Indian shuttlers
-
‘పసిడి’ వేటలో భారత షట్లర్లు
పారిస్: పారాలింపిక్స్‌లో ఆదివారం భారత షట్లర్లు మెరిపించారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్–4 కేటగిరీలో సుహాస్ యతిరాజ్... ఎస్ఎల్–3 కేటగిరీలో నితేశ్ కుమార్ ఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం రజత పతకాలను ఖరారు చేసుకున్నారు. 2007 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన సుహాస్ గత టోక్యో పారాలింపిక్స్‌లోనూ ఫైనల్‌కు చేరి రజత పతకం దక్కించుకున్నాడు. ఈసారి సెమీఫైనల్లో సుహాస్ 21–17, 21–12తో భారత్‌కే చెందిన సుకాంత్ కదమ్‌ను ఓడించాడు. మరో విభాగం సెమీఫైనల్లో నితేశ్ 21–16, 21–12తో దైసుకె ఫుజిహారా (జపాన్)పై గెలిచి తొలిసారి పారాలింపిక్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు. నేడు జరిగే ఫైనల్స్‌లో టోక్యో పారాలింపిక్స్ చాంపియన్ లుకాస్ మజుర్ (ఫ్రాన్స్)తో సుహాస్; డేనియల్ బెథెలి (బ్రిటన్)తో నితేశ్ తలపడతారు. మహిళల సింగిల్స్ ఎస్యు5 కేటగిరీలో ఇద్దరు భారత క్రీడాకారిణులు తులసిమతి మురుగేశన్, మనీషా రామదాస్ సెమీఫైనల్లో పోటీపడనున్నారు. ఇద్దరిలో ఒకరు ఫైనల్‌కు చేరుకోనుండటంతో ఈ విభాగంలోనూ భారత్‌కు కనీసం రజతం లభించనుంది. ఈరోజు జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో ఫ్రెడీ సెతియావాన్ (ఇండోనేసియా)తో సుకాంత్ తలపడతాడు. ప్రీతికి రెండో పతకం మహిళల అథ్లెటిక్స్ టి35 200 మీటర్ల విభాగంలో భారత అథ్లెట్ ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని సాధించింది. ప్రీతి 200 మీటర్ల దూరాన్ని 30.01 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. టి35 100 మీటర్ల విభాగంలోనూ ప్రీతికి కాంస్య పతకం లభించిన సంగతి తెలిసిందే. రాకేశ్‌కు దక్కని కాంస్యం పురుషుల ఆర్చరీ కాంపౌండ్ ఓపెన్ విభాగంలో భారత ప్లేయర్ రాకేశ్ కుమార్ కాంస్య పతక మ్యాచ్‌లో ఓడిపోయాడు. హి జిహావో (చైనా)తో జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో రాకేశ్ 146–147 స్కోరుతో పరాజయం పాలయ్యాడు. రవికి ఐదో స్థానం పురుషుల షాట్‌పుట్ ఎఫ్40 కేటగిరీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు రవి రొంగలి ఐదో స్థానంలో నిలిచాడు. ఇనుప గుండును రవి 10.63 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది ఆసియా పారా గేమ్స్‌లో రజతం గెలిచిన రవి ఈసారి తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినా ఫలితం లేకపోయింది. మిగెల్ మోంటెరో (పోర్చుగల్; 11.21 మీటర్లు) స్వర్ణం సాధించాడు. మరోవైపు మహిళల 1500 మీటర్ల టి11 విభాగం తొలి రౌండ్లో భారత అథ్లెట్ రక్షిత రాజు 5 నిమిషాల 29.92 సెకన్లలో గమ్యానికి చేరి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది. షూటర్ల గురి కుదరలేదు భారత షూటర్లకు ఆదివారం అచి్చరాలేదు. ఆదివారం లక్ష్యంపై గురి పెట్టిన ఏ షూటర్ కూడా పోడియంపై నిలువలేకపోయాడు. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (ఎస్‌హెచ్1) ఈవెంట్లో అవని లేఖరా 11వ స్థానంలో నిలువగా, సిద్ధార్థ బాబు 28వ స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. ఇదే విభాగం వ్యక్తిగత ఈవెంట్లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన అవని గురి ‘మిక్స్డ్’లో మాత్రం కుదర్లేదు. ఆమె 632.8 స్కోరు చేయగా, సిద్ధార్థ 628.3 స్కోరు చేశాడు. ఈ ఈవెంట్ల్లో టాప్–8 స్థానాల్లో నిలిచిన వారే ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (ఎస్‌హెచ్2) ఈవెంట్లోనూ శ్రీహర్ష రామకృష్ణకు క్వాలిఫయింగ్‌లోనే చుక్కెదురైంది. అతను 630.2 స్కోరుతో 26వ స్థానంలో నిలిచాడు. రోయింగ్‌లో నిరాశ భారత రోయింగ్ జోడీ కొంగనపల్లి నారాయణ–అనితకు పారాలింపిక్స్‌లో నిరాశ ఎదురైంది. ఆసియా పారా క్రీడల్లో రజత పతకం నెగ్గుకొచి్చన ఈ జంట పారిస్ నుంచి రిక్తహస్తాలతో రానుంది. ఆదివారం జరిగిన పీఆర్3 మిక్స్డ్ డబుల్ స్కల్స్ రోయింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నారాయణ–అనిత జోడీ ఓవరాల్‌గా ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. 7 నుంచి 12వ స్థానాల కోసం నిర్వహించిన వర్గీకరణ పోటీల్లో భారత ద్వయానికి 8వ స్థానం దక్కింది. ఈ జంట పోటీని 8 నిమిషాల 16.96 సెకన్లలో పూర్తి చేసింది. ఆర్మీ సిపాయి అయిన కొంగనపల్లి నారాయణ 2015లో జమ్మూ కశీ్మర్లోని సరిహద్దు విధుల్లో ఉండగా ల్యాండ్‌మైన్ పేలి ఎడమ కాలిని మోకాలు నుంచి పాదం వరకు పూర్తిగా కోల్పోయాడు. అనిత రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయింది. -
భారత షట్లర్లకు నిరాశ
సియోల్: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. బరిలోకి దిగిన యువ షట్లర్లు అష్మిత చాలిహా, మాళవిక, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే పరాజయం పాలయ్యారు. బుధవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ 53వ ర్యాంకర్ అష్మిత 8–21, 13–21తో 17వ ర్యాంకర్ పోన్‌పావీ చోచువాంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. మరో మ్యాచ్‌లో ప్రపంచ 41వ ర్యాంకర్ మాళవిక 21–18, 15–21, 17–21తో 18వ ర్యాంకర్ లిన్ హోజ్మార్క్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడిపోయింది. ఆకర్షి 15–21, 15–21తో లిన్ క్రిస్టోఫర్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం చవిచూసింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో ఆయుశ్ రాజ్ గుప్తా–శ్రుతి జంట 7–21, 12–21తో కో సంగ్ హ్యాన్–ఇయోమ్ హ్యూ వోన్ (కొరియా) జోడీ చేతిలో ఓడింది. -
చరిత్ర సృష్టించిన సాత్విక్–చిరాగ్ జోడీ.. 52 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం
దుబాయ్: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఒక పతకం ఖాయమైంది. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–11, 21–12తో అహసాన్–హెంద్రా సెతియవాన్ (ఇండోనేసియా) జోడీని ఓడించింది. HISTORY SCRIPTED 🥳🥳🥳 ➡️ Sat-Chi assured medal for India after 52 years in MD category ➡️ Medal from Indian doubles department after 9 years Well done boys, proud of you! 🥹🫶@himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #BAC2023#IndiaontheRise#Badminton pic.twitter.com/dz5dG4n7Xe — BAI Media (@BAI_Media) April 28, 2023 ఈ గెలుపుతో సాత్విక్–చిరాగ్ జోడీ 52 ఏళ్ల తర్వాత ఆసియా చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్‌లో పతకాన్ని ఖరారు చేసుకున్న భారతీయ జోడీగా గుర్తింపు పొందింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ పీవీ సింధు 21–18, 5–21, 9–21తో ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. కాంటా సునెయామ (జపాన్)తో జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో హెచ్ఎస్ ప్రణయ్ తొలి గేమ్‌ను 11–21తో కోల్పోయి, రెండో గేమ్‌లో 9–13తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగాడు. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 18–21, 21–19, 15–21తో దెజాన్–గ్లోరియా విద్జాజా (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. -
Badminton Asia Championships 2023: అదృష్టాన్ని పరీక్షించుకోనున్న భారత షట్లర్లు
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరో మెగా టోర్నీకి సిద్ధమయ్యారు. దుబాయ్‌లో నేడు మొదలయ్యే ఆసియా బ్యాడ్మింటన్ వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. 61 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో భారత స్టార్స్ సైనా నెహ్వాల్ మూడు కాంస్య పతకాలు (2010, 2016, 2018), పీవీ సింధు (2014, 2022) రెండు కాంస్య పతకాలు సాధించారు. అయితే ఈ ఏడాది సైనా నెహ్వాల్ బరిలోకి దిగడంలేదు. -
All England Badminton Tourney: సీడింగ్ లేకుండానే బరిలోకి భారత ఆటగాళ్లు
ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నేడు (మార్చి 14) బర్మింగ్‌హామ్‌లో మొదలుకానుంది. 2001లో పుల్లెల గోపీచంద్ తర్వాత మరో భారత ప్లేయర్ ఈ టోర్నీ టైటిల్‌ను సాధించలేకపోయాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్ టైటిల్ కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2009 తర్వాత తొలిసారి భారత క్రీడాకారులెవరికీ సీడింగ్ లభించలేదు. -
Malaysia Masters Badminton Tourney: భారత్‌కు నిరాశాజనక ఫలితాలు
మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత్‌కు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 14–21, 14–21తో పియర్లీ టాన్–తినా (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది. భారత్‌కే చెందిన అశ్విని–శిఖా; దండు పూజ–ఆరతి జోడీలు కూడా తొలి రౌండ్లోనే ఓడిపోయాయి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మాళవిక 10–21, 17–21తో గో జిన్ వె (మలేసియా) చేతిలో ఓటమి పాలైంది. -
లక్ష్యసేన్‌కు నిరాశ
బాలి: ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రోజు భారత షట్లర్లకు ఏ మాత్రం కలిసిరాలేదు. పురుషుల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన లక్ష్యసేన్, పారుపల్లి కశ్యప్ తొలి రౌండ్లోనే ఓడి ఇంటిదారి పట్టారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21–23, 15–21తో ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో పోరాడి ఓడాడు. 54 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ తొలి గేమ్‌ను చేజేతులా కోల్పోయాడు. ఇరు ఆటగాళ్ల మధ్య ఆధిక్యం పలుమార్లు మారిన తొలి గేమ్‌లో లక్ష్యసేన్ ఒక దశలో 18–14తో ఆధిక్యంలో ఉన్నాడు. కీలక సమయంలో మొమోటా చాంపియన్ ఆటతో వరుసగా ఆరు పాయింట్లు సాధించి 20–18తో ఆధిక్యంలోకి వచ్చాడు. వెంటనే తేరుకున్న లక్ష్యసేన్ వరుసగా మూడు పాయింట్లు సాధించి 21–20తో గేమ్ పాయింట్‌కు వెళ్లాడు. మరోసారి తన అనుభవాన్ని ఉపయోగించిన మొమోటా వరుసగా మూడు పాయింట్లు సాధించి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండో గేమ్‌లో మరింత దూకుడు కనబర్చిన జపాన్ షట్లర్ మ్యాచ్‌ను ముగించేశాడు. మరో పోరులో కశ్యప్ 11–21, 14–21తో లోహ్ కీన్ య్యూ (సింగపూర్) చేతిలో వరుస సెట్లలో ఓడాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ధ్రువ్ కపిల–అర్జున్ ద్వయం 20–22, 13–21తో చోయ్ సొల్జ్యూ– కిమ్ వోన్హూ (కొరియా) జంట చేతిలో... మిక్స్డ్ డబుల్స్‌లో ప్రసాద్–జుహి దేవాంగన్ జోడీ 12–21, 4–21తో జన్సెన్– లిండా ఎఫ్లర్ (జర్మనీ) జంట చేతిలో ఓడాయి. -
Uber Cup: ఐదేళ్ల తర్వాత... తొలిసారిగా..
అర్హుస్ (డెన్మార్క్): ప్రపంచ చాంపియన్ పీవీ సింధు లేకపోయినా... గాయం కారణంగా మరో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ సేవలు అందుబాటులో లేకపోయినా... భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు అద్భుత ఆటతీరుతో ఉబెర్ కప్ టోర్నమెంట్లో నాకౌట్ దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–1తో స్కాట్లాండ్ జట్టును ఓడించింది. వరుసగా రెండో విజయం నమోదు చేసిన భారత్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. నాలుగు జట్లున్న గ్రూప్ ‘బి’లో భారత్, థాయ్‌లాండ్ జట్లు రెండేసి విజయాలు సాధించి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత పొందాయి. నేడు థాయ్ లాండ్, భారత్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ద్వారా గ్రూప్ విజేత ఎవరో తేలుతుంది. 2014, 2016ల లో ఉబెర్‌కప్‌లో సెమీఫైనల్ చేరుకొని తమ అత్యు త్తమ ప్రదర్శన కనబరిచిన భారత జట్టు 2018లో లీగ్ దశలోనే వెనుదిరిగింది. ఐదేళ్ల విరామం తర్వాత భారత్ మళ్లీ నాకౌట్ దశకు చేరుకుంది. స్కాట్లాండ్తో జరిగిన పోటీలో తొలి మ్యాచ్‌లో ప్రపంచ 104వ ర్యాంకర్ మాళవిక బన్సోద్ 13–21, 9–21తో ప్రపంచ 26వ ర్యాంకర్ క్రిస్టీ గిల్మోర్ చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో అదితి భట్ 21–14, 21–8తో రాచెల్ సుగ్డెన్‌పై నెగ్గి స్కోరును 1–1తో సమం చేసింది. మూడో మ్యాచ్‌లో తనీషా–రితూపర్ణ ద్వయం 21–11, 21–8తో జూలీ–క్లారా టోరెన్స్ జోడీపై గెలిచి భారత్ ఆధిక్యాన్ని 2–1కి పెంచింది. నాలుగో మ్యాచ్‌లో తస్నీమ్ మీర్ 21–15, 21–6తో లౌరెన్ మిడిల్టన్ను ఓడించి 3–1తో భారత్ విజయాన్ని ఖరారు చేసింది. నామమాత్రమైన ఐదో మ్యాచ్‌లో త్రిసా జాలీ–గాయత్రి గోపీచంద్ జోడీ 21–8, 19–21, 21–10తో క్రిస్టీ గిల్మోర్–ఎలానోర్ జంటపై గెలిచింది. చదవండి: DC vs KKR, Qualifier 2: చెన్నైని ఢీ కొట్టేదెవరు? -
క్వార్టర్స్‌లో వృశాలి
వ్లాదివోస్టాక్ (రష్యా): భారత యువ షట్లర్ గుమ్మడి వృశాలి రష్యా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ వరల్డ్ సూపర్–100 టోర్నమెంట్లో సత్తా చాటింది. ప్రిక్వార్టర్స్‌లో ప్రత్యర్థిని వరుస సెట్లలో చిత్తు చేసిన వృశాలి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆమెతో పాటు రితూపర్ణ దాస్, సౌరభ్ వర్మ, మిథున్ మంజునాథ్, శుభాంకర్ డే క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో వృశాలి 21–11, 21–13తో బయోల్ లిమ్ లీ (కొరియా)పై అద్భుత విజయం సొంతం చేసుకుంది. 24 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో వృశాలి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. మరో మ్యాచ్‌లో రితూపర్ణ దాస్ 13–21, 21–17, 21–19తో రెండో సీడ్ యింగ్ యింగ్ లీ (మలేసియా)పై పోరాడి గెలిచింది. తొలి గేమ్‌లో ఓడిన రితూపర్ణ వెంటనే పుంజుకొని వరుసగా రెండు గేమ్‌లు నెగ్గి మ్యాచ్ సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ సౌరభ్ వర్మ 21–11, 21–9తో సెర్గే సిరాంత్ (రష్యా)పై; మిథున్ 21–16, 21–13తో కోజి నైటో (జపాన్)పై; ఐదో సీడ్ శుభాంకర్ డే 21–11, 21–19తో సిద్ధార్థ్ ప్రతాప్ సింగ్ (భారత్)పై గెలిచి క్వార్టర్స్ చేరారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మరో భారత క్రీడాకారిణి ముగ్ధా ఆగ్రే 4–21, 13–21తో ఐరిస్ వాంగ్ (అమెరికా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సౌరభ్ శర్మ–అనౌష్క పారిఖ్ జోడీ 21–6, 21–12తో ఆర్టెమ్ సెర్పియానోవ్–అనస్తాసియా పుస్తిన్స్కయా (రష్యా) ద్వయంపై; రోహన్ కపూర్–కుహూ గార్గ్ జంట 21–10, 21–14 తో అలెక్సీ పనోవ్–పొలీనా మక్కోవీవా (రష్యా) జోడీపై గెలిచింది. -
భారత్‌కు 11 పతకాలు
పారా బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్ బకింగ్‌హామ్‌షైర్ (ఇంగ్లండ్): పారా బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు సత్తా చాటారు. ఈ టోర్నీలో మన ఆటగాళ్లు మొత్తం 11 పతకాలు గెలుచుకున్నారు. ఇందులో నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్యాలు ఉన్నాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో (ఎస్ఎల్ 4 కేటగిరీ) తరుణ్ తన టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ తరుణ్ 18-21, 21-10, 21-15తో ల్యూకాస్ మాజుర్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. పురుషుల సింగిల్స్ (ఎస్ఎల్ 3 కేటగిరీ)లో ప్రమోద్ భగత్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో భగత్ 16-21, 21-3, 21-16తో డిఫెండింగ్ చాంపియన్ ఫామ్ ట్రంగ్ (వియత్నాం)పై సంచలన విజయం సాధించాడు. పురుషుల డబుల్స్ (ఎస్ఎస్3 ఎస్ఎల్4)లో స్వర్ణ, రజతాలతో పాటు మిక్స్డ్ డబుల్స్‌లో కూడా భారత్ స్వర్ణం గెలుచుకుంది. పారా బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్ ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది.