పెన్ను పట్టుకొని తరగతి గదిలో పరీక్ష రాయాల్సిన కుర్రాడు... దేశం తరఫున గన్ను పట్టుకొని బరిలోకి దిగాడు. కచ్చితమైన గురితో లక్ష్యంలోకి బుల్లెట్‌లు దించాడు. రౌండ్ రౌండ్‌కు ఒక్కో ప్రత్యర్థిని వెనక్కి నెట్టేశాడు. ఊహించని రీతిలో విజేతగా అవతరించి ఔరా అనిపిం చాడు. అందివచ్చిన ఏకైక అవకాశాన్ని స్వర్ణం తో సద్వినియోగం చేసుకున్న ఆ పసిడి బుల్లెట్ ఎవరో కాదు హరియాణాకు చెందిన 15 ఏళ్ల అనీశ్ భన్వాలా. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో బరిలోకి దిగిన అతను ఫైనల్లో 30 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 23 పాయింట్లతో డేవిడ్ చాప్‌మన్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న కామన్వెల్త్ గేమ్స్ రికార్డును బద్దలు కొట్టాడు.