మరోసారి పతకాల పట్టికలో అగ్రస్థానం
వరుసగా నాలుగో ఒలింపిక్స్‌లో ఈ ఘనత
వరుసగా ఎనిమిదో స్వర్ణం నెగ్గి రికార్డు నెలకొల్పిన అమెరికా మహిళల బాస్కెట్‌బాల్ జట్టు
పారిస్: విశ్వ క్రీడల్లో చివరిరోజు ఆఖరి మెడల్ ఈవెంట్‌లో అమెరికా అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది. చివరి మెడల్ ఈవెంట్‌గా జరిగిన మహిళల బాస్కెట్‌బాల్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అమెరికా 67–66 పాయింట్ల తేడాతో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టును ఓడించింది. మహిళల బాస్కెట్‌బాల్ జట్టు స్వర్ణ పతకంతో పతకాల పట్టికలో అమెరికా జట్టు టాప్ ర్యాంక్‌ను ఖరారు చేసుకోవడం విశేషం. అమెరికా, చైనా జట్లు 40 స్వర్ణ పతకాలతో సమంగా నిలిచాయి. అయితే చైనాకంటే అమెరికా ఎక్కువ రజత పతకాలు, ఎక్కువ కాంస్య పతకాలు సాధించింది. దాంతో అమెరికాకు అగ్రస్థానం దక్కింది. ఫ్రాన్స్ జట్టుతో జరిగిన ఫైనల్లో అమెరికా మహిళల జట్టుకు గట్టిపోటీ ఎదురైంది.
ఒకదశలో అమెరికాకు ఓటమి తప్పదా అనిపించింది. ఆఖరి క్వార్టర్‌లో నాలుగు నిమిషాలు మిగిలి ఉన్నంతవరకు ఫ్రాన్స్ 53–52తో ఒక్క పాయింట్ ఆధిక్యంలో ఉంది. ఈ దశలో తమకు లభించిన ఫ్రీ త్రోను అమెరికా పాయింట్‌గా మలిచి స్కోరును 53–53తో సమం చేసింది. ఆ తర్వాత అమెరికా కీలక పాయింట్లు సాధిస్తూ ఆధిక్యంలోకి వెళ్లింది. 17 సెకన్లు మిగిలి ఉన్నాయనగా అమెరికా 63–59తో ముందంజలో నిలిచింది. ఈ దశలో తమకు లభించిన రెండు ఫ్రీ త్రోలను ఫ్రాన్స్ ప్లేయర్ మరీన్ జోన్స్ పాయింట్లుగా మలిచింది. దాంతో అమెరికా ఆధిక్యం 63–61గా మారింది.
11 సెకన్లు ఉన్నాయనగా అమెరికా ప్లేయర్ కెల్సీ ప్లమ్ రెండు పాయింట్లు సాధించి 65–61తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఐదు సెకన్లు ఉన్నాయనగా ఫ్రాన్స్ ప్లేయర్ గ్యాబీ విలియమ్స్ మూడు పాయింట్ల షాట్ సంధించడంతో అమెరికా ఆధిక్యం 65–64కు తగ్గింది. మూడు సెకన్లు ఉన్నాయనగా ఫ్రాన్స్ ప్లేయర్ ఫౌల్ చేయడంతో అమెరికాకు రెండు ఫ్రీ త్రోలు రావడం, వాటిని పాయింట్లుగా మలచడం జరిగింది. దాంతో అమెరికా 67–64తో ముందంజలోకి వెళ్లింది. చివరి క్షణంలో ఫ్రాన్స్ ప్లేయర్ మరీన్ జోన్స్ రెండు పాయింట్లు సాధించినా ఆతిథ్య జట్టు పాయింట్ తేడాతో ఓటమి చవిచూసింది.
అమెరికా జట్టులో విల్సన్ అజా 21 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలువగా... కెల్సీ ప్లమ్, కాపర్ కాలీ 12 పాయింట్ల చొప్పున సాధించారు. ఈ గెలుపుతో అమెరికా మహిళల బాస్కెట్‌బాల్ జట్టు ఒలింపిక్స్‌లో వరుసగా ఎనిమిదో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఓవరాల్‌గా అమెరికా మహిళల జట్టుకిది పదో స్వర్ణం. 1984 లాస్ ఏంజెలిస్, 1988 సియోల్ ఒలింపిక్స్‌లో స్వర్ణాలు నెగ్గిన అమెరికా జట్టు 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించింది. ఆ తర్వాత 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో అమెరికా మహిళల జట్టు పసిడి పతకాల వేట మళ్లీ మొదలై 2024 పారిస్ ఒలింపిక్స్ వరకు కొనసాగుతూనే ఉంది.
మరోవైపు శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల బాస్కెట్‌బాల్ ఫైనల్లో అమెరికా జట్టు 98–87 పాయింట్ల తేడాతో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టుపై గెలిచి ఓవరాల్‌గా 17వసారి పసిడి పతకాన్ని దక్కించుకుంది. అమెరికా జట్టులో స్టీఫెన్ కర్రీ త్రీ పాయింటర్ షాట్‌లను ఎనిమిదిసార్లు వేయడం విశేషం. దిగ్గజ ప్లేయర్లు కెవిన్ డురాంట్ 15 పాయింట్లు, లెబ్రాన్ జేమ్స్ 14 పాయింట్లు, డేవిడ్ బుకెర్ 15 పాయింట్లు సాధించారు.
14 అమెరికా సాధించిన స్వర్ణాల సంఖ్యలో అత్యధికంగా అథ్లెటిక్స్ నుంచి 14 పసిడి పతకాలు లభించాయి. ఆ తర్వాత స్విమ్మింగ్‌లో 8, జిమ్నాస్టిక్స్‌లో 3, బాస్కెట్‌బాల్, సైక్లింగ్ ట్రాక్, ఫెన్సింగ్, రెజ్లింగ్‌లో 2 చొప్పున స్వర్ణాలు దక్కాయి. సైక్లింగ్ రోడ్, ఫుట్‌బాల్, గోల్ఫ్, రోయింగ్, షూటింగ్, సరి్ఫంగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లో ఒక్కో స్వర్ణం చొప్పున లభించాయి.
19 ఇప్పటి వరకు 30 సార్లు ఒలింపిక్స్ క్రీడలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 19 సార్లు అమెరికా జట్టు పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. సోవియట్ యూనియన్ ఆరుసార్లు టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. యూనిఫైడ్ టీమ్, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, జర్మనీ ఒక్కోసారి మొదటి స్థానంలో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment