ముగింపు వేడుకల్లో ప్రసంగిస్తున్న చీఫ్ పీటర్ బెట్టీ
గోల్డ్‌కోస్ట్: కామన్‌వెల్త్ క్రీడల(2018) నిర్వాహకులు క్రీడాభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. ఆదివారం జరిగిన ముగింపు వేడుకల నిర్వహణ సక్రమంగా లేదని.. టీవీల్లో టెలికాస్టింగ్ కూడా సరిగ్గా జరగలేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గోల్డ్‌కోస్ట్ కామన్‌వెల్త్ గేమ్స్ చీఫ్ పీటర్ బెట్టీ స్పందించారు.
‘ సాధారణంగా ఒలంపిక్స్, కామన్‌వెల్త్ క్రీడల ప్రారంభ వేడుకల కన్నా.. ముగింపు వేడుకలు క్రీడాకారులకు ఉపశమనం అందించేలా.. అందరిలో ఉత్సాహం నింపేలా నిర్వహించటం ఆనవాయితీ. కానీ, ఆ విషయంలో మేం పొరపాట్లు చేశాం. ముగింపు వేడుకల ముందే క్రీడాకారులను మేం మైదానంలోకి(కర్రారా స్టేడియం) లోకి పిలిచాం. మైదానంలో కొద్దిపాటి ప్రేక్షకులే ఉన్నారనుకుని టెలివిజన్‌లో ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వారు పొరపాటు పడ్డారు. క్రీడాకారులు జెండాలతో పెరేడ్ నిర్వహించటం కూడా కొన్ని ఛానెళ్లు సరిగ్గా ప్రసారం చేయలేకపోయారు. దీనికితోడు కొందరు క్రీడాకారులు ఇచ్చిన ఉపన్యాసాలు సుదీర్ఘంగా ఉండటం కూడా అందరికీ విసుగును పుట్టించాయి. వెరసి ముగింపు వేడుకలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నేనే స్వయంగా క్షమాపణలు చెబుతున్నా అని బెట్టీ వరస ట్వీట్లలో పేర్కొన్నారు.
మరోవైపు కామన్‌వెల్త్ గేమ్స్ ప్రసార హక్కులు దక్కించుకున్న ఆస్ట్రేలియా ఛానెల్ ‘సెవెన్’ కూడా ప్రోగ్రామ్‌ను సరిగ్గా టెలికాస్ట్ చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తగా.. ఛానెల్ యాజమాన్యం కూడా ఓ ప్రకటనలో క్షమాపణలు తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment