భారత బ్యాడ్మింటన్‌లో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన క్షణం... తెలుగు జాతి క్రీడాభిమానులంతా సగర్వంగా మనవాడని చెప్పుకోగలిగే ఘనత... ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగిన మన కిడాంబి శ్రీకాంత్ ఎందరో దిగ్గజాల వల్ల కానిది సాధ్యం చేసి చూపించాడు. వరుస విజయాలతో సత్తా చాటిన ‘డిప్యూటీ కలెక్టర్’ ఇప్పుడు షటిల్ ప్రపంచంలో శిఖరానికి చేరుకున్నాడు. తాజా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్ తొలిసారి వరల్డ్ నంబర్‌వన్‌గా అవతరిస్తున్నాడు. కంప్యూటరైజ్డ్ ర్యాంకింగ్ ప్రవేశ పెట్టిన తర్వాత పురుషుల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు శ్రీకాంత్ కావడం విశేషం.
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ అభిమానులందరికీ ఆనందం పంచే రోజు వచ్చేసింది. చైనా కోటను బద్దలుకొట్టి మనోళ్లూ ప్రపంచ బ్యాడ్మింటన్‌ను శాసించగలరని చూపించిన శ్రీకాంత్ ఇప్పుడు కొత్త చరిత్ర సృష్టించాడు. గురువారం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య అధికారికంగా ప్రకటించబోయే ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్‌కు నంబర్‌వన్ స్థానం దక్కనుంది. 2017లో ఏకంగా నాలుగు సూపర్ సిరీస్ టోర్నీ విజయాలతో అగ్రస్థానానికి చేరువగా వచ్చిన శ్రీకాంత్ త్రుటిలో ఆ అవకాశం కోల్పోయాడు. అయితే ఆ కల నెరవేరేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. గత ఏడాది నవంబర్ 2న తొలిసారి వరల్డ్ నంబర్–2 స్థానానికి చేరుకున్న శ్రీకాంత్... ఇప్పుడు నంబర్‌వన్ హోదాను ఖాయం చేసుకున్నాడు.
అక్సెల్‌సన్‌ను వెనక్కి తోసి...
ప్రస్తుతం శ్రీకాంత్ ఖాతాలో 76,895 పాయింట్లు ఉన్నాయి. డెన్మార్క్ స్టార్ విక్టర్ అక్సెల్సన్ 77,130 పాయింట్లతో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. వీరిద్దరి మధ్య 235 పాయింట్ల తేడా మాత్రమే ఉంది. బీడబ్ల్యూఎఫ్ నిబంధనల ప్రకారం గత 52 వారాల ప్రాతిపదికన ర్యాంకింగ్ నిర్ణయిస్తారు. గత ఏడాదిలో అత్యధిక పాయింట్లు సాధించిన 10 టోర్నీల ప్రదర్శ నను తీసుకొని గణిస్తారు. గతేడాది ఇదే సమయానికి మలేసియా ఓపెన్ ద్వారా సాధించిన 1660 పాయింట్లు అక్సెల్‌సన్ కోల్పోతాడు. 2018లో ఇప్పటికే జరగాల్సిన ఈ టోర్నీ వాయిదా పడింది. ఫలితంగా శ్రీకాంత్ ముందంజ వేసే అవకాశం లభించింది. మహిళల విభాగంలో భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్ 2015 మార్చిలో తొలిసారి వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచింది. 1980లో భారత దిగ్గజం ప్రకాశ్ పదుకొనే వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచినా.. అప్పటికి అధికారికంగా కంప్యూటరైజ్డ్ ర్యాంకింగ్ వ్యవస్థ లేదు. ఆ సమయంలో అతను సాధించిన వరుస విజయాలను బట్టి ప్రకాశ్‌ను నంబర్‌వన్‌గా గుర్తించారు. శ్రీకాంత్ గురువు, ప్రస్తుత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ 2001లో అత్యుత్తమంగా 5వ ర్యాంక్‌కు చేరుకున్నారు.
తగ్గే అవకాశమూ...
నంబర్‌వన్‌గా శ్రీకాంత్ ఎంత కాలం నిలుస్తాడనేది కూడా ఆసక్తికరం. గతేడాది గెలిచిన నాలుగు సూపర్ సిరీస్‌లు ఇండోనేసియా, ఆస్ట్రేలియన్, డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్‌ల వల్ల అతను అగ్రస్థానానికి చేరుకోగలిగాడు. ఈ ఏడాది వాటన్నింటినీ నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ టోర్నీ ఓడినా అంతే భారీ స్థాయిలో పాయింట్లు కోల్పోతాడు కాబట్టి ర్యాంకింగ్ బాగా వెనక్కి వెళ్లిపోయే ప్రమాదముంది.
అలా మొదలై..
►2011 డిసెంబర్ 15న శ్రీకాంత్ బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి చోటు దక్కించుకున్నాడు. అప్పుడతని ర్యాంక్ 386. తర్వాతి వారమే అది 535కు పడిపోయింది.
►2012 డిసెంబర్ 6న తొలి సారి టాప్–100లోకి. నాడు ర్యాంక్ 81.
►2013 జూన్ 13న తొలిసారి టాప్–50లోకి (44వ ర్యాంక్)
► 2014 నవంబర్ 20న తొలిసారి టాప్–10లోకి (10)
► 179- 89 శ్రీకాంత్ కెరీర్‌లో గెలుపోటములు
►కెరీర్ మొత్తం ప్రైజ్‌మనీ 3 లక్షల 97 వేల డాలర్లు (సుమారు రూ. 2 కోట్ల 58 లక్షలు)
Comments
Please login to add a commentAdd a comment