
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో క్రీడాకారులకు రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటి స్వదేశానికి చేరుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల క్రీడాకారుల బృందం శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి క్రీడాకారులకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్క క్రీడాకారుడితో ప్రత్యేకంగా మాట్లాడి అభినందనలు తెలిపారు. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొని దేశానికి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారని క్రీడాకారులను ప్రశంసించారు.
సీఎంను కలిసిన వారిలో బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సైనా నెహ్వాల్, సిక్కి రెడ్డి, రుత్విక శివాని, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, ప్రణవ్ చోప్రా, బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్, జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణులు బుద్దా అరుణ రెడ్డి, మేఘన రెడ్డి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి నిర్ణయించినందుకు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment