నాలుగేళ్ల క్రితం శ్రీకాంత్ జీవితంలో అనూహ్య ఘటన! అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న శ్రీకాంత్ ఒక రోజు తన బాత్‌రూమ్‌లో అచేతనంగా కనిపించాడు. చాలా సేపటి వరకు దానిని ఎవరూ గుర్తించలేదు. కొద్ది సేపటి తర్వాత అకాడమీ ఉద్యోగులు గుర్తించి అతడిని దగ్గరిలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అది ‘బ్రెయిన్ ఫీవర్’గా తేలింది. అతను కోలుకోవాలని కోచ్ గోపీచంద్, సహచరులు చేసిన ప్రార్థనలు ఫలించి శ్రీకాంత్ ఎట్టకేలకు మృత్యుముఖం నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత కొన్ని టోర్నీల్లో తీవ్రంగా ఇబ్బంది పడిన శ్రీకాంత్ మళ్లీ చెలరేగేందుకు సమయం పట్టింది. అయితే ఈ ఘటన జరిగిన నాటి నుంచి ఇప్పుడు వరల్డ్ నంబర్‌వన్‌గా ఎదగడం వరకు శ్రీకాంత్‌ది అద్భుత ప్రస్థానం. అప్పటి వరకు రెండు గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్స్ మాత్రమే గెలిచిన శ్రీకాంత్ అనంతరం మరింత వేగంగా దూసుకుపోయాడు. కఠోర శ్రమ, శిక్షణతో తనను తాను అత్యుత్తమంగా తీర్చి దిద్దుకున్నాడు. అదే ఏడాది (2014) నవంబర్‌లో ప్రతిష్టాత్మక చైనా ఓపెన్‌ను గెలుచుకోవడంతో శ్రీ జోరు మళ్లీ మొదలైంది. ఫైనల్లో దిగ్గజ ఆటగాడు లిన్ డాన్‌పై సాధించిన గెలుపు కొత్త శ్రీకాంత్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ తర్వాత అతను తిరుగులేని ప్రదర్శనతో దూసుకుపోయాడు. 2015లో ఇండియా ఓపెన్‌తో అతని ఖాతాలో రెండో సూపర్ సిరీస్ టైటిల్ చేరింది. తర్వాతి ఏడాది రియో ఒలింపిక్స్ సమయానికి మంచి ఫామ్‌లో ఉన్నా... క్వార్టర్ ఫైనల్లో లిన్ డాన్ చేతిలో ఓటమి శ్రీకాంత్‌కు పతకావకాశాలను దూరం చేసింది. అయితే మళ్లీ తన ఆటలో లోపాలు సరిదిద్దుకున్న శ్రీకాంత్... 2017లో విశ్వరూపం చూపించాడు. ఏకంగా ఐదు సూపర్ సిరీస్ టోర్నీలలో ఫైనల్ చేరి వాటిలో నాలుగింటిలో విజేతగా నిలిచి అరుదైన ఘనతను లిఖించాడు. ఈ క్రమంలో భారత్ తరఫున పురుషుల సింగిల్స్‌లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. మైదానంలో శ్రీకాంత్ ప్రదర్శనకు కేంద్రం ‘పద్మశ్రీ’తో సత్కరిస్తే... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ పదవినిచ్చి గౌరవించింది. ఇప్పుడు పాతికేళ్ల వయసులో వరల్డ్ నంబర్‌వన్‌గా శిఖరాన నిలిచిన ఈ గుంటూరు అబ్బాయి భవిష్యత్తులో మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయం.
2009లో శ్రీకాంత్ తొలిసారి నా వద్దకు వచ్చిన రోజు బాగా గుర్తుంది. అప్పటికే అతని అన్న నందగోపాల్ నా వద్ద శిక్షణ పొందుతున్నాడు. ఖాళీగా తిరుగుతున్నాడు, ఇతడిని కూడా కాస్త దారిలో పెట్టమంటూ అతని తల్లిదండ్రులు నాతో చెప్పడంతో కోచింగ్ ఇవ్వడం ప్రారంభించాను. అయితే ఆ సమయంలో దేనిపై కూడా ఆసక్తి చూపించకుండా, చాలా సోమరిగా కనిపించేవాడు. మెల్లమెల్లగా మారడం మొదలు పెట్టిన అనంతరం డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ ఆడసాగాడు. కొన్ని చక్కటి విజయాలు కూడా లభించాయి. ఆ సమయంలోనే అతని ప్రతిభను గుర్తించి ప్రత్యేక దృష్టి పెట్టాను. 2012 చివర్లో శ్రీకాంత్‌ను పూర్తిగా సింగిల్స్‌కు పరిమితమయ్యేలా ప్రోత్సహించాను. మంచి ఫలితాలు వస్తున్న సమయంలో డబుల్స్‌ను వదిలేందుకు ఇష్టపడని శ్రీకాంత్ కాస్త అలిగాడు కూడా. అయితే తనలో అసలు సత్తా ఏమిటో తెలుసుకున్న తర్వాత పట్టుదలగా ఆడి దూసుకుపోయాడు. పురుషుల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ చాలా గొప్ప ఘనత. శ్రీకాంత్‌ను ఎంత ప్రశంసించినా తక్కువే. పవర్, అటాకింగ్ శ్రీకాంత్‌కు అతి పెద్ద బలం. కోర్టులో బుర్రకు పదును పెట్టి ఆడటం మరో అదనపు లక్షణం. నంబర్‌వన్ అయ్యాక దానిని నిలబెట్టుకునే క్రమంలో అతనికి ఇతర స్టార్ ఆట గాళ్ల నుంచి గట్టి పోటీ ఎదురు కావడం ఖాయం. అయితే వీటన్నంటిని తట్టుకొని మంచి విజయాలు సాధిస్తాడని నమ్ముతున్నా.
– పుల్లెల గోపీచంద్, భారత కోచ్
Comments
Please login to add a commentAdd a comment