డిస్టెన్స్ రన్నింగ్ మూడు విభాగాల్లోనూ పతకాలు నెగ్గిన తొలి మహిళా అథ్లెట్‌గా ఘనత
పారిస్: మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు, ఒక కాంస్యంతో కలిపి మూడు పతకాలు గెలిచిన నెదర్లాండ్స్ మహిళా అథ్లెట్ సిఫాన్ హసన్ ‘పారిస్’లోనూ మూడు పతకాలతో మెరిసింది. ‘పారిస్’లో ఇప్పటికే 5000 మీటర్లు, 10000 మీటర్ల విభాగాల్లో కాంస్య పతకాలు సాధించిన 31 ఏళ్ల సిఫాన్... ఆదివారం జరిగిన మారథాన్ రేసులో ఏకంగా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
42.195 కిలోమీటర్ల దూరాన్ని సిఫాన్ 2 గంటల 22 నిమిషాల 55 సెకన్లలో అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా పూర్తి చేసి కొత్త ఒలింపిక్ రికార్డును నమోదు చేసింది. 2012 లండన్ గేమ్స్‌లో 2 గంటల 23 నిమిషాల 7 సెకన్లతో జెలెనా టికి (ఇథియోపియా) నెలకొల్పిన ఒలింపిక్ రికార్డును సిఫాన్ సవరించింది.
తాజా విజయంతో సిఫాన్ కొత్త చరిత్ర సృష్టించింది. ఒకే ఒలింపిక్స్‌లో డిస్టెన్స్ రన్నింగ్ (5000, 10000 మీటర్లు, మారథాన్)లోని మూడు ఈవెంట్లలో పతకాలు గెలిచిన తొలి మహిళా అథ్లెట్‌గా సిఫాన్ గుర్తింపు పొందింది. పురుషుల్లో ఎమిల్ జటోపెక్ (చెక్ రిపబ్లిక్; 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో... 5000, 10000 మీటర్లు, మారథాన్) మూడు స్వర్ణ పతకాలు గెలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment