న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల ప్రదర్శన దేశాన్ని గర్వపడేలా చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నాలుగు మెడల్స్ సాధించిన టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా సహా.. సైనా, సింధు తదితర క్రీడాకారులను ఆయన ప్రశంసించారు. ఆటగాళ్ల నిరంతర శ్రమకు ప్రతిఫలమే ఈ ఫలితాలన్నారు. మాసాంతపు మన్‌కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జాతినుద్దేశించి మోదీ మాట్లాడారు.
వచ్చే ఏడాది అక్టోబర్ 2న మహాత్ముని 150వ జయంతి ఉత్సవాలకు ముందే.. దేశ స్వచ్ఛతపై నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు యువత నడుం బిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఇందుకోసం వేసవి సెలవుల్లో ప్రభుత్వం చేపట్టిన ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. నీటి సంరక్షణ, వాజ్‌పేయి జై విజ్ఞాన్ నినాదం తదితర అంశాలపై మోదీ మాట్లాడారు. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా మహ్మద్ ప్రవక్తను, బుద్ధ పౌర్ణిమ నేపథ్యంలో గౌతమ బుద్ధుడిని గుర్తుచేసుకున్నారు.
క్రీడాకారులకు అభినందనలు
కామన్వెల్త్ క్రీడల్లో భారత పతాకాన్ని రెపరెపలాడించిన క్రీడాకారులందరికీ ప్రధాని అభినందనలు తెలిపారు. మరీ ముఖ్యంగా ఎక్కువ పతకాలు సాధించిన మహిళా క్రీడాకారులు చూపిన పోరాటపటిమను ప్రధాని ప్రశంసించారు. పతకాలు సాధించిన తర్వాత త్రివర్ణపతాకాన్ని భుజాన వేసుకుని జాతీయగీతాలాపన వింటుంటే గర్వంగా ఉంటుందన్నారు. ఇదే అభిప్రాయాన్ని పలువురు క్రీడాకారులు తనతో పంచుకున్నారన్నారు.
బ్యాడ్మింటన్ ఫైనల్స్‌లో ఇద్దరు భారతీయ క్రీడాకారిణుల (సైనా నెహ్వాల్, పీవీ సింధు) మధ్యే పోటీ నెలకొన్నా.. మ్యాచ్‌పై ఎంతో ఆసక్తి పెరిగిందన్నారు. ‘గత నెల మన్‌కీ బాత్‌లో దేశ ప్రజలందరినీ.. ‘ఫిట్ ఇండియా’లో పాల్గొనాలని కోరాను. అనారోగ్యం దరిచేరకుండా నిరోధించేందుకు ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. సినీనటుడు అక్షయ్ కుమార్ సహా చాలా మంది.. ఫిట్‌నెస్ అవసరాన్ని తెలుపుతూ వీడియోలు, ఫొటోలు పోస్టు చేశారు. అందరికీ కృతజ్ఞతలు’ అని మోదీ తెలిపారు. ఫిట్‌గా ఉండటం, మానసిక, శారీరక సంతులకోసం యోగా చాలా ప్రత్యేకమైందన్నారు.
రంజాన్, బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు
ఉపవాసం ఉండటం ద్వారా ఎదుటివారి ఆకలిని అర్థం చేసుకోవచ్చని, దాహంగా ఉన్నప్పుడే ఇతరుల దాహం అర్థమవుతుందన్న మహమ్మద్ ప్రవక్త సందేశాన్ని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మే 15నుంచి రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా దేశవాసులందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధ భగవానుడు శాంతి, సామరస్యం, సోదరభావాన్ని బోధించారని.. ఈ విలువలే నేటి ప్రపంచానికి చాలా అవసరమన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కూడా తన ఆలోచనల్లో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పదాలను కూడా బుద్ధ భగవానుడి బోధనలనుంచే గ్రహించినట్లు చెప్పిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. మే 29న బుద్ధ పౌర్ణిమ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1998లో మే 11న (బుద్ధ పౌర్ణిమ) నాటి ప్రధాని వాజ్‌పేయి నిర్వహించిన అణుపరీక్షలను మోదీ గుర్తుచేశారు. నవభారత నిర్మాణం కోసం జై జవాన్, జై కిసాన్‌లతోపాటు వాజ్‌పేయి సూచించిన ‘జై విజ్ఞాన్’ నినాదంలోని అంతరార్థాన్ని నేటి యువత గుర్తించాలని ప్రధాని కోరారు. మే 7న రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు.
స్వచ్ఛత కోసం ఇంటర్న్‌షిప్
వేసవి సెలవుల్లో ‘స్వచ్ఛ భారత్’లో భాగంగా నిర్వహిస్తున్న ‘సమ్మర్ ఇంటర్న్‌షిప్–2018’ కార్యక్రమంలో పాల్గొనాలని యువతను కోరారు. తద్వారా సమాజంతో మమేకమవటంతోపాటు సానుకూల మార్పు తీసుకురావటంలో భాగస్వాములం అవుతామన్నారు. ఇందులో పాల్గొన్న యువతకు సర్టిఫికెట్లు ఇస్తారని.. ఇందులో రాణించిన వారికి యూజీసీ రెండు క్రెడిట్ పాయింట్లు కూడా ఇస్తుందన్నారు.
‘మైగవ్’ యాప్ ద్వారా ఇంటర్న్‌షిప్‌కు రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. మన పూర్వీకులు కూడా జల సంరక్షణను ఓ ఉద్యమంలా చేపట్టారని.. పలు దేవాలయాల్లో ఇప్పటికీ ఈ శాసనాలను గమనించవచ్చన్నారు. మూడున్నరేళ్లలో జల సంరక్షణకు రూ. 35వేల కోట్లు వెచ్చించామన్నారు. దీని ద్వారా కోటిన్నర ఎకరాల భూమికి మేలు జరిగిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment