భారత్‌కు ఒకే రోజు ఏడు పతకాలు
బ్యాడ్మింటన్‌లో నితేశ్‌కు...జావెలిన్ త్రోలో సుమిత్‌కు స్వర్ణాలు
రజతాలు నెగ్గిన సుహాస్, తులసిమతి, యోగేశ్
ఆర్చరీలో శీతల్–రాకేశ్ జోడీకి కాంస్యం
షట్లర్ మనీషాకు కాంస్యం
పారాలింపిక్స్‌లో సోమవారం భారత క్రీడాకారులు పతకాల మోత మోగించారు. రెండు స్వర్ణ పతకాలు, మూడు రజతాలు, రెండు తో కలిపి మొత్తం ఏడు పతకాలను సొంతం చేసుకున్నారు. ఒకే రోజు భారత్ ఖాతాలో రెండు పసిడి పతకాలు చేరడం విశేషం.
ముందుగా తొలిసారి పారాలింపిక్స్ లో ఆడుతున్న షట్లర్ నితేశ్ కుమార్ బంగారు పతకంతో అదరగొట్టగా... మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ అదే ప్రదర్శనను ‘పారిస్’లోనూ పునరావృతం చేశాడు. తద్వారా దేవేంద్ర ఝఝారియా, అవని లేఖరా తర్వాత పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణ పతకాలు గెలిచిన మూడో భారత ప్లేయర్‌గా సుమిత్ అంటిల్ గుర్తింపు పొందాడు.
పారిస్: అంచనాలను అందుకుంటూ భారత దివ్యాంగ క్రీడాకారులు సోమవారం పారాలింపిక్స్‌లో అదరగొట్టారు. ఏడు పతకాలతో తమ సత్తాను చాటుకున్నారు. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్‌ఎల్3 కేటగిరీలో నితేశ్ కుమార్ చాంపియన్‌గా అవతరించాడు. డేనియల్ బెథెల్ (బ్రిటన్) తో జరిగిన ఫైనల్లో నితేశ్ 21–14, 18–21, 23–21తో గెలుపొందాడు.
నిర్ణాయక మూడో గేమ్‌లో నితేశ్ రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని నెగ్గడం విశేషం. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్‌ఎల్4 కేటగిరీలో ఐఏఎస్ ఆఫీసర్ సుహాస్ యతిరాజ్ మరోసారి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. గత టోక్యో పారాలింపిక్స్‌లోనూ రన్నరప్‌గా నిలిచిన సుహాస్ ఈసారీ రెండో స్థానాన్ని సంపాదించాడు. ఫైనల్లో 41 ఏళ్ల సుహాస్ 9–21, 13–21తో డిఫెండింగ్ చాంపియన్ లుకాస్ మజుర్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్‌యు5 కేటగిరీలో భారత క్రీడాకారిణులు తులసిమతి రజతం పతకం నెగ్గగా ... మనీషా రామదాస్ కాంస్య పతకాన్ని సంపాదించింది. ఫైనల్లో తులసిమతి 17–21, 10–21తో యాంగ్ కియు జియా (చైనా) చేతిలో ఓడింది.
కాంస్య పతక మ్యాచ్‌లో మనీషా 21–12, 21–8తో కేథరీన్ రొసెన్‌గ్రెన్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్4 కాంస్య పతక మ్యాచ్‌లో భారత ప్లేయర్ సుకాంత్ కదమ్ 17–21, 18–21తో ఫ్రెడీ సెతియవాన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు.
‘సూపర్’ సుమిత్
అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతంతో కలిసి రెండు పతకాలు దక్కాయి. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 కేటగిరీలో డిఫెండింగ్ చాంపియన్ సుమిత్ అంటిల్ తన పసిడి పతకాన్ని నిలబెట్టుకున్నాడు. సుమిత్ రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 70.59 మీటర్ల దూరం విసిరాడు. ఈ ప్రయత్నం సుమిత్‌కు పసిడి పతకాన్ని ఖరారు చేసింది. నిరీ్ణత ఆరు త్రోల తర్వాత కూడా ఇతర అథ్లెట్లు సుమిత్ దరిదాపులకు రాలేకపోయారు. అంతకుముందు పురుషుల డిస్కస్ త్రో ఎఫ్56 కేటగిరీలో భారత అథ్లెట్ యోగేశ్ కథునియా రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. యోగేశ్ డిస్క్‌ను 42.22 మీటర్ల దూరం విసిరాడు.
శీతల్–రాకేశ్ జోడీకి కాంస్యం
ఆర్చరీ మిక్స్‌డ్ కాంపౌండ్ టీమ్ విభాగంలో శీతల్ దేవి–రాకేశ్ కుమార్ జంట కాంస్య పతకాన్ని దక్కించుకుంది. కాంస్య పతక మ్యాచ్‌లో శీతల్–రాకేశ్ 156–155తో ఎలెనోరా సారి్ట–మాటియో బొనాసినా (ఇటలీ) జంటపై గెలిచింది. సెమీఫైనల్లో శీతల్–రాకేశ్ ద్వయం ‘షూట్ ఆఫ్’లో ఇరాన్ చేతిలో ఓడిపోయి ఫైనల్ చేరలేకపోయింది. షూటింగ్‌లో నిహాల్ సింగ్, అమీర్ అహ్మద్ భట్ మిక్స్‌డ్ 25 మీటర్ల పిస్టల్ ఎస్‌హెచ్1 కేటగిరీలో క్వాలిఫయింగ్‌లోనే వెనుదిగిరారు. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ 3 స్వర్ణాలు, 5 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి 14 పతకాలతో 14వ స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment