GC2018
-
ముగిసిన కామన్వెల్త్ గేమ్స్
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్-2018 ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ ముగింపు వేడుకల్లో భారత అథ్లెట్ల బృందానికి బాక్సింగ్ దిగ్గజం మేరికోమ్ నేతృత్వం వహించారు. త్రివర్ణపతకాన్ని చేతపట్టుకోని నడుస్తూ.. కామన్వెల్త్ గేమ్స్‌కు ముగింపు పలికారు. ఈ 21వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పంట పండింది. 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యలను భారత అథ్లెట్లు సొంతం చేసుకున్నారు. మొత్తం 66 పతకాలతో భారత్ మూడోస్థానంలో నిలిచింది. 198 పతకాలతో(80 స్వర్ణాలు,59 రజతాలు, 59 కాంస్యాలు) ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉండగా 136 పతకాలతో(45 స్వర్ణాలు, 45 రజాతాలు, 46 కాంస్యలతో) ఇంగ్లండ్ రెండోస్థానంలో నిలిచింది. చివరిదైన11వ రోజు భారత్ 1 స్వర్ణం, 4 రజతాలు, 1 కాంస్యలతో ఏడు పతకాలను సొంతం చేసుకుంది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో 21-18, 23-21 తేడాతో పీవీ సింధుపై నెగ్గిన సైనా నెహ్వాల్‌కు బంగారు పతకం సొంతమైంది. ఇక ఓడిన పీవీ సింధు రజతం సాధించారు. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో శ్రీకాంత్ రజత పతకం గెలుపొందారు. టేబుల్ టెన్నిస్‌లో శరత్ కమల్ కాంస్య పతకం సాధించగా.. స్క్వాష్ మహిళల డబుల్స్ ఫైనల్లో భారత్ స్టార్లు జోష్నా చిన్నప్ప, దీపికా పల్లికల్ కార్తీక్‌లు రజత పతకాలు గెలుపొందారు. ఇక పతకాల జాబితాలో కెనడా 82, న్యూజిలాండ్ 46, దక్షిణాఫ్రికా 37, వాలేస్ 36, స్కాట్లాండ్ 44, నైజిరియా 24, సైప్రస్ 14, జమైకా 27, మలేసియా 24, కెన్యా 17, నార్త్ ఐర్లాండ్ 12 పతకాలు సాధించాయి. -
కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్‌కు చేదు అనుభవం
వారణాసి: కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచి భారత కీర్తిని పతాక స్థాయికి చేర్చిన వెయిట్‌లిఫ్టర్ పూనమ్ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. శనివారం వారణాసిలో ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. పూనమ్ యాదవ్ వారణాసిలోని తమ బంధువుల ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. పూనమ్‌తోపాటు తండ్రి, మరో ఇద్దరు బంధువులు కూడా ఉన్నారు. వాళ్లు అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. దుండగులు వారిపైన కూడా దాడి చేశారు. రాళ్ల వర్షం కురవడంతో పోలీసులు వెంటనే పూనమ్‌ను అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై వారణాసి రూరల్ ఎస్పీ అమిత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ విషయం తెలియగానే అదనపు బందోబస్తును పూనమ్ యాదవక్‌కు రక్షణగా పంపించామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దాడికి పాల్పడిన వాళ్లను వదిలిపెట్టమన్నారు. గతంలో పూనమ్ యాదవ్ బంధువు, సమీప గ్రామ పెద్దకు మధ్య ఉన్న భూవివాదంలో భాగంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన 21వ కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ మహిళల 69 కేజీల విభాగంలో పూనమ్ గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. స్నాచ్‌లో 100 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 122 కేజీల బరువెత్తి ఆమె పసిడిని సొంతం చేసుకుంది. -
ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ ఓటమి
-
ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్‌కి షాక్
గోల్డ్‌కోస్ట్ : ప్రపంచ నంబర్‌వన్, భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో చుక్కెదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ స్వర్ణ పోరులో ఓటమి చెందడంతో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో మలేసియాకు చెందిన లీ చోంగ్ వీ 19-21, 21-14, 21-14 తేడాతో కిడాంబి శ్రీకాంత్‌పై విజయం సాధించి స్వర్ణం సాధించాడు. తొలి గేమ్‌లో హోరాహోరాగా పోరాడి నెగ్గిన భారత షట్లర్ శ్రీకాంత్ ఆపై రెండు వరుస గేమ్‌లు కోల్పోయాడు. దీంతో మ్యాచ్ లీ చోంగ్ వీ వశమైంది. తొలి గేమ్ కోల్పోయిన లీ చోంగ్ వీ ఆపై ఏ దశలోనూ శ్రీకాంత్‌కు అవకాశం ఇవ్వలేదు. అద్భుతమైన స్మాష్‌లతో వరుస పాయింట్లు నెగ్గడంతో శ్రీకాంత్ కాస్త ఒత్తిడికి లోనైనట్లు కనిపించాడు. మూడో గేమ్‌లో సైతం లీ చోంగ్ వీ ఆదినుంచే పాయింట్లపై దృష్టిపెట్టి ఎదురుదాడి చేయడంతో గేమ్‌తో పాటు మ్యాచ్ కోల్పోయిన శ్రీకాంత్ రజతంతో సరిపెట్టుకున్నాడు. సెమీఫైనల్స్‌లో లీ చోంగ్ వీ 21–16, 9–21, 21–14తో హెచ్ఎస్ ప్రణయ్ (భారత్)ను ఓడించిన విషయం తెలిసిందే. భారత్ ఖాతాలో 65 పతకాలు ఉండగా.. అందులో 26 స్వర్ణాలు, 19 రజతాలు, 20 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. -
ఒక్కసారి మైండ్‌లో ఫిక్స్ అయితే..నా భర్త కూడా ఆపలేరు
గోల్డ్‌కోస్ట్ : గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకం సాధించిన భారత మహిళా బాక్సర్ మేరీకోమ్ తన విజయ రహస్యాన్ని వెల్లడించారు. ఫిట్నెస్ను కాపాడుకోవడం ద్వారానే 35 ఏళ్ల వయస్సులోనూ తాను రాణించగలుగుతున్నానని పేర్కొన్నారు. 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం నెగ్గిన తర్వాత మేరీకోమ్ మీడియాతో మాట్లాడారు. ప్రత్యర్థిని నిలువరించేందుకు ముందుగానే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటానని.. తద్వారా సులువుగా విజయం సాధించే అవకాశం ఉంటుందన్నారు. గాయాల బెడద లేకపోవడం తనకు కలిసొచ్చే అంశమని తెలిపారు. ఒక్కసారి మైండ్‌లో ఫిక్స్ అయితే.. ఈవెంట్లు లేని సమయంలోనూ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటానని క్రీడల పట్ల తనకున్న నిబద్ధతని చాటుకున్నారు. బౌట్లు లేని సమయంలోనూ ఇలా కష్టపడడం అవసరమా అంటూ తన భర్త ప్రేమగా కోప్పడతారని.. అయినప్పటికీ ప్రాక్టీస్ చేయకుండా ఆయన నన్ను ఆపలేరని సరదాగా వ్యాఖ్యానించారు. ఒక్కసారి మైండ్‌లో ఫిక్స్ అయిపోతే అనుకున్న పనిని పూర్తిచేసేదాకా ఎవరి మాటా విననన్నారు. 2020 ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే అంశంపై ప్రశ్నించగా.. ఆ విషయంపై ఇప్పుడే ఏం చెప్పలేనన్నారు. ప్రస్తుతం 48 కేజీల బరువున్న తాను ఒలింపిక్స్‌లో 51 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉంటుందని, అప్పటికీ ఫిట్నెస్ను ఇలాగే కాపాడుకోగలిగితే తప్పక పాల్గొంటానని పేర్కొన్నారు. ముగ్గురు పిల్లలకు తల్లైన తర్వాత కూడా పతకాల వేట కొనసాగిస్తున్న మేరీకోమ్ ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రియో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన మేరీకోమ్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం నెగ్గిన భారత తొలి మహిళా బాక్సర్‌గా రికార్డు సృష్టించారు. -
భారత్ ఖాతాలో మరో స్వర్ణం
గోల్డ్‌కోస్ట్ : ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగిస్తోంది. పదోరోజు ఆటలో భాగంగా భారత క్రీడాకారులు స్వర్ణాల పంట పండిస్తున్నారు. శనివారం ఒక్కరోజే భారత్ 7 స్వర్ణాలు కైవసం చేసుకుంది. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో మానికా బాత్రా సింగపూర్‌కు చెందిన మియింగ్యూ యుపై 11-7, 11-6, 11-2, 11-7 తేడాతో విజయం సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్‌లో దీపికా పల్లికల్, సౌరబ్ ఘోశల్‌లు స్వర్ణ పోరులో ఆస్ట్రేలియాకు చెందిన పిల్లే కామెరూన్, ఉరుక్హఖ్ డోన్నా చేతిలో 0-2 తేడాతో ఓటమి చెందడంతో రజతాలతో సరిపెట్టుకున్నారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 55కు చేరగా.. అందులో 24 స్వర్ణాలు, 14 రజతాలు, 17 కాంస్యాలున్నాయి. భారత్ మూడో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. -
కామన్వెల్త్ గేమ్స్: ఫైనల్లో సైనా Vs సింధు
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్‌లో ఆసక్తికర పోరు జరుగనుంది. భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధూ ఒకే కోర్టులో తలపడనున్నారు. సెమీ ఫైనల్లో తమ ప్రత్యర్థులను మట్టి కరిపించిన ఈ స్టార్స్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. దీంతో బ్యాడ్మింటన్‌లో భారత్ ఖాతాలో స్వర్ణం, రజతం పతకాలు ఖాయమయ్యాయి. అయితే ఫైనల్లో ఎవరికి ఏ పతకం వరించనుందో అని ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరుగనుంది. హోరా హోరిగా సాగిన సెమీస్‌లో లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన సైనా స్కాంట్లాండ్ ఫ్లేయర్ క్రిస్టీ గిల్మోర్ పై 21-14,18-21, 21-17 తో నెగ్గి ఫైనల్లోకి ప్రవేశించింది. మరో సెమీస్‌లో ఒలిపింక్ పతక విజేత సింధు 21-18, 21-8 తేడాతో కెనడా క్రీడాకారిణి మైఖేల్ లీపై విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరోవైపు ప్రపంచ నంబర్ వన్ కిడాంబి శ్రీకాంత్ కూడా ఫైనల్ కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సెమీఫైనల్లో శ్రీకాంత్ 21-10, 21-17 తో ఇంగ్లండ్ క్రీడాకారుడు రాజివ్ ఔసెఫ్పై విజయం సాధించి ఫైనల్లో ప్రవేశించాడు. మరో పురుషుల సెమీస్‌లో హోరాహోరీగా జరిగిన పోరులో భారత్‌కే చెందిన ప్రణయ్ 16-21, 21-9, 14-21 తేడాతో మాజీ ప్రపంచ చాంపియన్, మలేషియా ఆటగాటు చాంగ్ వీ లీ చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో ఫైనల్స్‌లో శ్రీకాంత్, చాంగ్ వీలీతో తలపడనున్నాడు. కాగా ఉమెన్స్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డిలకు ఈ సారి నిరాశ ఎదురైంది. మలేసియా జోడీ మేయి కౌన్ చౌ, వివియాన్ హూలపై 21-17, 15-21, 4-21 తేడాతో పరాజయం పొందిన ఈ భారత జోడీ... ఇవాళ సాయంత్రం కాంస్య పతకం కోసం తలపడనున్నారు. -
కామన్వెల్త్ గేమ్స్.. భారత్‌కు భారీగా పతకాలు
గోల్డ్‌కోస్ట్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారతీయ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. అద్భుతంగా రాణిస్తూ వరుసగా పతకాలు సాధిస్తున్నారు. శనివారం భారత్ ఖాతాలో మరిన్ని స్వర్ణాలు వచ్చి చేరాయి. ఈ రోజు భారీగా పతకాలు దక్కడంతో భారత్ పతకాల విషయంలో అర్ధ సెంచరీని దాటింది. మెడల్స్ పట్టికలో ప్రస్తుతం భారత్ 50 పతకాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. భారత్ ఖాతాలో 23 స్వర్ణాలు, 13 రజతాలు, 15 కాంస్య పతకాలు ఉన్నాయి. సీనియర్ బాక్సింగ్ క్రీడాకారిణి మేరికోమ్ మరోసారి సత్తా చాటింది. తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ ఆమె స్వర్ణ పతకాన్ని సాధించింది. 45-48 కేజీల విభాగంలో ఫైనల్లో ప్రత్యర్థిని మట్టికరిపించి ఆమె భారత్‌కు గోల్డ్ మెడల్ అందించింది. మహిళల 50 కిలోల ఫ్రీస్టయిల్ పోటీల్లో రెజ్లర్ వినేష్ ఫొగట్, 125 కేజీల పురుషుల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో రెజ్లర్ సుమిత్ గోల్డ్ మెడళ్లను సొంతం చేసుకున్నారు. జావెలింగ్ త్రో విభాగంలో నీరజా చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించారు. బాక్సర్ గౌరవ్ సోలంకీ కూడా సత్తా చాటాడు. పురుషుల 52 కిలోల విభాగంలో ప్రత్యర్థిని ఓడించి స్వర్ణపతకాన్ని సొంతం చేసుకున్నాడు. షూటర్ సంజీవ్ రాజ్‌పుత్ సైతం కామన్వెల్త్ క్రీడల్లో భారత పతకాన్ని రెపరెపలాడించాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3పొజిషన్స్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించాడు. రియో ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించిన రెజ్లర్ సాక్షి మాలిక్ మరోసారి సత్తా చాటి.. కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. అటు బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజాలు సైనా నెహ్వాల్, పీవీ సింధు ఫైనల్‌కు చేరడంతో స్వర్ణ, రజత పతకాలు భారత్ ఖాతాలో చేరడం ఖాయంగా మారింది. -
కామన్వెల్త్ గేమ్స్ : బ్యాడ్మింటన్‌లో భారత్ జోరు
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు తమ తమ వ్యక్తిగత మ్యాచ్‌ల్లో గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్ పోరులో సైనా నెహ్వాల్ 21-8, 21-13 తేడాతో రచెల్ హండ్రిచ్(కెనడా)పై వరుస గేమ్‌ల్లో గెలిచి సెమీస్‌కు చేరగా, ఆపై పీవీ సింధు 21-14, 21-7 తేడాతో మరో కెనడా క్రీడాకారిణి బిట్నీ టామ్‌పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించింది. ఇక పురుషుల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్ వన్ శ్రీకాంత్ 21-15 21-12 తో ర్యాన్ ఎంగ్ జిన్ రేయ్(సింగపూర్)పై గెలిచి సెమీస్‌కు అర్హత సాధించాడు. మరొకవైపు హెచ్ఎస్ ప్రణయ్ సైతం సెమీస్‌లోకి ప్రవేశించాడు. శ్రీలంక ఆటగాడు దినుకా కరుణరత్నాను వరుస గేమ్‌ల్లో ఓడించి సెమీస్‌కు చేరాడు. మిక్స్డ్ డబుల్స్ సాత్విక్- పొన్నప్ప ద్వయం సెమీస్‌కు చేరింది. సాత్విక్- పొన్నప్ప జోడి 2-0తో గో సూన్ హాట్- షెవాన్ జెమీపై గెలిచి సెమీస్‌కు చేరగా, మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సిక్కిరెడ్డి-పొన్నప్ప అశ్విని జోడి క్వార్టర్ అడ్డంకిని అధిగమించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నారు. సిక్కిరెడ్డి-పొన్నప్ప అశ్విని జంట 2-0తో హాసిని-దిల్రుక్షి( శ్రీలంక) జంటపై గెలిచి సెమీస్‌కు చేరారు. -
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్ల పతకాల పట్టు
-
భారత్‌కు మరో రెండు రజతాలు, ఓ కాంస్యం
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల జోరు కొనసాగుతోంది. తొమ్మిదో రోజు పోటీల్లో మహిళల డబుల్స్ టేబుల్ టెన్నిస్(టీటీ), పురుషుల 75 కేజీల బాక్సింగ్ విభాగంలో భారత్‌కు రెండు రజత పతకాలు దక్కగా.. పురుషుల బాక్సింగ్ 69 కేజీల విభాగంలో ఓ కాంస్యం సొంతమైంది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ టేబుల్ టెన్నిస్ ఫైనల్లో మనిక బాత్రా, మౌమా దాస్‌ల జోడి టియాన్వీ ఫెంగ్ ,మెంగువు యు( సింగఫూర్) ద్వయం చేతిలో పరాజయం పొందడంతో రజత పతకం సొంతమైంది. పురుషుల 75 కేజీల సెమీ ఫైనల్లో భారత బాక్సర్ వికాస్ క్రిషన్ యాదవ్ స్టీవెన్.. డానెల్లీ( ఇంగ్లండ్)పై గెలిచి ఫైనల్‌కు చేరాడు. దాంతో కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకుని తుది పోరుకు అర్హత సాధించాడు.. పురుషుల బాక్సింగ్ 69 కేజీల విభాగం సెమీ ఫైనల్లో మనోజ్‌కుమార్ ప్యాట్ మెక్‌కార్మాక్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోవడంతో కాంస్యం చేజిక్కింది. ఇక అంతక ముందు పురుషుల రెజ్లింగ్ 97 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో భారత రెజ్లర్ మౌసమ్ ఖత్రీ రజతం సాధించగా.. 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో భారత మహిళా షూటర్లు తేజస్విని సావంత్ స్వర్ణానికి గురి పెట్టగా, అంజుమ్ రెండు పాయింట్ల తేడాతో రజతం పతకం సొంతం చేసుకొంది. రెజ్లింగ్‌లో 65 కేజీల పురుషుల ఫ్రీ స్టైల్ విభాగంలో భారత రెజ్లర్ బజరంగ్ పునియా బంగారు పతకం సాధించగా.. భారత మహిళా రెజ్లర్ పూజా ధండా ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్నారు. దీంతో భారత్ ఖాతాలో 17 స్వర్ణం, 11 రజతం, 14 కాంస్యలతో 42 పతకాలు చేరాయి. సెమీస్‌లో ఓడిన పురుషుల హాకీ జట్టు ఇక భారత్ పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్లె 2-3 తేడాతో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పొందింది. కాంస్య పతకం కోసం రెండో సెమీఫైనల్లో తలపడే ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్లలో ఓడిన జట్టుతో పోటీపడనుంది. ఇక మహిళల హాకీ జట్టు సైతం కాంస్యం కోసం ఇంగ్లండ్‌తో తలపడనున్న విషయం తెలిసిందే. -
కామన్వెల్త్ గేమ్స్ : మౌసమ్ ఖత్రీకి రజతం
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్ మౌసమ్ ఖత్రీ రజతం సాధించాడు. తొమ్మిదిరోజు పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన ఫైనల్ పోరులో ఖత్రీ ఓటమి పాలై రజతంతో సంతృప్తి చెందాడు. పురుషుల రెజ్లింగ్ 97 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో దక్షిణాఫ్రికాకు చెందిన మార్టిన్ ఎరాస్మస్ చేతిలో 12-2 తేడాతో ఖత్రీ పరాజయం చెందాడు. క్వార్టర్ ఫైనల్లో సెప్రస్ అలెక్సియోస్, సెమీ ఫైనల్లో సోసో తామారౌలను ఓడించి ఫైనల్‌కు చేరిన ఖత్రీ.. తుది పోరులో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ప్రత్యర్థి ఎరాస్మస్కు లొంగిపోయిన ఖత్రీ రన్నరప్‌గా నిలిచి రజతంతో సరిపెట్టుకున్నాడు. 2010 ఆసియన్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన ఖత్రీ.. గతేడాది జరిగిన కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో రజతాన్ని సాధించాడు. ఇదిలా ఉంచితే, కామన్వెల్త్ గేమ్స్‌లో ఇప్పటివరకూ భారత్ 39 పతకాలు సాధించగా.. అందులో 17 స్వర్ణాలు, 10 రజతాలు, 12 కాంస్య పతకాలు ఉన్నాయి. -
భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్‌లో తొమ్మిదో రోజు భారత్ స్వర్ణాల వేట కొనసాగుతోంది. భారత రెజ్లర్ బజరంగ్ పునియా భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేర్చారు. రెజ్లింగ్‌లో 65 కేజీల పురుషుల ఫ్రీ స్టైల్ విభాగంలో భారత రెజ్లర్ బజరంగ్ పునియా బంగారు పతకం సాధించారు. దీంతో భారత్ స్వర్ణాల సంఖ్య 17కు చేరుకుంది. ప్రత్యర్థి వేల్స్‌కు చెందిన ఛారిగ్ కేన్ మీద 10-0 పాయింట్ల తేడాతో రెజ్లర్ పునియా ఘన విజయం సాధించారు. రజతం నెగ్గిన పూజా భారత మహిళా రెజ్లర్ పూజా ధండా రజతం నెగ్గారు. 57 కేజీల ఫ్రీ స్టైల్ విభాగం ఫైనల్లో ఓటమి చెందడంతో ఆమె రజతంతో సరిపెట్టుకున్నారు. స్వర్ణం కోసం ఆమె చేసిన పోరాటం ఆకట్టుకుంది. మరోవైపు నేటి ఉదయం 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో భారత మహిళా షూటర్లు తేజస్విని సావంత్ స్వర్ణం నెగ్గగా, అంజుమ్ రెండు పాయింట్ల తేడాతో రజతం పతకం సాధించారు. మరో భారత షూటర్ అనీష్ భన్వాలా 15 ఏళ్ల వయసులోనే చరిత్ర సృష్టించారు. 25 మీటర్ల రాపిడ్ పిస్టల్ విభాగంలో స్వర్ణం అందించాడు. ఇప్పటివరకూ భారత్ 37 పతకాలు సాధించగా.. అందులో 17 స్వర్ణాలు, 9రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. భారత రెజ్లర్ పూజ -
వరుసగా మూడో కామన్వెల్త్లో స్వర్ణం
-
వరుసగా మూడో కామన్వెల్త్లో స్వర్ణం
గోల్డ్‌కోస్ట్ : ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల వేట కొనసాగిస్తున్నారు. భారత రెజ్లర్ సుశీల్ కుమార్ వరుసగా మూడో కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించారు. గురువారం జరిగిన పురుషుల 74 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో పోటీపడిన రెజ్లర్ సుశీల్ భారత్ ఖాతాలో బంగారు పతకాన్ని చేర్చారు. స్వర్ణం కోసం జరిగిన పోరులో దక్షిణాఫ్రికాకు చెందిన రెజ్లర్ బోథాను మట్టికరిపించిన సుశీల్ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. దీంతో భారత్ స్వర్ణాల సంఖ్య 14కి చేరింది. కామన్వెల్త్ గేమ్స్ ఎనిమిదో రోజు భారత్ రెండు స్వర్ణాలు, ఓ రజతం, కాంస్యం నెగ్గింది. అందులో నాలుగు రెజ్లింగ్‌లో రాగా, షూటింగ్లో రజతం వచ్చింది. అంతకుముందు రెజ్లర్ రాహుల్ ఆవారే పరుషుల 57 కేజీల విభాగంలో భారత్‌కు స్వర్ణాన్ని అందించిన విషయం తెలిసిందే. కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. 14 స్వర్ణాలు, 6 రజతాలు, 9 కాంస్యాల కలిపి మొత్తం 29 పతకాలను భారత్ సాధించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 2010- ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం 2014- గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం 2018- ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో 74 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో స్వర్ణం -
పసిడి పోరుకు మేరీకోమ్
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా బాక్సర్ మేరీకోమ్ పంచ్ అదిరింది. బుధవారం జరిగిన సెమీ ఫైనల్లో మేరీకోమ్ 5-0 తేడాతో శ్రీలంక బాక్సర్ అనూష దిల్రుక్షిపై గెలిచి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఫలితంగా మేరీకోమ్ రజత పతకం ఖాయం చేసుకుంది. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో ఆడుతున్న మేరీకోమ్ మహిళల 48 కేజీల కేటగిరీలో భాగంగా మొత్తం ఐదు రౌండ్లు పాటు జరిగిన సెమీస్‌లో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. మేరీకోమ్ 30-27, 30-27, 30-27, 30-27, 30-27 తేడాతో అనూష దిల్రుక్షిపై గెలుపొంది ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగే పసిడి పోరులో ఉత్తర ఐర్లాండ్ క్రిస్టినా ఓ హరాతో మేరీకోమ్ తలపడనుంది. -
కామన్వెల్త్ గేమ్స్: పసిడి సాధించిన హీనా
-
కామన్వెల్త్ గేమ్స్: పసిడి సాధించిన హీనా
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పసిడి పతకాల జోరు కొనసాగుతోంది. ఆరో రోజు ఈవెంట్లో భాగంగా మంగళవారం మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత స్టార్ షూటర్ హీనా సిద్దు స్వర్ణం కైవసం చేసుకుంది. 38 రికార్డు స్కోర్ నమోదు చేయడంతో హీనాకు పసిడి ఖాయమైంది. ఇప్పటికే 10మీటర్ల విభాగంలో హీనా రజతం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కామన్వెల్త్ 2018లో భారత్‌కి రెండు పతకాలు అందించిన తొలి క్రీడాకారిణిగా హీనా సిద్దూ రికార్డుకెక్కింది. దీంతో భారత్ స్వర్ణాల సంఖ్య 11కు చేరగా 4 రజతాలు, 5 కాంస్యాలతో మొత్తం మెడల్స్ సంఖ్య 20కి చేరింది. ప్రస్తుతం భారత్ పతకాల జాబితాలో మూడోస్థానంలో కొనసాగుతోంది. -
కామన్వెల్త్ : బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర
-
కామన్వెల్త్ : బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఈవెంట్లో భారత్ స్వర్ణం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 3-1 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ మలేసియాను ఓడించి పసిడిని సొంతం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు ఇది తొలి స్వర్ణం. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సాత్విక్ జోడిలు గెలుపొంది భారత్ విజయంలో ముఖ్య భూమిక పోషించారు. అంతకుముందు సెమీ ఫైనల్లో సింగపూర్‌పై విజయం సాధించి తుది పోరుకు చేరిన భారత బ్యాడ్మింటన్ టీమ్.. అదే ఊపును ఫైనల్లో కూడా కొనసాగించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో అశ్విన్ పొన్నప్ప-సాత్విక్ జోడి 21-14, 21-14, 21-15 తేడాతో చాన్ పెంగ్ సూన్-గో లి యింగ్ ద్వయంపై గెలిచి ఆధిక్యం సాధించగా, ఆపై శ్రీకాంత్ 21-17, 21-14 తో చాంగ్ లీపై విజయం సాధించాడు. దాంతో భారత్‌కు 2-0తో స్పష్టమైన ఆధిక్యం లభించింది. కాగా, పురుషుల డబుల్స్‌లో భారత్‌కు ఓటమి పాలైంది. సాత్విక్-చిరాగ్ జోడి 15-21, 19, 21తేడాతో పరాజయం చెందింది. దాంతో భారత్ ఆధిక్యం 2-1కు తగ్గింది. ఇక చివరి మ్యాచ్‌లో భాగంగా మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21-11,19-21, 21-9 తేడాతో చీహ్‌పై గెలుపును సాధించింది. తొలి గేమ్‌ను గెలిచిన సైనా, రెండో గేమ్‌ను చేజార్చుకుంది. కాగా, కీలకమైన ఆఖరి గేమ్‌లో పుంజుకున్న సైనా.. ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఆఖరి గేమ్‌ను 21-9 తేడాతో గెలుచుకున్న సైనా నెహ్వాల్ భారత్‌కు స్వర్ణాన్ని ఖాయం చేసింది. ఇది భారత్‌కు 10వ స్వర్ణం. కాగా, పతకాల సంఖ్య 19కు చేరింది. -
కామన్వెల్త్ గేమ్స్: భారత్ పసిడి జోరు.!
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. వరుసగా ఐదోరోజు భారత అథ్లేట్స్ పతకాల వేట కొనసాగిస్తున్నారు. పురుషుల డబుల్స్ టేబుల్ టెన్నిస్( టీటీ)లో భారత్ బృందం అచంట శరత్, సాతియన్ జ్ఞానశేఖరన్, హర్మీత్ దేశాయ్ స్వర్ణపతకం సాధించారు. టీమ్ ఈవెంట్లో భాగంగా సోమవారం నైజీరియాతో జరిగిన ఫైనల్లో భారత్ 3-0 తేడాతో విజయం సాధించి పసిడిని సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో అచంట శరత్ కమల్ 4-11, 11-5, 11-4, 11-9 లతేడాతో బోడే అబియోడన్‌ను ఓడించడంతో భారత్‌కు ఆధిక్యం లభించింది. రెండో గేమ్‌లో సత్యన్ జ్ఞానశేఖర్ 10-12, 11-3, 11-3, 11-4 తేడాతో సెగన్ టోరిలియోపై నెగ్గడంతో భారత్ 2-0తో పై చేయి సాధించింది. ఇక మూడో గేమ్ డబుల్స్‌లో జ్ఞానశేఖరన్, హర్మీత్ దేశాయ్‌ల జోడి 11-8,11-5,11-3ల తేడాతో ఓలాజిడ్ ఓమాతియో, అబియోడన్ జంటను ఓడించడంతో భారత్‌కు స్వర్ణం ఖాయమైంది. దీంతో భారత స్వర్ణాల సంఖ్య 9కి చేరగా పతకాల సంఖ్య 18కి చేరింది. ఇప్పటివరకూ 9 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్య పతకాలు కొల్లగొట్టిన భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. నేటి ఉదయం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు చెందిన జీతూరాయ్ స్వర్ణం గెలుచుకోగా, ఓమ్ ప్రకాశ్ మితర్వాల్ కాంస్యంతో సాధించిన విషయం తెలిసిందే. -
షూటింగ్: భారత మహిళల గురి అదుర్స్!
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. వరుసగా ఐదోరోజు భారత ఆటగాళ్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత మహిళా షూటర్లు రజతం, కాంస్య పతకాలు సాధించారు. మెహులి ఘోష్ రజతం నెగ్గగా, అదే విభాగంలో అపూర్వి చండేలా కాంస్యం కైవసం చేసుకున్నారు. టాప్ పొజిషన్లో నిలిచిన సింగపూర్‌కు చెందిన లిండ్సే వెలోసో స్వర్ణం అందుకున్నారు. ఇప్పటివరకూ 8 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్య పతకాలు కొల్లగొట్టిన భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. నేటి ఉదయం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు చెందిన జీతూరాయ్ స్వర్ణం గెలుచుకోగా, ఓమ్ ప్రకాశ్ మితర్వాల్ కాంస్యంతో సాధించిన విషయం తెలిసిందే. -
కామన్వెల్త్లో భారత్ గోల్డెన్ రన్!
గోల్డ్‌కోస్ట్: ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. తాజాగా భారత షూటర్ జీతు రాయ్ 10మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో స్వర్ణపతకాన్ని సాధించాడు. సోమవారం జరిగిన ఈ పోటీల్లో రికార్డు పాయింట్లతో అతను గోల్డ్ మెడల్‌ను కొల్లగొట్టాడు. కాగా, ఇదే పోటీలో మరో భారత షూటర్ ఓంప్రకాశ్ మిథర్వాల్ కాంస్యం పతకాన్ని సాధించాడు. సోమవారం ఉదయం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్ పోటీలో 235.1 పాయింట్లు సాధించి.. జితు రాయ్ మొదటిస్థానాన్ని సాధించగా.. ఆస్ట్రేలియా షూటర్ కెర్రీ బెల్ 233.5 పాయింట్లతో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 214.3 పాయింట్లతో ఓంప్రకాశ్ కాంస్యాన్ని సాధించాడు. దీంతో భారత్ ఎనిమిది స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో పతకాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 84 పతకాల (31 స్వర్ణాలు, 26 రజతాలు, 28 కాంస్యాలు)తో మొదటిస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ 48 పతకాల(19 స్వర్ణాలు, 19 రజతాలు, 10 కాంస్యాలు)తో రెండోస్థానంలో ఉంది. -
రజతం సాధించిన భారత వెయిట్‌లిఫ్టర్
గోల్డ్‌కోస్ట్ : ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తన హవా కొనసాగిస్తోంది. సోమవారం (భారత కాలమానం ప్రకారం) ఉదయం భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. భారత వెయిట్‌లిఫ్టర్ ప్రదీప్ సింగ్ రజతం సాధించారు. 105 కేజీల విభాగంలో పాల్గొన్న ప్రదీప్ 352 కేజీల బరువెత్తి రెండో స్థానంలో నిలిచి భారత్ ఖాతాలో మరో పతకం చేర్చారు. స్నాచ్‌లో 152 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 200 కేజీలు ఎత్తారు. సమోవాకు చెందిన సనేలే మావో 360 కేజీలు ఎత్తి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన ఓయిన్ బాక్సాల్ 351 కేజీల బరువులెత్తి మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. దీంతో ఇప్పటివరకూ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఏడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలు సాధించింది. -
చక్ దే ఇండియా.. వైరల్ వీడియో
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు శుభారంభం ఇచ్చారు. అయితే మరింత మంది భారత అథ్లెట్లు, క్రీడాకారులు పతకాలు సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాలని సగటు భారతీయుడు కోరుకుంటున్నాడు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. మన్దీప్ జంగ్రాకు, ఇతర భారత క్రీడాకారులకు మన మద్దతు తెలుపుదాం అంటూ 'ద బ్యాక్ బెంచర్స్' ఫేస్బుక్ పేజీలో పోస్ట్ అయిన వీడియో వైరల్ అవుతోంది. కామన్వెల్త్ గేమ్స్ 2018లో భారత ప్లేయర్లు మరిన్ని పతకాలు సాధించాలంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. భారత ప్లేయర్లు తొలి రోజే ఒక స్వర్ణం, ఒక రజతం సాధించారు. తనపై పెట్టుకున్న ఆశలను, అంచనాలను నిజంచేస్తూ మహిళల 48 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ మీరాబాయి చాను విజేతగా నిలవగా, పురుషుల 56 కేజీల విభాగంలో గురురాజా 249కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాడు. 53 కేజీల విభాగంలో లిఫ్టర్ సంజిత చాను 192 కేజీ బరువును ఎత్తి పసిడిని అందించారు.