
గోల్డ్‌కోస్ట్: ఎక్కడైనా ప్రతిష్టాత్మక గేమ్స్ జరుగుతుంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చే అథ్లెట్లు పోటీల్లో పాల్గొంటారు... ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తారు. మరికొందరు పట్టుదలగా ఆడతారు. పతకాల్ని పట్టుకెళ్తారు. కానీ ‘వనుతు’ దేశానికి చెందిన బీచ్ వాలీబాల్ క్రీడాకారిణి మిల్లర్ పటా ఏడు నెలల పసివాడితో గోల్డ్‌కోస్ట్‌కు వచ్చింది. గురువారం లిన్‌లైన్ మటౌటుతో కలిసి కాంస్యం గెలిచిన మిల్లర్ పటా... ఈ పతకం వేటలో అందరికంటే ఎక్కువే కష్టపడింది.
సాధారణంగా క్రీడాగ్రామంలో చిన్నపిల్లల్ని అనుమతించరు. దీంతో మిల్లర్ తన చిన్నారి కోసం క్రీడాగ్రామంలోని వసతుల్ని కాదని బయట వేరే చోటు చూసుకుంది. తన చిన్నారికి పాలిచ్చి, లాలించిన తర్వాత ఆమె ప్రాక్టీసులో చెమటోడ్చేది. ఇలా తల్లిగా, పతకం గెలిచాక అథ్లెట్‌గా ఆమె రెండు పాత్రలకు న్యాయం చేసింది. పతకాన్ని తన కుమారుడి సాక్షిగా అందుకొని తెగ మురిసిపోయింది