త్రివర్ణ శోభితం... | closing on Commonwealth Games | Sakshi
Sakshi News home page

త్రివర్ణ శోభితం...

Published Mon, Apr 16 2018 1:00 AM | Last Updated on Mon, Apr 16 2018 10:55 AM

closing  on Commonwealth Games - Sakshi

తొలి రోజే విరజిమ్మిన పసిడి వెలుగులను భారత క్రీడాకారులు చివరి రోజు వరకూ కొనసాగించారు. ఫలితంగా గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ను భారత్‌ అంచనాలకు మించిన ప్రదర్శనతో దిగ్విజయంగా ముగించింది. పోటీల ఆఖరి రోజు త్రివర్ణాలైన స్వర్ణ, రజత, కాంస్య పతకాలు భారత క్రీడాకారుల ఖాతాలో చేరడం విశేషం.బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌ స్వర్ణం సాధించగా...  పీవీ సింధు రజతం దక్కించుకుంది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ రజతం సొంతం చేసుకోగా... పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి ద్వయం రజతం సాధించింది. మహిళల స్క్వాష్‌ డబుల్స్‌ విభాగంలో దీపిక పళ్లికల్‌–జోష్నా చినప్ప జంట రజతం గెల్చుకోగా... టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మనిక బాత్రా – సత్యన్‌ జ్ఞానశేఖరన్‌... పురుషుల సింగిల్స్‌లో ఆచంట శరత్‌ కమల్‌ కాంస్య పతకాలు నెగ్గారు. ఆఖరి రోజు ఏడు పతకాలు సాధించిన భారత్‌ ఓవరాల్‌గా 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలతో 66 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. 2014 గ్లాస్గో గేమ్స్‌ (15 స్వర్ణాలు, 30 రజతాలు, 19 కాంస్యాలతో కలిపి 64 పతకాలు)తో పోలిస్తే స్వర్ణ పతకాల విషయంలో పురోగతి సాధించింది. ‘గోల్డ్‌ కోస్ట్‌’లో భారత్‌ మూడో స్థానంలో నిలిచి ఈ క్రీడల చరిత్రలో తమ రెండో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. 2010 ఢిల్లీ గేమ్స్‌లో భారత్‌ అత్యుత్తమంగా రెండో స్థానాన్ని సాధించింది. 2002, 2006 గేమ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత్, 1990 గేమ్స్‌లో ఐదో స్థానాన్ని పొందింది. 

గోల్డ్‌కోస్ట్‌: మొదటి నుంచి మొదలైన పతకాల వేటను చివరి రోజు వరకు కొనసాగిస్తూ భారత క్రీడాకారులు కామన్వెల్త్‌ గేమ్స్‌కు ఘనమైన ముగింపు ఇచ్చారు. అందుబాటులో ఉన్న ఏడు పతకాలను దక్కించుకున్నారు. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో ఇద్దరు భారత స్టార్లు సైనా నెహ్వాల్, పీవీ సింధుల మధ్య జరిగిన ఫైనల్లో సైనా పైచేయి సాధించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో సైనా 21–18, 23–21తో సింధును ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఈ గేమ్స్‌ చరిత్రలో సైనాకిది రెండో వ్యక్తిగత స్వర్ణం. 2010 గేమ్స్‌లోనూ ఆమె ఈ ఘనత సాధించింది.  చీలమండ గాయం కారణంగా టీమ్‌ విభాగంలో బరిలోకి దిగని సింధుపై తుది పోరులో సైనా ఆధిపత్యం చలాయించింది. సింధు సంధించిన స్మాష్‌లకు కొన్నిసార్లు సైనా వద్ద సమాధానం లేకపోగా... సైనా కొట్టిన డ్రాప్‌ షాట్‌లకు సింధు చేతులెత్తేసింది. తొలి గేమ్‌ ఆరంభంలోనే 9–4తో ముందంజ వేసిన సైనా... ఆ తర్వాత అదే జోరు కొనసాగించి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌ కూడా నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఈ గేమ్‌లోనూ కీలకదశలో సైనా పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. ‘నేను పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగాను. నేను నా అత్యుత్తమ ప్రదర్శన చేశాను. అయితే ఈ రోజు నాది కాదంతే’ అని ఓటమి తర్వాత సింధు వ్యాఖ్యానించింది.  

శ్రీకాంత్‌కు నిరాశ... 
పురుషుల సింగిల్స్‌లో స్వర్ణం నెగ్గాలని ఆశించిన భారత స్టార్, ప్రపంచ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ రజతంతో సరిపెట్టుకున్నాడు. మలేసియా దిగ్గజం లీ చోంగ్‌ వీతో జరిగిన ఫైనల్లో శ్రీకాంత్‌ 19–21, 21–14, 21–14తో పోరాడి ఓడిపోయాడు. మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగం ఫైనల్‌ సందర్భంగా లీ చోంగ్‌ వీని ఓడించిన శ్రీకాంత్‌ అదే ఫలితాన్ని ఈసారి పునరావృతం చేయలేకపోయాడు. ఈ క్రీడల్లో లీ చోంగ్‌ వీకిది మూడో వ్యక్తిగత స్వర్ణం. అతను 2006 మెల్‌బోర్న్, 2010 ఢిల్లీ గేమ్స్‌లోనూ స్వర్ణాలు గెలిచాడు.  

సాత్విక్‌–చిరాగ్‌ జంట తడబాటు... 
ఈ క్రీడల్లో ఆరంభం నుంచి అద్భుతంగా ఆడిన సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం స్వర్ణ పతక పోరులో నిరాశపరిచింది. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జంట 13–21, 16– 21తో మార్కస్‌ ఎలిస్‌–క్రిస్‌ లాన్‌గ్రిడ్జ్‌ (ఇంగ్లండ్‌) జోడీ చేతిలో పరాజయం పాలైంది. తద్వారా ఈ గేమ్స్‌ చరిత్రలో పురుషుల డబుల్స్‌ విభాగంలో రజతం నెగ్గిన తొలి భారతీయ జోడీగా సాత్విక్‌–చిరాగ్‌ జంట గుర్తింపు పొందింది. 

మనిక ఖాతాలో నాలుగో పతకం... 
టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ)లో చివరి రోజు భారత్‌కు రెండు కాంస్యాలు లభించాయి. మిక్స్‌డ్‌ డబుల్స్‌ కాంస్య పతక పోరులో మనిక బాత్రా–సత్యన్‌ జంట 11–6, 11–2, 11–4తో భారత్‌కే చెందిన ఆచంట శరత్‌ కమల్‌–మౌమా దాస్‌ జోడీపై గెలిచింది. ఈ గేమ్స్‌లో మనికకు ఇది నాలుగో పతకం కావడం విశేషం. ఆమె మహిళల టీమ్‌ విభాగంలో స్వర్ణం, సింగిల్స్‌ విభాగంలో స్వర్ణం, డబుల్స్‌ విభాగంలో రజతం గెల్చుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌ కాంస్య పతక పోరులో శరత్‌ కమల్‌ 11–7, 11–9, 9–11, 11–6, 12–10తో సామ్యూల్‌ వాకర్‌ (ఇంగ్లండ్‌)పై గెలిచాడు.  

ఫైనల్లో ఓడిన దీపిక–జోష్నా జోడీ 
గ్లాస్గో గేమ్స్‌లో మహిళల డబుల్స్‌ స్క్వాష్‌ విభాగంలో స్వర్ణం నెగ్గిన దీపిక పళ్లికల్‌–జోష్నా చినప్ప (భారత్‌) జంట ఈసారి మాత్రం రజతంతో సంతృప్తి పడింది. ఫైనల్లో దీపిక–జోష్నా ద్వయం 9–11, 8–11తో జోలీ కింగ్‌– అమందా (న్యూజిలాండ్‌) జోడీ చేతిలో ఓడిపోయింది.   

మరిన్ని పతకాలు సాధించేవాళ్లం...

కామన్వెల్త్‌ క్రీడల్లో మొత్తంగా మా ప్రదర్శన సంతృప్తినిచ్చింది. టీమ్‌ ఈవెంట్‌లో మలేసియాను ఓడించి మనం స్వర్ణం నెగ్గడమే అన్నింటికంటే అద్భుతం. నా దృష్టిలో ఈ టోర్నీ అశ్విని సొంతం. సాత్విక్‌–అశ్విని జంట టీమ్‌ ఈవెంట్‌లో విజయం సాధించి భారత్‌ను 1–0తో ముందంజలో నిలపడమే ఆ తర్వాత లీ చోంగ్‌ వీపై శ్రీకాంత్‌ చెలరేగి ఆడేందుకు కావాల్సిన స్ఫూర్తినిచ్చింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కూడా సాత్విక్‌–అశ్విని జోడి పతకం నెగ్గాల్సింది. ఓవరాల్‌గా చూస్తే కఠిన పరిస్థితుల్లో మన షట్లర్లు ఒకే రోజు రెండేసి మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. మ్యాచ్‌ల షెడ్యూలింగ్‌లో కాస్త అదృష్టం కలిసొస్తే మరో రెండు పతకాలు మన ఖాతాలో చేరేవి. సైనా ఆటతీరు ఎంతో మెరుగైంది. ముందుగా టీమ్‌ మ్యాచ్‌లు బాగా ఆడి ఆ తర్వాత వ్యక్తిగత ఈవెంట్లలో కూడా సైనా రాణించడం చెప్పుకోదగ్గ అంశం.    
–పుల్లెల గోపీచంద్, భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌   

ఒలింపిక్‌ పతకంతో సమానం... 
కామన్వెల్త్‌ విజయం నా తల్లిదండ్రులకు ఇస్తున్న కానుక. గాయం కారణంగా రియో ఒలింపిక్స్‌లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత ఈ పతకం గెలుచుకోవడం ఉద్వేగంగా ఉంది. నా దృష్టిలో ఒలింపిక్‌ పతకం, నంబర్‌ వన్‌ ర్యాంక్‌లతో ఈ విజయం సమానం.  గత 10–12 రోజులుగా నిర్విరామంగా ఆడుతుండటం వల్ల కూడా నేను మరింత ఎక్కువ శ్రమించాల్సి వచ్చింది. సింధుతో ఆరోగ్యకరమైన పోటీ ఉంది. దీనిని ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. మాపై ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న అమ్మాయిని ఓడించగలగడం సంతోషంగా ఉంది. మా నాన్న కోసం పోరాడటాన్ని నేను తప్పుగా భావించడం లేదు. అందరూ దానిని అదోలా చేశారు. కానీ ఆయన లేకపోతే నేను దేశం కోసం పతకాలు గెలవకపోయేదాన్ని. ఏదీ చేయకుండా అంతా చేసేసినట్లు అందరూ వ్యవహరించారు. ముందే తెలిస్తే నేను ఆయన కోసం హోటల్‌ గదిని తీసుకునేదాన్ని. వ్యక్తిగత కోచ్‌ అక్రిడిటేషన్‌ ఇచ్చి చివరకు అలా చేశారు. ఈ విషయంలో తీవ్ర ఒత్తిడికి లోనై నేను రెండు రోజుల పాటు సరిగ్గా నిద్రపోలేదు. సింధు టీమ్‌ ఈవెంట్లు ఆడటం లేదు. కానీ నేను మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. నేను మా నాన్న కోసం పోరాడటమే అందరికీ సమస్యగా అనిపించింది. నేను సింధు చేతిలో ఓడితే భారత్‌లో చాలా మంది సైనా వయసైపోయింది, రిటైర్‌ కావాలి అంటూ వంద వ్యాఖ్యలు చేస్తారు. అదే సింధును ఇంకా ఎదుగుతున్న క్రీడాకారిణిగానే చూస్తారు. ఆమెనైతే ఎవరూ ఏమీ అనరు.     
– సైనా  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement