గోల్డ్‌కోస్ట్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారతీయ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. అద్భుతంగా రాణిస్తూ వరుసగా పతకాలు సాధిస్తున్నారు. శనివారం భారత్ ఖాతాలో మరిన్ని స్వర్ణాలు వచ్చి చేరాయి. ఈ రోజు భారీగా పతకాలు దక్కడంతో భారత్ పతకాల విషయంలో అర్ధ సెంచరీని దాటింది. మెడల్స్ పట్టికలో ప్రస్తుతం భారత్ 50 పతకాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. భారత్ ఖాతాలో 23 స్వర్ణాలు, 13 రజతాలు, 15 కాంస్య పతకాలు ఉన్నాయి.
సీనియర్ బాక్సింగ్ క్రీడాకారిణి మేరికోమ్ మరోసారి సత్తా చాటింది. తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ ఆమె స్వర్ణ పతకాన్ని సాధించింది. 45-48 కేజీల విభాగంలో ఫైనల్‌లో ప్రత్యర్థిని మట్టికరిపించి ఆమె భారత్‌కు గోల్డ్ మెడల్ అందించింది. మహిళల 50 కిలోల ఫ్రీస్టయిల్ పోటీల్లో రెజ్లర్ వినేష్ ఫొగట్, 125 కేజీల పురుషుల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో రెజ్లర్ సుమిత్ గోల్డ్ మెడళ్లను సొంతం చేసుకున్నారు. జావెలింగ్ త్రో విభాగంలో నీరజా చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించారు.
బాక్సర్ గౌరవ్ సోలంకీ కూడా సత్తా చాటాడు. పురుషుల 52 కిలోల విభాగంలో ప్రత్యర్థిని ఓడించి స్వర్ణపతకాన్ని సొంతం చేసుకున్నాడు. షూటర్ సంజీవ్ రాజ్‌పుత్ సైతం కామన్‌వెల్త్ క్రీడల్లో భారత పతకాన్ని రెపరెపలాడించాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3పొజిషన్స్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. రియో ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించిన రెజ్లర్ సాక్షి మాలిక్ మరోసారి సత్తా చాటి.. కామన్‌వెల్త్ క్రీడల్లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. అటు బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజాలు సైనా నెహ్వాల్, పీవీ సింధు ఫైనల్‌కు చేరడంతో స్వర్ణ, రజత పతకాలు భారత్ ఖాతాలో చేరడం ఖాయంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment