
సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేస్తున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు
అసెంబ్లీలో జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌పై బీఆర్‌ఎస్ నిరసన
రాష్ట్రవ్యాప్తంగా సీఎం, ప్రభుత్వ దిష్టిబోమ్మల దహనం
ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలతో ఆందోళన..
పలుచోట్ల బీఆర్‌ఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రభుత్వ తీరును ప్రజాకోర్టులోనే తేల్చుకుంటాం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడంపై బీఆర్‌ఎస్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతగాకనే అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతునొక్కుతోందని మండిపడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి.
సీఎం రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబోమ్మలతో ర్యాలీలు నిర్వహించి దహనం చేశాయి. జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి బయటికి పంపడం అప్రజాస్వామికమని.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీఆర్‌ఎస్ నేతల గొంతు నొక్కేందుకు సీఎం రేవంత్ సస్పెన్షన్లను ఆయుధంగా మలుచుకున్నారని మండిపడ్డాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ శ్రేణులు పలు చోట్ల రాస్తారోకోలు, ధర్నాలు చేయగా... పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు..
శాసనసభలో స్పీకర్‌ను అగౌరవపరిచే విధంగా జగదీశ్‌రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా... ప్రభుత్వం కక్షపూరితంగా, పథకం ప్రకారమే ఆయనను సభ నుంచి సస్పెండ్ చేసిందని బీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్నా చెప్పుకునేందుకు ఒక్క మంచి పనికూడా లేనందునే.. కాంగ్రెస్ సర్కారు నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తోందని విమర్శించారు. అసెంబ్లీని అడ్డాగా చేసుకుని అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశాయి. నకిరేకల్, దేవరకొండ, మునుగోడులలో రాస్తారోకోతో నిరసన తెలిపాయి. హుజూర్‌నగర్, మఠంపల్లి, నేరేడుచర్లలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, భీమారం, రామకృష్ణాపూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్‌లలో బీఆర్‌ఎస్ నేతలు నిరసనలు తెలిపారు. కాగా.. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంచిర్యాలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మణుగూరు, ఇల్లందు, మధిర తదితర చోట్ల తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపారు.
ప్రజాకోర్టులో తేల్చుకుంటాం: కేటీఆర్
పార్టీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్ కేడర్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతకానితనం బయటపడొద్దనే బీఆర్‌ఎస్ నాయకులపై కుట్రలు చేస్తున్నారని ఒక ప్రకటనలో మండిపడ్డారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కితే ప్రజాకోర్టులో తేల్చుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలు, హామీల అమల్లో మోసాన్ని ఇదే స్ఫూర్తితో ఎప్పటికప్పుడు ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment