మీరాబాయి చాను, గురురాజా
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తొలి స్వర్ణ పతకాన్ని ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను బంగారు పతకాన్ని సాధించింది. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో మొత్తంగా 196 కేజీల బరువును సునాయాసంగా ఎత్తిన మీరాబాయి చాను పసిడి పతకాన్ని అందుకుంది. తొలుత స్నాచ్‌లో 86 కేజీలను ఎత్తిన చాను..ఆపై క్లీన్ అండ్ జర్క్‌లో 110 కేజీలను ఎత్తి సత్తాచాటింది.
ఇక మారిషస్‌కు చెందిన వెయిట్ లిఫ్టర్ రోల్యా రానైవోసోవా మొత్తం 170 కేజీలను ఎత్తి రజత పతకాన్ని సొంతం చేసుకోగా, మొత్తం 155 కేజీలతో శ్రీలంక లిఫ్టర్ దినుషా గోమ్స్ కాంస్య పతకంతో సంతృప్తి పడింది. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ చాలెంజ్‌లో మీరాబాయి చానుకు ఎదురే లేకుండా పోయింది. స్నాచ్‌లో భాగంగా జరిగిన మూడు రౌండ్‌లలో (80,84 86 కేజీలు) చాను సక్సెస్‌ఫుల్‌గా బరువులు ఎత్తగా, క్లీన్ అండ్ జర్క్ విభాగంలోని మూడు రౌండ్లను(103, 107, 110 కేజీలు) మీరాబాయి చాను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. క్లీన్ అండ్ జర్క్ చివరి రౌండ్‌లో అత్యధికంగా 110 కేజీల బరువు ఎత్తిన చాను తొలి స్థానంలో నిలిచింది.
దాంతో పసిడి పతకం మీరాబాయి చాను ఖాతాలో వేసుకుంది. ఇది క్లీన్ అండ్ జర్క్‌లో మీరాబాయ్ చాను అత్యుత్తమ ప్రదర్శనగా రికార్డులెక్కింది. అంతకుముందు 109 కేజీలను మాత్రమే తన అత్యుత్తమ క్లీన్ అండ్ జర్క్ ప్రదర్శన కాగా, దాన్ని చాను తాజాగా అధిగమించి సరికొత్త వ్యక్తిగత ఫీట్‌ను సైతం సొంతం చేసుకుంది. అయితే స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో రోల్యా రానైవోసోవా, దినుషా గోమ్స్‌లు రెండేసి రౌండ్‌లను మాత్రమే పూర్తి చేయడం చాను ఆధిపత్యాన్ని రుజువు చేసింది. మరోవైపు గురువారం జరిగిన పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ గురురాజా రజత పతకం సాధించాడు. మొత్తం మూడు రౌండ్లలో 249 కిలోల బరువును ఎత్తిన గురురాజా రెండో స్థానంలో నిలిచి వెండి పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment