రెండు సింగిల్స్ విభాగాల్లో ఫైనల్లోకి
ఎస్‌ఎల్–4 కేటగిరీలో సుహాస్, ఎస్‌ఎల్–3 కేటగిరీలో నితేశ్ ఫైనల్లోకి
మహిళల అథ్లెటిక్స్ 200 మీటర్ల విభాగంలో కాంస్యం గెలిచిన ప్రీతి
పారిస్: పారాలింపిక్స్‌లో ఆదివారం భారత షట్లర్లు మెరిపించారు. పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్–4 కేటగిరీలో సుహాస్ యతిరాజ్... ఎస్‌ఎల్–3 కేటగిరీలో నితేశ్ కుమార్ ఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం రజత పతకాలను ఖరారు చేసుకున్నారు. 2007 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన సుహాస్ గత టోక్యో పారాలింపిక్స్‌లోనూ ఫైనల్‌కు చేరి రజత పతకం దక్కించుకున్నాడు. ఈసారి సెమీఫైనల్లో సుహాస్ 21–17, 21–12తో భారత్‌కే చెందిన సుకాంత్ కదమ్‌ను ఓడించాడు.
మరో విభాగం సెమీఫైనల్లో నితేశ్ 21–16, 21–12తో దైసుకె ఫుజిహారా (జపాన్)పై గెలిచి తొలిసారి పారాలింపిక్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు. నేడు జరిగే ఫైనల్స్‌లో టోక్యో పారాలింపిక్స్ చాంపియన్ లుకాస్ మజుర్ (ఫ్రాన్స్)తో సుహాస్; డేనియల్ బెథెలి (బ్రిటన్)తో నితేశ్ తలపడతారు. మహిళల సింగిల్స్ ఎస్‌యు5 కేటగిరీలో ఇద్దరు భారత క్రీడాకారిణులు తులసిమతి మురుగేశన్, మనీషా రామదాస్ సెమీఫైనల్లో పోటీపడనున్నారు. ఇద్దరిలో ఒకరు ఫైనల్‌కు చేరుకోనుండటంతో ఈ విభాగంలోనూ భారత్‌కు కనీసం రజతం లభించనుంది. ఈరోజు జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో ఫ్రెడీ సెతియావాన్ (ఇండోనేసియా)తో సుకాంత్ తలపడతాడు.
ప్రీతికి రెండో పతకం
మహిళల అథ్లెటిక్స్ టి35 200 మీటర్ల విభాగంలో భారత అథ్లెట్ ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని సాధించింది. ప్రీతి 200 మీటర్ల దూరాన్ని 30.01 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. టి35 100 మీటర్ల విభాగంలోనూ ప్రీతికి కాంస్య పతకం లభించిన సంగతి తెలిసిందే.
రాకేశ్‌కు దక్కని కాంస్యం
పురుషుల ఆర్చరీ కాంపౌండ్ ఓపెన్ విభాగంలో భారత ప్లేయర్ రాకేశ్ కుమార్ కాంస్య పతక మ్యాచ్‌లో ఓడిపోయాడు. హి జిహావో (చైనా)తో జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో రాకేశ్ 146–147 స్కోరుతో పరాజయం పాలయ్యాడు.
రవికి ఐదో స్థానం
పురుషుల షాట్‌పుట్ ఎఫ్40 కేటగిరీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు రవి రొంగలి ఐదో స్థానంలో నిలిచాడు. ఇనుప గుండును రవి 10.63 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది ఆసియా పారా గేమ్స్‌లో రజతం గెలిచిన రవి ఈసారి తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినా ఫలితం లేకపోయింది. మిగెల్ మోంటెరో (పోర్చుగల్; 11.21 మీటర్లు) స్వర్ణం సాధించాడు. మరోవైపు మహిళల 1500 మీటర్ల టి11 విభాగం తొలి రౌండ్‌లో భారత అథ్లెట్ రక్షిత రాజు 5 నిమిషాల 29.92 సెకన్లలో గమ్యానికి చేరి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది.
షూటర్ల గురి కుదరలేదు
భారత షూటర్లకు ఆదివారం అచి్చరాలేదు. ఆదివారం లక్ష్యంపై గురి పెట్టిన ఏ షూటర్ కూడా పోడియంపై నిలువలేకపోయాడు. మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (ఎస్‌హెచ్1) ఈవెంట్‌లో అవని లేఖరా 11వ స్థానంలో నిలువగా, సిద్ధార్థ బాబు 28వ స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. ఇదే విభాగం వ్యక్తిగత ఈవెంట్‌లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన అవని గురి ‘మిక్స్‌డ్’లో మాత్రం కుదర్లేదు. ఆమె 632.8 స్కోరు చేయగా, సిద్ధార్థ 628.3 స్కోరు చేశాడు. ఈ ఈవెంట్‌ల్లో టాప్–8 స్థానాల్లో నిలిచిన వారే ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (ఎస్‌హెచ్2) ఈవెంట్‌లోనూ శ్రీహర్ష రామకృష్ణకు క్వాలిఫయింగ్‌లోనే చుక్కెదురైంది. అతను 630.2 స్కోరుతో 26వ స్థానంలో నిలిచాడు.
రోయింగ్‌లో నిరాశ భారత రోయింగ్ జోడీ కొంగనపల్లి నారాయణ–
అనితకు పారాలింపిక్స్‌లో నిరాశ ఎదురైంది. ఆసియా పారా క్రీడల్లో రజత పతకం నెగ్గుకొచి్చన ఈ జంట పారిస్ నుంచి రిక్తహస్తాలతో రానుంది. ఆదివారం జరిగిన పీఆర్3 మిక్స్‌డ్ డబుల్ స్కల్స్ రోయింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నారాయణ–అనిత జోడీ ఓవరాల్‌గా ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. 7 నుంచి 12వ స్థానాల కోసం నిర్వహించిన వర్గీకరణ పోటీల్లో భారత ద్వయానికి 8వ స్థానం దక్కింది. ఈ జంట పోటీని 8 నిమిషాల 16.96 సెకన్లలో పూర్తి చేసింది. ఆర్మీ సిపాయి అయిన కొంగనపల్లి నారాయణ 2015లో జమ్మూ కశీ్మర్‌లోని సరిహద్దు విధుల్లో ఉండగా ల్యాండ్‌మైన్ పేలి ఎడమ కాలిని మోకాలు నుంచి పాదం వరకు పూర్తిగా కోల్పోయాడు. అనిత రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment