womens sports
-
దేశానికి ఎంత గర్వకారణం.. అయినా వివక్ష
ఒక కుండలో నీళ్లు ఉన్నాయి. ఇద్దరు ఎండనపడి వచ్చారు. ఒక స్త్రీ.. ఒక పురుషుడు. నడిచొచ్చింది సమాన దూరం. మోసుకొచ్చింది సమాన భారం. పురుషుడికి గ్లాసు నిండా నీళ్లిచ్చి.. స్త్రీకి అరగ్లాసు ఇస్తే ఏమిటర్థం?! ఆమెది నడక కాదనా? ఆమెది బరువు కాదనా? ఆమెసలు మనిషే కాదనా? ఎండ ఈక్వల్ అయినప్పుడు.. కుండా ఈక్వల్ అవాలి కదా! ఇప్పుడు కొంచెం నయం. ఉండండి, 83 శాతం అంటే కొంచెం కాకపోవచ్చు. చాలా నయం. ఎనభై మూడు శాతం క్రీడాంశాలలో స్త్రీ, పురుషులన్న వ్యత్యాసం చూపకుండా ‘ఈక్వల్ పేమెంట్’ ఇస్తున్నారు! బి.బి.సి. రిపోర్ట్ ఇది. బి.బి.సి. మీడియాలో కూడా ఆమధ్య ఒకరిద్దరు పైస్థాయి మహిళా ఉద్యోగులు జాబ్‌ని వాళ్ల ముఖాన కొట్టేసి బయటికి వచ్చేశారు. జార్జికి వంద పౌండ్లు ఇస్తూ, అదే పనికి ఒలీవియాకు 60 పౌండ్లు ఇస్తుంటే ఎవరైనా అదే పని చేస్తారు. ఇదిగో, ఇలా అడిగేవాళ్ల వల్లనే ఎప్పటికైనా మహిళలకు సమాన ప్రతిఫలం వస్తుంది. ఫురుషులతో సమానంగా. మన దేశంలో ఇలా అడిగినవాళ్లు.. స్పోర్ట్‌లో.. ఐదుగురు మహిళలు ఉన్నారు. తక్కినవాళ్లూ ‘పేమెంట్‌లో ఏంటీ పక్షపాతం!’ అని అంటూనే ఉన్నా.. ప్రధానంగా సానియా మీర్జా, దీపికా పల్లికల్, అతిది చౌహన్, అపర్ణా పపొట్, మిథాలీరాజ్ ఎప్పటికప్పుడు ఈ ఎక్కువతక్కువల్ని గుర్తు చేస్తూ వస్తున్నారు. ఐపీఎల్‌నే తీస్కోండి. పురుషులు ఆడేదీ అదే ఆట, స్త్రీలు ఆడేదీ అదే ఆట. వచ్చే క్యాష్ మాత్రం స్త్రీలకు తక్కువ. టెన్నిస్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, స్క్వాష్.. ఏదైనా వీళ్లకు వచ్చేది వాళ్లకు ఇచ్చే దాంట్లో నాలుగింట ఒక వంతు తక్కువే! ‘‘మీకు న్యాయంగా అనిపిస్తోందా.. తక్కువ చేసి ఇవ్వడానికి’’ అని ఉమెన్ ప్లేయర్స్ అడిగితే.. ‘‘స్పాన్సరర్స్ రాకుంటే మేమైనా ఏం చేస్తాం. పురుషులు ఆడితే చూసినంతగా, స్త్రీలు ఆడితే చూడరు. ఉమెన్ ఈవెంట్లకు ఖర్చు తప్ప, లాభం ఎక్కడిది!’’ అని సమాధానం. నిజమే కదా పాపం అనిపించే అబద్ధం ఇది. డబ్బులు బాగానే వస్తాయి. డబ్బులు ఇవ్వడానికే మనసు రాదు. ∙∙ మార్చిలో ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది. అదీ బి.బి.సి. వాళ్లదే. పురుషులతో సమానంగా మహిళలకూ పారితోషికం, ఇతరత్రా బెనిఫిట్స్ ఇవ్వాలని ఎక్కువమంది ఇండియన్ క్రీడాభిమానులు అంటున్నారట. అంటే వాళ్లు స్పోర్ట్స్‌ని చూస్తున్నారు కానీ, స్పోర్ట్స్ ఉమన్ అని స్పోర్ట్మన్ అనీ చూడ్డం లేదు. పైగా పద్నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ సర్వేలో నాలుగింట మూడొంతుల మంది.. ఆటల్ని ఇష్టపడేవాళ్లే. సినిమాలు, పొలిటికల్ న్యూస్ లేకున్నా బతికేస్తాం కానీ, కళ్లముందు ఏదో ఒక స్పోర్ట్స్ ఈవెంట్ లేకుంటే ఆ పూటకు బతికినట్లే ఉండదని కూడా చెప్పారట. వాళ్లకు కోహ్లీ అని, మిథాలీ అని కాదు. క్రికెట్ కావాలి. సెరెనా అనీ, జకోవిచ్ అని కాదు. టెన్నిస్ కావాలి. ‘కోహ్లీనే కావాలి’ అని వాళ్లు అడిగినా మిథాలీకి రెమ్యునరేషన్ తగ్గించడం కరెక్టు కాదు. గెలిచేందుకు పెట్టే ఎఫర్ట్.. ఆ కష్టం.. వాటికి మనీని తగ్గించి ఇవ్వడం క్రీడాకారిణుల ప్రతిభను, తపనను, శ్రమను తక్కువగా చూడటమే. ఈ అసమానత్వాన్ని ప్రశ్నించకుండా రిటైర్ అయిపోతే, తమకు తాము అన్యాయం చేసుకోవడం మాత్రమే కాదు, కొత్తగా వచ్చేవాళ్లకూ అన్యాయం చేసినట్లే. అందుకే క్రీడాకారిణులు గళం విప్పుతున్నారు. తమ స్వరం వినిపిస్తున్నారు. ఇప్పటికే విదేశీ క్రీడా క్లబ్బులు, ఆసోసియేషన్లు, ఫెడరేషన్లు, కౌన్సిళ్లు, లీగ్‌లు, బోర్డులు, కమిటీలు.. ‘ఈక్వల్ పే’ అమలు చెయ్యడానికి అతి కష్టం మీదనైనా ఒళ్లొంచుతున్నాయి. నాలుగేళ్లు నిరసన భారతదేశపు అత్యుత్తమస్థాయి స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్.. ప్రైజ్ మనీలోని అసమానతలకు నిరసనగా 2012 నుంచి 2015 వరకు వరుసగా నాలుగేళ్లు ‘నేషనల్ స్క్వాష్ చాంపియన్ షిప్’ను బాయ్‌కాట్ చేశారు. ‘స్పోర్ట్స్‌మ్యాన్ స్పిరిట్ లేదు. డబ్బే ముఖ్యమా!’ అని ఆమెపై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ తన నిర్ణయం మీద తను ఉన్నారు. స్త్రీ పురుషులిద్దరికీ ప్రైజ్ మనీ సమానంగా ఉండేంత వరకు నేషనల్స్ ఆడేది లేదని కూడా స్పష్టంగా చెప్పారు. ఆమె ర్యాంకింగ్ పురుషుల కంటే కూడా ఎక్కువగా ఉండేది! నేటికీ తక్కువే మేరీ కోమ్, సైనా నెహ్వాల్, పి.వి.సింధు.. దేశానికి ఎంత గర్వకారణం! అయినా వివక్ష ఉంటోంది. స్త్రీ పురుష సమానత్వం, సాధికారత అని ఎంత మాట్లాడుకున్నా మనమింకా పురుష ప్రపంచంలోనే జీవిస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది నాకు. మన క్రీడా ప్రతిభ మెరుగైంది కానీ, క్రీడాకారిణులకు ఇచ్చే ప్రైజ్ మనీ పురుషులకు వచ్చే మొత్తం కన్నా తక్కువగానే ఉంటోంది. – సానియా మీర్జా, టెన్నిస్ స్టార్ (నిరుడు ‘ఫిక్కీ’ చర్చా వేదికపై) ఆటతో సాధించొచ్చు ఈక్వల్ పే ఉండాలి. ఈక్వల్ ప్రైజ్ మనీ ఉండాలి. ఆట తీరుతో కూడా వీటిని సాధించవచ్చు. గుడ్ బ్రాండ్ క్రికెట్ ఆడితే మంచి మార్కెటింగ్ జరుగుతుంది. మ్యాచిల వల్ల ఆదాయం వస్తుంది. పురుషుల ఆటల్లో వచ్చే లాభాల్లోంచి మాకేం పంచి పెట్టనక్కర్లేదు. మా విజయాల్లోని షేర్‌ను తీసుకోడానికే మేము ఇష్టపడతాం. మొత్తానికైతే పారితోషికాల విషయంలో మునుపటి కన్నా కొంత బెటర్ అయ్యాం. – మిథాలీ రాజ్, స్టార్ క్రికెటర్ (ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో) నమ్మకంగా చెప్పలేం ఆర్థికంగా కొంచెం మెరుగయినట్లే ఉంది. అయితే ఈక్వల్ ప్లేకి ఈక్వల్ పే ఉందా అని నమ్మకంగా చెప్పగలిగిన పరిస్థితి అయితే లేదు. పురుషులకు సమానంగా స్త్రీలకు ప్రైజ్ మనీ ఇవ్వాలి. – అపర్ణా పొపట్, బాడ్మింటన్ (గత ఏడాది ఎకనమిక్ టైమ్స్ ‘పనాచ్’ రౌండ్ టేబుల్ చర్చలో) పోలికే లేదు ప్రైజ్ మనీలోనే కాదు, అన్నిట్లోనూ మహిళా జట్లు, మహిళా క్రీడాకారులకు వివక్ష ఎదురౌతోంది. పురుషుల ఫుట్‌బాల్‌తో మహిళల ఫుట్‌బాల్‌ను పోల్చనే లేము. వాళ్ల లీగ్‌తో మా లీగ్‌ను పోల్చలేం. లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్‌ని (సక్సెస్ అయ్యేందుకు ఉండే అవకాశం) కూడా కంపేర్ చెయ్యలేం. ప్రతి దాంట్లోనూ ఇంతని చెప్పలేనంత అసమానత్వం ఉంది. – అదితి చౌహాన్, ఫుట్‌బాల్ గోల్ కీపర్ -
టెన్నిస్‌లో పురుషులకే ఎక్కువసార్లు శిక్ష
లాస్ ఏంజిల్స్: టెన్నిస్ క్రీడలో ఇప్పటిదాకా మహిళల కంటే పురుషులకే ఎక్కువ శిక్షలు, జరిమానాలు పడ్డాయని ఓ నివేదికలో తేలింది. గ్రాం డ్‌స్లామ్ టోర్నీల్లో గత 20 ఏళ్లలో ఆటగాళ్లకు 1517 సార్లు జరిమానాలు విధిస్తే... క్రీడాకారిణిలకు కేవలం 535 సార్లు మాత్రమే జరిమానాలు విధించినట్లు గణాంకాల ద్వారా వెల్లడైంది. 1998 నుంచి 2018 వరకు గ్రాండ్‌స్లామ్ టోర్నీ లను పరిశీలించగా 3 రెట్లు అధికంగా పురుషులకే శిక్షలు పడ్డాయని ఆ నివేదిక పేర్కొంది. ఆటగాళ్లు, క్రీడాకారిణిలు అసహనంతో చేసిన తప్పిదాలకు ఎవరెన్నిసార్లు శిక్షలకు గురయ్యారనే లెక్కలు కూడా ఉన్నాయి. కోర్టులో రాకెట్లను బద్దలు కొట్టిన సందర్భంలో పురుషులు 649 సార్లు, మహిళలు 99 సార్లు పాయింట్ల కోతకు గురయ్యారు. అనుచితంగా నోరు పారేసుకున్న ఘటనల్లో పురుషులు 344 సార్లు, మహిళలు 140 సార్లు, క్రీడాస్ఫూర్తికి విఘాతం కలిగించిన ఘటనల్లో పురుషులు 287 సార్లు, మహిళలు 67 సార్లు శిక్షకు గురయ్యారు. గత వారం యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో నయోమి ఒసాకా (జపాన్)తో మ్యాచ్ సందర్భంగా సెరెనా విలియమ్స్ ఒక్కసారిగా సహనం కోల్పో యిన సంగతి తెలిసిందే. చైర్ అంపైర్‌ను దూషించడంతో ఆయన అంతే తీవ్రంగా స్పందించి ఆమెకు పాయింట్ల కోత పెట్టారు. పురుషులు ఇలా చేస్తే అలాగే శిక్షించేవారా అని ఆమె గద్దించింది. సమానత్వం కోసం పోరాడుతున్నానని చెప్పుకొచ్చింది. సెరెనా నోరు పారేసుకోవడం ఇదేమి మొదటి సారి కాదు. 2009లో లైన్ విమెన్‌పై విరుచుకుపడింది. ఈ ఏడాది ఇండియన్ వెల్స్ టోర్నీలో మీడియా సమావేశంలో ఓ విలేకరిపై అసహనం ప్రదర్శించింది. -
పసిడి కాంతలు...
తొలి రోజు ఒకటి... రెండో రోజు ఒకటి... మూడో రోజు రెండు... నాలుగో రోజు మూడు... మొత్తానికి కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పసిడి పతకాల వేట మరింత జోరందుకుంది. ఈ ‘పసిడి’ పతకాల విజయ యాత్రలో అమ్మాయిలు తమ అద్వితీయ విన్యాసాలతో భారత్‌ను ముందుండి నడిపిస్తున్నారు. పోటీల నాలుగో రోజు ఆదివారం భారత క్రీడాకారిణులు తమ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. తొలుత వెయిట్‌లిఫ్టింగ్‌లో పూనమ్ యాదవ్ (69 కేజీలు) ‘లిఫ్ట్’కు బంగారు పతకం ఒడిలోకి చేరగా... ఆ తర్వాత షూటింగ్లో మను భాకర్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్) గురికి మరో పసిడి పతకం వచ్చేసింది. చివర్లో మహిళల టీటీ జట్టు ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సింగపూర్‌ను బోల్తా కొట్టించి ఈ క్రీడల చరిత్రలోనే తొలిసారి స్వర్ణాన్ని సొంతం చేసుకొని ఔరా అనిపించింది. గోల్డ్‌కోస్ట్: భారత్ తరఫున మొదటి మూడు రోజులు వెయిట్‌లిఫ్టర్లు పతకాలు కొల్లగొట్టగా... నాలుగోరోజు వీరి సరసన షూటర్లు, టీటీ క్రీడాకారిణులు కూడా చేరారు. ఫలితంగా కామన్వెల్త్ గేమ్స్‌లో ఆదివారం భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఒకేరోజు మూడు స్వర్ణాలు, రజతం, రెండు కాంస్యాలు కైవసం చేసుకుంది. ప్రస్తుతం భారత్ ఏడు స్వర్ణాలు, రెండు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. మను మళ్లీ మెరిసె... పతకాలు సాధించే విషయంలో తమపై పెట్టుకున్న అంచనాలను భారత షూటర్లు నిజం చేశారు. ఆదివారం మొదలైన షూటింగ్ ఈవెంట్ తొలి రోజే మన షూటర్లు స్వర్ణం, రజతం, కాంస్యం నెగ్గారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో హరియణాకు చెందిన 16 ఏళ్ల అమ్మాయి మను భాకర్ తన అద్వితీయ ఫామ్‌ను కొనసాగిస్తూ స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో ఆమె 240.9 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా ఈ క్రీడల చరిత్రలో పిన్న వయసులో స్వర్ణం నెగ్గిన భారత షూటర్‌గా ఆమె గుర్తింపు పొందింది. భారత్‌కే చెందిన హీనా సిద్ధూ 234 పాయింట్లు స్కోరు చేసి రజతం గెల్చుకుంది. గత నెలలో మెక్సికో ఆతిథ్యమిచ్చిన సీనియర్ ప్రపంచకప్‌లో రెండు స్వర్ణాలు, సిడ్నీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో రెండు స్వర్ణాలు నెగ్గిన మను అదే జోరును కామన్వెల్త్ గేమ్స్‌లోనూ కనబరిచి ప్రపంచకప్‌లలో తాను నెగ్గిన పసిడి పతకాలు గాలివాటమేమీ కాదని నిరూపించింది. క్వాలిఫయింగ్‌లో 388 పాయింట్లు... ఫైనల్లో 240.9 పాయింట్లు స్కోరు చేసి మను కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డులు నెలకొల్పడం విశేషం. మరోవైపు మహిళల స్కీట్ ఫైనల్లో భారత షూటర్ సానియా షేక్ నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్ రవి కుమార్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. ఫైనల్లో రవి 224 పాయింట్లు సాధించాడు. మరో భారత షూటర్ దీపక్ కుమార్ 162 పాయింట్లతో ఆరో స్థానానికి పరిమితమయ్యాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో మరో రెండు... వరుసగా నాలుగో రోజు భారత వెయిట్‌లిఫ్టర్లు స్వర్ణం సాధించడం విశేషం. మహిళల 69 కేజీల విభాగంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల పూనమ్ యాదవ్ మొత్తం 222 కేజీలు (స్నాచ్‌లో 100+క్లీన్ అండ్ జెర్క్‌లో 122) బరువెత్తి బంగారు పతకాన్ని గెల్చుకుంది. 2014 గ్లాస్కో గేమ్స్‌లో పూనమ్ 63 కేజీల విభాగంలో పోటీపడి కాంస్యం సాధించింది. పురుషుల 94 కేజీల విభాగంలో పంజాబ్‌కు చెందిన 24 ఏళ్ల వికాస్ ఠాకూర్ కాంస్య పతకాన్ని సాధించాడు. అతను మొత్తం 351 కేజీలు (స్నాచ్‌లో 159+క్లీన్ అండ్ జెర్క్‌లో 192) బరువెత్తి మూడో స్థానంలో నిలిచాడు. 2014 గ్లాస్కో గేమ్స్‌లో వికాస్ 85 కేజీల విభాగంలో రజతం గెలిచాడు. మహిళల 75 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ సీమా ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. మనిక మెరుపులు... ఆదివారం అన్నింటికంటే హైలైట్ భారత మహిళల టీటీ జట్టు ప్రదర్శన. టీమ్ విభాగంలో వరుసగా ఐదో స్వర్ణం సాధించాలని ఆశించిన ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సింగపూర్ జట్టును భారత్ బోల్తా కొట్టించింది. ఫైనల్లో భారత్ 3–1తో సింగపూర్‌ను ఓడించి ఈ క్రీడల చరిత్రలో తొలిసారి పసిడి పతకాన్ని దక్కించుకుంది. 2010 ఢిల్లీ గేమ్స్‌లో భారత మహిళల జట్టు సింగపూర్ చేతిలో ఓడి రజతంతో సంతృప్తి పడింది. ఈసారి విజేతగా నిలిచి బదులు తీర్చుకుంది. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల మనిక బాత్రా తాను ఆడిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో గెలిచి భారత చిరస్మరణీయ విజయంలో కీలకపాత్ర పోషించింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 58వ ర్యాంకర్ మనిక 11–8, 8–11, 7–11, 11–9, 11–7తో ప్రపంచ 4వ ర్యాంకర్ ఫెంగ్ తియన్వెను ఓడించి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌లో మధురిక ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌గా జరిగిన డబుల్స్‌లో మౌమా దాస్–మధురిక ద్వయం 11–7, 11–6, 8–11, 11–7తో యిహాన్ జూ – మెంగ్యు యూ జోడీని ఓడించడంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో మ్యాచ్‌లో మనిక 11–7, 11–4, 11–7తో యిహాన్ జూపై నెగ్గడంతో భారత్ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకోవడంతోపాటు స్వర్ణాన్ని గెల్చుకుంది. ‘‘ప్రపంచ నాలుగో ర్యాంకర్, ఒలింపిక్ పతక విజేతను నేను ఓడిస్తానని కలలో కూడా ఊహించలేదు. ఆమెపై గెలిచిన క్షణాన నేను ప్రపంచం శిఖరాన ఉన్నట్లు భావించాను’ అని మనిక వ్యాఖ్యానించింది. స్వర్ణ పతకాలతో భారత మహిళల టీటీ బృందం -
రేపటి నుంచి పైకా మహిళల క్రీడలు
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా పైకా మహిళల క్రీడలు సోమవారం నుంచి నిర్వహించనున్నారు. హైదరాబాద్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ (హెచ్‌డీఎస్‌ఏ) ఆధ్వర్యంలో మొదట 11న కబడ్డీ టోర్నీ ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. అనంతరం 13న ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, హాకీ టోర్నీ కమ్ సెలక్షన్ ట్రయల్స్ జింఖానా మైదానంలో నిర్వహిస్తారు. అదే రోజు ఎల్బీ స్టేడియంలో స్విమ్మింగ్ పోటీలు జరుగుతాయి. ఈనెల 16న జింఖానా మైదానంలో బాస్కెట్‌బాల్, టెన్నిస్, ఎల్బీ స్టేడియంలో బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, జిమ్నాస్టిక్స్ పోటీలు నిర్వహిస్తారు. 20న హ్యాండ్‌బాల్ పోటీలు ఎల్బీ స్టేడియంలో జరుగుతాయి. ఈ పోటీల్లో పాల్గొనే ఆసక్తి గల క్రీడాకారిణిలు వయస్సు ధృవీకరణ పత్రాలతో హాజరుకావాలి. ఇతర వివరాలకు జింఖానా మైదానంలోని హెచ్‌డీఎస్‌ఏ అధికారి ఎ.అలీమ్ ఖాన్ (040 27900649)ను సంప్రదించవచ్చు.