సోమవారం న్యూఢిల్లీలో భారత్ బ్యాడ్మింటన్ బృందంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన పతక విజేతలు సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలను కలిశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రామ్‌నాథ్ కోవింద్ పతకాలు గెలిచిన క్రీడాకారులందరితో కరచాలనం చేసి అభినందించారు. భవిష్యత్తులోనూ రాణించి యువతకు స్ఫూర్తిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. అంతకుముందు ప్రధాని నివాసంలో మోదీని కలువగా ఆయన వారితో కాసేపు ముచ్చటించారు. ‘అంతర్జాతీయ క్రీడల్లో సత్తాచాటిన మీరు అందరికీ ప్రేరణగా నిలిచారు. మీ ప్రతిభతో భారత్ ఉప్పొంగిపోయింది. మీ పతకంతో భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు’ అని ప్రధాని మోదీ వారిని కొనియాడారు. భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్టార్ మహిళా బాక్సర్ మేరీ కోమ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. గోపీనుద్దేశించి ఓ విజయవంతమైన ప్లేయర్‌గా కెరీర్ ముగించుకున్నప్పటికీ అంతటితో సంతృప్తి చెందక... కోచ్‌గా విరామమెరుగని కృషితో యువ క్రీడాకారులను అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో విజేతలుగా నిలుపుతున్నారని అభినందించారు.
దశాబ్దాలపాటు విజేతగా నిలవొచ్చని మేరీకోమ్ చాటిందన్నారు. ఎంపీ అయ్యాక కూడా ఆమె పతకం గెలిచిందన్నారు. అథ్లెట్లతో పాటు భారత క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ కూడా వారితో పాటు ఉన్నారు. గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన మెగా ఈవెంట్‌లో భారత్ 26 స్వర్ణాలు, 20 చొప్పున రజత, కాంస్యాలతో మొత్తం 66 పతకాలు సాధించింది. స్వర్ణ విజేతకు భారత క్రీడాశాఖ తరఫున రూ. 30 లక్షలు, రజతానికి రూ. 20 లక్షలు, కాంస్యానికి రూ. 10 లక్షలు నజరానా అందజేశారు. ఈ కార్యక్రమంలో పతక విజేతలు మేరీకోమ్ (బాక్సింగ్), సుశీల్ కుమార్ (రెజ్లింగ్), సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్), మీరాబాయి చాను, రాగాల వెంకట్ రాహుల్ (వెయిట్‌లిఫ్టింగ్), హుసాముద్దీన్ (బాక్సింగ్) తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment