డయానా టురాసి ‘సిక్సర్’
Diana Taurasi: ఒలింపిక్స్ బాస్కెట్‌బాల్‌లో అమెరికా క్రీడాకారిణి డయానా టురాసి చరిత్ర పుటల్లోకి ఎక్కింది. వరుసగా ఆరు స్వర్ణ పతకాలు సాధించిన ఏకైక బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా ఆమె గుర్తింపు పొందింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భాగంగా ఆదివారం జరిగిన మహిళల బాస్కెట్‌బాల్ ఫైనల్లో అమెరికా 67–66తో ఫ్రాన్స్‌ను ఓడించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ జట్టులో డయానా సభ్యురాలిగా ఉంది. 42 ఏళ్ల డయానా 2004 ఏథెన్స్, 2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లోనూ పసిడి పతకాలు గెలిచిన అమెరికా బాస్కెట్‌బాల్ జట్టులోనూ సభ్యురాలిగా ఉంది.
వెయిట్‌లిఫ్టింగ్‌లో చైనా హవా
పారిస్ ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో చైనా ఐదు స్వర్ణాలతో అదరగొట్టింది. చివరిరోజు మహిళల ప్లస్ 81 కేజీల విభాగంలో చైనా లిఫ్టర్ లీ వెన్‌వెన్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. లీ వెన్‌వెన్ మొత్తం 309 కేజీల (స్నాచ్‌లో 136 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 173 కేజీలు) బరువెత్తింది.
చైనా తరఫున ఈ క్రీడల్లో హు జీహుయ్ (49 కేజీలు), షిఫాంగ్ లువో (59 కేజీలు), లీ ఫాబిన్ (61 కేజీలు), లీ హువాన్‌హువా (102 కేజీలు) కూడా పసిడి పతకాలు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment