హెప్టాథ్లాన్‌లో ‘హ్యాట్రిక్’ స్వర్ణం
ఒలింపిక్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారిణిగా రికార్డు
పారిస్: ఒక్క క్రీడాంశంలో పోటీపడి ఒలింపిక్ పతకం గెలవాలంటేనే ఎన్నో ఏళ్లు శ్రమించాల్సి ఉంటుంది. అలాంటిది ఒకే ఈవెంట్‌లో ఏడు క్రీడాంశాలు ఉంటే ఎంత కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో బెల్జియం క్రీడాకారిణి నఫీసాటు థియామ్‌ను ఎంత ప్రశంసించినా తక్కువే. ఏడు క్రీడాంశాల సమాహారమైన ‘హెప్టాథ్లాన్’లో ఆమె వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకొని స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
తద్వారా ఒలింపిక్స్ చరిత్రలో హెప్టాథ్లాన్‌లో మూడు స్వర్ణాలు గెలిచిన ఏకైక క్రీడాకారిణిగా నఫీసాటు థియామ్ కొత్త చరిత్ర లిఖించింది. హెప్టాథ్లాన్‌లో 100 మీటర్ల హర్డిల్స్ రేసు, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్ల రేసు, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్ల రేసు ఉంటాయి. ఈ ఏడింటిలో ఆయా అథ్లెట్స్ సాధించిన పాయింట్ల ఆధారంగా టాప్–3లో నిలిచిన వారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందజేస్తారు.
పారిస్ ఒలింపిక్స్‌లో 29 ఏళ్ల నఫీసాటు 6880 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌లో నిలిచింది. 2016 రియో ఒలింపిక్స్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ నఫీసాటు పసిడి పతకాలు సాధించింది. ప్రస్తుత వరల్డ్ చాంపియన్ కాటరీనా జాన్సన్ థాంప్సన్ (బ్రిటన్; 6844 పాయింట్లు) రజతం, నూర్ విడిట్స్ (బెల్జియం; 6707 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment