
గోల్డ్‌కోస్ట్: ధనిక దేశాల్లో జరిగే ప్రతిష్టాత్మక క్రీడల్లో పాల్గొనేందుకు రావడం... జట్టు నుంచి పారిపోయి తలోదారి చూసుకోవడం పేద దేశాల అథ్లెట్లకు రివాజుగా మారిపోయింది. ఈసారి ఆస్ట్రేలియాలో కామెరూన్ అథ్లెట్లు ఐదుగురు జట్టు నుంచి తప్పించుకున్నారు. ఇందులో ముగ్గురు వెయిట్‌లిఫ్టర్లు ఒలివియెర్, అర్కెంజ్‌లైన్, ఫౌవోద్జి కాగా ఇద్దరు బాక్సర్లు క్రిస్టియాన్ ఎన్‌ద్జి, ఫొట్సల ఉన్నారు. వీరంతా కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు వచ్చారు. సందు చూసుకొని క్రీడాగ్రామం నుంచి తప్పించుకున్నారు.
మంగళవారం నుంచి పత్తాలేకుండా పోయారని కామెరూన్ వర్గాలు తెలిపాయి. ఫిర్యాదు అందుకున్న ఆస్ట్రేలియా పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 2000లో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌కు వచ్చిన వారిలో వందకు పైగా అథ్లెట్లు ఇలాగే తప్పించుకొని అనధికారికంగా ఉంటున్నట్లు తెలిసింది. కామెరూన్ మీడియా అధికారి సైమోన్ మొలొంబె మాట్లాడుతూ ఆటలాడేందుకు వచ్చిన అథ్లెట్లు చట్టాలను గౌరవించాలని సూచించారు.