అశ్విని పొన్నప్ప-సాత్విక్ జోడి
గోల‍్డ్‌కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 3-1 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ మలేసియాను ఓడించి పసిడిని సొంతం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ గేమ్స్ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు ఇది తొలి స్వర్ణం. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, మిక్స్‌డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సాత్విక్ జోడిలు గెలుపొంది భారత్ విజయంలో ముఖ్య భూమిక పోషించారు. అంతకుముందు సెమీ ఫైనల్లో సింగపూర్‌పై విజయం సాధించి తుది పోరుకు చేరిన భారత బ్యాడ్మింటన్ టీమ్.. అదే ఊపును ఫైనల్లో కూడా కొనసాగించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.
తొలి మ్యాచ్‌లో అశ్విన్ పొన్నప్ప-సాత్విక్ జోడి 21-14, 21-14, 21-15 తేడాతో చాన్ పెంగ్ సూన్-గో లి యింగ్ ద్వయంపై గెలిచి ఆధిక్యం సాధించగా, ఆపై శ్రీకాంత్ 21-17, 21-14 తో చాంగ్ లీపై విజయం సాధించాడు. దాంతో భారత్‌కు 2-0తో స్పష్టమైన ఆధిక్యం లభించింది. కాగా, పురుషుల డబుల్స్‌లో భారత్‌కు ఓటమి పాలైంది. సాత్విక్-చిరాగ్ జోడి 15-21, 19, 21తేడాతో పరాజయం చెందింది. దాంతో భారత్ ఆధిక్యం 2-1కు తగ్గింది. ఇక చివరి మ్యాచ్‌లో భాగంగా మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21-11,19-21, 21-9 తేడాతో చీహ్‌పై గెలుపును సాధించింది. తొలి గేమ్‌ను గెలిచిన సైనా, రెండో గేమ్‌ను చేజార్చుకుంది. కాగా, కీలకమైన ఆఖరి గేమ్‌లో పుంజుకున్న సైనా.. ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఆఖరి గేమ్‌ను 21-9 తేడాతో గెలుచుకున్న సైనా నెహ్వాల్ భారత్‌కు స్వర్ణాన్ని ఖాయం చేసింది. ఇది భారత్‌కు 10వ స‍్వర్ణం. కాగా, పతకాల సంఖ్య 19కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment