అందుబాటులో ఉన్న 8 స్వర్ణాలూ కైవసం
పారిస్ ఒలింపిక్స్ డైవింగ్ క్రీడాంశంలో చైనా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. అక్వాటిక్ సెంటర్‌లో అద్భుతాలు చేసిన చైనా డైవర్లు రికార్డు స్థాయిలో ఎనిమిది స్వర్ణాలతో ఈ విభాగంలో అందుబాటులో ఉన్న అన్ని పసిడి పతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు. శనివారం పురుషుల 10 మీటర్ల ప్లాట్‌ఫామ్ ఫైనల్లో డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్ కావో యున్ (చైనా) 547.50 పాయింట్లతో టాప్ ర్యాంక్ దక్కించుకున్నాడు.
తద్వారా ఒలింపిక్స్ డైవింగ్‌లో 1988 తర్వాత స్వర్ణం నిలబెట్టుకున్న మొదటి స్విమ్మర్‌గా కావో యున్ నిలిచాడు. అమెరికాకు చెందిన గ్రెగ్ లుగానిస్ 1984 లాస్ ఏంజెలెస్, 1988 సియోల్ ఒలింపిక్స్‌లో పసిడి పతకాలు నెగ్గాడు. తమాయి రికుటో (జపాన్; 507.65 పాయింట్లు), విలియమ్స్ నోహ్ (గ్రేట్ బ్రిటన్; 497.35 పాయింట్లు) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. గతంలో ఎనిమిదింట ఏడు పతకాలు నెగ్గిన చైనా... ఈసారి మాత్రం క్లీన్‌స్వీప్ చేసింది.
‘పారిస్’ క్రీడల్లో డైవింగ్ విభాగంలో జరిగిన మహిళల 3 మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్, పురుషుల 3 మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్, మహిళల 10 మీటర్ల ప్లాట్‌ఫామ్, పురుషుల సింక్రనైజ్డ్ 3 మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్, మహిళల సింక్రనైజ్డ్ 3 మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్, మహిళల సింక్రనైజ్డ్ 10 మీటర్ల ప్లాట్‌ఫామ్, పురుషుల సింక్రనైజ్డ్ 10 మీటర్ల ప్లాట్‌ఫామ్ పోటీల్లో చైనా స్విమ్మర్లు అగ్రస్థానాల్లో నిలిచి పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. చైనా డైవర్లు ఈ ఎనిమిది విభాగాల్లో స్వర్ణాలే కాకుండా.. మరో రెండు రజతాలు, ఒక కాంస్యం కూడా గెలిచి మొత్తంగా డైవింగ్‌లోనే 11 పతకాలు పట్టారు.
Comments
Please login to add a commentAdd a comment