
న్యూఢిల్లీ: గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన వెయిట్ లిఫ్టర్ పూనమ్ యాదవ్‌ను భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) జాతీయ క్యాంప్ నుంచి సస్పెండ్ చేసింది. ఈ ఏడాది జరుగనున్న ఆసియా క్రీడల కోసం పాటియాలాలో ఏర్పాటు చేసిన జాతీయ క్యాంప్‌లో శిక్షణ పొందుతున్న పూనమ్ అక్కడి అధికారుల అనుమతి లేకుండా క్యాంప్ నుంచి పలుమార్లు బయటకు వెళ్లింది. దీంతో ఐడబ్ల్యూఎఫ్ ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ‘ప్రస్తుతం జరుగుతోన్న జాతీయ క్యాంప్‌లో పూనమ్ ఐడబ్ల్యూఎఫ్ నిబంధనలను బేఖాతరు చేసింది. ఆమె పలుమార్లు నిబంధనలను అతిక్రమించింది. 15 రోజుల వ్యవధిలో అనుమతి లేకుండా రెండు సార్లు క్యాంప్ నుంచి బయటకు వెళ్లింది.
ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించబోం’ అని ఐడబ్ల్యూఎఫ్ ఆమెకు ఓ లేఖ ద్వారా తెలిపింది. ఆమెపై నిషేధం విధించడానికి ముందే షోకాజ్ నోటీసులు పంపినా లాభం లేకపోయిందని పేర్కొంది. ఈ అంశంపై ఐడబ్ల్యూఎఫ్ కార్యదర్శి సహదేవ్ యాదవ్ స్పందిస్తూ... ‘రాబోయే ఆసియా క్రీడల్లో పూనమ్ స్థానం భర్తీ చేయలేనిది. గత కొన్నేళ్లుగా పూనమ్ చాలా కఠినమైన శిక్షణ తీసుకుంటోంది. కానీ ఈ విధంగా క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతూ క్యాంప్‌నకు గైర్హాజరు అయితే తిరిగి పుంజుకోవడం కష్టం’ అని తెలిపారు. ఆమె తిరిగి క్యాంప్‌లో చేరాలంటే... ‘నాడా’ ఆధ్వర్యంలో డోపింగ్ టెస్ట్ పాసవ్వాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment