స్వర్ణం గెలిచిన టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లు
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. వరుసగా ఐదోరోజు భారత అథ్లేట్స్ పతకాల వేట కొనసాగిస్తున్నారు. పురుషుల డబుల్స్ టేబుల్ టెన్నిస్( టీటీ)లో భారత్ బృందం అచంట శరత్, సాతియన్ జ్ఞానశేఖరన్, హర్మీత్ దేశాయ్ స్వర్ణపతకం సాధించారు. టీమ్ ఈవెంట్‌లో భాగంగా సోమవారం నైజీరియాతో జరిగిన ఫైనల్లో భారత్ 3-0 తేడాతో విజయం సాధించి పసిడిని సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో అచంట శరత్ కమల్ 4-11, 11-5, 11-4, 11-9 లతేడాతో బోడే అబియోడన్‌ను ఓడించడంతో భారత్‌కు ఆధిక్యం లభించింది. రెండో గేమ్‌లో సత్యన్ జ్ఞానశేఖర్ 10-12, 11-3, 11-3, 11-4 తేడాతో సెగన్ టోరిలియోపై నెగ్గడంతో భారత్ 2-0తో పై చేయి సాధించింది. ఇక మూడో గేమ్ డబుల్స్‌లో జ్ఞానశేఖరన్, హర్మీత్ దేశాయ్‌ల జోడి 11-8,11-5,11-3ల తేడాతో ఓలాజిడ్ ఓమాతియో, అబియోడన్ జంటను ఓడించడంతో భారత్‌కు స్వర్ణం ఖాయమైంది. దీంతో భారత స్వర్ణాల సంఖ్య 9కి చేరగా పతకాల సంఖ్య 18కి చేరింది.
ఇప్పటివరకూ 9 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్య పతకాలు కొల్లగొట్టిన భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. నేటి ఉదయం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు చెందిన జీతూరాయ్ స్వర్ణం గెలుచుకోగా, ఓమ్ ప్రకాశ్ మితర్వాల్ కాంస్యంతో సాధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment