పసిడి బుల్లెట్‌... | Anish Bhanwala creates history : gold for Tejasvini | Sakshi
Sakshi News home page

పసిడి బుల్లెట్‌...

Published Sat, Apr 14 2018 1:26 AM | Last Updated on Sat, Apr 14 2018 9:22 AM

Anish Bhanwala creates history : gold for Tejasvini    - Sakshi

తొలి రోజే మొదలైన భారత పసిడి పతకాల వేట తొమ్మిదో రోజూ నిరాటంకంగా కొనసాగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా 15 ఏళ్ల కుర్రాడు అనీశ్‌ భన్వాలా షూటింగ్‌ విభాగంలో స్వర్ణ పతకం గెలిచి సంచలనం సృష్టించాడు. తొలిసారి ఈ గేమ్స్‌లో పాల్గొంటున్న అతను పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ విభాగంలో కామన్వెల్త్‌ గేమ్స్‌ రికార్డు నెలకొల్పడంతో పాటు బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో హరియాణాకు చెందిన ఈ పదో తరగతి విద్యార్థి కామన్వెల్త్‌ గేమ్స్‌ చరిత్రలో భారత్‌ తరఫున స్వర్ణ పతకం గెలిచిన పిన్న వయసు క్రీడాకారుడిగా కొత్త చరిత్ర లిఖించాడు. మరోవైపు మహిళల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ విభాగంలో 37 ఏళ్ల తేజస్విని సావంత్‌ విజేతగా నిలిచింది. పురుషుల రెజ్లింగ్‌లో అంచనాలను నిజం చేస్తూ బజరంగ్‌ పూనియా 65 కేజీల విభాగంలో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. టీటీ, బాక్సింగ్‌లోనూ మనోళ్లు మెరవడంతో... గోల్డ్‌కోస్ట్‌ గేమ్స్‌లో తొమ్మిదో రోజు భారత్‌ తమ అత్యుత్తమ ప్రదర్శన చేసి మూడు స్వర్ణాలు, నాలుగు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం 11 పతకాలను దక్కించుకుంది.  

గోల్డ్‌కోస్ట్‌: పెన్ను పట్టుకొని తరగతి గదిలో పరీక్ష రాయాల్సిన కుర్రాడు... దేశం తరఫున గన్ను పట్టుకొని బరిలోకి దిగాడు. కచ్చితమైన గురితో లక్ష్యంలోకి బుల్లెట్‌లు దించాడు. రౌండ్‌ రౌండ్‌కు ఒక్కో ప్రత్యర్థిని వెనక్కి నెట్టేశాడు. ఊహించని రీతిలో విజేతగా అవతరించి ఔరా అనిపిం చాడు. అందివచ్చిన ఏకైక అవకాశాన్ని స్వర్ణం తో సద్వినియోగం చేసుకున్న ఆ పసిడి బుల్లెట్‌ ఎవరో కాదు హరియాణాకు చెందిన 15 ఏళ్ల అనీశ్‌ భన్వాలా. 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ విభాగంలో బరిలోకి దిగిన అతను ఫైనల్లో 30 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 23 పాయింట్లతో డేవిడ్‌ చాప్‌మన్‌ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న కామన్వెల్త్‌ గేమ్స్‌ రికార్డును బద్దలు కొట్టాడు.  మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌లో మహారాష్ట్ర షూటర్‌ తేజస్విని సావంత్‌ చాంపియన్‌గా నిలిచి భారత్‌ ఖాతాలో స్వర్ణ పతకాన్ని జమ చేసింది. ఫైనల్లో తేజస్విని 457.9 పాయింట్లు స్కోరు చేసి 449.1 పాయింట్లతో జియాంగ్‌ (సింగపూర్‌) పేరిట ఉన్న కామన్వెల్త్‌ గేమ్స్‌ రికార్డును బద్దలు కొట్టింది. భారత్‌కే చెందిన అంజుమ్‌ (455.7 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచి రజతం గెల్చుకుంది. 

భళా... బజరంగ్‌ 
రెజ్లింగ్‌ ఈవెంట్‌లో రెండో రోజు కూడా భారత్‌ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి. పురుషుల 65 కేజీల విభాగంలో బజరంగ్‌ పూనియా స్వర్ణ పతకాన్ని నెగ్గాడు. నలుగురు ప్రత్యర్థులతో పోటీపడిన బజరంగ్‌ ఒక్కరికి ఒక్క పాయింట్‌ కూడా ఇవ్వకపోవడం విశేషం. కేన్‌ చారిగ్‌ (వేల్స్‌)తో జరిగిన ఫైనల్లో బజరంగ్‌ 10–0తో మూడు నిమిషాల్లోపే బౌట్‌ను ముగించాడు. తొలి రౌండ్‌లో బజరంగ్‌ 10–0తో రిచర్డ్స్‌ (న్యూజిలాండ్‌)పై, క్వార్టర్‌ ఫైనల్లో 10–0తో అమాస్‌ (నైజీరియా)పై, సెమీఫైనల్లో 10–0తో విన్సెంట్‌ (కెనడా)పై గెలుపొందాడు. పురషుల 97 కేజీల ఫైనల్లో మౌజమ్‌ ఖత్రీ (భారత్‌) 2–12తో ఎరాస్మస్‌ (దక్షిణాఫ్రికా) చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకున్నాడు. మహిళల 57 కేజీల ఫైనల్లో పూజా ధండా (భారత్‌) 5–7తో ఒడునాయో (నైజీరియా) చేతిలో ఓటమిపాలై రజతం గెలుపొందగా... 68 కేజీల విభాగంలో షెరీన్‌ సుల్తానా (బంగ్లాదేశ్‌)పై దివ్య కక్రాన్‌ నెగ్గి కాంస్యం సంపాదించింది. 

మనిక మళ్లీ మెరిసె... 
మహిళల టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టీమ్‌ విభాగంలో స్వర్ణంతో మెరిసిన భారత క్రీడాకారిణులు డబుల్స్‌ విభాగంలోనూ ఆకట్టుకున్నారు. టీమ్‌కు స్వర్ణం దక్కడంలో కీలకపాత్ర పోషించిన మనిక బాత్రా తన భాగస్వామి మౌమా దాస్‌తో కలిసి డబుల్స్‌లో రజతం గెల్చుకుంది. ఫైనల్లో మనిక–మౌమా దాస్‌ జంట 0–3తో ఫెంగ్‌ తియన్‌వె–యు మెంగ్యు (సింగపూర్‌) జోడీ చేతిలో పరాజయం పాలైంది.

హుసాముద్దీన్‌కు కాంస్యం 
పురుషుల బాక్సింగ్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. ఐదుగురు బాక్సర్లు అమిత్‌ (49 కేజీలు), గౌరవ్‌ సోలంకి (52 కేజీలు), మనీశ్‌ కౌశిక్‌ (60 కేజీలు), వికాస్‌ కృషన్‌ (75 కేజీలు), సతీశ్‌ కుమార్‌ (ప్లస్‌ 91 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లగా... తెలంగాణ బాక్సర్‌ హుసాముద్దీన్‌ (56 కేజీలు), మనోజ్‌ కుమార్‌ (69 కేజీలు), నమన్‌ తన్వర్‌ (91 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు గెల్చుకున్నారు. సెమీస్‌లో హుసాముద్దీన్‌ 0–5తో పీటర్‌ మెక్‌గ్రెయిల్‌ (ఇంగ్లండ్‌) చేతిలో ఓటమి చవిచూశాడు.

లెక్కల పరీక్ష గురించే ఆలోచనంతా... 
మనలో చాలామందికి గణితమంటే భయం... ఇక ఆ సబ్జెక్టులో పరీక్షంటే చెప్పేదేముంది? ఒత్తిడితో వణికిపోతాం. కామన్వెల్త్‌ క్రీడల షూటింగ్‌లో స్వర్ణం నెగ్గిన అనీశ్‌ భన్వాలా కూడా దీనికి అతీతుడేం కాదు. పదిహేనేళ్ల అతి పిన్న వయసులోనే పతకం నెగ్గిన తన ఘనత గురించి దేశమంతా మాట్లాడుకుంటుంటే, అతడేమో లెక్కల పరీక్ష గురించి ఆందోళన చెందుతున్నాడు. తుపాకీ పట్టి సడలని ఏకాగ్రత, సాధనతో గురి చూసి లక్ష్యాన్ని కొట్టిన తాను... గణితం సబ్జెక్టును మాత్రం సరిగా సాధన చేయలేదని చెబుతున్నాడు. హరియాణాలోని సోనేపట్‌ జిల్లా గొహనా కసండీకి చెందినవాడు అనీశ్‌. షూటింగేమీ అతడి మొదటి ప్రాధాన్య క్రీడ కాదు. 2013లో అండర్‌–12 స్థాయిలో మోడ్రన్‌ పెంటాథ్లాన్‌ ప్రపంచ చాంపియన్‌షిప్, 2015లో ఆసియా పెంటాథ్లాన్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. తర్వాత నుంచి షూటింగ్‌పై దృష్టి పెట్టాడు. దీనికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం దక్కింది. ఆటే సర్వస్వంగా భావిస్తూ పైకెదిగాడు. గత నెల మెక్సికోలో జరిగిన ప్రపంచకప్, జూనియర్‌ ప్రపంచ కప్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అక్కడ కనబర్చిన ప్రతిభతో కామన్వెల్త్‌ గేమ్స్‌కు వచ్చాడు. ‘రేంజ్‌లో ఒత్తిడిని ఆస్వాదిస్తా. అది నాలో ప్రతిభను బయటకు తీస్తుంది. కామన్వెల్త్‌లో నాకేం రికార్డు లేదు. కానీ ఈసారి ముద్ర వేయాలని నిశ్చయించుకున్నా’ అని ఓవైపు ఆత్మవిశ్వాసంతో చెప్పే అనీశ్‌... ‘భారత్‌లో దిగిన వెంటనే నేను పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. హిందీ, సోషల్‌ సబ్జెక్టుల్లో ఫర్వాలేదు. లెక్కల గురించే నా ఆందోళనంతా. ఇప్పుడైనా దృష్టి పెట్టాలి’ అని అంటుండటం గమనార్హం. వారాంతాల్లో సరదాగా గడపటం ఎలా అని ఆలోచించే తన వయసు కుర్రాళ్లలా కాకుండా... ‘నా దృష్టంతా వచ్చే ప్రపంచకప్, ఆసియా క్రీడలపైనే ఉంద’ని చెబుతున్నాడీ టీనేజర్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement