ఒక్కసారి మైండ్‌లో ఫిక్స్‌ అయితే..నా భర్త కూడా ఆపలేరు | Mary Kom Reveals The Secret To Her Success | Sakshi
Sakshi News home page

ఒక్కసారి మైండ్‌లో ఫిక్స్‌ అయితే..నా భర్త కూడా ఆపలేరు

Published Sat, Apr 14 2018 8:18 PM | Last Updated on Sat, Apr 14 2018 8:21 PM

Mary Kom Reveals The Secret To Her Success - Sakshi

కామన్వెల్త్‌ క్రీడల్లో సాధించిన స్వర్ణ పతకంతో మేరీకోమ్‌ (ఫైల్‌ ఫొటో)

గోల్డ్‌కోస్ట్‌ : గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్‌ క్రీడల్లో పసిడి పతకం సాధించిన భారత మహిళా బాక్సర్‌ మేరీకోమ్‌ తన విజయ రహస్యాన్ని వెల్లడించారు. ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం ద్వారానే 35 ఏళ్ల వయస్సులోనూ తాను రాణించగలుగుతున్నానని పేర్కొన్నారు. 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం నెగ్గిన తర్వాత మేరీకోమ్‌ మీడియాతో మాట్లాడారు. ప్రత్యర్థిని నిలువరించేందుకు ముందుగానే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటానని.. తద్వారా సులువుగా విజయం సాధించే అవకాశం ఉంటుందన్నారు. గాయాల బెడద లేకపోవడం తనకు కలిసొచ్చే అంశమని తెలిపారు.

ఒక్కసారి మైండ్‌లో ఫిక్స్‌ అయితే..
ఈవెంట్లు లేని సమయంలోనూ ప్రాక్టీస్‌ చేస్తూనే ఉంటానని క్రీడల పట్ల తనకున్న నిబద్ధతని చాటుకున్నారు. బౌట్‌లు లేని సమయంలోనూ ఇలా కష్టపడడం అవసరమా అంటూ తన భర్త ప్రేమగా కోప్పడతారని.. అయినప్పటికీ ప్రాక్టీస్‌ చేయకుండా ఆయన నన్ను ఆపలేరని సరదాగా వ్యాఖ్యానించారు. ఒక్కసారి మైండ్‌లో ఫిక్స్‌ అయిపోతే అనుకున్న పనిని పూర్తిచేసేదాకా ఎవరి మాటా విననన్నారు. 2020 ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొనే అంశంపై ప్రశ్నించగా.. ఆ విషయంపై ఇప్పుడే ఏం చెప్పలేనన్నారు. ప్రస్తుతం 48 కేజీల బరువున్న తాను ఒలింపిక్స్‌లో 51 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉంటుందని, అప్పటికీ ఫిట్‌నెస్‌ను ఇలాగే కాపాడుకోగలిగితే తప్పక పాల్గొంటానని పేర్కొన్నారు.    

ముగ్గురు పిల్లలకు తల్లైన తర్వాత కూడా పతకాల వేట కొనసాగిస్తున్న మేరీకోమ్‌ ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా‌ నిలిచిన విషయం తెలిసిందే. రియో ఒలింపిక్స్‌లో బ్రాంజ్‌ మెడల్‌ సాధించిన మేరీకోమ్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణ పతకం నెగ్గిన భారత తొలి మహిళా బాక్సర్‌గా రికార్డు సృష్టించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement