందన్నారు. -
‘టాప్’లో హుసాముద్దీన్
న్యూఢిల్లీ: గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం గెలిచిన తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్‌ను ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం’ (టాప్) పథకంలో ఎంపిక చేశారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే అవకాశాలున్న క్రీడాకారులను ఎంపిక చేసి, వారి సాధనకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించే విధంగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. గత రెండేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో 56 కేజీల విభాగంలో హుసాముద్దీన్ నిలకడగా రాణిస్తూ పతకాలు సాధిస్తున్నాడు. మరోవైపు కామన్వెల్త్ గేమ్స్‌లోనే స్వర్ణం నెగ్గిన మరో బాక్సర్ గౌరవ్ సోలంకి (బాక్సింగ్)తోపాటు షూటర్లు మను భాకర్, మెహులీ ఘోష్, అనీశ్ భన్వాలా, ఓంప్రకాశ్, షాజర్ రిజ్వీ, భారత మహిళల టెన్నిస్ నంబర్‌వన్ అంకిత రైనాలను కూడా ‘టాప్స్’లో ఎంపిక చేశారు. అంకిత ఇటీవలే టాప్–200లోకి ప్రవేశించింది. డబ్ల్యూటీఏ తాజా ర్యాంకింగ్స్‌లో ఆమె అత్యుత్తమంగా 197వ ర్యాంక్‌లో నిలిచింది. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో భారత క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో సానియా మీర్జా, నిరుపమా వైద్యనాథన్ మాత్రమే టాప్–200లో చోటు సంపాదించారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన వెయిట్‌లిఫ్టర్ రాహుల్
విజయవాడ స్పోర్ట్స్: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశాడు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను ఆదివారం ఆగిరిపల్లి క్యాంపు వద్ద రాహుల్ తన తండ్రి మధుతో పాటు కలిశాడు. రాహుల్‌కు ఆర్థిక సాయం చేస్తామని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. రాహుల్‌కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి లక్ష రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా స్టువర్టుపురం ప్రాంతానికి చెందిన రాగాల వెంకట్ రాహుల్ గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా) వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 85 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. -
ప్రభుత్వ ఉద్యోగాల్లో 2 శాతం స్పోర్ట్స్ కోటా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో క్రీడాకారులకు రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటి స్వదేశానికి చేరుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల క్రీడాకారుల బృందం శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి క్రీడాకారులకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్క క్రీడాకారుడితో ప్రత్యేకంగా మాట్లాడి అభినందనలు తెలిపారు. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొని దేశానికి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారని క్రీడాకారులను ప్రశంసించారు. సీఎంను కలిసిన వారిలో బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సైనా నెహ్వాల్, సిక్కి రెడ్డి, రుత్విక శివాని, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, ప్రణవ్ చోప్రా, బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్, జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణులు బుద్దా అరుణ రెడ్డి, మేఘన రెడ్డి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి నిర్ణయించినందుకు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
కేసీఆర్‌ను కలిసిన కామన్వెల్త్ విజేతలు
-
స్వర్ణ విజేత రాహుల్‌కు పవన్ నజరానా
సాక్షి, హైదరాబాద్ : కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిప్టింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్‌కు జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ రూ.10 లక్షల నజరానాను ప్రకటించారు. శనివారం వెంకట్ రాహుల్ పవన్ కల్యాణ్‌ను ఆయన నివాసంలో కలిసినట్లు జనసేన ఓప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ రాహుల్‌ను, క్రీడల వైపు ప్రోత్సహించిన అతని తండ్రిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం అందరికి తెలిసేలా బాపట్ల పట్టణంలో జనసేన తరపున ఈనెల 30న భారీ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ వేదికపైనే రాహుల్ తండ్రిని మధును సైతం సన్మానిస్తామని ఆయన పేర్కొన్నారు. గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన కామెన్వెల్త్ గేమ్స్‌లో 85 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా స్టువర్ట్పురం ప్రాంతానికి చెందిన రాగాల వెంకట్ రాహుల్ 338 కేజీలు (స్నాచ్‌లో 151+క్లీన్ అండ్ జెర్క్‌లో 187) బరువెత్తి పసిడిని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
కేసీఆర్‌ను కలిసిన కామన్వెల్త్ విజేతలు
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శనివారం ప్రగతిభవన్‌లో కామన్వెల్త్ గేమ్స్ 2018 విజేతలు కలిశారు. ఈ సందర్భంగా కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన వారిని కేసీఆర్ అభినందించారు. క్రీడాకారులతో పాటు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్‌ను కూడా కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. కామన్వెల్త్లో తెలంగాణకు చెందిన వారు మెడల్స్ సాధించడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ర్టానికి, దేశానికి మంచి గౌరవం తీసుకువచ్చారన్నారు. భవిష్యత్‌లో మరెన్నో విజయాలు సాధించాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం వెల్లడించారు. కాగా, ఈ నెల 23న కామన్వెల్త్ విజేతలకు ఎల్బీ స్టేడియంలో సన్మానం, అభినందన సభ నిర్వహించనున్నారు. సీఎంను కలిసిన వారిలో సైనా నెహ్వాల్, పీవీ సింధు, శ్రీకాంత్, పుల్లెల గోపిచంద్ పాటు పలువురు ఉన్నారు. -
నాకు ఏ అవమానం జరగలేదు: మను
ఛండీగడ్ : ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు పసిడి పతకం అందించిన పదహారేళ్ల షూటర్ మను భాకర్‌కు అవమానం జరిగింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్లో అద్భుత ప్రదర్శనతో పిన్న వయసులోనే స్వర్ణం సాధించిన ఆమెకు సొంతూరిలోనే ఈ చేదు అనుభవం ఎదురైంది. ఛార్కీ దాద్రీ పట్టణంలో ఫోగట్ కాప్ పంచాయతీ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిర్వాహకులు పూలమాలలతో మను భాకర్ ను సత్కరించిన అనంతరం ఆమె వేదికపై ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చున్నారు. అయితే కొంత మంది వీవీఐపీలు రావడంతో మను భాకర్ తన కుర్చీలో నుంచి లేవాల్సి వచ్చింది. ‘పెద్దలు’ కుర్చీల్లో ఆసీనులు కావడంతో ఆమె నేలపైనే కూర్చోవలసి వచ్చింది. కాగా, రెజ్లర్లు వినేష్ ఫోగట్, బబితా కుమారీలను కూడా ఈ కార్యక్రమంలో సన్మానించారు. ఈ ఘటనపై మను భాకర్ తండ్రి స్పందిస్తూ.. అదేం లేదు. పెద్దల్ని గౌరవించడంలో భాగంగానే ఆమె నేలపై కూర్చుంది. అది సంప్రదాయంలో భాగమే. ఆమె తన చర్యతో పెద్దల్ని గౌరవించడం పట్ల యువతకు ఒక సందేశాన్నిచ్చింది. దీన్ని అనవసరంగా రాద్దాంతం చేయొద్దని వ్యాఖ్యానించారు. పాల్గొన్న తొలి కామన్వెల్త్ క్రీడల్లోనే సత్తా చాటిన భాకర్, సీనియర్లను తలదన్ని ఎయిర్ పిస్టల్ షూటింగ్లో 240.9 పాయింట్లు (కామన్వెల్త్ గేమ్స్ రికార్డు) సాధించి బంగారు పతకాన్ని గెలుపొందడం విశేషం. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మను భాకర్ స్పందించారు. మీరేదో ఊహించుకుని వార్తలు రాయడం సరికాదని ఆమె మీడియాను ఉద్దేశించి అన్నారు. ‘నాకు ఏ అవమానం జరగలేదు. కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన పెద్దల్ని గౌరవించి నేను కింద కూర్చున్నాను. దానికి ఎందుకు అంత ప్రాధాన్యం.. పెద్దల్ని గౌరవించడం తప్పా..? మన కన్నా పెద్దవారొచ్చినప్పుడు వారిని గౌరవించకుండా హుందాగా అలానే కూర్చుంటారా..? అని ప్రశ్నించింది. -
నాకు ఏ అవమానం జరగలేదు: మను
-
వెయిట్ లిఫ్టర్ రాహుల్‌కు ఘనస్వాగతం
సాక్షి, గన్నవరం : కామన్వెల్త్ కీడ్రల్లో స్వర్ణం సాధించిన వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్‌కు ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న అతడినికి బుధవారం ఉదయం ఏపీ క్రీడాశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, శాప్ ఉపాధ్యక్షుడు బంగార్రాజు, రాహుల్ కుటుంబీకులు ఘనంగా స్వాగతం పలికారు. గుంటూరు జిల్లా స్టూవర్ట్‌పురానికి చెందిన రాహుల్ 85 కిలోల విభాగంలో పసిడి పతకం నెగ్గిన విషయం తెలిసిందే. -
‘సుశీల్ రియోలో ఆడి ఉంటే స్వర్ణమే’
సాక్షి, న్యూఢిల్లీ : 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా సుశీల్‌ని అడ్డుకొని ఉండకపోతే భారత్‌కు తప్పక బంగారు పతకం సాధించిపెట్టేవాడని యోగా గురు బాబా రాందేవ్ అభిప్రాయ పడ్డారు. గోల్డ్ కోస్ట్‌లో జరిగిన ‘కామన్వెల్త్ గేమ్స్-2018’లో 74 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో స్వర్ణం సాధించిన సుశీల్ కుమార్‌ను, 125 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో స్వర్ణం గెలుపొందిన సుమిత్ మాలిక్‌ను బాబా రాందేవ్ మంగళవారం అభినందించారు. ‘మీరిద్దరూ కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌ను నిలబెట్టారు. యువత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటుంది. సుశీల్ గనుక రియో ఒలిపింక్స్‌లో పాల్గొని ఉంటే స్వర్ణం సాధించి ఉండేవాడు’ అంటూ రాందేవ్ వ్యాఖ్యానించారు. రియో ఒలింపిక్స్‌లో 74 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ పోటీల్లో బెర్త్ కోసం ముంబయ్‌కు చెందిన నార్సింగ్ యాదవ్‌కు, తనకు ట్రయల్ పోటీ నిర్వహించాలన్న సుశీల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. గాయం కారణంగా 2015 లాస్ వెగాస్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్లో సుశీల్ పాల్గొనక పోవడంతో నార్సింగ్ యాదవ్ రియోకి బెర్త్ ఖాయం చేసుకున్నాడు. -
కామన్వెల్త్ క్రీడా విజేతలకు ఘనస్వాగతం
సాక్షి, న్యూఢిల్లీ: గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు గెల్చుకుని వచ్చిన భారత క్రీడాకారులకు దేశంలో ఘన స్వాగతం లభిస్తోంది. రెజ్లింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన సుశీల్ కుమార్‌కి, బాక్సింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన మేరికోమ్‌కి సొంత రాష్ట్రాల్లో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో దేశానికి తొలిసారిగా స్వర్ణ పతకాన్ని అందించిన క్రీడాకారిణి మనికా బత్రాకు ఢిల్లీలో ఘనస్వాగతం లభించింది. మంగళవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మనికాకు అభిమానులు పెద్దఎత్తున స్వాగత ర్యాలీ నిర్వహించారు. మనికా దేశం గర్వపడేలా చేసిందని, ఇలాగే మరిన్ని స్వర్ణ పతకాలు గెలవాలని క్రీడాభిమానులు కోరుకున్నారు. మనికా బత్రా మాట్లాడుతూ.. ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. కామన్వేల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించడం సంతోషంగా ఉందని, ఇలాగే మరిన్ని పతాకాలను భారత్‌కు అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో భారతదేశానికి తొలిసారిగా స్వర్ణ పతకాన్ని అందించింది క్రీడాకారిణి మనికా బత్రా. సింగపూర్ క్రీడాకారిణి మెయినగ్యు యూతో జరిగిన హోరాహోరీ పోరులో మనికా 11-7, 11-6, 11-2, 11-7 పాయింట్లతో గెలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో కామన్వెల్త్ చరిత్రలో భారతదేశానికి టేబుల్ టెన్నిస్‌లో స్వర్ణపతకం తీసుకొచ్చిన మొదటి మహిళగా రికార్డులకెక్కింది. సెమీ ఫైనల్లో ఈమె వరల్డ్ నెంబర్ ఫోర్ మరియు ఒలింపిక్ మెడల్ గ్రహీతైన సింగపూర్ క్రీడాకారిణి తియాన్వై ఫెంగ్‌ను ఓడించడం విశేషం. గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యలను భారత అథ్లెట్లు సొంతం చేసుకున్నారు. మొత్తం 66 పతకాలతో భారత్ మూడోస్థానంలో నిలిచింది. భారత మెన్స్ అథ్లెట్లు 13 స్వర్ణాలతో పాటు 9 రజతాలు, 13 కాంస్యా పతకాలు సాధించారు. ఇక ఉమెన్స్ విభాగంలో 12 స్వర్ణాలు, 10 రజతాలు, 6 కాంస్యా పతకాలు వచ్చాయి. మిక్స్ డ్ టీమ్ విభాగం లో ఒక్కో స్వర్ణం, రజతం, కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. -
...క్షమించండి ముగింపు వేడుకలపై
గోల్డ్‌కోస్ట్: ఘనంగా ప్రారంభమై సజావుగా సాగిన ప్రతిష్ఠాత్మక 21వ కామన్వెల్త్ క్రీడల ముగింపు వేడుకలు మాత్రం ఆ స్థాయిలో జరగలేదు. ప్రసారకర్తలు కనీసం అథ్లెట్ల మార్చ్‌పాస్ట్‌ను కూడా పూర్తి స్థాయిలో చూపించలేకపోయారు. సుదీర్ఘ ప్రసంగాల కవరేజీపైనే ఎక్కువ దృష్టిపెట్టడంతో విసుగెత్తిన ప్రేక్షకులు ముందుగానే వెళ్లిపోయారు. దీనిపై విమర్శలు రావడంతో క్రీడల చీఫ్ పీటర్ బీటీ సోమవారం క్షమాపణ చెప్పారు. అథ్లెట్లను కార్యక్రమంలో భాగం చేయాలనుకుని ముందుగానే స్టేడియంలోకి తీసుకురావడంతో వారి మార్చ్‌పాస్ట్‌ను చూసే అవకాశం టీవీ ప్రేక్షకులను దక్కలేదు. దీంతో అంతా తారుమారై కార్యక్రమ ప్రాధాన్యత మారిపోయింది. -
‘జకార్తా’లోనూ జోరు కొనసాగించాలి
సాక్షి క్రీడావిభాగం : అంచనాలకు మించి రాణించిన భారత క్రీడాకారులు గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌ను సగర్వంగా ముగించారు. టీమ్ క్రీడాంశాల్లో నిరాశపరిచినప్పటికీ వ్యక్తిగత ఈవెంట్స్‌లో మాత్రం దుమ్మురేపారు. తొలిసారే ఈ గేమ్స్‌లో పాల్గొన్న కొందరు స్వర్ణ పతకాలతో మెరిశారు. సీనియర్లకు ఏమాత్రం తీసిపోమని నిరూపించారు. షూటింగ్లో మను భాకర్, అనీశ్ భన్వాలా, బాక్సింగ్‌లో గౌరవ్ సోలంకి ప్రదర్శనే దీనికి నిదర్శనం. మొత్తం 16 క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు బరిలోకి దిగగా... తొమ్మిది క్రీడాంశాల్లో పతకాలు వచ్చాయి. ఆర్టిస్టిక్, రిథమిక్ జిమ్నాస్టిక్స్, సైక్లింగ్, హాకీ, లాన్ బాల్స్, బాస్కెట్‌బాల్, స్విమ్మింగ్ క్రీడాంశాల్లో మనోళ్లకు ఒక్క పతకం కూడా రాలేదు. ఆసియా క్రీడా దిగ్గజాలు చైనా, కొరియా, జపాన్ ప్రాతినిధ్యం లేని కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ కొన్నేళ్లుగా నిలకడగానే రాణిస్తోంది. టాప్–5లో చోటు సంపాదిస్తోంది. అయితే ఈ తరహా ప్రదర్శన చైనా, కొరియా, జపాన్, ఇరాన్, కజకిస్తాన్, చైనీస్ తైపీ తదితర దేశాలు పాల్గొనే ఆసియా క్రీడల్లో భారత్ పునరావృతం చేయాల్సిన అవసరం ఉంది. ఈసారి ఆసియా క్రీడలకు ఇండోనేసియా రాజధాని జకార్తా 2022 ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 2 వరకు వేదికగా నిలువనుంది. గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలతో కలిపి మొత్తం 66 పతకాలు నెగ్గి మూడో స్థానాన్ని సంపాదించింది. ఆసియా క్రీడల విషయానికొస్తే 1986 తర్వాత భారత్ టాప్–5లో ఒక్కసారీ నిలువలేదు. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో భారత్ 11 స్వర్ణాలు, 10 రజతాలు, 36 కాంస్యాలతో కలిపి మొత్తం 57 పతకాలు గెలిచి ఎనిమిదో స్థానంలో నిలిచింది. గోల్డ్ కోస్ట్‌లో భారత్ పతకాలు గెలిచిన క్రీడాంశాలన్నీ జకార్తా ఆసియా క్రీడల్లోనూ ఉన్నాయి. వీటికి అదనంగా ఆర్చరీ, టెన్నిస్, కబడ్డీ, రోయింగ్ క్రీడాంశాల్లో భారత్ పతకాలు సాధించే అవకాశాలున్నాయి. కామన్వెల్త్ గేమ్స్‌లో లేని ఈ క్రీడాంశాలు ఆసియా క్రీడల్లో ఉన్నాయి. అయితే అన్నింట్లోనూ చైనా, కొరియా, జపాన్ల నుంచి భారత్‌కు గట్టిపోటీ ఉంటుంది. కామన్వెల్త్ గేమ్స్ అందించిన విశ్వాసంతో మరో నాలుగు నెలల తర్వాత మొదలయ్యే ఆసియా క్రీడల్లోనూ భారత క్రీడాకారులు మురిపించాలని, గతంలోకంటే ఎక్కువగా పతకాల పంట పండించాలని ఆశిద్దాం. -
కామన్వెల్త్ గేమ్స్.. ముగింపు వేడుకలపై విమర్శలు
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ క్రీడల(2018) నిర్వాహకులు క్రీడాభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. ఆదివారం జరిగిన ముగింపు వేడుకల నిర్వహణ సక్రమంగా లేదని.. టీవీల్లో టెలికాస్టింగ్ కూడా సరిగ్గా జరగలేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ చీఫ్ పీటర్ బెట్టీ స్పందించారు. ‘ సాధారణంగా ఒలంపిక్స్, కామన్వెల్త్ క్రీడల ప్రారంభ వేడుకల కన్నా.. ముగింపు వేడుకలు క్రీడాకారులకు ఉపశమనం అందించేలా.. అందరిలో ఉత్సాహం నింపేలా నిర్వహించటం ఆనవాయితీ. కానీ, ఆ విషయంలో మేం పొరపాట్లు చేశాం. ముగింపు వేడుకల ముందే క్రీడాకారులను మేం మైదానంలోకి(కర్రారా స్టేడియం) లోకి పిలిచాం. మైదానంలో కొద్దిపాటి ప్రేక్షకులే ఉన్నారనుకుని టెలివిజన్‌లో ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వారు పొరపాటు పడ్డారు. క్రీడాకారులు జెండాలతో పెరేడ్ నిర్వహించటం కూడా కొన్ని ఛానెళ్లు సరిగ్గా ప్రసారం చేయలేకపోయారు. దీనికితోడు కొందరు క్రీడాకారులు ఇచ్చిన ఉపన్యాసాలు సుదీర్ఘంగా ఉండటం కూడా అందరికీ విసుగును పుట్టించాయి. వెరసి ముగింపు వేడుకలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నేనే స్వయంగా క్షమాపణలు చెబుతున్నా అని బెట్టీ వరస ట్వీట్లలో పేర్కొన్నారు. మరోవైపు కామన్వెల్త్ గేమ్స్ ప్రసార హక్కులు దక్కించుకున్న ఆస్ట్రేలియా ఛానెల్ ‘సెవెన్’ కూడా ప్రోగ్రామ్‌ను సరిగ్గా టెలికాస్ట్ చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తగా.. ఛానెల్ యాజమాన్యం కూడా ఓ ప్రకటనలో క్షమాపణలు తెలియజేసింది. -
బర్మింగ్‌హామ్‌లో కలుద్దాం!
గోల్డ్‌కోస్ట్: లక్షల మంది ప్రేక్షకుల్ని మురిపించిన వేడుక, వేలమంది అథ్లెట్లను మెరిపించిన ఆటల పండుగ ముగిసింది. 12 రోజుల పాటు గోల్డ్ కోస్ట్ ఆతిథ్యమిచ్చిన కామన్వెల్త్గేమ్స్ ఆద్యంతం అలరించాయి. ఆసీస్ వాసులు ఆరంభం నుంచి గేమ్స్‌కు బ్రహ్మరథం పట్టారు. విజేతలకు జేజేలు పలికి క్రీడాస్ఫూర్తిని చాటారు. గేమ్స్‌కు ముందు అట్టహాసంగా ప్రారంభమైన వేడుకల్లో ఆసీస్ చరిత్రను, సంప్రదాయాన్ని ఆవిష్కరిస్తే... ముగింపు వేడుకల్లో ఘనమైన పార్టీతో వీడ్కోలు పలికారు. బాణాసంచా వెలుగులు, మిరుమిట్లు గొలిపే కాంతులు స్టేడియాన్ని వర్ణరంజితం చేశాయి. ఈ సందర్భంగా కామన్వెల్త్ గేమ్స్ పతాకాన్ని 2022 గేమ్స్‌కు ఆతిథ్యమివ్వనున్న బర్మింగ్‌హామ్ (ఇంగ్లండ్) అధికారులకు అందజేశారు. ముగింపు వేడుకల్లో వివిధ దేశాలకు చెందిన అథ్లెట్లు తమ తమ జాతీయ జెండాలతో, పతకాలు గెలిచిన విజయగర్వంతో మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. భారత బృందానికి బాక్సర్ మేరీకోమ్ నేతృత్వం వహించింది. -
త్రివర్ణ శోభితం...
తొలి రోజే విరజిమ్మిన పసిడి వెలుగులను భారత క్రీడాకారులు చివరి రోజు వరకూ కొనసాగించారు. ఫలితంగా గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌ను భారత్ అంచనాలకు మించిన ప్రదర్శనతో దిగ్విజయంగా ముగించింది. పోటీల ఆఖరి రోజు త్రివర్ణాలైన స్వర్ణ, రజత, కాంస్య పతకాలు భారత క్రీడాకారుల ఖాతాలో చేరడం విశేషం.బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ స్వర్ణం సాధించగా... పీవీ సింధు రజతం దక్కించుకుంది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ రజతం సొంతం చేసుకోగా... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ద్వయం రజతం సాధించింది. మహిళల స్క్వాష్ డబుల్స్ విభాగంలో దీపిక పళ్లికల్–జోష్నా చినప్ప జంట రజతం గెల్చుకోగా... టేబుల్ టెన్నిస్ (టీటీ) మిక్స్డ్ డబుల్స్‌లో మనిక బాత్రా – సత్యన్ జ్ఞానశేఖరన్... పురుషుల సింగిల్స్‌లో ఆచంట శరత్ కమల్ కాంస్య పతకాలు నెగ్గారు. ఆఖరి రోజు ఏడు పతకాలు సాధించిన భారత్ ఓవరాల్‌గా 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలతో 66 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. 2014 గ్లాస్గో గేమ్స్ (15 స్వర్ణాలు, 30 రజతాలు, 19 కాంస్యాలతో కలిపి 64 పతకాలు)తో పోలిస్తే స్వర్ణ పతకాల విషయంలో పురోగతి సాధించింది. ‘గోల్డ్ కోస్ట్’లో భారత్ మూడో స్థానంలో నిలిచి ఈ క్రీడల చరిత్రలో తమ రెండో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. 2010 ఢిల్లీ గేమ్స్‌లో భారత్ అత్యుత్తమంగా రెండో స్థానాన్ని సాధించింది. 2002, 2006 గేమ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత్, 1990 గేమ్స్‌లో ఐదో స్థానాన్ని పొందింది. గోల్డ్‌కోస్ట్: మొదటి నుంచి మొదలైన పతకాల వేటను చివరి రోజు వరకు కొనసాగిస్తూ భారత క్రీడాకారులు కామన్వెల్త్ గేమ్స్‌కు ఘనమైన ముగింపు ఇచ్చారు. అందుబాటులో ఉన్న ఏడు పతకాలను దక్కించుకున్నారు. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో ఇద్దరు భారత స్టార్లు సైనా నెహ్వాల్, పీవీ సింధుల మధ్య జరిగిన ఫైనల్లో సైనా పైచేయి సాధించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో సైనా 21–18, 23–21తో సింధును ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఈ గేమ్స్ చరిత్రలో సైనాకిది రెండో వ్యక్తిగత స్వర్ణం. 2010 గేమ్స్‌లోనూ ఆమె ఈ ఘనత సాధించింది. చీలమండ గాయం కారణంగా టీమ్ విభాగంలో బరిలోకి దిగని సింధుపై తుది పోరులో సైనా ఆధిపత్యం చలాయించింది. సింధు సంధించిన స్మాష్‌లకు కొన్నిసార్లు సైనా వద్ద సమాధానం లేకపోగా... సైనా కొట్టిన డ్రాప్ షాట్లకు సింధు చేతులెత్తేసింది. తొలి గేమ్ ఆరంభంలోనే 9–4తో ముందంజ వేసిన సైనా... ఆ తర్వాత అదే జోరు కొనసాగించి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్ కూడా నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఈ గేమ్‌లోనూ కీలకదశలో సైనా పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. ‘నేను పూర్తి ఫిట్నెస్తో బరిలోకి దిగాను. నేను నా అత్యుత్తమ ప్రదర్శన చేశాను. అయితే ఈ రోజు నాది కాదంతే’ అని ఓటమి తర్వాత సింధు వ్యాఖ్యానించింది. శ్రీకాంత్‌కు నిరాశ... పురుషుల సింగిల్స్‌లో స్వర్ణం నెగ్గాలని ఆశించిన భారత స్టార్, ప్రపంచ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ రజతంతో సరిపెట్టుకున్నాడు. మలేసియా దిగ్గజం లీ చోంగ్ వీతో జరిగిన ఫైనల్లో శ్రీకాంత్ 19–21, 21–14, 21–14తో పోరాడి ఓడిపోయాడు. మిక్స్డ్ టీమ్ విభాగం ఫైనల్ సందర్భంగా లీ చోంగ్ వీని ఓడించిన శ్రీకాంత్ అదే ఫలితాన్ని ఈసారి పునరావృతం చేయలేకపోయాడు. ఈ క్రీడల్లో లీ చోంగ్ వీకిది మూడో వ్యక్తిగత స్వర్ణం. అతను 2006 మెల్బోర్న్, 2010 ఢిల్లీ గేమ్స్‌లోనూ స్వర్ణాలు గెలిచాడు. సాత్విక్–చిరాగ్ జంట తడబాటు... ఈ క్రీడల్లో ఆరంభం నుంచి అద్భుతంగా ఆడిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం స్వర్ణ పతక పోరులో నిరాశపరిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట 13–21, 16– 21తో మార్కస్ ఎలిస్–క్రిస్ లాన్గ్రిడ్జ్ (ఇంగ్లండ్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. తద్వారా ఈ గేమ్స్ చరిత్రలో పురుషుల డబుల్స్ విభాగంలో రజతం నెగ్గిన తొలి భారతీయ జోడీగా సాత్విక్–చిరాగ్ జంట గుర్తింపు పొందింది. మనిక ఖాతాలో నాలుగో పతకం... టేబుల్ టెన్నిస్ (టీటీ)లో చివరి రోజు భారత్‌కు రెండు కాంస్యాలు లభించాయి. మిక్స్డ్ డబుల్స్ కాంస్య పతక పోరులో మనిక బాత్రా–సత్యన్ జంట 11–6, 11–2, 11–4తో భారత్‌కే చెందిన ఆచంట శరత్ కమల్–మౌమా దాస్ జోడీపై గెలిచింది. ఈ గేమ్స్‌లో మనికకు ఇది నాలుగో పతకం కావడం విశేషం. ఆమె మహిళల టీమ్ విభాగంలో స్వర్ణం, సింగిల్స్ విభాగంలో స్వర్ణం, డబుల్స్ విభాగంలో రజతం గెల్చుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ కాంస్య పతక పోరులో శరత్ కమల్ 11–7, 11–9, 9–11, 11–6, 12–10తో సామ్యూల్ వాకర్ (ఇంగ్లండ్)పై గెలిచాడు. ఫైనల్లో ఓడిన దీపిక–జోష్నా జోడీ గ్లాస్గో గేమ్స్‌లో మహిళల డబుల్స్ స్క్వాష్ విభాగంలో స్వర్ణం నెగ్గిన దీపిక పళ్లికల్–జోష్నా చినప్ప (భారత్) జంట ఈసారి మాత్రం రజతంతో సంతృప్తి పడింది. ఫైనల్లో దీపిక–జోష్నా ద్వయం 9–11, 8–11తో జోలీ కింగ్– అమందా (న్యూజిలాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. మరిన్ని పతకాలు సాధించేవాళ్లం... కామన్వెల్త్ క్రీడల్లో మొత్తంగా మా ప్రదర్శన సంతృప్తినిచ్చింది. టీమ్ ఈవెంట్లో మలేసియాను ఓడించి మనం స్వర్ణం నెగ్గడమే అన్నింటికంటే అద్భుతం. నా దృష్టిలో ఈ టోర్నీ అశ్విని సొంతం. సాత్విక్–అశ్విని జంట టీమ్ ఈవెంట్లో విజయం సాధించి భారత్‌ను 1–0తో ముందంజలో నిలపడమే ఆ తర్వాత లీ చోంగ్ వీపై శ్రీకాంత్ చెలరేగి ఆడేందుకు కావాల్సిన స్ఫూర్తినిచ్చింది. మిక్స్డ్ డబుల్స్‌లో కూడా సాత్విక్–అశ్విని జోడి పతకం నెగ్గాల్సింది. ఓవరాల్‌గా చూస్తే కఠిన పరిస్థితుల్లో మన షట్లర్లు ఒకే రోజు రెండేసి మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. మ్యాచ్‌ల షెడ్యూలింగ్‌లో కాస్త అదృష్టం కలిసొస్తే మరో రెండు పతకాలు మన ఖాతాలో చేరేవి. సైనా ఆటతీరు ఎంతో మెరుగైంది. ముందుగా టీమ్ మ్యాచ్‌లు బాగా ఆడి ఆ తర్వాత వ్యక్తిగత ఈవెంట్లలో కూడా సైనా రాణించడం చెప్పుకోదగ్గ అంశం. –పుల్లెల గోపీచంద్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ ఒలింపిక్ పతకంతో సమానం... కామన్వెల్త్ విజయం నా తల్లిదండ్రులకు ఇస్తున్న కానుక. గాయం కారణంగా రియో ఒలింపిక్స్‌లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత ఈ పతకం గెలుచుకోవడం ఉద్వేగంగా ఉంది. నా దృష్టిలో ఒలింపిక్ పతకం, నంబర్ వన్ ర్యాంక్‌లతో ఈ విజయం సమానం. గత 10–12 రోజులుగా నిర్విరామంగా ఆడుతుండటం వల్ల కూడా నేను మరింత ఎక్కువ శ్రమించాల్సి వచ్చింది. సింధుతో ఆరోగ్యకరమైన పోటీ ఉంది. దీనిని ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. మాపై ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న అమ్మాయిని ఓడించగలగడం సంతోషంగా ఉంది. మా నాన్న కోసం పోరాడటాన్ని నేను తప్పుగా భావించడం లేదు. అందరూ దానిని అదోలా చేశారు. కానీ ఆయన లేకపోతే నేను దేశం కోసం పతకాలు గెలవకపోయేదాన్ని. ఏదీ చేయకుండా అంతా చేసేసినట్లు అందరూ వ్యవహరించారు. ముందే తెలిస్తే నేను ఆయన కోసం హోటల్ గదిని తీసుకునేదాన్ని. వ్యక్తిగత కోచ్ అక్రిడిటేషన్ ఇచ్చి చివరకు అలా చేశారు. ఈ విషయంలో తీవ్ర ఒత్తిడికి లోనై నేను రెండు రోజుల పాటు సరిగ్గా నిద్రపోలేదు. సింధు టీమ్ ఈవెంట్లు ఆడటం లేదు. కానీ నేను మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. నేను మా నాన్న కోసం పోరాడటమే అందరికీ సమస్యగా అనిపించింది. నేను సింధు చేతిలో ఓడితే భారత్‌లో చాలా మంది సైనా వయసైపోయింది, రిటైర్ కావాలి అంటూ వంద వ్యాఖ్యలు చేస్తారు. అదే సింధును ఇంకా ఎదుగుతున్న క్రీడాకారిణిగానే చూస్తారు. ఆమెనైతే ఎవరూ ఏమీ అనరు. – సైనా -
కామన్వెల్త్ ప్రస్థానం
-
భార్య మ్యాచ్ చూసి కలత చెందిన కార్తీక్
కోల్‌కతా : కామన్వెల్త్ గేమ్స్‌లో తన భార్య దీపికా పల్లికల్ స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ మ్యాచ్ చూసి కలత చెందినట్లు కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తిక్ తెలిపాడు. ఈ ఫైనల్లో రిఫరీల తీరును కార్తీక్ తప్పుబడుతూ ట్వీట్ చేశాడు. రిఫరీలు సరిగా ప్రవర్తించలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన స్క్వాష్ డబుల్స్ ఫైనల్లో రిఫరీలు తీరుతో అప్సెట్ అయ్యా. ఈ మ్యాచ్‌లో గోల్డ్‌మెడల్ పక్కా అని భావించా. అయినప్పటకి దీపిక పల్లికల్, సౌరవ్ ఘోషల్ మీ విజయంతో దేశం గర్వించేలా చేశారు. మీరే మాకు, దేశానికి నిజమైన విజేతలు.’ అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. కామన్వెల్త్ స్వర్ణ పతకం కోసం దీపిక పల్లికల్, సౌరవ్ ఘోషల్ మిక్స్డ్ డబుల్స్ జంట పోరాడి.. చివరికి రజత పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక దినేశ్ కెప్టెన్సీ వహిస్తున్న కోల్‌కతా సైతం సన్‌రైజర్స్ చేతిలో ఓడింది. .@DipikaPallikal @SauravGhosal @CWGSquash @GC2018 @cwg pic.twitter.com/DvLrXvUSGI — DK (@DineshKarthik) 14 April 2018 -
ముగిసిన కామన్వెల్త్ గేమ్స్
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్-2018 ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ ముగింపు వేడుకల్లో భారత అథ్లెట్ల బృందానికి బాక్సింగ్ దిగ్గజం మేరికోమ్ నేతృత్వం వహించారు. త్రివర్ణపతకాన్ని చేతపట్టుకోని నడుస్తూ.. కామన్వెల్త్ గేమ్స్‌కు ముగింపు పలికారు. ఈ 21వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పంట పండింది. 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యలను భారత అథ్లెట్లు సొంతం చేసుకున్నారు. మొత్తం 66 పతకాలతో భారత్ మూడోస్థానంలో నిలిచింది. 198 పతకాలతో(80 స్వర్ణాలు,59 రజతాలు, 59 కాంస్యాలు) ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉండగా 136 పతకాలతో(45 స్వర్ణాలు, 45 రజాతాలు, 46 కాంస్యలతో) ఇంగ్లండ్ రెండోస్థానంలో నిలిచింది. చివరిదైన11వ రోజు భారత్ 1 స్వర్ణం, 4 రజతాలు, 1 కాంస్యలతో ఏడు పతకాలను సొంతం చేసుకుంది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో 21-18, 23-21 తేడాతో పీవీ సింధుపై నెగ్గిన సైనా నెహ్వాల్‌కు బంగారు పతకం సొంతమైంది. ఇక ఓడిన పీవీ సింధు రజతం సాధించారు. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో శ్రీకాంత్ రజత పతకం గెలుపొందారు. టేబుల్ టెన్నిస్‌లో శరత్ కమల్ కాంస్య పతకం సాధించగా.. స్క్వాష్ మహిళల డబుల్స్ ఫైనల్లో భారత్ స్టార్లు జోష్నా చిన్నప్ప, దీపికా పల్లికల్ కార్తీక్‌లు రజత పతకాలు గెలుపొందారు. ఇక పతకాల జాబితాలో కెనడా 82, న్యూజిలాండ్ 46, దక్షిణాఫ్రికా 37, వాలేస్ 36, స్కాట్లాండ్ 44, నైజిరియా 24, సైప్రస్ 14, జమైకా 27, మలేసియా 24, కెన్యా 17, నార్త్ ఐర్లాండ్ 12 పతకాలు సాధించాయి. -
కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్‌కు చేదు అనుభవం
వారణాసి: కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచి భారత కీర్తిని పతాక స్థాయికి చేర్చిన వెయిట్‌లిఫ్టర్ పూనమ్ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. శనివారం వారణాసిలో ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. పూనమ్ యాదవ్ వారణాసిలోని తమ బంధువుల ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. పూనమ్‌తోపాటు తండ్రి, మరో ఇద్దరు బంధువులు కూడా ఉన్నారు. వాళ్లు అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. దుండగులు వారిపైన కూడా దాడి చేశారు. రాళ్ల వర్షం కురవడంతో పోలీసులు వెంటనే పూనమ్‌ను అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై వారణాసి రూరల్ ఎస్పీ అమిత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ విషయం తెలియగానే అదనపు బందోబస్తును పూనమ్ యాదవక్‌కు రక్షణగా పంపించామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దాడికి పాల్పడిన వాళ్లను వదిలిపెట్టమన్నారు. గతంలో పూనమ్ యాదవ్ బంధువు, సమీప గ్రామ పెద్దకు మధ్య ఉన్న భూవివాదంలో భాగంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన 21వ కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ మహిళల 69 కేజీల విభాగంలో పూనమ్ గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. స్నాచ్‌లో 100 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 122 కేజీల బరువెత్తి ఆమె పసిడిని సొంతం చేసుకుంది. -
ఆఖరి రోజూ భారత్ పతకాల జోరు
గోల్డ్‌కోస్ట్, క్వీన్స్లాండ్ : 21వ కామన్వెల్త్ గేమ్స్ ఆఖరి రోజు భారత్ పతకాల పంట పండింది. 11వ రోజు మహిళల బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్ బంగారు పతకం సాధించగా, పీవీ సింధు రజతం సాధించారు. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో శ్రీకాంత్ రజత పతకం సాధించారు. మలేసియా షట్లర్ లీ చోంగ్ వీతో జరిగిన ఫైనల్లో శ్రీకాంత్ ఓటమి చవి చూశారు. పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో ఇంగ్లండ్‌తో తలపడిన భారత్ వరుస సెట్లలో ఓడిపోయి రజత పతకానికి పరిమితమైంది. టేబుల్ టెన్నిస్‌లో శరత్ కమల్, ఇంగ్లండ్ ఆటగాడిని వరుస సెట్లలో మట్టికరిపించి భారత్‌కు కాంస్య పతకం అందించారు. స్క్వాష్ మహిళల డబుల్స్ ఫైనల్లో భారత్ స్టార్లు జోష్నా చిన్నప్ప, దీపికా పల్లికల్ కార్తీక్‌లు న్యూజిలాండ్ జంట చేతిలో ఓటమి చవిచూశారు. దీంతో భారత్ రజత పతకానికి పరిమితం కావాల్సివచ్చింది. పసిడి 26, రజతం 20, కాంస్యం 20 కలిపి మొత్తం 66 పతకాలతో భారత్ పట్టికలో మూడో స్థానంలో ఉంది. -
ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ ఓటమి
-
సైనాకు స్వర్ణం.. సింధుకు రజతం..
-
ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్‌కి షాక్
గోల్డ్‌కోస్ట్ : ప్రపంచ నంబర్‌వన్, భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో చుక్కెదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ స్వర్ణ పోరులో ఓటమి చెందడంతో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో మలేసియాకు చెందిన లీ చోంగ్ వీ 19-21, 21-14, 21-14 తేడాతో కిడాంబి శ్రీకాంత్‌పై విజయం సాధించి స్వర్ణం సాధించాడు. తొలి గేమ్‌లో హోరాహోరాగా పోరాడి నెగ్గిన భారత షట్లర్ శ్రీకాంత్ ఆపై రెండు వరుస గేమ్‌లు కోల్పోయాడు. దీంతో మ్యాచ్ లీ చోంగ్ వీ వశమైంది. తొలి గేమ్ కోల్పోయిన లీ చోంగ్ వీ ఆపై ఏ దశలోనూ శ్రీకాంత్‌కు అవకాశం ఇవ్వలేదు. అద్భుతమైన స్మాష్‌లతో వరుస పాయింట్లు నెగ్గడంతో శ్రీకాంత్ కాస్త ఒత్తిడికి లోనైనట్లు కనిపించాడు. మూడో గేమ్‌లో సైతం లీ చోంగ్ వీ ఆదినుంచే పాయింట్లపై దృష్టిపెట్టి ఎదురుదాడి చేయడంతో గేమ్‌తో పాటు మ్యాచ్ కోల్పోయిన శ్రీకాంత్ రజతంతో సరిపెట్టుకున్నాడు. సెమీఫైనల్స్‌లో లీ చోంగ్ వీ 21–16, 9–21, 21–14తో హెచ్ఎస్ ప్రణయ్ (భారత్)ను ఓడించిన విషయం తెలిసిందే. భారత్ ఖాతాలో 65 పతకాలు ఉండగా.. అందులో 26 స్వర్ణాలు, 19 రజతాలు, 20 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. -
స్వర్ణపోరులో సింధుపై సైనా విజయం
సాక్షి, హైదరాబాద్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ స్వర్ణ యాత్ర కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో మరో స్వర్ణం భారత పతకాల పట్టికలో చేరింది. ఉత్కంఠభరిత ఫైనల్లో పీవీ సింధుపై సైనా నెహ్వాల్ అద్భుత విజయం సాధించారు. నువ్వా నేనా అంటూ సాగిన రెండు సెట్ల మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ సింధుపై 21-18, 23-21 తేడాతో విజయం సాధించారు. దీంతో సింధు రజతంతో సరిపెట్టుకున్నారు. ఆద్యంతం ఎటాకింగ్ గేమ్‌ను ఆడిన సైనా సింధుపై ఆధిపత్యం ప్రదర్శించడం గమనార్హం. ఈ గోల్డ్‌తో భారత్ ఖాతాలో 26 స్వర్ణాలు చేరగా.. మొత్తం 64 పతకాలతో పట్టికలో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. -
స్వర్ణం కోసం సింధు, సైనా పోరు
బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణ, రజత పతకాలు భారత్ ఖాతాలో చేరనున్నాయి. భారత టాప్ స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఫైనల్ చేరుకోవడమే దీనికి కారణం. శనివారం జరిగిన సెమీఫైనల్స్‌లో సింధు 21–18, 21–8తో మిచెల్లి లీ (కెనడా)పై, సైనా 21–14, 18–21, 21–17తో కిర్స్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)పై గెలిచారు. నేడు జరిగే ఫైనల్లో సింధు, సైనా అమీతుమీ తేల్చుకుంటారు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో లీ చోంగ్ వీ (మలేసియా)తో ప్రపంచ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ (భారత్) తలపడనున్నాడు. సెమీఫైనల్స్‌లో శ్రీకాంత్ 21–10, 21–17తో రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)ను, లీ చోంగ్ వీ 21–16, 9–21, 21–14తో హెచ్ఎస్ ప్రణయ్ (భారత్)ను ఓడించారు. కాంస్య పతక పోరులో ప్రణయ్ 21–17, 23–25, 9–21తో రాజీవ్ ఉసెఫ్ చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ కాంస్య పతక పోరులో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జంట 19–21, 19–21తో పెంగ్ సూన్ చాన్–లియు యింగ్ గో (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 21–18, 21–10తో సచిన్ డయాస్–గుణెతిలక (శ్రీలంక) ద్వయంపై గెలిచి నేడు జరిగే స్వర్ణ పతక పోరులో క్రిస్–మార్కస్ (ఇంగ్లండ్) జంటతో తలపడనుంది. -
స్వర్ణాభిషేకం
గోల్డ్ రష్.. గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో గత తొమ్మిది రోజుల్లో ఒకే రోజు గరిష్టంగా మూడు స్వర్ణాలు నెగ్గిన భారత క్రీడాకారులు... పదో రోజు శనివారం మాత్రం తమ విశ్వరూపం ప్రదర్శించారు. ఊహించనిరీతిలో ఒకే రోజు ఏకంగా 8 స్వర్ణాలు సొంతం చేసుకొని పసిడి పంట పండించారు. బాక్సింగ్‌లో మేరీకోమ్ (48 కేజీలు), గౌరవ్ సోలంకి (52 కేజీలు), వికాస్ కృషన్ (75 కేజీలు)... రెజ్లింగ్‌లో వినేశ్ ఫొగాట్ (మహిళల 50 కేజీలు), సుమీత్ (పురుషుల 125 కేజీలు), టేబుల్ టెన్నిస్‌లో మనిక బాత్రా (మహిళల సింగిల్స్), షూటింగ్లో సంజీవ్ రాజ్‌పుత్ (పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్), అథ్లెటిక్స్‌లో నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో) బంగారు పతకాలు గెలిచారు. నేడు ముగియనున్న ఈ గేమ్స్‌లో ఓవరాల్ పతకాల పట్టికలో భారత్‌కు మూడో స్థానం ఖాయమైంది. గోల్డ్‌కోస్ట్‌లో భారత్ స్వర్ణాల పంట పండించింది. కామన్వెల్త్ క్రీడల్లో మొదటి తొమ్మిది రోజుల్లో 17 బంగారు పతకాలు నెగ్గిన మన బృందం ఒక్క పదో రోజే 8 పసిడి పతకాలతో సత్తా చాటింది. బాక్సింగ్ పంచ్ మూడు... రెజ్లింగ్ పట్టు రెండు చొప్పున బంగారు పతకాలు అందించాయి. టేబుల్ టెన్నిస్, షూటింగ్, అథ్లెటిక్స్ క్రీడాంశాల నుంచి ఒక్కో స్వర్ణం భారత్ బంగారం బరువును పెంచాయి. బాక్సింగ్‌లో మూడు వెండి విజయాలు సహా 5 రజతాలు... నాలుగు కంచు మోతలతో శనివారం మన ఖాతాలో మొత్తం 17 పతకాలు చేరడం విశేషం. పోటీలకు చివరి రోజైన ఆదివారం జరగబోయే మహిళల బ్యాడ్మింటన్ ఫైనల్ ద్వారా ఇప్పటికే ఒక స్వర్ణం మన చెంత చేరగా... బ్యాడ్మింటన్, స్క్వాష్‌లలో కలిపి మరో మూడు బంగారు పతకాలు గెలిచేందుకు అవకాశం ఉంది. ఓవరాల్‌గా పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్థానంతో గేమ్స్‌ను ముగించడం ఖాయమైంది. నీరజ్ ఘనత... పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. మొత్తం 86.47 మీటర్ల దూరం జావెలిన్ విసిరి అతను అగ్రస్థానంలో నిలిచాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో జావెలిన్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కాగా, ఓవరాల్‌గా రెండో పతకం మాత్రమే. ఇంతకుముందు 2010 ఢిల్లీ క్రీడల్లో కాశీనాథ్ నాయక్ కాంస్యం సాధించాడు. ఓవరాల్‌గా కామన్వెల్త్ గేమ్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో స్వర్ణం నెగ్గిన ఐదో భారతీయ అథ్లెట్‌గా నీరజ్ గుర్తింపు పొందాడు. గతంలో మిల్కా సింగ్ (1958), కృష్ణ పూనియా (2010–డిస్కస్ త్రో), వికాస్ గౌడ (2014–డిస్కస్ త్రో), 4్ఠ400 మహిళల రిలే జట్టు (2010లో) ఈ ఘనత సాధించారు. పంచ్ పవర్... బాక్సింగ్‌లో ఆరుగురు ఫైనల్లోకి చేరగా... మేరీకోమ్, గౌరవ్ సోలంకి (52 కేజీలు), వికాస్ కృషన్ (75 కేజీలు) స్వర్ణాలు గెలిచారు. అమిత్ (49 కేజీలు), మనీశ్ కౌశిక్ (60 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) రజతాలు గెల్చుకున్నారు. మహిళల 48 కేజీల ఫైనల్లో మేరీకోమ్ 5–0తో క్రిస్టినా ఒహారా (నార్తర్న్ ఐర్లాండ్)పై గెలిచి ఈ గేమ్స్ చరిత్రలో స్వర్ణం నెగ్గిన తొలి భారత మహిళా బాక్సర్‌గా చరిత్ర లిఖించింది. ఇతర ఫైనల్స్‌లో గౌరవ్ 4–1తో బ్రెండన్ ఇర్విన్ (నార్తర్న్ ఐర్లాండ్)పై, వికాస్ 5–0తో విల్ఫ్రెడ్ సెయిన్స్టన్ (కామెరూన్)పై విజయం సాధించారు. మరోవైపు మనీశ్ కౌశిక్ 2–3తో హ్యారీ గార్సిడ్ (ఆస్ట్రేలియా) చేతిలో... అమిత్ 1–3 తేడాతో గలాల్ యాఫై (ఇంగ్లండ్) చేతిలో... సతీశ్ కుమార్ 0–5తో ఫ్లేజర్ క్లార్క్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడి రజతాలు గెలిచారు. సెమీస్‌లో ఓడిన తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (56 కేజీలు), మనోజ్ (69 కేజీలు), నమన్ తన్వర్ (91 కేజీలు)లకు కాంస్య పతకాలు లభించాయి. సంజీవ్ స్వర్ణ గురి.. షూటింగ్ ఈవెంట్‌ను భారత్ స్వర్ణంతో ముగించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్ ఫైనల్లో సంజీవ్ రాజ్‌పుత్ 454.5 పాయింట్లు స్కోరు చేసి కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పడంతోపాటు పసిడి పతకం గెలిచాడు. ఈ క్రీడల్లో రాజ్‌పుత్ గతం లో కాంస్యం (2006–మెల్బోర్న్), రజతం (2014– గ్లాస్గో) గెలుచుకున్నాడు. పురుషుల ట్రాప్ ఈవెంట్లో తెలంగాణ షూటర్ కైనన్ షెనాయ్, మానవ్‌జిత్ సంధూ ఫైనల్‌కు అర్హత పొందలేకపోయారు. భళా... మనిక టేబుల్ టెన్నిస్ (టీటీ)లో ఇప్పటికే టీమ్ విభాగంలో స్వర్ణం, మహిళల డబుల్స్‌లో రజత పతకాలను తన ఖాతాలో వేసుకున్న మనిక బాత్రా సింగిల్స్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చి మరో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో మనిక 11–7, 11–6, 11–2, 11–7 తేడాతో యు మెంగ్యు (సింగపూర్)ను చిత్తు చేసింది. తద్వారా కామన్వెల్త్ క్రీడల చరిత్రలో టీటీలో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా మనిక ఘనత సాధించింది. పురుషులు డబుల్స్‌లో ఆచంట శరత్ కమల్–జ్ఞానశేఖరన్ సత్యన్ జోడి రజతం గెలుచుకుంది. ఫైనల్లో శరత్–సత్యన్ ద్వయం 5–11, 12–10, 9–11, 6–11, 8–11తో పాల్ డ్రిన్కాల్–లియామ్ పిచ్‌ఫోర్డ్ (ఇంగ్లండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌లోనే భారత్‌కు కాంస్యం కూడా దక్కింది. కాంస్య పతక పోరులో హర్మీత్ దేశాయ్–సానిల్ శంకర్ శెట్టి 11–5, 11–6, 12–10తో ప్యాంగ్ యెన్ కోయెన్ – షావో ఫెంగ్ (సింగపూర్)ను చిత్తు చేశారు. దీపిక జంటకు రజతం స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో భారత జంట దీపిక పళ్లికల్–సౌరవ్ ఘోషాల్‌కు నిరాశే ఎదురైంది. ఫైనల్లో కామెరాన్ పిల్లీ–డోనా ఉర్ఖుహర్ట్ (ఆస్ట్రేలియా) చేతిలో వరుస గేమ్‌లలో 8–11, 10–11తో ఓడిన దీపిక–సౌరవ్ రజత పతకంతో సంతృప్తి చెందారు. హాకీలో హతవిధీ... భారత పురుషుల, మహిళల హాకీ జట్లు గోల్డ్‌కోస్ట్ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగాయి. కాంస్య పతకం కోసం బరిలో దిగిన పురుషుల జట్టు 1–2తో, మహిళల జట్టు 0–6తో ఇంగ్లండ్ జట్ల చేతిలో ఓటమిపాలై నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాయి. ‘పట్టు’ నిలిచె... రెజ్లింగ్‌లోనూ భారత్ తమ ‘పట్టు’ నిలబెట్టుకుంది. శనివారం జరిగిన నాలుగు విభాగాల్లో భారత్‌కు రెండు స్వర్ణాలు, రెండు కాంస్యాలు లభించాయి. మహిళల 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ స్వర్ణ పతకంతో మెరిసింది. నలుగురు రెజ్లర్ల మధ్య లీగ్ పద్ధతిలో జరిగిన ఈ పోరులో వినేశ్ ఆడిన మూడు బౌట్లలోనూ అజేయంగా నిలిచి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. వినేశ్ వరుసగా 3–1తో మిసిని జెనెసిస్ (నైజీరియా), 4–0తో రూపిందర్ కౌర్ (ఆస్ట్రేలియా), 4–1తో జెస్సికా మెక్‌డొనాల్డ్ (కెనడా)లపై విజయం సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా రెండోసారి వినేశ్ స్వర్ణం గెలుచుకోవడం విశేషం. పురుషుల 125 కేజీల విభాగంలో సుమీత్ స్వర్ణ పతకంతో సత్తా చాటాడు. ఐదుగురు రెజ్లర్ల మధ్య లీగ్ పద్ధతిలో జరిగిన బౌట్లలో సుమీత్ తాను ఆడిన నాలుగు బౌట్లలోనూ విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. సుమిత్ వరుసగా 5–0తో క్లాడ్ బియాంగ్ (కామెరూన్)పై, 3–1తో కేరీ జార్విస్ (కెనడా)పై, 3–1తో తయ్యబ్ రజా (పాకిస్తాన్)పై, 5–0తో సినివి బోల్టిక్ (నైజీరియా)పై గెలుపొందాడు. మరోవైపు మహిళల 62 కేజీల విభాగంలో సాక్షి మలిక్, పురుషుల 86 కేజీల విభాగంలో సోమ్‌వీర్ కాంస్య పతకాలు నెగ్గారు. సిక్కి జోడీకి కాంస్యం బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్‌లో భారత్‌కు కాంస్య పతకం లభించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో తెలంగాణ క్రీడాకారిణి ఎన్. సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప కలిసి 21–19, 21–19 స్కోరుతో ఆస్ట్రేలియాకు చెందిన మపాసా సెత్యానా–సొమర్‌విలే గ్రాన్యాలపై గెలుపొందారు. -
ఒక్కసారి మైండ్‌లో ఫిక్స్ అయితే..నా భర్త కూడా ఆపలేరు
గోల్డ్‌కోస్ట్ : గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకం సాధించిన భారత మహిళా బాక్సర్ మేరీకోమ్ తన విజయ రహస్యాన్ని వెల్లడించారు. ఫిట్నెస్ను కాపాడుకోవడం ద్వారానే 35 ఏళ్ల వయస్సులోనూ తాను రాణించగలుగుతున్నానని పేర్కొన్నారు. 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం నెగ్గిన తర్వాత మేరీకోమ్ మీడియాతో మాట్లాడారు. ప్రత్యర్థిని నిలువరించేందుకు ముందుగానే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటానని.. తద్వారా సులువుగా విజయం సాధించే అవకాశం ఉంటుందన్నారు. గాయాల బెడద లేకపోవడం తనకు కలిసొచ్చే అంశమని తెలిపారు. ఒక్కసారి మైండ్‌లో ఫిక్స్ అయితే.. ఈవెంట్లు లేని సమయంలోనూ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటానని క్రీడల పట్ల తనకున్న నిబద్ధతని చాటుకున్నారు. బౌట్లు లేని సమయంలోనూ ఇలా కష్టపడడం అవసరమా అంటూ తన భర్త ప్రేమగా కోప్పడతారని.. అయినప్పటికీ ప్రాక్టీస్ చేయకుండా ఆయన నన్ను ఆపలేరని సరదాగా వ్యాఖ్యానించారు. ఒక్కసారి మైండ్‌లో ఫిక్స్ అయిపోతే అనుకున్న పనిని పూర్తిచేసేదాకా ఎవరి మాటా విననన్నారు. 2020 ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే అంశంపై ప్రశ్నించగా.. ఆ విషయంపై ఇప్పుడే ఏం చెప్పలేనన్నారు. ప్రస్తుతం 48 కేజీల బరువున్న తాను ఒలింపిక్స్‌లో 51 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉంటుందని, అప్పటికీ ఫిట్నెస్ను ఇలాగే కాపాడుకోగలిగితే తప్పక పాల్గొంటానని పేర్కొన్నారు. ముగ్గురు పిల్లలకు తల్లైన తర్వాత కూడా పతకాల వేట కొనసాగిస్తున్న మేరీకోమ్ ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రియో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన మేరీకోమ్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం నెగ్గిన భారత తొలి మహిళా బాక్సర్‌గా రికార్డు సృష్టించారు. -
58 ఏళ్ల తర్వాత జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్
-
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పసిడి పంట
-
భారత్ ఖాతాలో మరో స్వర్ణం
గోల్డ్‌కోస్ట్ : ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగిస్తోంది. పదోరోజు ఆటలో భాగంగా భారత క్రీడాకారులు స్వర్ణాల పంట పండిస్తున్నారు. శనివారం ఒక్కరోజే భారత్ 7 స్వర్ణాలు కైవసం చేసుకుంది. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో మానికా బాత్రా సింగపూర్‌కు చెందిన మియింగ్యూ యుపై 11-7, 11-6, 11-2, 11-7 తేడాతో విజయం సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్‌లో దీపికా పల్లికల్, సౌరబ్ ఘోశల్‌లు స్వర్ణ పోరులో ఆస్ట్రేలియాకు చెందిన పిల్లే కామెరూన్, ఉరుక్హఖ్ డోన్నా చేతిలో 0-2 తేడాతో ఓటమి చెందడంతో రజతాలతో సరిపెట్టుకున్నారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 55కు చేరగా.. అందులో 24 స్వర్ణాలు, 14 రజతాలు, 17 కాంస్యాలున్నాయి. భారత్ మూడో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. -
కామన్వెల్త్ గేమ్స్: ఫైనల్లో సైనా Vs సింధు
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్‌లో ఆసక్తికర పోరు జరుగనుంది. భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధూ ఒకే కోర్టులో తలపడనున్నారు. సెమీ ఫైనల్లో తమ ప్రత్యర్థులను మట్టి కరిపించిన ఈ స్టార్స్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. దీంతో బ్యాడ్మింటన్‌లో భారత్ ఖాతాలో స్వర్ణం, రజతం పతకాలు ఖాయమయ్యాయి. అయితే ఫైనల్లో ఎవరికి ఏ పతకం వరించనుందో అని ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరుగనుంది. హోరా హోరిగా సాగిన సెమీస్‌లో లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన సైనా స్కాంట్లాండ్ ఫ్లేయర్ క్రిస్టీ గిల్మోర్ పై 21-14,18-21, 21-17 తో నెగ్గి ఫైనల్లోకి ప్రవేశించింది. మరో సెమీస్‌లో ఒలిపింక్ పతక విజేత సింధు 21-18, 21-8 తేడాతో కెనడా క్రీడాకారిణి మైఖేల్ లీపై విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరోవైపు ప్రపంచ నంబర్ వన్ కిడాంబి శ్రీకాంత్ కూడా ఫైనల్ కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సెమీఫైనల్లో శ్రీకాంత్ 21-10, 21-17 తో ఇంగ్లండ్ క్రీడాకారుడు రాజివ్ ఔసెఫ్పై విజయం సాధించి ఫైనల్లో ప్రవేశించాడు. మరో పురుషుల సెమీస్‌లో హోరాహోరీగా జరిగిన పోరులో భారత్‌కే చెందిన ప్రణయ్ 16-21, 21-9, 14-21 తేడాతో మాజీ ప్రపంచ చాంపియన్, మలేషియా ఆటగాటు చాంగ్ వీ లీ చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో ఫైనల్స్‌లో శ్రీకాంత్, చాంగ్ వీలీతో తలపడనున్నాడు. కాగా ఉమెన్స్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డిలకు ఈ సారి నిరాశ ఎదురైంది. మలేసియా జోడీ మేయి కౌన్ చౌ, వివియాన్ హూలపై 21-17, 15-21, 4-21 తేడాతో పరాజయం పొందిన ఈ భారత జోడీ... ఇవాళ సాయంత్రం కాంస్య పతకం కోసం తలపడనున్నారు. -
కామన్వెల్త్ గేమ్స్.. భారత్‌కు భారీగా పతకాలు
గోల్డ్‌కోస్ట్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారతీయ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. అద్భుతంగా రాణిస్తూ వరుసగా పతకాలు సాధిస్తున్నారు. శనివారం భారత్ ఖాతాలో మరిన్ని స్వర్ణాలు వచ్చి చేరాయి. ఈ రోజు భారీగా పతకాలు దక్కడంతో భారత్ పతకాల విషయంలో అర్ధ సెంచరీని దాటింది. మెడల్స్ పట్టికలో ప్రస్తుతం భారత్ 50 పతకాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. భారత్ ఖాతాలో 23 స్వర్ణాలు, 13 రజతాలు, 15 కాంస్య పతకాలు ఉన్నాయి. సీనియర్ బాక్సింగ్ క్రీడాకారిణి మేరికోమ్ మరోసారి సత్తా చాటింది. తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ ఆమె స్వర్ణ పతకాన్ని సాధించింది. 45-48 కేజీల విభాగంలో ఫైనల్లో ప్రత్యర్థిని మట్టికరిపించి ఆమె భారత్‌కు గోల్డ్ మెడల్ అందించింది. మహిళల 50 కిలోల ఫ్రీస్టయిల్ పోటీల్లో రెజ్లర్ వినేష్ ఫొగట్, 125 కేజీల పురుషుల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో రెజ్లర్ సుమిత్ గోల్డ్ మెడళ్లను సొంతం చేసుకున్నారు. జావెలింగ్ త్రో విభాగంలో నీరజా చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించారు. బాక్సర్ గౌరవ్ సోలంకీ కూడా సత్తా చాటాడు. పురుషుల 52 కిలోల విభాగంలో ప్రత్యర్థిని ఓడించి స్వర్ణపతకాన్ని సొంతం చేసుకున్నాడు. షూటర్ సంజీవ్ రాజ్‌పుత్ సైతం కామన్వెల్త్ క్రీడల్లో భారత పతకాన్ని రెపరెపలాడించాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3పొజిషన్స్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించాడు. రియో ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించిన రెజ్లర్ సాక్షి మాలిక్ మరోసారి సత్తా చాటి.. కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. అటు బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజాలు సైనా నెహ్వాల్, పీవీ సింధు ఫైనల్‌కు చేరడంతో స్వర్ణ, రజత పతకాలు భారత్ ఖాతాలో చేరడం ఖాయంగా మారింది. -
స్వర్ణం నెగ్గిన 15 ఏళ్ల భారత షూటర్ అనీశ్
-
మళ్లీ సిరంజీల కలకలం
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ క్రీడల్లో డోపింగ్ నిరోధానికి ఉద్దేశించిన సిరంజీ రహిత (నో నీడిల్స్) నిబంధన ఉల్లంఘించినందుకు భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు రాకేశ్ బాబు (ట్రిపుల్ జంపర్), ఇర్ఫాన్ (రేస్ వాకర్) శుక్రవారం బహిష్కరణకు గురయ్యారు. ఇర్ఫాన్ పడక గదిలో, రాకేశ్ బ్యాగ్‌లో సిరంజీలు బయటపడటంతో వారు తక్షణం క్రీడా గ్రామం వదిలి వెళ్లాలని కామన్వెల్త్ క్రీడా సమాఖ్య (సీజీఎఫ్) అధ్యక్షుడు లూయీస్ మార్టిన్ ఆదేశించారు. కాగా, ఇర్ఫాన్ తన విభాగమైన 20 కి.మీ. నడకలో 13వ స్థానంలో నిలిచి ఇప్పటికే పతకానికి దూరమయ్యాడు. రాకేశ్ శుక్రవారం పోటీలో పాల్గొనాల్సి ఉన్నా మోకాలి గాయంతో ముందే వైదొలిగాడు. మరోవైపు క్రీడల ప్రారంభానికి ముందు భారత బృందం బస చేసిన హోటల్ సమీపాన సిరంజీలు బయటపడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజా ఘటనపై భారత చెఫ్ డి మిషన్ విక్రమ్ సిసోడియా, జనరల్ టీమ్ మేనేజర్ నామ్‌దేవ్ షిర్గోంకర్, అథ్లెటిక్స్ టీమ్ మేనేజర్ రవీందర్ చౌధరిలను సీజీఎఫ్ కోర్టు తీవ్రంగా హెచ్చరించింది. క్రీడలు ముగిశాక ఈ ఘటనపై విచారణ చేపట్టి అథ్లెట్లను శిక్షిస్తామని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) పేర్కొంది. ఈ నిర్ణయాన్ని పూర్తిగా అంగీకరించలేమని, ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత అప్పీల్‌కు వెళ్తామని షిర్గోంకర్ మీడియా సమావేశంలో తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) మాజీ కార్యదర్శి బీకే సిన్హా ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల విచారణ సంఘాన్ని నియమిస్తున్నట్లు ఏఎఫ్ఐ అధ్యక్షుడు ఆదిల్ సుమరివాలా తెలిపారు. వికాస్‌కు డోప్ పరీక్ష... ఈ క్రీడల్లో కాంస్య పతకం గెలిచిన భారత వెయిట్ లిఫ్టర్ వికాస్ ఠాకూర్ అనూహ్యంగా డోప్ పరీక్ష ఎదుర్కొన్నాడు. పోటీలు ముగిశాక బుధవారం తిరుగు పయనమైన అతడికి చివరి నిమిషంలో ఈ పరిస్థితి ఎదురైంది. ఇర్ఫాన్, రాకేశ్‌లతో పాటు మరో ఆటగాడిని పరీక్షించాలని కామన్వెల్త్ మెడికల్ కమిషన్ కోరడంతో వికాస్‌ను పంపినట్లు షిర్గోంకర్ తెలిపారు. అయితే... ఠాకూర్ ఎలాంటి పొరపాటు చేయనట్లు తేలిందన్నారు. -
తల్లిగా లాలించింది... ప్లేయర్‌గా గెలిచింది
గోల్డ్‌కోస్ట్: ఎక్కడైనా ప్రతిష్టాత్మక గేమ్స్ జరుగుతుంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చే అథ్లెట్లు పోటీల్లో పాల్గొంటారు... ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తారు. మరికొందరు పట్టుదలగా ఆడతారు. పతకాల్ని పట్టుకెళ్తారు. కానీ ‘వనుతు’ దేశానికి చెందిన బీచ్ వాలీబాల్ క్రీడాకారిణి మిల్లర్ పటా ఏడు నెలల పసివాడితో గోల్డ్‌కోస్ట్‌కు వచ్చింది. గురువారం లిన్లైన్ మటౌటుతో కలిసి కాంస్యం గెలిచిన మిల్లర్ పటా... ఈ పతకం వేటలో అందరికంటే ఎక్కువే కష్టపడింది. సాధారణంగా క్రీడాగ్రామంలో చిన్నపిల్లల్ని అనుమతించరు. దీంతో మిల్లర్ తన చిన్నారి కోసం క్రీడాగ్రామంలోని వసతుల్ని కాదని బయట వేరే చోటు చూసుకుంది. తన చిన్నారికి పాలిచ్చి, లాలించిన తర్వాత ఆమె ప్రాక్టీసులో చెమటోడ్చేది. ఇలా తల్లిగా, పతకం గెలిచాక అథ్లెట్‌గా ఆమె రెండు పాత్రలకు న్యాయం చేసింది. పతకాన్ని తన కుమారుడి సాక్షిగా అందుకొని తెగ మురిసిపోయింది -
పసిడి బుల్లెట్...
తొలి రోజే మొదలైన భారత పసిడి పతకాల వేట తొమ్మిదో రోజూ నిరాటంకంగా కొనసాగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా 15 ఏళ్ల కుర్రాడు అనీశ్ భన్వాలా షూటింగ్ విభాగంలో స్వర్ణ పతకం గెలిచి సంచలనం సృష్టించాడు. తొలిసారి ఈ గేమ్స్‌లో పాల్గొంటున్న అతను పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పడంతో పాటు బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో హరియాణాకు చెందిన ఈ పదో తరగతి విద్యార్థి కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో భారత్ తరఫున స్వర్ణ పతకం గెలిచిన పిన్న వయసు క్రీడాకారుడిగా కొత్త చరిత్ర లిఖించాడు. మరోవైపు మహిళల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో 37 ఏళ్ల తేజస్విని సావంత్ విజేతగా నిలిచింది. పురుషుల రెజ్లింగ్‌లో అంచనాలను నిజం చేస్తూ బజరంగ్ పూనియా 65 కేజీల విభాగంలో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. టీటీ, బాక్సింగ్‌లోనూ మనోళ్లు మెరవడంతో... గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో తొమ్మిదో రోజు భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన చేసి మూడు స్వర్ణాలు, నాలుగు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం 11 పతకాలను దక్కించుకుంది. గోల్డ్‌కోస్ట్: పెన్ను పట్టుకొని తరగతి గదిలో పరీక్ష రాయాల్సిన కుర్రాడు... దేశం తరఫున గన్ను పట్టుకొని బరిలోకి దిగాడు. కచ్చితమైన గురితో లక్ష్యంలోకి బుల్లెట్లు దించాడు. రౌండ్ రౌండ్‌కు ఒక్కో ప్రత్యర్థిని వెనక్కి నెట్టేశాడు. ఊహించని రీతిలో విజేతగా అవతరించి ఔరా అనిపిం చాడు. అందివచ్చిన ఏకైక అవకాశాన్ని స్వర్ణం తో సద్వినియోగం చేసుకున్న ఆ పసిడి బుల్లెట్ ఎవరో కాదు హరియాణాకు చెందిన 15 ఏళ్ల అనీశ్ భన్వాలా. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో బరిలోకి దిగిన అతను ఫైనల్లో 30 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 23 పాయింట్లతో డేవిడ్ చాప్మన్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న కామన్వెల్త్ గేమ్స్ రికార్డును బద్దలు కొట్టాడు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో మహారాష్ట్ర షూటర్ తేజస్విని సావంత్ చాంపియన్‌గా నిలిచి భారత్ ఖాతాలో స్వర్ణ పతకాన్ని జమ చేసింది. ఫైనల్లో తేజస్విని 457.9 పాయింట్లు స్కోరు చేసి 449.1 పాయింట్లతో జియాంగ్ (సింగపూర్) పేరిట ఉన్న కామన్వెల్త్ గేమ్స్ రికార్డును బద్దలు కొట్టింది. భారత్‌కే చెందిన అంజుమ్ (455.7 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచి రజతం గెల్చుకుంది. భళా... బజరంగ్ రెజ్లింగ్ ఈవెంట్లో రెండో రోజు కూడా భారత్ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి. పురుషుల 65 కేజీల విభాగంలో బజరంగ్ పూనియా స్వర్ణ పతకాన్ని నెగ్గాడు. నలుగురు ప్రత్యర్థులతో పోటీపడిన బజరంగ్ ఒక్కరికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకపోవడం విశేషం. కేన్ చారిగ్ (వేల్స్)తో జరిగిన ఫైనల్లో బజరంగ్ 10–0తో మూడు నిమిషాల్లోపే బౌట్‌ను ముగించాడు. తొలి రౌండ్లో బజరంగ్ 10–0తో రిచర్డ్స్ (న్యూజిలాండ్)పై, క్వార్టర్ ఫైనల్లో 10–0తో అమాస్ (నైజీరియా)పై, సెమీఫైనల్లో 10–0తో విన్సెంట్ (కెనడా)పై గెలుపొందాడు. పురషుల 97 కేజీల ఫైనల్లో మౌజమ్ ఖత్రీ (భారత్) 2–12తో ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా) చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకున్నాడు. మహిళల 57 కేజీల ఫైనల్లో పూజా ధండా (భారత్) 5–7తో ఒడునాయో (నైజీరియా) చేతిలో ఓటమిపాలై రజతం గెలుపొందగా... 68 కేజీల విభాగంలో షెరీన్ సుల్తానా (బంగ్లాదేశ్)పై దివ్య కక్రాన్ నెగ్గి కాంస్యం సంపాదించింది. మనిక మళ్లీ మెరిసె... మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ విభాగంలో స్వర్ణంతో మెరిసిన భారత క్రీడాకారిణులు డబుల్స్ విభాగంలోనూ ఆకట్టుకున్నారు. టీమ్‌కు స్వర్ణం దక్కడంలో కీలకపాత్ర పోషించిన మనిక బాత్రా తన భాగస్వామి మౌమా దాస్‌తో కలిసి డబుల్స్‌లో రజతం గెల్చుకుంది. ఫైనల్లో మనిక–మౌమా దాస్ జంట 0–3తో ఫెంగ్ తియన్వె–యు మెంగ్యు (సింగపూర్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. హుసాముద్దీన్‌కు కాంస్యం పురుషుల బాక్సింగ్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. ఐదుగురు బాక్సర్లు అమిత్ (49 కేజీలు), గౌరవ్ సోలంకి (52 కేజీలు), మనీశ్ కౌశిక్ (60 కేజీలు), వికాస్ కృషన్ (75 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లగా... తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (56 కేజీలు), మనోజ్ కుమార్ (69 కేజీలు), నమన్ తన్వర్ (91 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు గెల్చుకున్నారు. సెమీస్‌లో హుసాముద్దీన్ 0–5తో పీటర్ మెక్‌గ్రెయిల్ (ఇంగ్లండ్) చేతిలో ఓటమి చవిచూశాడు. లెక్కల పరీక్ష గురించే ఆలోచనంతా... మనలో చాలామందికి గణితమంటే భయం... ఇక ఆ సబ్జెక్టులో పరీక్షంటే చెప్పేదేముంది? ఒత్తిడితో వణికిపోతాం. కామన్వెల్త్ క్రీడల షూటింగ్లో స్వర్ణం నెగ్గిన అనీశ్ భన్వాలా కూడా దీనికి అతీతుడేం కాదు. పదిహేనేళ్ల అతి పిన్న వయసులోనే పతకం నెగ్గిన తన ఘనత గురించి దేశమంతా మాట్లాడుకుంటుంటే, అతడేమో లెక్కల పరీక్ష గురించి ఆందోళన చెందుతున్నాడు. తుపాకీ పట్టి సడలని ఏకాగ్రత, సాధనతో గురి చూసి లక్ష్యాన్ని కొట్టిన తాను... గణితం సబ్జెక్టును మాత్రం సరిగా సాధన చేయలేదని చెబుతున్నాడు. హరియాణాలోని సోనేపట్ జిల్లా గొహనా కసండీకి చెందినవాడు అనీశ్. షూటింగేమీ అతడి మొదటి ప్రాధాన్య క్రీడ కాదు. 2013లో అండర్–12 స్థాయిలో మోడ్రన్ పెంటాథ్లాన్ ప్రపంచ చాంపియన్‌షిప్, 2015లో ఆసియా పెంటాథ్లాన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. తర్వాత నుంచి షూటింగ్‌పై దృష్టి పెట్టాడు. దీనికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం దక్కింది. ఆటే సర్వస్వంగా భావిస్తూ పైకెదిగాడు. గత నెల మెక్సికోలో జరిగిన ప్రపంచకప్, జూనియర్ ప్రపంచ కప్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అక్కడ కనబర్చిన ప్రతిభతో కామన్వెల్త్ గేమ్స్‌కు వచ్చాడు. ‘రేంజ్లో ఒత్తిడిని ఆస్వాదిస్తా. అది నాలో ప్రతిభను బయటకు తీస్తుంది. కామన్వెల్త్లో నాకేం రికార్డు లేదు. కానీ ఈసారి ముద్ర వేయాలని నిశ్చయించుకున్నా’ అని ఓవైపు ఆత్మవిశ్వాసంతో చెప్పే అనీశ్... ‘భారత్‌లో దిగిన వెంటనే నేను పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. హిందీ, సోషల్ సబ్జెక్టుల్లో ఫర్వాలేదు. లెక్కల గురించే నా ఆందోళనంతా. ఇప్పుడైనా దృష్టి పెట్టాలి’ అని అంటుండటం గమనార్హం. వారాంతాల్లో సరదాగా గడపటం ఎలా అని ఆలోచించే తన వయసు కుర్రాళ్లలా కాకుండా... ‘నా దృష్టంతా వచ్చే ప్రపంచకప్, ఆసియా క్రీడలపైనే ఉంద’ని చెబుతున్నాడీ టీనేజర్. -
కామన్వెల్త్ గేమ్స్ : బ్యాడ్మింటన్‌లో భారత్ జోరు
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు తమ తమ వ్యక్తిగత మ్యాచ్‌ల్లో గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్ పోరులో సైనా నెహ్వాల్ 21-8, 21-13 తేడాతో రచెల్ హండ్రిచ్(కెనడా)పై వరుస గేమ్‌ల్లో గెలిచి సెమీస్‌కు చేరగా, ఆపై పీవీ సింధు 21-14, 21-7 తేడాతో మరో కెనడా క్రీడాకారిణి బిట్నీ టామ్‌పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించింది. ఇక పురుషుల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్ వన్ శ్రీకాంత్ 21-15 21-12 తో ర్యాన్ ఎంగ్ జిన్ రేయ్(సింగపూర్)పై గెలిచి సెమీస్‌కు అర్హత సాధించాడు. మరొకవైపు హెచ్ఎస్ ప్రణయ్ సైతం సెమీస్‌లోకి ప్రవేశించాడు. శ్రీలంక ఆటగాడు దినుకా కరుణరత్నాను వరుస గేమ్‌ల్లో ఓడించి సెమీస్‌కు చేరాడు. మిక్స్డ్ డబుల్స్ సాత్విక్- పొన్నప్ప ద్వయం సెమీస్‌కు చేరింది. సాత్విక్- పొన్నప్ప జోడి 2-0తో గో సూన్ హాట్- షెవాన్ జెమీపై గెలిచి సెమీస్‌కు చేరగా, మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సిక్కిరెడ్డి-పొన్నప్ప అశ్విని జోడి క్వార్టర్ అడ్డంకిని అధిగమించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నారు. సిక్కిరెడ్డి-పొన్నప్ప అశ్విని జంట 2-0తో హాసిని-దిల్రుక్షి( శ్రీలంక) జంటపై గెలిచి సెమీస్‌కు చేరారు. -
భారత్ స్వర్ణాల వేట మొదలైంది..
-
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్ల పతకాల పట్టు
-
భారత్‌కు మరో రెండు రజతాలు, ఓ కాంస్యం
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల జోరు కొనసాగుతోంది. తొమ్మిదో రోజు పోటీల్లో మహిళల డబుల్స్ టేబుల్ టెన్నిస్(టీటీ), పురుషుల 75 కేజీల బాక్సింగ్ విభాగంలో భారత్‌కు రెండు రజత పతకాలు దక్కగా.. పురుషుల బాక్సింగ్ 69 కేజీల విభాగంలో ఓ కాంస్యం సొంతమైంది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ టేబుల్ టెన్నిస్ ఫైనల్లో మనిక బాత్రా, మౌమా దాస్‌ల జోడి టియాన్వీ ఫెంగ్ ,మెంగువు యు( సింగఫూర్) ద్వయం చేతిలో పరాజయం పొందడంతో రజత పతకం సొంతమైంది. పురుషుల 75 కేజీల సెమీ ఫైనల్లో భారత బాక్సర్ వికాస్ క్రిషన్ యాదవ్ స్టీవెన్.. డానెల్లీ( ఇంగ్లండ్)పై గెలిచి ఫైనల్‌కు చేరాడు. దాంతో కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకుని తుది పోరుకు అర్హత సాధించాడు.. పురుషుల బాక్సింగ్ 69 కేజీల విభాగం సెమీ ఫైనల్లో మనోజ్‌కుమార్ ప్యాట్ మెక్‌కార్మాక్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోవడంతో కాంస్యం చేజిక్కింది. ఇక అంతక ముందు పురుషుల రెజ్లింగ్ 97 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో భారత రెజ్లర్ మౌసమ్ ఖత్రీ రజతం సాధించగా.. 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో భారత మహిళా షూటర్లు తేజస్విని సావంత్ స్వర్ణానికి గురి పెట్టగా, అంజుమ్ రెండు పాయింట్ల తేడాతో రజతం పతకం సొంతం చేసుకొంది. రెజ్లింగ్‌లో 65 కేజీల పురుషుల ఫ్రీ స్టైల్ విభాగంలో భారత రెజ్లర్ బజరంగ్ పునియా బంగారు పతకం సాధించగా.. భారత మహిళా రెజ్లర్ పూజా ధండా ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్నారు. దీంతో భారత్ ఖాతాలో 17 స్వర్ణం, 11 రజతం, 14 కాంస్యలతో 42 పతకాలు చేరాయి. సెమీస్‌లో ఓడిన పురుషుల హాకీ జట్టు ఇక భారత్ పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్లె 2-3 తేడాతో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పొందింది. కాంస్య పతకం కోసం రెండో సెమీఫైనల్లో తలపడే ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్లలో ఓడిన జట్టుతో పోటీపడనుంది. ఇక మహిళల హాకీ జట్టు సైతం కాంస్యం కోసం ఇంగ్లండ్‌తో తలపడనున్న విషయం తెలిసిందే. -
కామన్వెల్త్ గేమ్స్ : మౌసమ్ ఖత్రీకి రజతం
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్ మౌసమ్ ఖత్రీ రజతం సాధించాడు. తొమ్మిదిరోజు పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన ఫైనల్ పోరులో ఖత్రీ ఓటమి పాలై రజతంతో సంతృప్తి చెందాడు. పురుషుల రెజ్లింగ్ 97 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో దక్షిణాఫ్రికాకు చెందిన మార్టిన్ ఎరాస్మస్ చేతిలో 12-2 తేడాతో ఖత్రీ పరాజయం చెందాడు. క్వార్టర్ ఫైనల్లో సెప్రస్ అలెక్సియోస్, సెమీ ఫైనల్లో సోసో తామారౌలను ఓడించి ఫైనల్‌కు చేరిన ఖత్రీ.. తుది పోరులో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ప్రత్యర్థి ఎరాస్మస్కు లొంగిపోయిన ఖత్రీ రన్నరప్‌గా నిలిచి రజతంతో సరిపెట్టుకున్నాడు. 2010 ఆసియన్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన ఖత్రీ.. గతేడాది జరిగిన కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో రజతాన్ని సాధించాడు. ఇదిలా ఉంచితే, కామన్వెల్త్ గేమ్స్‌లో ఇప్పటివరకూ భారత్ 39 పతకాలు సాధించగా.. అందులో 17 స్వర్ణాలు, 10 రజతాలు, 12 కాంస్య పతకాలు ఉన్నాయి. -
భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్‌లో తొమ్మిదో రోజు భారత్ స్వర్ణాల వేట కొనసాగుతోంది. భారత రెజ్లర్ బజరంగ్ పునియా భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేర్చారు. రెజ్లింగ్‌లో 65 కేజీల పురుషుల ఫ్రీ స్టైల్ విభాగంలో భారత రెజ్లర్ బజరంగ్ పునియా బంగారు పతకం సాధించారు. దీంతో భారత్ స్వర్ణాల సంఖ్య 17కు చేరుకుంది. ప్రత్యర్థి వేల్స్‌కు చెందిన ఛారిగ్ కేన్ మీద 10-0 పాయింట్ల తేడాతో రెజ్లర్ పునియా ఘన విజయం సాధించారు. రజతం నెగ్గిన పూజా భారత మహిళా రెజ్లర్ పూజా ధండా రజతం నెగ్గారు. 57 కేజీల ఫ్రీ స్టైల్ విభాగం ఫైనల్లో ఓటమి చెందడంతో ఆమె రజతంతో సరిపెట్టుకున్నారు. స్వర్ణం కోసం ఆమె చేసిన పోరాటం ఆకట్టుకుంది. మరోవైపు నేటి ఉదయం 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో భారత మహిళా షూటర్లు తేజస్విని సావంత్ స్వర్ణం నెగ్గగా, అంజుమ్ రెండు పాయింట్ల తేడాతో రజతం పతకం సాధించారు. మరో భారత షూటర్ అనీష్ భన్వాలా 15 ఏళ్ల వయసులోనే చరిత్ర సృష్టించారు. 25 మీటర్ల రాపిడ్ పిస్టల్ విభాగంలో స్వర్ణం అందించాడు. ఇప్పటివరకూ భారత్ 37 పతకాలు సాధించగా.. అందులో 17 స్వర్ణాలు, 9రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. భారత రెజ్లర్ పూజ -
15 ఏళ్ల చిన్నోడు.. భారత్‌కు స్వర్ణం తెచ్చాడు..
గోల్డ్ కోస్ట్, క్వీన్స్లాండ్ : భారత షూటరఅనీష్ భన్వాలా చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో(భారత్ నుంచి) బంగారు పతకం సాధించిన అతి పిన్నవయస్కుడిగా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. 25 మీటర్ల రాపిడ్ పిస్టల్ విభాగంలో ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన అనీష్ తన కంటే ఎన్నో ఏళ్ల అనుభవం గల ప్రపంచస్థాయి సీనియర్లను వెనక్కునెట్టాడు. ఓ దశలో ఆస్ట్రేలియాకు చెందిన షూటర్ సెర్గి ఎవ్‌గ్లెవ్‌స్కీ(2014 కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్) అనీష్‌ను వెనక్కు నెట్టాడు. ఆత్మవిశ్వాసం కోల్పోని అనీష్ ఆఖరి రెండు రౌండ్లలో సెర్గి కన్నా రెండేసి ఎక్కువ పాయింట్లు సాధించి పసిడి పట్టాడు. అన్ని రౌండ్లలో కలిపి అనీష్ 30 పాయింట్లు సాధించగా.. సెర్గి 28 పాయింట్లతో రెండో స్థానంలో, ఇంగ్లండ్‌కు చెందిన శామ్ 17 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. 25 మీటర్ల రాపిడ్ పిస్టల్ ఈవెంట్లో 30 పాయింట్లు సాధించడం కామన్వెల్త్ క్రీడల్లో ఇదే తొలిసారి కూడా. షూటింగ్లో జూనియర్ వరల్డ్ రికార్డు అనీష్ పేరిటే ఉంది. గత షూటింగ్ వరల్డ్ కప్‌లో సైతం అనీష్ స్వర్ణం సాధించాడు. భారత్ తరఫున 15 ఏళ్ల వయసులో అభినవ్ బింద్రా కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్నాడు. అయితే పతకం సాధించలేకపోయాడు. -
ఇద్దరు భారత అథ్లెట్ల బహిష్కరణ
గోల్డ్‌కోస్ట్ : ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న ‘కామన్వెల్త్ గేమ్స్-2018’ లో ముందునుంచి పకడ్బందీగా అమలవుతున్న ‘నో నీడిల్ పాలసీ’ (సిరంజీల వాడకం నిషేదం)ని ఉల్లంఘించారనే కారణంగా ఇద్దరు భారత అథ్లెట్లు బహిష్కరణకు గురయ్యారు. ఏవీ రాకేష్ బాబు, ఇర్ఫాన్ కొలొత్తమ్ థోడిల పైన కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (సీజీఎఫ్) నిషేదం విధించింది. ఈ ఇద్దరూ క్రీడా గ్రామం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా భారత బృందానికి నేతృత్వం వహిస్తున్న విక్రం సిసోడియా, జట్టు మేనేజర్ నామ్‌దేవ్ శిర్గావంకర్, అథ్లెటిక్స్ మేనేజర్ రవీందర్ చౌదరీలపై కూడా సీజీఎఫ్ మండిపడింది. ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తే శిక్ష తప్పదని సీజీఎఫ్ ప్రెసిడెంట్ లూయిస్ మార్టిన్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడా గ్రామంలో సిరంజీలు వాడొద్దనే నింబధనల్ని బహిష్కరణకు గురైన భారత అథ్లెట్లు ఉల్లంఘించారని సీజీఎఫ్ తెలిపింది. దీనిని తాము యాంటీ డోపింగ్ నిబంధనల ఉల్లంఘనగా చూడలేదని, అయితే నీడిల్ ఉపయోగించకూడదన్న గేమ్స్ నిబంధనలను మాత్రం వీరు ఉల్లంఘించారని సీజీఎఫ్ తెలిపింది. ఒకవేళ డయాబెటిస్‌లాంటి వాటికోసం నీడిల్స్ ఉపయోగించాలనుకుంటే.. ముందుగానే అనుమతి తీసుకోవాలని సూచించింది. భారత ఆటగాళ్ల గదుల వద్ద వాడి పడేసిన సిరంజీలు బయటపడినపుడు తొలుత పెద్దగా పట్టించుకోని సీజీఎఫ్ కోర్టు.. ఈ విషయంపై పునర్విచారణచేపట్టి చర్యలు తీసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ నుంచి బహిష్కరణకు గురైన రాకేష్ బాబు ట్రిపుల్ జంప్‌లో, ఇర్ఫాన్ రేస్ వాక్‌లో పాల్గొనాల్సి ఉంది. -
కామన్వెల్త్లో ఓ ఫన్నీ సన్నివేశం
-
పసిడి పట్టు...
కొంతకాలంగా తనకు సంబంధం లేకుండానే వివాదాల్లో నిలిచిన భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ కామన్వెల్త్ గేమ్స్‌లో మాత్రం విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ గేమ్స్‌లో వరుసగా మూడోసారి స్వర్ణ పతకాన్ని గెలిచి ‘హ్యాట్రిక్’ సాధించాడు. అంతేకాకుండా ఈ గేమ్స్ చరిత్రలో మూడుసార్లు బంగారు పతకం గెలిచిన ఏకైక భారత రెజ్లర్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. సుశీల్‌కు తోడు మరో భారత రెజ్లర్ రాహుల్ అవారే కూడా పసిడి పతకం నెగ్గాడు. మహిళా రెజ్లర్లు బబిత రజతం, కిరణ్ కాంస్యం సాధించి భారత సత్తాను చాటారు. షూటింగ్లో తేజస్విని రజతం... అథ్లెటిక్స్‌లో సీమా పూనియా రజతం, నవ్‌జీత్ కాంస్యం గెలిచారు. దాంతో పోటీల ఎనిమిదో రోజు భారత్‌కు ఏకంగా ఏడు పతకాలు వచ్చాయి. గోల్డ్‌కోస్ట్: వెయిట్‌లిఫ్టర్లు తమ పతకాల వేటను ముగించగా... షూటర్లు దానిని కొనసాగిస్తుండగా... వీరి సరసన రెజ్లర్లు కూడా చేరారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల పంట పండిస్తోంది. పోటీల ఎనిమిదో రోజు రెజ్లింగ్ ఈవెంట్ ప్రారంభంకాగా... బరిలోకి దిగిన నలుగురు భారత రెజ్లర్లు సుశీల్, రాహుల్ అవారే, బబిత కుమారి, కిరణ్ పతకాలు గెల్చుకోవడం విశేషం. భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్‌కు 74 కేజీల విభాగంలో తన ప్రత్యర్థుల నుంచి ఏమాత్రం పోటీ ఎదురుకాలేదు. సుశీల్ గెలిచిన నాలుగు బౌట్లలో మూడు టెక్నికల్ సుపీరియారిటీ (ఇద్దరి మధ్య కనీసం 10 పాయింట్లు తేడా) ద్వారా రాగా... మరొకటి ‘బై ఫాల్’ (ప్రత్యర్థి భుజాన్ని మ్యాట్‌కు రెండు సెకన్లకంటే ఎక్కువసేపు అదిమి పెట్టడం) ద్వారా వచ్చింది. తొలి రౌండ్లో 11–0తో జెవోన్ బాల్ఫోర్ (కెనడా)ను ఓడించిన సుశీల్... క్వార్టర్ ఫైనల్లో 10–0తో అసద్ బట్ (పాకిస్తాన్)పై గెలిచాడు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా రెజ్లర్ కానర్ ఇవాన్స్‌ను ‘బై ఫాల్’ పద్ధతిలో చిత్తు చేసిన సుశీల్...జోనస్ బోథా (దక్షిణాఫ్రికా)తో జరిగిన ఫైనల్లో కేవలం 80 సెకన్లలోనే 10–0తో ఆధిక్యంలోకి వెళ్లి విజయాన్ని, స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. 2010 ఢిల్లీ గేమ్స్‌లో 66 కేజీల విభాగంలో విజేతగా నిలిచిన సుశీల్... 2014 గ్లాస్కో గేమ్స్‌లో 74 కేజీల విభాగంలో చాంపియన్ అయ్యాడు. మరోవైపు పురుషుల 57 కేజీల విభాగంలో మహారాష్ట్ర రెజ్లర్ రాహుల్ అవారే కూడా విజేతగా నిలిచాడు. తొలి రౌండ్లో 11–0తో జార్జి రమ్ (ఇంగ్లండ్)పై... క్వార్టర్ ఫైనల్లో 10–0తో థామస్ సిచిని (ఆస్ట్రేలియా)పై గెలిచిన రాహుల్... సెమీఫైనల్లో 12–8తో మొహమ్మద్ బిలాల్ (పాకిస్తాన్)పై, ఫైనల్లో 15–7తో స్టీవెన్ తకహాషి (కెనడా)పై విజయం సాధించి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. మహిళల రెజ్లింగ్ 53 కేజీల విభాగంలో బబిత కుమారి స్వర్ణ పతక పోరులో 3–5తో డయానా వీకెర్ (కెనడా) చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకుంది. ఈ విభాగంలో ఐదు ఎంట్రీలు మాత్రమే రావడంతో రౌండ్ రాబిన్ లీగ్‌లో బౌట్లను నిర్వహించారు. 76 కేజీల విభాగం కాంస్య పతక పోరులో కిరణ్ ‘బై ఫాల్’ పద్ధతిలో కటుస్కియా పరిధవెన్ (మారిషస్)ను ఓడించింది. అథ్లెటిక్స్‌లో బోణీ... మహిళల డిస్కస్ త్రోలో సీమా పూనియా, నవ్‌జీత్ ధిల్లాన్ అద్భుత ప్రదర్శనలతో అథ్లెటిక్స్‌లో భారత్ పతకాల బోణీ చేసింది. డిస్క్‌ను సీమా 60.41 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో... నవ్‌జీత్ 57.43 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచి వరుసగా రజత, కాంస్య పతకాలను గెల్చుకున్నారు. పురుషుల ట్రిపుల్ జంప్‌లో అర్పిందర్ సింగ్, రాకేశ్ బాబు ఫైనల్‌కు అర్హత పొందారు. తేజస్విని గురికి రజతం... షూటింగ్లో భారత్‌కు మరో పతకం వచ్చింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో ప్రపంచ మాజీ చాంపియన్ తేజస్విని సావంత్ రెండో స్థానంలో నిలిచింది. ఈ మహారాష్ట్ర షూటర్ 618.9 పాయింట్లు స్కోరు చేసి రజత పతకం సొంతం చేసుకుంది. ఇదే విభాగంలో మరో భారత షూటర్ అంజుమ్ 16వ స్థానంలో నిలిచింది. బ్యాడ్మింటన్‌లో అదే జోరు భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు అదరగొట్టారు. వ్యక్తిగత విభాగాల్లో బరిలో దిగిన అందరూ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించారు. ప్రిక్వార్టర్స్‌లో పీవీ సింధు 21–15, 21–9తో హువాన్ యు (ఆస్ట్రేలియా)పై; రుత్విక 21–10, 21–23, 21–10తో జియి మిన్ యో (సింగపూర్)పై; ప్రపంచ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ 21–10, 21–10తో నిలుక కరుణరత్నే (శ్రీలంక)పై; ప్రణయ్ 21–18, 21–11తో ఆంథోని జోయ్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందారు. సైనా నెహ్వాల్ 21–4, 2–0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ఆమె ప్రత్యర్థి జెసిక లీ (ఐల్ ఆఫ్ మ్యాన్) గాయం కారణంగా తప్పుకోవడంతో క్వార్టర్స్‌కు చేరింది. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్–అశ్విని పొన్నప్ప, ప్రణవ్ చోప్రా–సిక్కి రెడ్డి జంటలు... మహిళల డబుల్స్‌లో అశ్విని–సిక్కిరెడ్డి, పురుషుల డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ శెట్టి జంటలు కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. హాకీలో కాంస్యం కోసం... అందివచ్చిన అవకాశాలను వృథా చేసుకున్న భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో 1–0తో ఓడింది. మ్యాచ్ చివరి క్వార్టర్లో భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇక ఈ మెగా ఈవెంట్లో భారత్ కాంస్యం కోసం ఇంగ్లండ్‌తో తలపడనుంది. సెమీస్‌లో మనిక టేబుల్ టెన్నిస్ (టీటీ)లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల సింగిల్స్ విభాగంలో మనిక బాత్రా సెమీఫైనల్‌కు అర్హత సాధించగా... మౌమా దాస్, మధురిక ఓటమి పాలయ్యారు. మనిక క్వార్టర్ ఫైనల్లో 4–1తో యిహాన్ జూ (సింగపూర్)పై గెలిచింది. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో శరత్ 4–1తో హేమింగ్ హు (ఆస్ట్రేలియా)పై; హర్మీత్ 4–1తో చీ ఫెంగ్ లియాంగ్ (మలేసియా)పై గెలుపొంది క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. దీపిక జంట జోరు... మహిళల స్క్వాష్ డబుల్స్‌లో దీపిక పళ్లికల్–జోష్నా చినప్ప జంట సెమీ ఫైనల్ చేరింది. ఈ జోడీ క్వార్టర్స్‌లో 11–8, 11–10తో టెస్నీ ఈవాన్స్–పీటర్ క్రీడ్ (వేల్స్)పై గెలుపొందింది. సెమీస్‌లో టాప్ సీడ్ జెయెల్లె కింగ్–పాల్ కోల్ (న్యూజిలాండ్) ద్వయంతో తలపడనుంది. పురుషుల డబుల్స్‌లో విక్రమ్–రమిత్ టాండన్ జంట క్వార్టర్స్‌కు చేరింది. మిక్స్డ్ డబుల్స్‌లో దీపిక పళ్లికల్–సౌరవ్ జంట సెమీస్‌కు చేరగా... జోష్నా చినప్ప–హరిందర్ పాల్ సంధూ జంట క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. -
వరుసగా మూడో కామన్వెల్త్లో స్వర్ణం
-
వరుసగా మూడో కామన్వెల్త్లో స్వర్ణం
గోల్డ్‌కోస్ట్ : ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల వేట కొనసాగిస్తున్నారు. భారత రెజ్లర్ సుశీల్ కుమార్ వరుసగా మూడో కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించారు. గురువారం జరిగిన పురుషుల 74 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో పోటీపడిన రెజ్లర్ సుశీల్ భారత్ ఖాతాలో బంగారు పతకాన్ని చేర్చారు. స్వర్ణం కోసం జరిగిన పోరులో దక్షిణాఫ్రికాకు చెందిన రెజ్లర్ బోథాను మట్టికరిపించిన సుశీల్ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. దీంతో భారత్ స్వర్ణాల సంఖ్య 14కి చేరింది. కామన్వెల్త్ గేమ్స్ ఎనిమిదో రోజు భారత్ రెండు స్వర్ణాలు, ఓ రజతం, కాంస్యం నెగ్గింది. అందులో నాలుగు రెజ్లింగ్‌లో రాగా, షూటింగ్లో రజతం వచ్చింది. అంతకుముందు రెజ్లర్ రాహుల్ ఆవారే పరుషుల 57 కేజీల విభాగంలో భారత్‌కు స్వర్ణాన్ని అందించిన విషయం తెలిసిందే. కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. 14 స్వర్ణాలు, 6 రజతాలు, 9 కాంస్యాల కలిపి మొత్తం 29 పతకాలను భారత్ సాధించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 2010- ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం 2014- గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం 2018- ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో 74 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో స్వర్ణం -
పసిడి గెలిచిన రాహుల్ ఆవారే
సాక్షి, హైదరాబాద్ : 21వ కామన్వెల్త్ గేమ్స్‌లో ఎనిమిదో రోజు భారత రెజ్లర్ రాహుల్ ఆవారే పసిడి పతకం సాధించారు. పురుషుల రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు రాహుల్. దీంతో గేమ్స్‌లో భారత్ ఇప్పటివరకూ సాధించిన పసిడి పతకాల సంఖ్య 13కు చేరింది. అంతకుముందు ఎనిమిదో రోజు పతకాల వేటను షూటర్ తేజస్వినీ సావంత్ రజతంతో ఆరంభించారు. 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో ఆమె రెండోస్థానంలో నిలిచి వెండి పతకాన్ని తెచ్చారు. మహిళల రెజ్లింగ్ 53 కేజీల విభాగంలో రెజ్లర్ బబితా కుమారి రజతం సాధించారు. మహిళల 76 కేజీల విభాగంలో భారత రెజ్లర్ కిరణ్ కాంస్య పతకాన్ని అందుకున్నారు. దీంతో భారత్ కామన్వెల్త్ గేమ్స్‌లో ఇప్పటివరకూ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 28కు చేరింది. -
డబుల్స్‌లో సాత్విక్ అద్భుత ప్రదర్శన
-
పసిడి పతకం నెగ్గిన భారత షూటర్
-
కామెరూన్ అథ్లెట్ల తలోదారి..!
గోల్డ్‌కోస్ట్: ధనిక దేశాల్లో జరిగే ప్రతిష్టాత్మక క్రీడల్లో పాల్గొనేందుకు రావడం... జట్టు నుంచి పారిపోయి తలోదారి చూసుకోవడం పేద దేశాల అథ్లెట్లకు రివాజుగా మారిపోయింది. ఈసారి ఆస్ట్రేలియాలో కామెరూన్ అథ్లెట్లు ఐదుగురు జట్టు నుంచి తప్పించుకున్నారు. ఇందులో ముగ్గురు వెయిట్‌లిఫ్టర్లు ఒలివియెర్, అర్కెంజ్లైన్, ఫౌవోద్జి కాగా ఇద్దరు బాక్సర్లు క్రిస్టియాన్ ఎన్ద్జి, ఫొట్సల ఉన్నారు. వీరంతా కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు వచ్చారు. సందు చూసుకొని క్రీడాగ్రామం నుంచి తప్పించుకున్నారు. మంగళవారం నుంచి పత్తాలేకుండా పోయారని కామెరూన్ వర్గాలు తెలిపాయి. ఫిర్యాదు అందుకున్న ఆస్ట్రేలియా పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 2000లో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌కు వచ్చిన వారిలో వందకు పైగా అథ్లెట్లు ఇలాగే తప్పించుకొని అనధికారికంగా ఉంటున్నట్లు తెలిసింది. కామెరూన్ మీడియా అధికారి సైమోన్ మొలొంబె మాట్లాడుతూ ఆటలాడేందుకు వచ్చిన అథ్లెట్లు చట్టాలను గౌరవించాలని సూచించారు. -
నాకు క్రికెట్ తెలియదు: బ్రెండన్ స్టార్క్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మిచెల్ స్టార్క్ సోదరుడు బ్రెండన్ స్టార్క్ హైజంప్ ఆటగాడు. గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో అతను 2.32 మీటర్లతో వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన కనబరిచి స్వర్ణం గెలిచాడు. అన్న మిచెల్‌తో పాటు అతని భార్య అలీసా హీలీ కూడా పేరొందిన క్రికెటరే... కానీ తనకు మాత్రం క్రికెట్ సంగతులేవీ తెలియవంటున్నాడు బ్రెండన్. ‘నేనెప్పుడు క్రికెట్‌ను ఫాలో కాలేదు. అది నా సోదరుడి ఆట. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఆడానేమో కానీ... ఇప్పుడైతే నాకు సంబంధం లేని ఆట అది’ అని 24 ఏళ్ల బ్రెండన్ స్టార్క్ అన్నాడు. -
'స్వర్ణ' శ్రేయసి..
మరోసారి భారత షూటర్లు కచ్చితమైన గురితో అదరగొట్టారు. కామన్వెల్త్ గేమ్స్ షూటింగ్ ఈవెంట్లో మరో మూడు పతకాలు అందించారు. మహిళల డబుల్ ట్రాప్‌లో శ్రేయసి సింగ్ ‘షూట్ ఆఫ్’లో స్వర్ణం ఖాయం చేసుకోగా... పురుషుల 50 మీటర్ల పిస్టల్ విభాగంలో ఓంప్రకాశ్ మితర్వాల్... డబుల్ ట్రాప్ విభాగంలో అంకుర్ మిట్టల్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. దాంతో ఏడో రోజు పోటీలు ముగిశాక భారత్ 12 స్వర్ణాలు, 4 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 24 పతకాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. గోల్డ్‌కోస్ట్: నాలుగేళ్ల క్రితం గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో నెగ్గిన 14 స్వర్ణాల సంఖ్యను గోల్డ్‌కోస్ట్‌లో ఈసారి భారత క్రీడాకారులు అధిగమించడం ఖాయమైంది. పోటీల తొలి రోజు మొదలైన పసిడి వేటను ఏడో రోజూ భారత క్రీడాకారులు కొనసాగించారు. తమపై పెట్టుకున్న అంచనాలు నిజం చేస్తూ మళ్లీ భారత షూటర్లు రాణించి మూడు పతకాలు సాధించారు. మహిళల డబుల్ ట్రాప్ ఈవెంట్లో ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల శ్రేయసి సింగ్ విజేతగా నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో నిర్ణీత 120 షాట్ల తర్వాత శ్రేయసి సింగ్, ఎమ్మా కాక్స్ (ఆస్ట్రేలియా) 96 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. విజేతను నిర్ణయించడానికి ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. శ్రేయసి రెండు పాయింట్లు సాధించి స్వర్ణం ఖాయం చేసుకోగా... ఎమ్మా కాక్స్ ఒక పాయింటే స్కోరు చేసి రజతంతో సరిపెట్టుకుంది. ‘2014 గ్లాస్కో గేమ్స్‌లో రజతం లభించాక చాలా నిరాశకు లోనయ్యాను. ఈసారి కూడా ఫైనల్లో వెనుకబడటంతో స్వర్ణంపై ఆశలు వదులుకున్నాను. అయితే షూట్ ఆఫ్ రూపంలో స్వర్ణం నెగ్గే మరో అవకాశం రావడంతో దానిని సద్వినియోగం చేసుకున్నాను. ఈసారి ప్రదర్శనతో పూర్తి సంతృప్తిగా ఉన్నాను. ఈ స్వర్ణం నా కెరీర్లో మైలురాయి లాంటిది’ అని శ్రేయసి వ్యాఖ్యానించింది. పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఫేవరెట్ జీతూ రాయ్ 105 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలువగా... ఓంప్రకాశ్ 201.1 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. పురుషుల డబుల్ ట్రాప్ ఫైనల్లో అంకుర్ మిట్టల్ 53 పాయింట్లతో కాంస్య పతకాన్ని సంపాదించాడు. భారత్‌కే చెందిన అసబ్ 43 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. అంకుర్ మిట్టల్ ,ఓంప్రకాశ్ -
పసిడికి పంచ్ దూరంలో మేరీకోమ్
గోల్డ్‌కోస్ట్: తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటున్న భారత మహిళా స్టార్ బాక్సర్ మేరీకోమ్ స్వర్ణానికి విజయం దూరంలో నిలిచింది. 48 కేజీల సెమీఫైనల్లో మేరీకోమ్ 5–0తో అనూష దిల్రుక్షి (శ్రీలంక)ని చిత్తుచేసింది. పురుషుల విభాగంలో ముగ్గురు భారత బాక్సర్లు వికాస్ కృషన్ (75 కేజీలు), గౌరవ్ సోలంకి (52 కేజీలు), మనీశ్ కౌశిక్ (60 కేజీలు) సెమీఫైనల్‌కు చేరి కనీసం కాంస్య పతకాలు ఖాయం చేసుకున్నారు. సరితా దేవి (60 కేజీలు), పింకీ రాణి (51 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓటమి చవిచూశారు. బ్యాడ్మింటన్‌లో జోరు... వ్యక్తిగత విభాగంలో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లందరూ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో పీవీ సింధు 21–6, 21–3తో ఆండ్రా వైట్‌సైడ్ (ఫిజీ)పై, సైనా నెహ్వాల్ 21–3, 21–1తో ఎల్సీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)పై, రుత్విక 21–5, 21–7తో గ్రేస్ అలిపాక (ఘనా)పై, శ్రీకాంత్ 21–13, 21–10తో ఆతిశ్ లుభా (మారిషస్)పై, ప్రణయ్ 21–14, 21–6తో క్రిస్టోఫర్ (మారిషస్)పై గెలిచారు. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా; సాత్విక్–అశ్విని పొన్నప్ప జంటలు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. గ్రూప్ ‘టాపర్’... పురుషుల హాకీలో భారత జట్టు గ్రూప్ టాపర్‌గా నిలిచింది. ‘బి’ గ్రూప్ చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 4–3తో ఇంగ్లండ్‌ను ఓడించి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధమైంది. భారత్ తరఫున మన్‌ప్రీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, వరుణ్ కుమార్, మన్దీప్ సింగ్ ఒక్కో గోల్ చేశారు. మ్యాచ్ చివరి నిమిషంలో మన్దీప్ సింగ్ గోల్ చేసి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. శరత్, సత్యన్ ముందంజ... టేబుల్ టెన్నిస్ (టీటీ)లో భారత ఆటగాళ్లు శరత్ కమల్, సత్యన్ ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించారు. తొలి రౌండ్లో శరత్ 4–3తో జావెన్ చూంగ్ (మలేసియా)పై, సత్యన్ 4–0తో రమీజ్ (పాకిస్తాన్)పై గెలిచారు. మహిళల సింగిల్స్‌లో మౌమా దాస్ 4–0తో హో వాన్ కౌ (మారిషస్)పై, మధురిక 4–1తో రెన్ చుంగ్ (ట్రినిడాడ్ టొబాగో)పై నెగ్గారు. అథ్లెట్స్‌కు మిశ్రమ ఫలితాలు... అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పురుషుల హైజంప్ ఫైనల్లో తేజస్విన్ శంకర్ (2.24 మీటర్లు) ఆరో స్థానంలో నిలువగా... మహిళల 400 మీటర్ల ఫైనల్లో హిమా దాస్ (51.32 సెకన్లు) తన అత్యుత్తమ సమయాన్ని నమోదు చేసి ఆరో స్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు మహిళల లాంగ్‌జంప్‌లో నయన జేమ్స్, నీనా వరాకిల్ క్వాలిఫయింగ్‌లో వరుసగా 9, 12 స్థానాలు సాధించి ఫైనల్‌కు చేరారు. దీపిక జంట విజయం... మహిళల స్క్వాష్ డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ జంట దీపిక పళ్లికల్–జోష్నా చినప్ప క్వార్టర్ ఫైనల్ చేరింది. ఈ జోడీ మూడో లీగ్ మ్యాచ్‌లో 11–5, 11–6తో కెల్లాస్–కొలెట్టే సుల్తానా (మాల్టా)పై గెలుపొందింది. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన ఈ జోడీ గ్రూప్ టాపర్‌గా క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. -
పసిడి పోరుకు మేరీకోమ్
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా బాక్సర్ మేరీకోమ్ పంచ్ అదిరింది. బుధవారం జరిగిన సెమీ ఫైనల్లో మేరీకోమ్ 5-0 తేడాతో శ్రీలంక బాక్సర్ అనూష దిల్రుక్షిపై గెలిచి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఫలితంగా మేరీకోమ్ రజత పతకం ఖాయం చేసుకుంది. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో ఆడుతున్న మేరీకోమ్ మహిళల 48 కేజీల కేటగిరీలో భాగంగా మొత్తం ఐదు రౌండ్లు పాటు జరిగిన సెమీస్‌లో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. మేరీకోమ్ 30-27, 30-27, 30-27, 30-27, 30-27 తేడాతో అనూష దిల్రుక్షిపై గెలుపొంది ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగే పసిడి పోరులో ఉత్తర ఐర్లాండ్ క్రిస్టినా ఓ హరాతో మేరీకోమ్ తలపడనుంది. -
భారత్ ఖాతాలో మరో పసిడి
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్‌లో షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే మను భాకర్... జీతూ రాయ్.. హీనా సిద్దూ పసిడి పతకాలు సొంతం చేసుకోగా.. తాజాగా శ్రేయాసి సింగ్ భారత్‌కు మరో బంగారు పతకాన్ని అందించింది. మహిళల డబుల్ ట్రాప్ షూటింగ్లో పోటీపడిన శ్రేయాసి.. ఫైనల్లో ఆస్ట్రేలియా ఫేవరేట్ ఎమ్మా కాక్స్‌పై గెలిచి ఇండియాకు 12వ గోల్డ్ మెడల్ సాధించింది. 2014 లో జరిగిన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ గెలిచిన శ్రేయాసి, ఈసారి స్వర్ణాన్ని ముద్దాడింది. ఇదే ఈవెంట్లో మరో ఇండియన్ షూటర్ వర్ష వర్మన్ ఒక్క పాయింట్ తేడాతో నాలుగో స్థానంలో నిలిచింది. మరోవైపు పురుషుల డబుల్ ట్రాప్‌లో భారత్‌కు చెందిన షూటర్ అంకుర్ మిట్టల్‌కు కాంస్యం దక్కింది. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 24 పతకాలతో మూడోస్థానంలో కొనసాగుతోంది. -
షటిల్ ‘శ్రీ’మంతుడు...
నాలుగేళ్ల క్రితం శ్రీకాంత్ జీవితంలో అనూహ్య ఘటన! అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న శ్రీకాంత్ ఒక రోజు తన బాత్రూమ్లో అచేతనంగా కనిపించాడు. చాలా సేపటి వరకు దానిని ఎవరూ గుర్తించలేదు. కొద్ది సేపటి తర్వాత అకాడమీ ఉద్యోగులు గుర్తించి అతడిని దగ్గరిలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అది ‘బ్రెయిన్ ఫీవర్’గా తేలింది. అతను కోలుకోవాలని కోచ్ గోపీచంద్, సహచరులు చేసిన ప్రార్థనలు ఫలించి శ్రీకాంత్ ఎట్టకేలకు మృత్యుముఖం నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత కొన్ని టోర్నీల్లో తీవ్రంగా ఇబ్బంది పడిన శ్రీకాంత్ మళ్లీ చెలరేగేందుకు సమయం పట్టింది. అయితే ఈ ఘటన జరిగిన నాటి నుంచి ఇప్పుడు వరల్డ్ నంబర్‌వన్‌గా ఎదగడం వరకు శ్రీకాంత్‌ది అద్భుత ప్రస్థానం. అప్పటి వరకు రెండు గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్స్ మాత్రమే గెలిచిన శ్రీకాంత్ అనంతరం మరింత వేగంగా దూసుకుపోయాడు. కఠోర శ్రమ, శిక్షణతో తనను తాను అత్యుత్తమంగా తీర్చి దిద్దుకున్నాడు. అదే ఏడాది (2014) నవంబర్‌లో ప్రతిష్టాత్మక చైనా ఓపెన్‌ను గెలుచుకోవడంతో శ్రీ జోరు మళ్లీ మొదలైంది. ఫైనల్లో దిగ్గజ ఆటగాడు లిన్ డాన్‌పై సాధించిన గెలుపు కొత్త శ్రీకాంత్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ తర్వాత అతను తిరుగులేని ప్రదర్శనతో దూసుకుపోయాడు. 2015లో ఇండియా ఓపెన్‌తో అతని ఖాతాలో రెండో సూపర్ సిరీస్ టైటిల్ చేరింది. తర్వాతి ఏడాది రియో ఒలింపిక్స్ సమయానికి మంచి ఫామ్‌లో ఉన్నా... క్వార్టర్ ఫైనల్లో లిన్ డాన్ చేతిలో ఓటమి శ్రీకాంత్‌కు పతకావకాశాలను దూరం చేసింది. అయితే మళ్లీ తన ఆటలో లోపాలు సరిదిద్దుకున్న శ్రీకాంత్... 2017లో విశ్వరూపం చూపించాడు. ఏకంగా ఐదు సూపర్ సిరీస్ టోర్నీలలో ఫైనల్ చేరి వాటిలో నాలుగింటిలో విజేతగా నిలిచి అరుదైన ఘనతను లిఖించాడు. ఈ క్రమంలో భారత్ తరఫున పురుషుల సింగిల్స్‌లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. మైదానంలో శ్రీకాంత్ ప్రదర్శనకు కేంద్రం ‘పద్మశ్రీ’తో సత్కరిస్తే... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ పదవినిచ్చి గౌరవించింది. ఇప్పుడు పాతికేళ్ల వయసులో వరల్డ్ నంబర్‌వన్‌గా శిఖరాన నిలిచిన ఈ గుంటూరు అబ్బాయి భవిష్యత్తులో మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయం. 2009లో శ్రీకాంత్ తొలిసారి నా వద్దకు వచ్చిన రోజు బాగా గుర్తుంది. అప్పటికే అతని అన్న నందగోపాల్ నా వద్ద శిక్షణ పొందుతున్నాడు. ఖాళీగా తిరుగుతున్నాడు, ఇతడిని కూడా కాస్త దారిలో పెట్టమంటూ అతని తల్లిదండ్రులు నాతో చెప్పడంతో కోచింగ్ ఇవ్వడం ప్రారంభించాను. అయితే ఆ సమయంలో దేనిపై కూడా ఆసక్తి చూపించకుండా, చాలా సోమరిగా కనిపించేవాడు. మెల్లమెల్లగా మారడం మొదలు పెట్టిన అనంతరం డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ ఆడసాగాడు. కొన్ని చక్కటి విజయాలు కూడా లభించాయి. ఆ సమయంలోనే అతని ప్రతిభను గుర్తించి ప్రత్యేక దృష్టి పెట్టాను. 2012 చివర్లో శ్రీకాంత్‌ను పూర్తిగా సింగిల్స్‌కు పరిమితమయ్యేలా ప్రోత్సహించాను. మంచి ఫలితాలు వస్తున్న సమయంలో డబుల్స్‌ను వదిలేందుకు ఇష్టపడని శ్రీకాంత్ కాస్త అలిగాడు కూడా. అయితే తనలో అసలు సత్తా ఏమిటో తెలుసుకున్న తర్వాత పట్టుదలగా ఆడి దూసుకుపోయాడు. పురుషుల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ చాలా గొప్ప ఘనత. శ్రీకాంత్‌ను ఎంత ప్రశంసించినా తక్కువే. పవర్, అటాకింగ్ శ్రీకాంత్‌కు అతి పెద్ద బలం. కోర్టులో బుర్రకు పదును పెట్టి ఆడటం మరో అదనపు లక్షణం. నంబర్‌వన్ అయ్యాక దానిని నిలబెట్టుకునే క్రమంలో అతనికి ఇతర స్టార్ ఆట గాళ్ల నుంచి గట్టి పోటీ ఎదురు కావడం ఖాయం. అయితే వీటన్నంటిని తట్టుకొని మంచి విజయాలు సాధిస్తాడని నమ్ముతున్నా. – పుల్లెల గోపీచంద్, భారత కోచ్ -
హీనా పసిడి గురి
వెయిట్‌లిఫ్టర్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే మను భాకర్... జీతూ రాయ్ పసిడి పతకాలు సొంతం చేసుకోగా... మూడో రోజు హీనా సిద్ధూ భారత్‌కు మరో బంగారు పతకాన్ని అందించింది. పారా పవర్‌లిఫ్టింగ్‌లో సచిన్ చౌధరీ కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. ఓవరాల్‌గా పోటీల ఆరోరోజు భారత్ ఖాతాలో ఒక స్వర్ణం, ఒక కాంస్యం చేరింది. పతకాల వేటలో జోరు తగ్గినా పట్టికలో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. గోల్డ్‌కోస్ట్: సత్తా ఉన్నా మెగా ఈవెంట్స్‌లో స్వర్ణం సాధించడంలో గురి తప్పుతుందని తనపై వస్తున్న విమర్శలకు ఎట్టకేలకు హీనా సిద్ధూ తన ప్రదర్శనతోనే జవాబు ఇచ్చింది. కామన్వెల్త్ గేమ్స్‌లో ఇన్నాళ్లు లోటుగా ఉన్న వ్యక్తిగత పసిడి పతకాన్ని మంగళవారం ఆమె తన ఖాతాలో వేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో రజతం నెగ్గిన హీనా సిద్ధూ... 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో పసిడి పతకంతో మెరిసింది. ఫైనల్లో హీనా 38 పాయింట్లు స్కోరు చేసి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకుంది. ఫైనల్లో పోటీపడిన భారత్‌కే చెందిన మరో షూటర్ అన్ను సింగ్ 15 పాయింట్లతో ఆరో స్థానానికి పరిమితమైంది. ఎలీనా గలియబోవిచ్ (ఆస్ట్రేలియా–35 పాయింట్లు) రజతం... అలా సజానా అజహరి (మలేసియా–26 పాయింట్లు) కాంస్యం గెలిచారు. క్వాలిఫయింగ్‌లో అన్ను 584 పాయింట్లతో రెండో స్థానంలో, హీనా 579 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. దంత వైద్య విద్య అభ్యసించిన హీనాకు ఆమె భర్త రోనక్ పండిత్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 2006 మెల్బోర్న్ కామన్వెల్త్ గేమ్స్‌లో రోనక్ 25 మీటర్ల పిస్టల్ పెయిర్స్ విభాగంలో స్వర్ణం సాధించడం విశేషం. భారీ అంచనాలతో 2016 రియో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన హీనా 20వ స్థానంలో నిలిచింది. 2014 గ్లాస్గో గేమ్స్‌లో ఏడో స్థానాన్ని సంపాదించింది. 2010 ఢిల్లీ గేమ్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో రజతం, పెయిర్స్ ఈవెంట్లో స్వర్ణం సాధించింది. తాజా ప్రదర్శనతో ఎట్టకేలకు వ్యక్తిగత స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో సీనియర్ షూటర్లు గగన్ నారంగ్, చెయిన్ సింగ్ ఫైనల్‌కు చేరినా పతకం మాత్రం నెగ్గలేకపోయారు. చెయిన్ సింగ్ 204.8 పాయింట్లతో నాలుగో స్థానంలో, గగన్ నారంగ్ 142.3 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. తొలి లక్ష్యం పూర్తి... హాకీలో భారత పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్ బెర్త్‌లు ఖాయం చేసుకొని తొలి లక్ష్యాన్ని పూర్తి చేశాయి. మలేసియాతో జరిగిన పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 2–1తో గెలిచింది. రెండు విజయాలు, ఒక ‘డ్రా’తో భారత్ ఏడు పాయింట్లతో ఇంగ్లండ్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే సెమీస్ చేరిన ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య బుధవారం జరిగే మ్యాచ్ ద్వారా గ్రూప్ టాపర్ ఎవరో తేలుతుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 1–0తో గెలిచింది. దాంతో తొమ్మిది పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచిన భారత్, ఇంగ్లండ్ సెమీఫైనల్‌కు చేరాయి. అయ్యో... అనస్! అథ్లెటిక్స్‌లో పురుషుల 400 మీటర్ల ఫైనల్లో మొహమ్మద్ అనస్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఫెనల్ రేసును అనస్ 45.31 సెకన్లలో ముగించి కొత్త జాతీయ రికార్డును సృష్టించినా పతకం మాత్రం నెగ్గలేకపోయాడు. మరోవైపు మహిళల 400 మీటర్ల విభాగంలో హిమా దాస్ సెమీఫైనల్లో ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరింది. తద్వారా ఈ గేమ్స్ చరిత్రలో ఈ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. రెండో రౌండ్లో సాత్విక్–అశ్విని జంట బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్ వ్యక్తిగత ఈవెంట్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జంట శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఈ భారత జోడీ 21–9, 21–5తో స్టువర్ట్–చోల్ లీ ద్వయంపై గెలిచింది. సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో ‘బై’ పొందిన శ్రీకాంత్, ప్రణయ్, సైనా, సింధు బుధవారం జరిగే రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో పోటీపడతారు. హుసాముద్దీన్‌కు పతకం ఖాయం బాక్సింగ్‌లో ఐదుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్‌కు చేరడంద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకన్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (56 కేజీలు) 5–0తో ఎవరిస్టో ములెంగా (జాంబియా)పై... అమిత్ (49 కేజీలు) 4–1తో అకీల్ అహ్మద్ (స్కాట్లాండ్)పై... మనోజ్ (69 కేజీలు) 4–1తో టెరీ నికోలస్ (ఆస్ట్రేలియా)పై... నమన్ తన్వర్ (91 కేజీలు) 5–0తో ఫ్రాంక్ మసోయి (సమోవా)పై... సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) 4–1తో నైగెల్ పాల్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో)పై గెలిచారు. ►పారా పవర్‌లిఫ్టింగ్‌లో భారత లిఫ్టర్ సచిన్ చౌధరీ ప్లస్ 107 కేజీల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలిచాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ మొత్తం 181 కేజీల బరువెత్తాడు. -
టాప్... జంప్... టాప్... స్మాష్...
భారత బ్యాడ్మింటన్‌లో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన క్షణం... తెలుగు జాతి క్రీడాభిమానులంతా సగర్వంగా మనవాడని చెప్పుకోగలిగే ఘనత... ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగిన మన కిడాంబి శ్రీకాంత్ ఎందరో దిగ్గజాల వల్ల కానిది సాధ్యం చేసి చూపించాడు. వరుస విజయాలతో సత్తా చాటిన ‘డిప్యూటీ కలెక్టర్’ ఇప్పుడు షటిల్ ప్రపంచంలో శిఖరానికి చేరుకున్నాడు. తాజా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్ తొలిసారి వరల్డ్ నంబర్‌వన్‌గా అవతరిస్తున్నాడు. కంప్యూటరైజ్డ్ ర్యాంకింగ్ ప్రవేశ పెట్టిన తర్వాత పురుషుల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు శ్రీకాంత్ కావడం విశేషం. సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ అభిమానులందరికీ ఆనందం పంచే రోజు వచ్చేసింది. చైనా కోటను బద్దలుకొట్టి మనోళ్లూ ప్రపంచ బ్యాడ్మింటన్‌ను శాసించగలరని చూపించిన శ్రీకాంత్ ఇప్పుడు కొత్త చరిత్ర సృష్టించాడు. గురువారం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య అధికారికంగా ప్రకటించబోయే ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్‌కు నంబర్‌వన్ స్థానం దక్కనుంది. 2017లో ఏకంగా నాలుగు సూపర్ సిరీస్ టోర్నీ విజయాలతో అగ్రస్థానానికి చేరువగా వచ్చిన శ్రీకాంత్ త్రుటిలో ఆ అవకాశం కోల్పోయాడు. అయితే ఆ కల నెరవేరేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. గత ఏడాది నవంబర్ 2న తొలిసారి వరల్డ్ నంబర్–2 స్థానానికి చేరుకున్న శ్రీకాంత్... ఇప్పుడు నంబర్‌వన్ హోదాను ఖాయం చేసుకున్నాడు. అక్సెల్సన్ను వెనక్కి తోసి... ప్రస్తుతం శ్రీకాంత్ ఖాతాలో 76,895 పాయింట్లు ఉన్నాయి. డెన్మార్క్ స్టార్ విక్టర్ అక్సెల్సన్ 77,130 పాయింట్లతో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. వీరిద్దరి మధ్య 235 పాయింట్ల తేడా మాత్రమే ఉంది. బీడబ్ల్యూఎఫ్ నిబంధనల ప్రకారం గత 52 వారాల ప్రాతిపదికన ర్యాంకింగ్ నిర్ణయిస్తారు. గత ఏడాదిలో అత్యధిక పాయింట్లు సాధించిన 10 టోర్నీల ప్రదర్శ నను తీసుకొని గణిస్తారు. గతేడాది ఇదే సమయానికి మలేసియా ఓపెన్ ద్వారా సాధించిన 1660 పాయింట్లు అక్సెల్సన్ కోల్పోతాడు. 2018లో ఇప్పటికే జరగాల్సిన ఈ టోర్నీ వాయిదా పడింది. ఫలితంగా శ్రీకాంత్ ముందంజ వేసే అవకాశం లభించింది. మహిళల విభాగంలో భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్ 2015 మార్చిలో తొలిసారి వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచింది. 1980లో భారత దిగ్గజం ప్రకాశ్ పదుకొనే వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచినా.. అప్పటికి అధికారికంగా కంప్యూటరైజ్డ్ ర్యాంకింగ్ వ్యవస్థ లేదు. ఆ సమయంలో అతను సాధించిన వరుస విజయాలను బట్టి ప్రకాశ్‌ను నంబర్‌వన్‌గా గుర్తించారు. శ్రీకాంత్ గురువు, ప్రస్తుత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ 2001లో అత్యుత్తమంగా 5వ ర్యాంక్‌కు చేరుకున్నారు. తగ్గే అవకాశమూ... నంబర్‌వన్‌గా శ్రీకాంత్ ఎంత కాలం నిలుస్తాడనేది కూడా ఆసక్తికరం. గతేడాది గెలిచిన నాలుగు సూపర్ సిరీస్‌లు ఇండోనేసియా, ఆస్ట్రేలియన్, డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్ల వల్ల అతను అగ్రస్థానానికి చేరుకోగలిగాడు. ఈ ఏడాది వాటన్నింటినీ నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ టోర్నీ ఓడినా అంతే భారీ స్థాయిలో పాయింట్లు కోల్పోతాడు కాబట్టి ర్యాంకింగ్ బాగా వెనక్కి వెళ్లిపోయే ప్రమాదముంది. అలా మొదలై.. ►2011 డిసెంబర్ 15న శ్రీకాంత్ బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి చోటు దక్కించుకున్నాడు. అప్పుడతని ర్యాంక్ 386. తర్వాతి వారమే అది 535కు పడిపోయింది. ►2012 డిసెంబర్ 6న తొలి సారి టాప్–100లోకి. నాడు ర్యాంక్ 81. ►2013 జూన్ 13న తొలిసారి టాప్–50లోకి (44వ ర్యాంక్) ► 2014 నవంబర్ 20న తొలిసారి టాప్–10లోకి (10) ► 179- 89 శ్రీకాంత్ కెరీర్లో గెలుపోటములు ►కెరీర్ మొత్తం ప్రైజ్‌మనీ 3 లక్షల 97 వేల డాలర్లు (సుమారు రూ. 2 కోట్ల 58 లక్షలు) -
కామన్వెల్త్ గేమ్స్: పసిడి సాధించిన హీనా
-
కామ్న్వెల్త్లో భారత బాక్సర్ల జోరు
-
కామన్వెల్త్ గేమ్స్: పసిడి సాధించిన హీనా
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పసిడి పతకాల జోరు కొనసాగుతోంది. ఆరో రోజు ఈవెంట్లో భాగంగా మంగళవారం మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత స్టార్ షూటర్ హీనా సిద్దు స్వర్ణం కైవసం చేసుకుంది. 38 రికార్డు స్కోర్ నమోదు చేయడంతో హీనాకు పసిడి ఖాయమైంది. ఇప్పటికే 10మీటర్ల విభాగంలో హీనా రజతం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కామన్వెల్త్ 2018లో భారత్‌కి రెండు పతకాలు అందించిన తొలి క్రీడాకారిణిగా హీనా సిద్దూ రికార్డుకెక్కింది. దీంతో భారత్ స్వర్ణాల సంఖ్య 11కు చేరగా 4 రజతాలు, 5 కాంస్యాలతో మొత్తం మెడల్స్ సంఖ్య 20కి చేరింది. ప్రస్తుతం భారత్ పతకాల జాబితాలో మూడోస్థానంలో కొనసాగుతోంది. -
రాగాల వెంకట్ రాహుల్‌కు అభినందనల వెల్లువ
గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా) : కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు స్వర్ణం అందించిన తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిస్బేన్‌లో వెంకట్ రాహుల్‌ను క్వీన్స్‌ల్యాండ్ తెలుగు అసోసియేషన్ సన్మానించింది. ఆస్ట్రేలియా లోని గోల్డ్ కోస్ట్ లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2018 వెయిట్ లిఫ్టింగ్ 85 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. తెలుగు క్రీడాకారులను ఆదరించి మరింత ప్రోత్సహిస్తే, భవిష్యత్తులో వారు మరిన్నివిజయాలను సాధించటానికి ప్రేరణగా ఉంటుంది అని క్వీన్స్‌ల్యాండ్ తెలుగు అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. క్వీన్స్‌ల్యాండ్ తెలుగు అసోసియేషన్ సభ్యులు నవనీత తాటిమకుల, రవి కాంత్ గుండేపల్లి, కృష్ణ రావిపాటి, ఉమా గూడూరు, రత్న బుద్ధవరపు తదితరులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. -
టీటీలో క్లీన్‌స్వీప్...
పుష్కర కాలం తర్వాత టేబుల్ టెన్నిస్‌లో భారత పురుషుల జట్టు స్వర్ణం సాధించింది. 2006 మెల్బోర్న్ గేమ్స్‌లో పసిడి పతకం నెగ్గిన భారత పురుషుల జట్టు గోల్డ్‌కోస్ట్‌లో అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. నైజీరియాతో జరిగిన ఫైనల్లో భారత్ 3–0తో విజయం సాధించింది. ఆచంట శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్, హర్మీత్ దేశాయ్, సానిల్ శెట్టి, ఆంథోనీ అమల్‌రాజ్ భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఆదివారం భారత మహిళల జట్టు కూడా స్వర్ణం నెగ్గడంతో 2002లో కామన్వెల్త్ గేమ్స్‌లో టీటీ ప్రవేశ పెట్టాక రెండు టీమ్ ఈవెంట్స్‌లో భారత్‌కు పసిడి పతకాలు రావడం ఇదే తొలిసారి. -
జీతూ గురి అదిరె...
షూటింగ్లో భారత స్టార్స్ మళ్లీ మెరిశారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో జీతూ రాయ్ స్వర్ణం... ఓం మితర్వల్ కాంస్యం గెలిచారు. ఫైనల్లో జీతూ రాయ్ 235.1 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని పొందాడు. ఓం మితర్వల్ 214.3 పాయింట్లు సాధించాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మెహులీ ఘోష్ (247.2 పాయింట్లు) రజతం, అపూర్వీ చండిలా (225.3 పాయింట్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు. రజతంతో ముగించిన లిఫ్టర్లు.. వెయిట్‌లిఫ్టింగ్ పోటీల చివరి రోజు భారత్‌కు రజతం లభించింది. పురుషుల 105 కేజీల విభాగంలో ప్రదీప్ సింగ్ మొత్తం 352 కేజీల (స్నాచ్‌లో 152+క్లీన్ అండ్ జెర్క్‌లో 200) బరువెత్తి రజత పతకం గెలిచాడు. ఓవరాల్‌గా ఈ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలు లభించడం విశేషం. -
బరిలోకి దిగి... కన్నీళ్లతో వెనుదిరిగి...
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటున్న తొలి లింగ మార్పిడి వెయిట్‌లిఫ్టర్ లారెల్ హబ్బర్డ్ భుజం గాయంతో పోటీ నుంచి మధ్యలో తప్పుకుంది. న్యూజిలాండ్‌కు చెందిన ఈ 40 ఏళ్ల లిఫ్టర్ మహిళల ప్లస్ 90 కేజీల కేటగిరీలో పాల్గొనేందుకు సిద్ధమైంది. స్నాచ్‌లో మూడో ప్రయత్నం సందర్భంగా ఆమె తడబడి విఫలమైంది. బార్‌ను ఎత్తే ప్రయత్నంలో గాయపడ్డ ఆమె కంటతడి పెట్టుకొని పోటీ నుంచి వైదొలిగింది. లారెల్ మొదట పురుషుడు. పేరు గెవిన్ హబ్బర్డ్. పదేళ్ల క్రితం 30 సంవత్సరాల వయసులో లింగమార్పిడి చేయించుకొని అతను ఆమెగా మారాడు. వెయిట్‌లిఫ్టింగ్ అంటే ఎంతో ఇష్టమైన హబ్బర్డ్ కామన్వెల్త్ కోసం ఎంతో పట్టుదలగా సన్నద్ధమైంది. అయితే ఇతర దేశాలకు చెందిన లిఫ్టర్లు, కోచ్‌లు ఆమె ఇప్పుడు మహిళగా మారినప్పటికీ పూర్వమున్న పురుషుల బలం అంతర్గతంగా ఉండనే ఉంటుందని విమర్శించారు. హబ్బర్డ్‌ను మహిళల ఈవెంట్లో పాల్గొనేందుకు అనుమతించడం సహేతుకం కాదని సమోవా లిఫ్టింగ్ జట్టు హెడ్ కోచ్ జెర్రీ వాల్‌వర్క్ నిర్వాహకుల తీరును తప్పుబట్టారు. అయితే తాను మాత్రం ఇలాంటి విమర్శలను పట్టించుకోనని లారెల్ హబ్బర్డ్ చెప్పింది. -
ఎన్నాళ్లో వేచిన స్వర్ణం
నాలుగు దశాబ్దాల నిరీక్షణ ముగిసింది. గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ జట్టు కొత్త చరిత్ర లిఖించింది. 1978 నుంచి అందని ద్రాక్షగా ఊరిస్తున్న మిక్స్డ్ టీమ్ స్వర్ణం తొలిసారి భారత్ సొంతమైంది. తమ గురువు పుల్లెల గోపీచంద్ ఒకనాడు క్రీడాకారుడిగా, కోచ్‌గా ఇంతకాలం సాధించలేని టీమ్ స్వర్ణాన్ని ఆయన శిష్యులు నిజం చేశారు. దేశానికి బంగారు పతకం కానుకగా ఇచ్చారు. గోల్డ్‌కోస్ట్: అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో తాము అమేయ శక్తిగా ఎదుగుతున్నామని భారత క్రీడాకారులు కామన్వెల్త్ గేమ్స్ వేదికగా చాటుకున్నారు. తమ ‘రాకెట్’ సత్తా ఏంటో నిరూపిస్తూ... మూడుసార్లు వరుస చాంపియన్‌గా నిలిచిన మలేసియాను బోల్తా కొట్టించి బంగారు పతకాన్ని తమ మెడలో వేసుకున్నారు. సోమవారం జరిగిన మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత్ 3–1తో మలేసియాను ఓడించి ఈ క్రీడల చరిత్రలో తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. 2006 మెల్బోర్న్, 2010 ఢిల్లీ, 2014 గ్లాస్గో గేమ్స్‌లో విజేతగా నిలిచిన మలేసియా ఈసారి మాత్రం భారత జోరు ముందు చేతులెత్తేసింది. ఇన్నాళ్లు బలహీనంగా ఉన్న డబుల్స్ విభాగం పటిష్టంగా మారడం భారత్ భవితను మార్చేసింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప ద్వయం 21–14, 15–21, 21–15తో పెంగ్ సూన్ చాన్–లియు యోంగ్ గో జోడీపై నెగ్గి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–17, 21–14తో దిగ్గజం లీ చోంగ్ వీని ఓడించి పెను సంచలనం సృష్టించాడు. గతంలో మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీతో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిన శ్రీకాంత్ ఐదో ప్రయత్నంలో అద్భుత ఫలితం సాధించాడు. భారత్‌ను 2–0తో ఆధిక్యంలో నిలబెట్టాడు. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 15–21, 20–22తో వి షెమ్ గో–వీ క్లాంగ్ తాన్ జంట చేతిలో ఓడిపోయింది. దాంతో భారత ఆధిక్యం 2–1కి తగ్గింది. అయితే నాలుగో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ 21–11, 19–21, 21–9తో సొనియా చెపై గెలుపొందడంతో భారత్ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకొని స్వర్ణం సాధించింది. ఫలితం తేలిపోవడంతో మహిళల డబుల్స్ మ్యాచ్‌ను నిర్వహించలేదు. చీలమండ గాయం మరింత తీవ్రం కాకూడదనే ఉద్దేశంతో పీవీ సింధును టీమ్ విభాగం మ్యాచ్‌ల్లో ఆడించలేదు. సింగిల్స్‌లో పోటీపడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ సైనా గెలుపొందడం విశేషం. డబుల్స్‌లో 17 ఏళ్ల సాత్విక్ ఐదు విజయాలు సాధించి భారత్‌కు స్వర్ణం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. 2006 మెల్బోర్న్లో కాంస్యం, 2010 ఢిల్లీ గేమ్స్‌లో రజతం నెగ్గిన భారత్ ఈసారి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. సైనా విజయం ఖాయంకాగానే భారత జట్టులోని సభ్యులందరూ కోర్టులోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. శ్రీకాంత్, ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ప్రణవ్ చోప్రా, సైనా, సింధు, సిక్కి రెడ్డి, రుత్విక శివాని, అశ్విని పొన్నప్ప సభ్యులుగా ఉన్న భారత జట్టులో ప్రణయ్, అశ్విని, చిరాగ్, ప్రణవ్ మినహా మిగతా వారందరూ తెలుగు క్రీడాకారులు కావడం విశేషం. 1998 కౌలాలంపూర్ కామన్వెల్త్ గేమ్స్‌లో పుల్లెల గోపీచంద్ సభ్యుడిగా ఉన్న భారత జట్టు పురుషుల టీమ్ ఈవెంట్లో రజత పతకం సాధించింది. నాడు రజతంతో సరిపెట్టుకున్న గోపీచంద్‌కు ఈసారి ఆయన శిష్యులు స్వర్ణాన్ని అందివ్వడం విశేషం. ►లీ చోంగ్ వీ గొప్ప ఫామ్‌లో లేకపోయినా దిగ్గజ హోదా ఉన్న అతడిని ఏ దశలోనూ తక్కువ అంచనా వేయొద్దు. నేనూ అదే చేశాను. నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించాను. విజయం సులువుగా లభించదని నాకు ముందే తెలుసు. – శ్రీకాంత్ ►మ్యాచ్ మధ్యలో ఏకాగ్రత కోల్పోయాను. కానీ కీలక దశలో పుంజుకున్నాను. నా విజయంతోనే స్వర్ణం ఖాయం కావాలని భావించాను. ఈ పతకం నాకెంతో ప్రత్యేకం. స్వర్ణం నెగ్గిన సంబరంలో సహచరులు రాత్రికి నిద్రపోరేమో? ముందు ఈ మధుర క్షణాలను ఆస్వాదిస్తా. తర్వాత సింగిల్స్‌పై దృష్టిసారిస్తాను. – సైనా ►గోల్డ్‌కోస్ట్‌లో భారత ‘గోల్డ్’ వేట కొనసాగుతోంది. అంచనాలను మించి రాణిస్తూ పోటీల ఐదో రోజు భారత క్రీడాకారులు మూడు స్వర్ణాలు సహా రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు గెల్చుకున్నారు. దాంతో పతకాల పట్టికలో భారత్ మూడో స్థానానికి ఎగబాకింది. ►టీమ్ ఈవెంట్లో భారత్ స్వర్ణం సాధించడం చాలా సంతోషంగా ఉంది. 2006 కామన్వెల్త్ క్రీడల అనంతరం నేను జట్టుకు కోచ్‌గా వచ్చాను. ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లోనూ మేం టీమ్ స్వర్ణం గెలవడంలో విఫలమయ్యాం. ఈసారి మరింత ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమయ్యాం. ఒక్క మాటలో చెప్పాలంటే మన డబుల్స్ విజయాలే ఇప్పుడు బంగారు పతకాన్ని అందించాయి. సాత్విక్ సాయిరాజ్, అశ్వినిలకు నా ప్రత్యేక అభినందనలు. వారి మ్యాచ్ వల్లే మెడల్ అవకాశాలు ఏర్పడ్డాయి. మిగతా పనిని శ్రీకాంత్ పూర్తి చేశాడు. లీ చోంగ్ వీతో మ్యాచ్ కోసం కూడా ఎన్నో ప్రణాళికలు రూపొందించాం. వీడియోలు చూసి శ్రీకాంత్ సిద్ధమయ్యాడు. మనం ప్రతీ మ్యాచ్‌పై కూడా ఆశలు పెట్టుకునే పరిస్థితి గతంతో పోలిస్తే వచ్చిన ప్రధాన మార్పు. –‘సాక్షి’తో పుల్లెల గోపీచంద్, భారత చీఫ్ కోచ్ -
కామన్వెల్త్ : బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర
-
కామన్వెల్త్ : బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఈవెంట్లో భారత్ స్వర్ణం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 3-1 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ మలేసియాను ఓడించి పసిడిని సొంతం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు ఇది తొలి స్వర్ణం. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సాత్విక్ జోడిలు గెలుపొంది భారత్ విజయంలో ముఖ్య భూమిక పోషించారు. అంతకుముందు సెమీ ఫైనల్లో సింగపూర్‌పై విజయం సాధించి తుది పోరుకు చేరిన భారత బ్యాడ్మింటన్ టీమ్.. అదే ఊపును ఫైనల్లో కూడా కొనసాగించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో అశ్విన్ పొన్నప్ప-సాత్విక్ జోడి 21-14, 21-14, 21-15 తేడాతో చాన్ పెంగ్ సూన్-గో లి యింగ్ ద్వయంపై గెలిచి ఆధిక్యం సాధించగా, ఆపై శ్రీకాంత్ 21-17, 21-14 తో చాంగ్ లీపై విజయం సాధించాడు. దాంతో భారత్‌కు 2-0తో స్పష్టమైన ఆధిక్యం లభించింది. కాగా, పురుషుల డబుల్స్‌లో భారత్‌కు ఓటమి పాలైంది. సాత్విక్-చిరాగ్ జోడి 15-21, 19, 21తేడాతో పరాజయం చెందింది. దాంతో భారత్ ఆధిక్యం 2-1కు తగ్గింది. ఇక చివరి మ్యాచ్‌లో భాగంగా మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21-11,19-21, 21-9 తేడాతో చీహ్‌పై గెలుపును సాధించింది. తొలి గేమ్‌ను గెలిచిన సైనా, రెండో గేమ్‌ను చేజార్చుకుంది. కాగా, కీలకమైన ఆఖరి గేమ్‌లో పుంజుకున్న సైనా.. ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఆఖరి గేమ్‌ను 21-9 తేడాతో గెలుచుకున్న సైనా నెహ్వాల్ భారత్‌కు స్వర్ణాన్ని ఖాయం చేసింది. ఇది భారత్‌కు 10వ స్వర్ణం. కాగా, పతకాల సంఖ్య 19కు చేరింది. -
కామన్వెల్త్ గేమ్స్: భారత్ పసిడి జోరు.!
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. వరుసగా ఐదోరోజు భారత అథ్లేట్స్ పతకాల వేట కొనసాగిస్తున్నారు. పురుషుల డబుల్స్ టేబుల్ టెన్నిస్( టీటీ)లో భారత్ బృందం అచంట శరత్, సాతియన్ జ్ఞానశేఖరన్, హర్మీత్ దేశాయ్ స్వర్ణపతకం సాధించారు. టీమ్ ఈవెంట్లో భాగంగా సోమవారం నైజీరియాతో జరిగిన ఫైనల్లో భారత్ 3-0 తేడాతో విజయం సాధించి పసిడిని సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో అచంట శరత్ కమల్ 4-11, 11-5, 11-4, 11-9 లతేడాతో బోడే అబియోడన్‌ను ఓడించడంతో భారత్‌కు ఆధిక్యం లభించింది. రెండో గేమ్‌లో సత్యన్ జ్ఞానశేఖర్ 10-12, 11-3, 11-3, 11-4 తేడాతో సెగన్ టోరిలియోపై నెగ్గడంతో భారత్ 2-0తో పై చేయి సాధించింది. ఇక మూడో గేమ్ డబుల్స్‌లో జ్ఞానశేఖరన్, హర్మీత్ దేశాయ్‌ల జోడి 11-8,11-5,11-3ల తేడాతో ఓలాజిడ్ ఓమాతియో, అబియోడన్ జంటను ఓడించడంతో భారత్‌కు స్వర్ణం ఖాయమైంది. దీంతో భారత స్వర్ణాల సంఖ్య 9కి చేరగా పతకాల సంఖ్య 18కి చేరింది. ఇప్పటివరకూ 9 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్య పతకాలు కొల్లగొట్టిన భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. నేటి ఉదయం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు చెందిన జీతూరాయ్ స్వర్ణం గెలుచుకోగా, ఓమ్ ప్రకాశ్ మితర్వాల్ కాంస్యంతో సాధించిన విషయం తెలిసిందే.