
మేరికోమ్
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్-2018 ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ ముగింపు వేడుకల్లో భారత అథ్లెట్ల బృందానికి బాక్సింగ్ దిగ్గజం మేరికోమ్ నేతృత్వం వహించారు. త్రివర్ణపతకాన్ని చేతపట్టుకోని నడుస్తూ.. కామన్వెల్త్ గేమ్స్‌కు ముగింపు పలికారు. ఈ 21వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పంట పండింది. 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యలను భారత అథ్లెట్లు సొంతం చేసుకున్నారు. మొత్తం 66 పతకాలతో భారత్ మూడోస్థానంలో నిలిచింది. 198 పతకాలతో(80 స్వర్ణాలు,59 రజతాలు, 59 కాంస్యాలు) ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉండగా 136 పతకాలతో(45 స్వర్ణాలు, 45 రజాతాలు, 46 కాంస్యలతో) ఇంగ్లండ్ రెండోస్థానంలో నిలిచింది.
చివరిదైన11వ రోజు భారత్ 1 స్వర్ణం, 4 రజతాలు, 1 కాంస్యలతో ఏడు పతకాలను సొంతం చేసుకుంది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో 21-18, 23-21 తేడాతో పీవీ సింధుపై నెగ్గిన సైనా నెహ్వాల్‌కు బంగారు పతకం సొంతమైంది. ఇక ఓడిన పీవీ సింధు రజతం సాధించారు. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో శ్రీకాంత్ రజత పతకం గెలుపొందారు. టేబుల్ టెన్నిస్‌లో శరత్ కమల్ కాంస్య పతకం సాధించగా.. స్క్వాష్ మహిళల డబుల్స్ ఫైనల్‌లో భారత్ స్టార్లు జోష్నా చిన్నప్ప, దీపికా పల్లికల్ కార్తీక్‌లు రజత పతకాలు గెలుపొందారు. ఇక పతకాల జాబితాలో కెనడా 82, న్యూజిలాండ్ 46, దక్షిణాఫ్రికా 37, వాలేస్ 36, స్కాట్లాండ్ 44, నైజిరియా 24, సైప్రస్ 14, జమైకా 27, మలేసియా 24, కెన్యా 17, నార్త్ ఐర్లాండ్ 12 పతకాలు సాధించాయి.