వెయిట్‌లిఫ్టర్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే మను భాకర్... జీతూ రాయ్ పసిడి పతకాలు సొంతం చేసుకోగా... మూడో రోజు హీనా సిద్ధూ భారత్‌కు మరో బంగారు పతకాన్ని అందించింది. పారా పవర్‌లిఫ్టింగ్‌లో సచిన్ చౌధరీ కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. ఓవరాల్‌గా పోటీల ఆరోరోజు భారత్ ఖాతాలో ఒక స్వర్ణం, ఒక కాంస్యం చేరింది. పతకాల వేటలో జోరు తగ్గినా పట్టికలో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది.
గోల్డ్‌కోస్ట్: సత్తా ఉన్నా మెగా ఈవెంట్స్‌లో స్వర్ణం సాధించడంలో గురి తప్పుతుందని తనపై వస్తున్న విమర్శలకు ఎట్టకేలకు హీనా సిద్ధూ తన ప్రదర్శనతోనే జవాబు ఇచ్చింది. కామన్వెల్త్ గేమ్స్‌లో ఇన్నాళ్లు లోటుగా ఉన్న వ్యక్తిగత పసిడి పతకాన్ని మంగళవారం ఆమె తన ఖాతాలో వేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో రజతం నెగ్గిన హీనా సిద్ధూ... 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో పసిడి పతకంతో మెరిసింది. ఫైనల్లో హీనా 38 పాయింట్లు స్కోరు చేసి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకుంది. ఫైనల్లో పోటీపడిన భారత్‌కే చెందిన మరో షూటర్ అన్ను సింగ్ 15 పాయింట్లతో ఆరో స్థానానికి పరిమితమైంది. ఎలీనా గలియబోవిచ్ (ఆస్ట్రేలియా–35 పాయింట్లు) రజతం... అలా సజానా అజహరి (మలేసియా–26 పాయింట్లు) కాంస్యం గెలిచారు. క్వాలిఫయింగ్‌లో అన్ను 584 పాయింట్లతో రెండో స్థానంలో, హీనా 579 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు.
దంత వైద్య విద్య అభ్యసించిన హీనాకు ఆమె భర్త రోనక్ పండిత్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 2006 మెల్‌బోర్న్ కామన్వెల్త్ గేమ్స్‌లో రోనక్ 25 మీటర్ల పిస్టల్ పెయిర్స్ విభాగంలో స్వర్ణం సాధించడం విశేషం. భారీ అంచనాలతో 2016 రియో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన హీనా 20వ స్థానంలో నిలిచింది. 2014 గ్లాస్గో గేమ్స్‌లో ఏడో స్థానాన్ని సంపాదించింది. 2010 ఢిల్లీ గేమ్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో రజతం, పెయిర్స్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది. తాజా ప్రదర్శనతో ఎట్టకేలకు వ్యక్తిగత స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో సీనియర్ షూటర్లు గగన్ నారంగ్, చెయిన్ సింగ్ ఫైనల్‌కు చేరినా పతకం మాత్రం నెగ్గలేకపోయారు. చెయిన్ సింగ్ 204.8 పాయింట్లతో నాలుగో స్థానంలో, గగన్ నారంగ్ 142.3 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు.
తొలి లక్ష్యం పూర్తి...
హాకీలో భారత పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్ బెర్త్‌లు ఖాయం చేసుకొని తొలి లక్ష్యాన్ని పూర్తి చేశాయి. మలేసియాతో జరిగిన పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 2–1తో గెలిచింది. రెండు విజయాలు, ఒక ‘డ్రా’తో భారత్ ఏడు పాయింట్లతో ఇంగ్లండ్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే సెమీస్ చేరిన ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య బుధవారం జరిగే మ్యాచ్ ద్వారా గ్రూప్ టాపర్ ఎవరో తేలుతుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 1–0తో గెలిచింది. దాంతో తొమ్మిది పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచిన భారత్, ఇంగ్లండ్ సెమీఫైనల్‌కు చేరాయి.
అయ్యో... అనస్!
అథ్లెటిక్స్‌లో పురుషుల 400 మీటర్ల ఫైనల్లో మొహమ్మద్ అనస్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఫెనల్ రేసును అనస్ 45.31 సెకన్లలో ముగించి కొత్త జాతీయ రికార్డును సృష్టించినా పతకం మాత్రం నెగ్గలేకపోయాడు. మరోవైపు మహిళల 400 మీటర్ల విభాగంలో హిమా దాస్ సెమీఫైనల్లో ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరింది. తద్వారా ఈ గేమ్స్ చరిత్రలో ఈ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.
రెండో రౌండ్‌లో సాత్విక్–అశ్విని జంట
బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్ వ్యక్తిగత ఈవెంట్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జంట శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో ఈ భారత జోడీ 21–9, 21–5తో స్టువర్ట్–చోల్ లీ ద్వయంపై గెలిచింది. సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన శ్రీకాంత్, ప్రణయ్, సైనా, సింధు బుధవారం జరిగే రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో పోటీపడతారు.
హుసాముద్దీన్‌కు పతకం ఖాయం
బాక్సింగ్‌లో ఐదుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్‌కు చేరడంద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకన్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (56 కేజీలు) 5–0తో ఎవరిస్టో ములెంగా (జాంబియా)పై... అమిత్ (49 కేజీలు) 4–1తో అకీల్ అహ్మద్ (స్కాట్లాండ్)పై... మనోజ్ (69 కేజీలు) 4–1తో టెరీ నికోలస్ (ఆస్ట్రేలియా)పై... నమన్ తన్వర్ (91 కేజీలు) 5–0తో ఫ్రాంక్ మసోయి (సమోవా)పై... సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) 4–1తో నైగెల్ పాల్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో)పై గెలిచారు.
►పారా పవర్‌లిఫ్టింగ్‌లో భారత లిఫ్టర్ సచిన్ చౌధరీ ప్లస్ 107 కేజీల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలిచాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ మొత్తం 181 కేజీల బరువెత్తాడు.
Comments
Please login to add a commentAdd a comment