పసిడి కాంతలు... | Shooters, lifters and paddlers win three gold medals | Sakshi
Sakshi News home page

పసిడి కాంతలు...

Published Mon, Apr 9 2018 3:53 AM | Last Updated on Mon, Apr 9 2018 3:53 AM

Shooters, lifters and paddlers win three gold medals - Sakshi

మను భాకర్‌, హీనా సిద్ధూ, పూనమ్‌ యాదవ్‌

తొలి రోజు ఒకటి... రెండో రోజు ఒకటి... మూడో రోజు రెండు... నాలుగో రోజు మూడు... మొత్తానికి కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత పసిడి పతకాల వేట మరింత జోరందుకుంది. ఈ ‘పసిడి’ పతకాల విజయ యాత్రలో అమ్మాయిలు తమ అద్వితీయ విన్యాసాలతో భారత్‌ను ముందుండి నడిపిస్తున్నారు. పోటీల నాలుగో రోజు ఆదివారం భారత క్రీడాకారిణులు తమ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. తొలుత వెయిట్‌లిఫ్టింగ్‌లో పూనమ్‌ యాదవ్‌ (69 కేజీలు) ‘లిఫ్ట్‌’కు బంగారు పతకం ఒడిలోకి చేరగా... ఆ తర్వాత షూటింగ్‌లో మను భాకర్‌ (10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌) గురికి మరో పసిడి పతకం వచ్చేసింది. చివర్లో మహిళల టీటీ జట్టు ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ సింగపూర్‌ను బోల్తా కొట్టించి ఈ క్రీడల చరిత్రలోనే తొలిసారి స్వర్ణాన్ని సొంతం చేసుకొని ఔరా అనిపించింది. 
 
గోల్డ్‌కోస్ట్‌:
భారత్‌ తరఫున మొదటి మూడు రోజులు వెయిట్‌లిఫ్టర్లు పతకాలు కొల్లగొట్టగా... నాలుగోరోజు వీరి సరసన షూటర్లు, టీటీ క్రీడాకారిణులు కూడా చేరారు. ఫలితంగా కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఆదివారం భారత్‌ తమ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఒకేరోజు మూడు స్వర్ణాలు, రజతం, రెండు కాంస్యాలు కైవసం చేసుకుంది. ప్రస్తుతం భారత్‌ ఏడు స్వర్ణాలు, రెండు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది.  

మను మళ్లీ మెరిసె...
పతకాలు సాధించే విషయంలో తమపై పెట్టుకున్న అంచనాలను భారత షూటర్లు నిజం చేశారు. ఆదివారం మొదలైన షూటింగ్‌ ఈవెంట్‌ తొలి రోజే మన షూటర్లు స్వర్ణం, రజతం, కాంస్యం నెగ్గారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో హరియణాకు చెందిన 16 ఏళ్ల అమ్మాయి మను భాకర్‌ తన అద్వితీయ ఫామ్‌ను కొనసాగిస్తూ స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో ఆమె 240.9 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది.

తద్వారా ఈ క్రీడల చరిత్రలో పిన్న వయసులో స్వర్ణం నెగ్గిన భారత షూటర్‌గా ఆమె గుర్తింపు పొందింది. భారత్‌కే చెందిన హీనా సిద్ధూ 234 పాయింట్లు స్కోరు చేసి రజతం గెల్చుకుంది. గత నెలలో మెక్సికో ఆతిథ్యమిచ్చిన సీనియర్‌ ప్రపంచకప్‌లో రెండు స్వర్ణాలు, సిడ్నీలో జరిగిన జూనియర్‌ ప్రపంచకప్‌లో రెండు స్వర్ణాలు నెగ్గిన మను అదే జోరును కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ కనబరిచి ప్రపంచకప్‌లలో తాను నెగ్గిన పసిడి పతకాలు గాలివాటమేమీ కాదని నిరూపించింది.

క్వాలిఫయింగ్‌లో 388 పాయింట్లు... ఫైనల్లో 240.9 పాయింట్లు స్కోరు చేసి మను కొత్త కామన్వెల్త్‌ గేమ్స్‌ రికార్డులు నెలకొల్పడం విశేషం. మరోవైపు మహిళల స్కీట్‌ ఫైనల్లో భారత షూటర్‌ సానియా షేక్‌ నాలుగో స్థానంలో  నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో భారత షూటర్‌ రవి కుమార్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. ఫైనల్లో రవి 224 పాయింట్లు సాధించాడు. మరో భారత షూటర్‌ దీపక్‌ కుమార్‌ 162 పాయింట్లతో ఆరో స్థానానికి పరిమితమయ్యాడు.  

వెయిట్‌లిఫ్టింగ్‌లో మరో రెండు...
వరుసగా నాలుగో రోజు భారత వెయిట్‌లిఫ్టర్లు స్వర్ణం సాధించడం విశేషం. మహిళల 69 కేజీల విభాగంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల పూనమ్‌ యాదవ్‌ మొత్తం 222 కేజీలు (స్నాచ్‌లో 100+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 122) బరువెత్తి బంగారు పతకాన్ని గెల్చుకుంది. 2014 గ్లాస్కో గేమ్స్‌లో పూనమ్‌ 63 కేజీల విభాగంలో పోటీపడి కాంస్యం సాధించింది. పురుషుల 94 కేజీల విభాగంలో పంజాబ్‌కు చెందిన 24 ఏళ్ల వికాస్‌ ఠాకూర్‌ కాంస్య పతకాన్ని సాధించాడు. అతను మొత్తం 351 కేజీలు (స్నాచ్‌లో 159+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 192) బరువెత్తి మూడో స్థానంలో నిలిచాడు. 2014 గ్లాస్కో గేమ్స్‌లో వికాస్‌ 85 కేజీల విభాగంలో రజతం గెలిచాడు. మహిళల 75 కేజీల విభాగంలో భారత లిఫ్టర్‌ సీమా ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.  

మనిక మెరుపులు...
ఆదివారం అన్నింటికంటే హైలైట్‌ భారత మహిళల టీటీ జట్టు ప్రదర్శన. టీమ్‌ విభాగంలో వరుసగా ఐదో స్వర్ణం సాధించాలని ఆశించిన ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ సింగపూర్‌ జట్టును భారత్‌ బోల్తా కొట్టించింది. ఫైనల్లో భారత్‌ 3–1తో సింగపూర్‌ను ఓడించి ఈ క్రీడల చరిత్రలో తొలిసారి పసిడి పతకాన్ని దక్కించుకుంది. 2010 ఢిల్లీ గేమ్స్‌లో భారత మహిళల జట్టు సింగపూర్‌ చేతిలో ఓడి రజతంతో సంతృప్తి పడింది. ఈసారి విజేతగా నిలిచి బదులు తీర్చుకుంది. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల మనిక బాత్రా తాను ఆడిన రెండు సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో గెలిచి భారత చిరస్మరణీయ విజయంలో కీలకపాత్ర పోషించింది.

తొలి మ్యాచ్‌లో ప్రపంచ 58వ ర్యాంకర్‌ మనిక 11–8, 8–11, 7–11, 11–9, 11–7తో ప్రపంచ 4వ ర్యాంకర్‌ ఫెంగ్‌ తియన్‌వెను ఓడించి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌లో మధురిక ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌గా జరిగిన డబుల్స్‌లో మౌమా దాస్‌–మధురిక ద్వయం 11–7, 11–6, 8–11, 11–7తో యిహాన్‌ జూ – మెంగ్యు యూ జోడీని ఓడించడంతో భారత్‌ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో మ్యాచ్‌లో మనిక 11–7, 11–4, 11–7తో యిహాన్‌ జూపై నెగ్గడంతో భారత్‌ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకోవడంతోపాటు స్వర్ణాన్ని గెల్చుకుంది. ‘‘ప్రపంచ నాలుగో ర్యాంకర్, ఒలింపిక్‌ పతక విజేతను నేను ఓడిస్తానని కలలో కూడా ఊహించలేదు. ఆమెపై గెలిచిన క్షణాన నేను ప్రపంచం శిఖరాన ఉన్నట్లు భావించాను’ అని మనిక వ్యాఖ్యానించింది.


                                     స్వర్ణ పతకాలతో భారత మహిళల టీటీ బృందం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement