mens singles
-
విన్నర్ సినెర్...
ఒకరేమో ఇప్పటికే ఆడిన రెండు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో విజేతగా నిలువగా... మరొకరు ఆడిన రెండు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఓడిపోయారు. గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఎలా గెలవాలో ఇప్పటికే ఒకరికి అనుభవం ఉండగా... మరొకరికి ఆ అనుభవం లేదు. అయితేనేం ముచ్చటగా మూడో ప్రయత్నంలోనైనా ‘గ్రాండ్’ విజయాన్ని అందుకోవాలని ఒకరు... వరుసగా మూడోసారీ ‘గ్రాండ్’ టైటిల్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో మరొకరు బరిలోకి దిగారు. ఆ ఇద్దరిలో ఒకరు ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ కాగా... మరొకరు ప్రపంచ రెండో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్.... ఈ ఆసక్తికర నేపథ్యంలో ఆదివారం ఆ్రస్టేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ హోరాహోరీగా సాగడం ఖాయమని అందరూ భావించారు. కానీ రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత సినెర్ తన ప్రత్యర్థికి ఆ అవకాశం ఇవ్వలేదు. తొలి పాయింట్ నుంచే పూర్తి ఆధిపత్యం కనబరిచి జ్వెరెవ్ జోరుకు అడ్డుకట్ట వేసిన సినెర్ వరుసగా రెండో ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెల్చుకున్నాడు. మరోవైపు సినెర్ దూకుడుకు ఎలా అడ్డుకట్ట వేయాలో తెలియక జ్వెరెవ్ వరుస సెట్లలో చేతులెత్తేసి కెరీర్లో మూడోసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. 2020 యూఎస్ ఓపెన్ ఫైనల్లో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) చేతిలో, 2024 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్ (స్పెయిన్) చేతిలో జ్వెరెవ్ పరాజయం పాలయ్యాడు.మెల్బోర్న్: ఎలాంటి సంచలనం నమోదు కాలేదు. ఆ్రస్టేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో కొత్త చాంపియన్ అవతరించలేదు. గత ఏడాది విజేతగా నిలిచిన ఇటలీ ప్లేయర్, ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ ఈ సంవత్సరం కూడా టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఆ్రస్టేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సినెర్ 2 గంటల 42 నిమిషాల్లో 6-3, 7-6 (7/4), 6ృ3తో రెండో సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై విజయం సాధించాడు. విజేతగా నిలిచిన సినెర్‌కు 35 లక్షల ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 19 కోట్ల 4 లక్షలు), రన్నరప్ జ్వెరెవ్‌కు 19 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 10 కోట్ల 33 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. గతంలో జ్వెరెవ్‌పై రెండుసార్లు నెగ్గి, నాలుగుసార్లు ఓడిపోయిన సినెర్ గత రికార్డును పట్టించుకోకుండా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఏస్‌తో మొదలుపెట్టిన సినెర్ తొలి గేమ్‌లో జ్వెరెవ్ చేసిన మూడు తప్పిదాలతో ఒకటిన్నర నిమిషంలోనే గేమ్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఎనిమిదో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సినెర్ తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 46 నిమిషాల్లో సెట్ గెలిచాడు. రెండో సెట్లో ఇద్దరూ ప్రతి పాయింట్‌కు హోరాహోరీగా పోటీపడ్డారు. దాంతో ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో స్కోరు 6ృ6తో సమమైంది. టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో సినెర్ పైచేయి సాధించి 72 నిమిషాల్లో రెండో సెట్‌నూ సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లోని ఆరో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సినెర్, ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 5ృ2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఎనిమిదో గేమ్‌ను జ్వెరెవ్ కాపాడుకోగా, తొమ్మిదో గేమ్‌లో సినెర్ తన సర్వీస్‌ను కాపాడుకోవడంతోపాటు బ్యాక్‌హాండ్ విన్నర్ షాట్‌తో విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో సినెర్ సర్వీస్‌లో జ్వెరెవ్ ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ సాధించే అవకాశాన్ని దక్కించుకోకపోవడం గమనార్హం. 4 గత 35 ఏళ్లలో గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో బ్రేక్ పాయింట్ ఎదుర్కోని నాలుగో ప్లేయర్ సినెర్. గతంలో పీట్ సంప్రాస్ (బోరిస్ బెకర్‌తో 1995 వింబుల్డన్ ఫైనల్), రోజర్ ఫెడరర్ (ఫిలిప్పోసిస్తో 2003 వింబుల్డన్ ఫైనల్), రాఫెల్ నాదల్ (కెవిన్ అండర్సన్‌తో 2017 యూఎస్ ఓపెన్ ఫైనల్) ఈ ఘనత సాధించారు.5 హార్డ్ కోర్టులపై వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఐదో ప్లేయర్ సినెర్. గతంలో జాన్ మెకన్రో (1979, 1980, 1981 యూఎస్ ఓపెన్), ఇవాన్ లెండిల్ (1985, 1986, 1987 యూఎస్ ఓపెన్), రోజర్ ఫెడరర్ (2005, 2006, 2007 యూఎస్ ఓపెన్), నొవాక్ జొకోవిచ్ (2 సార్లు; 2011 ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్, 2012 ఆ్రస్టేలియన్ ఓపెన్; 2015 ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్; 2016 ఆ్రస్టేలియన్ ఓపెన్) ఈ ఘనత సాధించారు.1 అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఇటలీ ప్లేయర్‌గా సినెర్ గుర్తింపు పొందాడు. రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో నికోలా పిత్రాంజెలి (1959, 1960 ఫ్రెంచ్ ఓపెన్) పేరిట ఉన్న రికార్డును సినెర్ (2024, 2025 ఆ్రస్టేలియన్ ఓపెన్; 2024 యూఎస్ ఓపెన్) సవరించాడు. 1 జిమ్ కొరియర్ (అమెరికా; 22 ఏళ్ల 5 నెలల 14 రోజులు; 1992ృ1993) తర్వాత ‘బ్యాక్ టు బ్యాక్’ ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన పిన్న వయస్కుడిగా సినెర్ (23 ఏళ్ల 5 నెలల 10 రోజులు) గుర్తింపు పొందాడు.8 కెరీర్లో తాము ఆడిన తొలి మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లోనూ విజేతగా నిలిచిన ఎనిమిదో ప్లేయర్ సినెర్. కానర్స్ (అమెరికా), జాన్ బోర్గ్, ఎడ్బర్గ్ (స్వీడన్), కుయెర్టన్ (బ్రెజిల్), ఫెడరర్, వావ్రింకా (స్విట్జర్లాండ్), అల్కరాజ్ (స్పెయిన్) ఈ ఘనత సాధించారు. 2019 ఆరేళ్ల తర్వాత ఆ్రస్టేలియన్ ఓపెన్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, రెండో ర్యాంకర్ తలపడ్డారు. ఈసారీ నంబర్‌వన్ ర్యాంకర్ వరుస సెట్లలో గెలిచాడు. 2019లో నంబర్‌వన్ జొకోవిచ్ రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్‌పై వరుస సెట్లలో నెగ్గాడు. 6 కెరీర్లో తాము ఆడిన తొలి మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఓడిన ఆరో ప్లేయర్ జ్వెరెవ్. ఈ జాబితాలో అగస్సీ (అమెరికా), ఇవానిసెవిచ్ (క్రొయేషియా), ముర్రే (బ్రిటన్), థీమ్ (ఆ్రస్టియా), రూడ్ (నార్వే) ఉన్నారు. -
నిశేష్ జోరుకు మోన్ఫిల్స్ బ్రేక్
ఆక్లాండ్: ఏఎస్‌బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్ నిశేష్ బసవరెడ్డి విజయ పరంపరకు బ్రేక్ పడింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 133వ ర్యాంకర్ నిశేష్ 6–7 (5/7), 4–6తో ప్రపంచ 52వ ర్యాంకర్, ఫ్రాన్స్ సీనియర్ స్టార్ ప్లేయర్ గేల్ మోన్ఫిల్స్ చేతిలో ఓడిపోయాడు. మోన్ఫిల్స్తో 1 గంట 46 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 19 ఏళ్ల నిశేష్ మూడు ఏస్‌లు సంధించాడు. తొలి సెట్లో ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో మోన్ఫిల్స్ పైచేయి సాధించాడు. రెండో సెట్ కూడా హోరాహోరీగా సాగింది. స్కోరు 4–4 వద్ద ఉన్నపుడు తొమ్మిదో గేమ్‌లో నిశేష్ సర్వీస్‌ను మోన్ఫిల్స్ బ్రేక్ చేసి 5–4తో ముందంజ వేశాడు. ఆ తర్వాత పదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకున్న మోన్ఫిల్స్ విజయాన్ని ఖరారు చేసుకొని కెరీర్లో 35వసారి ఏటీపీ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్నాడు.సెమీస్‌లో ఓడిన నిశేష్‌కు 35,480 డాలర్ల (రూ. 30 లక్షల 54 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సోమవారం విడుదల చేసే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో నిశేష్ 27 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 106వ ర్యాంక్‌కు చేరుకోనున్నాడు. ఈనెల 12న మొదలయ్యే ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ తొలి రౌండ్లో పదిసార్లు చాంపియన్, సెర్బియా దిగ్గజం జొకోవిచ్‌తో నిశేష్ తలపడతాడు. -
డిఫెండింగ్ చాంపియన్‌పై నిశేష్ సంచలన విజయం
ఏఎస్‌బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్ నిశేష్ బసవరెడ్డి సంచలనం సృష్టించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 19 ఏళ్ల నిశేష్ 6–4, 5–7, 6–4తో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ 23వ ర్యాంకర్ అలెజాంద్రో టబిలో (చిలీ)ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 2 గంటల 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిశేష్ తొమ్మిది ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. గత నెలలో ప్రొఫెషనల్‌గా మారిన నిశేష్ ఈ టోర్నీ తొలి రౌండ్లో 6–2, 6–2తో 85వ ర్యాంకర్ కమ్సానా (అర్జెంటీనా)పై గెలిచాడు. మరోవైపు అడిలైడ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ వరేలా (మెక్సికో) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–3, 3–6, 11–13తో నాలుగో సీడ్ హ్యారీ హెలియోవారా (ఫిన్లాండ్)–హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది. -
చాంపియన్స్ రితిన్ ప్రణవ్, వైదేహి
న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో టాప్ సీడ్, గుజరాత్ క్రీడాకారిణి వైదేహి చౌదరి విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన వైదేహి 6–3, 6–3తో మాయా రేవతి (తమిళనాడు)పై విజయం సాధించింది. గంటన్నర పాటు సాగిన తుది పోరులో తొలి గేమ్ కోల్పోయిన వైదేహి ఆ తర్వాత వరుసగా మూడు గేమ్‌లు నెగ్గి ముందంజ వేసింది. అదే జోరులో తొలి సెట్ కైవసం చేసుకున్న వైదేహి.. రెండో సెట్ కూడా నెగ్గి రెండోసారి జాతీయ చాంపియన్‌గా నిలిచింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడ్ ప్లేయర్ రెథిన్ ప్రణవ్ (తమిళనాడు) 6–4, 2–6, 6–2తో నితిన్ కుమార్ సిన్హా (రైల్వేస్)పై గెలిచి చాంపియన్‌గా అవతరించాడు. క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన 17 ఏళ్ల రెథిన్ ప్రణవ్ వరుస విజయాలతో సత్తా చాటి విజేతగా నిలిచాడు. -
సిలిచ్ కొత్త చరిత్ర... 777వ ర్యాంక్‌తో బరిలోకి దిగి ఏటీపీ సింగిల్స్ టైటిల్ సొంతం
హాంగ్జౌ (చైనా): క్రొయేషియా టెన్నిస్ ప్లేయర్ మారిన్ సిలిచ్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్ చరిత్రలో కొత్త ఘనతను నమోదు చేశాడు. ఏటీపీ టైటిల్ నెగ్గిన అతి తక్కువ ర్యాంకింగ్ ప్లేయర్‌గా అతను గుర్తింపు పొందాడు. మంగళవారం ముగిసిన హాంగ్జౌ ఓపెన్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో సిలిచ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో అతను 7–6 (7/5), 7–6 (7/5)తో చైనాకు చెందిన జాంగ్ జిజెన్‌ను ఓడించి తన కెరీర్లో 21వ టైటిల్ గెలుచుకున్నాడు. హౌంగ్జౌ ఓపెన్‌లో బరిలోకి దిగే సమయానికి సిలిచ్ ఏటీపీ ర్యాంక్ 777 కావడం విశేషం. 35 ఏళ్ల సిలిచ్‌కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇక్కడ ఆడే అవకాశం లభించింది. ఒకప్పుడు పురుషుల సింగిల్స్‌లో మంచి విజయాలతో టాప్ ఆటగాళ్లలో ఒకడిగా సిలిచ్ కొనసాగాడు. 2014లో తన ఏకైక గ్రాండ్‌స్లామ్ (యూఎస్ ఓపెన్) నెగ్గిన అతను ఆ్రస్టేలియన్ ఓపెన్, వింబుల్డన్‌లలో రన్నరప్‌గా నిలిచాడు. 2018లో అతను వరల్డ్ నంబర్‌వన్ ర్యాంకును కూడా అందుకున్నాడు. గత కొంత కాలంగా గాయాలతో అతను చాలా వరకు ఆటకు దూరమయ్యాడు. -
US Open 2024: సూపర్ సినెర్
ఈ ఏడాది తన అది్వతీయమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ మరో గొప్ప విజయం సాధించాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో సినెర్ పురుషుల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించాడు. ఆద్యంతం తన ఆధిపత్యం చలాయిస్తూ వరుస సెట్లలో అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్‌పై గెలిచాడు. తన కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టోర్నీ ప్రారంభానికి ముందు తెరపైకొచి్చన డోపింగ్ వివాదం తన ఆటతీరుపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఇటలీ స్టార్ యానిక్ సినెర్ నిరూపించాడు. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌కు, టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో సినెర్ విజేతగా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 23 ఏళ్ల సినెర్ 6–3, 6–4, 7–5తో ప్రపంచ 12వ ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో సినెర్‌కు ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురుకాలేదు. విజేతగా నిలిచిన సినెర్‌కు 36 లక్షల డాలర్లు (రూ. 30 కోట్ల 23 లక్షలు), రన్నరప్ ఫ్రిట్జ్కు 18 లక్షల డాలర్లు (రూ. 15 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. బ్రేక్ పాయింట్‌తో మొదలు... 2003లో ఆండీ రాడిక్ యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచాక మరో అమెరికన్ క్రీడాకారుడు గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించలేకపోయాడు. 2009లో ఆండీ రాడిక్ వింబుల్డన్ ఫైనల్లో ఫెడరర్ చేతిలో ఓడిపోయాక మరో అమెరికా ప్లేయర్ మరే గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ ఫైనల్ చేరలేకపోయాడు. 15 ఏళ్ల తర్వాత టేలర్ ఫ్రిట్జ్ రూపంలో అమెరికా ప్లేయర్ ఒకరు గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్ ఆడుతుండటంతో అందరి కళ్లు ఫ్రిట్జ్పైనే కేంద్రీకృతమయ్యాయి. అయితే సినెర్ మాత్రం అమెరికా అభిమానుల ఆశలను వమ్ము చేశాడు.తొలి సెట్లోని తొలి గేమ్‌లోనే ఫ్రిట్జ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన సినెర్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 2–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే మూడో గేమ్‌లో సరీ్వస్ కాపాడుకొని, నాలుగో గేమ్‌లో సినెర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫ్రిట్జ్ స్కోరును 2–2తో సమం చేశాడు. కానీ సినెర్ వెంటనే విజృంభించి మరో రెండుసార్లు ఫ్రిట్జ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను గెల్చుకున్నాడు. రెండో సెట్లోనూ సినెర్ దూకుడుకు ఫ్రిట్జ్ జవాబు ఇవ్వలేకపోయాడు. మూడో సెట్లో కాస్త పోటీ ఎదురైనా 12వ గేమ్‌లో ఫ్రిట్జ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన సినెర్ విజయాన్ని అందుకున్నాడు.6: ఈ ఏడాది సినెర్ గెలిచిన టైటిల్స్. ఆ్రస్టేలియన్ ఓపెన్, రోటర్‌డామ్ ఓపెన్, మయామి మాస్టర్స్, హాలె ఓపెన్, సిన్సినాటి మాస్టర్స్, యూఎస్ ఓపెన్ టోర్నీల్లో సినెర్ విజేతగా నిలిచాడు. 55: ఈ సంవత్సరం సినెర్ మొత్తం 60 మ్యాచ్‌లు ఆడాడు. 55 మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. ఐదింటిలో ఓడిపోయాడు. 3: తన కెరీర్లో ఒకే ఏడాది ఫైనల్ చేరుకున్న తొలి రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ విజేతగా నిలిచిన మూడో ప్లేయర్ సినెర్. గతంలో గిలెర్మో విలాస్ (అర్జెంటీనా; 1977లో ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్), జిమ్మీ కానర్స్ (అమెరికా; 1974లో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) మాత్రమే ఈ ఘనత సాధించారు. 4: ఒకే ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన నాలుగో ప్లేయర్ సినెర్. ఫెడరర్ (స్విట్జర్లాండ్), జొకోవిచ్ (సెర్బియా) మూడుసార్లు చొప్పున... 1988లో మాట్స్ విలాండర్ (స్వీడన్) ఒకసారి ఈ ఘనత సాధించారు. -
యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా సిన్నర్..
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా ప్రపంచ నంబర్ వన్, ఇటలీ టెన్నిస్ స్టార్ జానిక్ సిన్నర్ నిలిచాడు. ఆదివారం అర్ధరాత్రి దాటాక న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో అమెరికాకు చెందిన టేలర్ ఫ్రిట్జ్‌పై 6-3, 6-4 , 7-5 తేడాతో సిన్నర్ విజయం సాధించాడు.దాదాపు రెండు గంటల పాటు సాగిన తుది పోరులో ప్రత్యర్ధిని సిన్నర్ చిత్తు చేశాడు. మూడు సెట్లలోనూ పూర్తి ఆధిపత్యం సాధించిన ఈ ఇటాలియన్ స్టార్.. తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 23 ఏళ్ల సిన్నర్‌కు ఈ ఏడాదిలో ఇది రెండవ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను గెలుచుకోగా.. తాజాగా ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్‌ను కూడా సిన్నర్ సొంతం చేసుకున్నాడు.తొలి ఇటాలియాన్గా..అదే విధంగా యూఎస్ ఓపెన్ ట్రోఫీని సొంతం చేసుకున్న మొట్టమొదటి ఇటాలియన్గా సిన్నర్ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు ఏ ఇటలీ టెన్నిస్ క్రీడాకారుడు కూడా యూఎస్ ఓపెన్ టైటిల్‌ను గెలవలేదు. ఇక ఈ ట్రోఫీని టెన్నిస్ దిగ్గజం ఆండ్రీ అగస్సీ చేతుల మీదుగా సిన్నర్ అందుకున్నాడు.చదవండి: ENG VS SL 3rd Test: రూట్ ఖాతాలో భారీ రికార్డు -
ఎట్టకేలకు గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అ‘మెరిక’న్
న్యూయార్క్: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. ఎట్టకేలకు 2009 తర్వాత గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో అమెరికా ప్లేయర్‌ను ఫైనల్లో చూడబోతున్నాం. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో అమెరికా ఆటగాళ్లు టేలర్ ఫ్రిట్జ్, ఫ్రాన్సెస్ టియాఫో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. తొలి సెమీఫైనల్లో వీరిద్దరు ముఖాముఖిగా తలపడనున్నారు. దాంతో ఓ అమెరికా ప్లేయర్ యూఎస్ ఓపెన్ టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఖాయమైంది. 2009 వింబుల్డన్ టోరీ్నలో ఆండీ రాడిక్ తర్వాత మరో అమెరికా ప్లేయర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి క్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ 7–6 (7/2), 3–6, 6–4, 7–6 (7/3)తో నాలుగో సీడ్, 2020 రన్నరప్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ను బోల్తా కొట్టించాడు. తొమ్మిదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)తో జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్లో 20వ సీడ్ టియాఫో 6–3, 6–7 (5/7), 6–3, 4–1తో గెలుపొందాడు. నాలుగో సెట్లో టియాఫో 4–1తో ఆధిక్యంలో ఉన్న దశలో దిమిత్రోవ్ గాయంతో వైదొలిగాడు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్), ముకోవా (చెక్ రిపబ్లిక్) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. -
‘పసిడి’ వేటలో భారత షట్లర్లు
పారిస్: పారాలింపిక్స్‌లో ఆదివారం భారత షట్లర్లు మెరిపించారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్–4 కేటగిరీలో సుహాస్ యతిరాజ్... ఎస్ఎల్–3 కేటగిరీలో నితేశ్ కుమార్ ఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం రజత పతకాలను ఖరారు చేసుకున్నారు. 2007 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన సుహాస్ గత టోక్యో పారాలింపిక్స్‌లోనూ ఫైనల్‌కు చేరి రజత పతకం దక్కించుకున్నాడు. ఈసారి సెమీఫైనల్లో సుహాస్ 21–17, 21–12తో భారత్‌కే చెందిన సుకాంత్ కదమ్‌ను ఓడించాడు. మరో విభాగం సెమీఫైనల్లో నితేశ్ 21–16, 21–12తో దైసుకె ఫుజిహారా (జపాన్)పై గెలిచి తొలిసారి పారాలింపిక్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు. నేడు జరిగే ఫైనల్స్‌లో టోక్యో పారాలింపిక్స్ చాంపియన్ లుకాస్ మజుర్ (ఫ్రాన్స్)తో సుహాస్; డేనియల్ బెథెలి (బ్రిటన్)తో నితేశ్ తలపడతారు. మహిళల సింగిల్స్ ఎస్యు5 కేటగిరీలో ఇద్దరు భారత క్రీడాకారిణులు తులసిమతి మురుగేశన్, మనీషా రామదాస్ సెమీఫైనల్లో పోటీపడనున్నారు. ఇద్దరిలో ఒకరు ఫైనల్‌కు చేరుకోనుండటంతో ఈ విభాగంలోనూ భారత్‌కు కనీసం రజతం లభించనుంది. ఈరోజు జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో ఫ్రెడీ సెతియావాన్ (ఇండోనేసియా)తో సుకాంత్ తలపడతాడు. ప్రీతికి రెండో పతకం మహిళల అథ్లెటిక్స్ టి35 200 మీటర్ల విభాగంలో భారత అథ్లెట్ ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని సాధించింది. ప్రీతి 200 మీటర్ల దూరాన్ని 30.01 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. టి35 100 మీటర్ల విభాగంలోనూ ప్రీతికి కాంస్య పతకం లభించిన సంగతి తెలిసిందే. రాకేశ్‌కు దక్కని కాంస్యం పురుషుల ఆర్చరీ కాంపౌండ్ ఓపెన్ విభాగంలో భారత ప్లేయర్ రాకేశ్ కుమార్ కాంస్య పతక మ్యాచ్‌లో ఓడిపోయాడు. హి జిహావో (చైనా)తో జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో రాకేశ్ 146–147 స్కోరుతో పరాజయం పాలయ్యాడు. రవికి ఐదో స్థానం పురుషుల షాట్‌పుట్ ఎఫ్40 కేటగిరీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు రవి రొంగలి ఐదో స్థానంలో నిలిచాడు. ఇనుప గుండును రవి 10.63 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది ఆసియా పారా గేమ్స్‌లో రజతం గెలిచిన రవి ఈసారి తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినా ఫలితం లేకపోయింది. మిగెల్ మోంటెరో (పోర్చుగల్; 11.21 మీటర్లు) స్వర్ణం సాధించాడు. మరోవైపు మహిళల 1500 మీటర్ల టి11 విభాగం తొలి రౌండ్లో భారత అథ్లెట్ రక్షిత రాజు 5 నిమిషాల 29.92 సెకన్లలో గమ్యానికి చేరి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది. షూటర్ల గురి కుదరలేదు భారత షూటర్లకు ఆదివారం అచి్చరాలేదు. ఆదివారం లక్ష్యంపై గురి పెట్టిన ఏ షూటర్ కూడా పోడియంపై నిలువలేకపోయాడు. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (ఎస్‌హెచ్1) ఈవెంట్లో అవని లేఖరా 11వ స్థానంలో నిలువగా, సిద్ధార్థ బాబు 28వ స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. ఇదే విభాగం వ్యక్తిగత ఈవెంట్లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన అవని గురి ‘మిక్స్డ్’లో మాత్రం కుదర్లేదు. ఆమె 632.8 స్కోరు చేయగా, సిద్ధార్థ 628.3 స్కోరు చేశాడు. ఈ ఈవెంట్ల్లో టాప్–8 స్థానాల్లో నిలిచిన వారే ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (ఎస్‌హెచ్2) ఈవెంట్లోనూ శ్రీహర్ష రామకృష్ణకు క్వాలిఫయింగ్‌లోనే చుక్కెదురైంది. అతను 630.2 స్కోరుతో 26వ స్థానంలో నిలిచాడు. రోయింగ్‌లో నిరాశ భారత రోయింగ్ జోడీ కొంగనపల్లి నారాయణ–అనితకు పారాలింపిక్స్‌లో నిరాశ ఎదురైంది. ఆసియా పారా క్రీడల్లో రజత పతకం నెగ్గుకొచి్చన ఈ జంట పారిస్ నుంచి రిక్తహస్తాలతో రానుంది. ఆదివారం జరిగిన పీఆర్3 మిక్స్డ్ డబుల్ స్కల్స్ రోయింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నారాయణ–అనిత జోడీ ఓవరాల్‌గా ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. 7 నుంచి 12వ స్థానాల కోసం నిర్వహించిన వర్గీకరణ పోటీల్లో భారత ద్వయానికి 8వ స్థానం దక్కింది. ఈ జంట పోటీని 8 నిమిషాల 16.96 సెకన్లలో పూర్తి చేసింది. ఆర్మీ సిపాయి అయిన కొంగనపల్లి నారాయణ 2015లో జమ్మూ కశీ్మర్లోని సరిహద్దు విధుల్లో ఉండగా ల్యాండ్‌మైన్ పేలి ఎడమ కాలిని మోకాలు నుంచి పాదం వరకు పూర్తిగా కోల్పోయాడు. అనిత రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయింది. -
5 గంటల 35 నిమిషాలు
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో బుధవారం అద్భుతం చోటు చేసుకుంది. ఈ టోర్నీ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన మ్యాచ్ నమోదైంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 184వ ర్యాంకర్ డేనియల్ ఇవాన్స్ (బ్రిటన్) 5 గంటల 35 నిమిషాల్లో 6–7 (6/8), 7–6 (7/2), 7–6 (7/4), 4–6, 6–4తో ప్రపంచ 22వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా)పై గెలుపొందాడు. తొలి సెట్ 68 నిమిషాలు, రెండో సెట్ 67 నిమిషాలు, మూడో సెట్ 72 నిమిషాలు, నాలుగో సెట్ 67 నిమిషాలు, ఐదో సెటస్ 61 నిమిషాలు జరిగాయి. ఈ క్రమంలో యూఎస్ ఓపెన్‌లో సుదీర్ఘంగా సాగిన మ్యాచ్‌గా ఇవాన్స్, ఖచనోవ్ మ్యాచ్ గుర్తింపు పొందింది. 1992లో స్టీఫెన్ ఎడ్బర్గ్ (స్వీడన్), మైకేల్ చాంగ్ (అమెరికా) మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ 5 గంటల 26 నిమిషాలు సాగింది. ఆనాటి మ్యాచ్‌లో చాంగ్‌పై గెలిచిన ఎడ్బర్గ్ ఫైనల్లో పీట్ సంప్రాస్ (అమెరికా)ను కూడా ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఖచనోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక ఐదో సెట్లో ఇవాన్స్ ఒకదశలో 0–4తో వెనుకబడి ఓటమికి చేరువయ్యాడు. అయితే పట్టువదలకుండా పోరాడిన ఇవాన్స్ అనూహ్యంగా వరుసగా ఆరు గేమ్‌లు గెలిచి సెట్‌తోపాటు విజయాన్ని కూడా అందుకున్నాడు. సిట్సిపాస్‌కు షాక్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ), మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) శ్రమించి గెలుపొందగా... 11వ సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు.సినెర్ 2–6, 6–2, 6–1, 6–2తో మెకంజీ మెక్‌డొనాల్డ్ (అమెరికా)పై, అల్కరాజ్ 6–2, 4–6, 6–3, 6–1తో లీ టు (ఆ్రస్టేలియా)పై, మెద్వెదెవ్ 6–3, 3–6, 6–3, 6–1తో దుసాన్ లాజోవిచ్ (సెర్బియా)పై నెగ్గారు. సిట్సిపాస్ 6–7 (5/7), 6–4, 3–6, 5–7తో కొకినాకిస్ (ఆ్రస్టేలియా) చేతిలో ఓడిపోయాడు. రాడుకానూ ఓటమి మహిళల సింగిల్స్‌లో 2021 చాంపియన్ ఎమ్మా రాడుకానూ (బ్రిటన్), రన్నరప్ లేలా ఫెర్నాండెజ్ (కెనడా)... 2019 విజేత బియాంకా ఆండ్రెస్కూ (కెనడా) తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. సోఫియా (అమెరికా) 6–1, 3–6, 6–4తో రాడుకానూపై, పొటపోవా (రష్యా) 2–6, 6–4, 7–5తో లేలా ఫెర్నాండెజ్‌పై, ఐదో సీడ్ పావ్లీని (ఇటలీ) 6–7 (5/7), 6–2, 6–4తో బియాంకాపై గెలుపొందారు. రెండో రౌండ్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) 4–6, 5–7తో రూస్ (రొమేనియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్)... శ్రీరామ్ బాలాజీ (భారత్)–గిడో ఆండ్రెజి (అర్జెంటీనా) జోడీలు రెండో రౌండ్లోకి దూసుకెళ్లాయి. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 6–4తో రియాన్ సెగర్మన్–ప్యాట్రిక్ ట్రహక్ (అమెరికా) జంటపై... బాలాజీ–ఆండ్రెజి జోడీ 5–7, 6–1, 7–6 (12/10)తో డానిల్ (న్యూజిలాండ్)–వరేలా (మెక్సికో) జంటపై గెలుపొందాయి. -
US Open 2024: జ్వెరెవ్ శుభారంభం
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ జ్వెరెవ్ 6–2, 6–7 (5/7), 6–3, 6–2తో మాక్సిమిలన్ మార్టెరర్ (జర్మనీ)పై గెలుపొందాడు. 2 గంటల 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ 21 ఏస్‌లు సంధించాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి ప్రత్యర్థి సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు 2020 చాంపియన్ డొమినిక్ థీమ్ (ఆ్రస్టియా) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. 13వ సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) గంటా 50 నిమిషాల్లో 6–4, 6–2, 6–2తో థీమ్‌ను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా) కష్టపడి రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్లో కిన్వెన్ జెంగ్ 4–6, 6–4, 6–2తో అనిసిమోవా (అమెరికా)పై గెలిచింది. 12వ సీడ్ దరియా కసత్కినా (రష్యా), 24వ సీడ్ డొనా వెకిచ్ (క్రొయేíÙయా), 27వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) కూడా తొలి రౌండ్లో గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మరోవైపు తొమ్మిదో సీడ్ మరియా సాకరి (గ్రీస్) గాయం కారణంగా తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. యఫాన్ వాంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో సాకరి తొలి సెట్‌ను 2–6తో కోల్పోయింది. ఈ దశల గాయం కారణంగా సాకరి మ్యాచ్ నుంచి తప్పుకుంది. -
క్వాలిఫయర్‌తో జొకోవిచ్ తొలి పోరు
న్యూయార్క్: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌పై గురి పెట్టిన సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు యూఎస్ ఓపెన్‌లో అనుకూలమైన ‘డ్రా’ ఎదురైంది. ఈనెల 26 నుంచి మొదలయ్యే సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో క్వాలిఫయర్‌తో జొకోవిచ్ తలపడతాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ టోరీ్నలో ఆడుతున్న జొకోవిచ్ తొలి రౌండ్‌ను దాటితే రెండో రౌండ్లో అతనికి జర్మనీ ప్లేయర్ జాన్ లెనార్డ్ స్ట్రఫ్ లేదా లాస్లో జెరె (సెర్బియా) ఎదురవుతారు. జొకోవిచ్ జోరు కొనసాగించి క్వార్టర్ ఫైనల్ చేరితే అతనికి ప్రత్యర్థికి ఆరో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) ఉండే అవకాశముంది.సెమీఫైనల్లో నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ), ఫైనల్లో టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ)లతో జొకోవిచ్ ఆడే చాన్స్ ఉంది. మరో పార్శ్వంలో ఉన్న వరల్డ్ నంబర్‌వన్ యానిక్ సినెర్ తొలి రౌండ్లో అమెరికా ఆటగాడు మెకంజీ మెక్‌డొనాల్డ్‌తో ఆడతాడు. -
అల్కరాజ్ అనూహ్య పరాజయం
సిన్సినాటి: నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో స్పెయిన్ సంచలనంగా మారిన కార్లొస్ అల్కరాజ్ సిన్సినాటి ఓపెన్‌లో ఓడిపోవడాన్ని ఏమాత్రం జీరి్ణంచుకోలేకపోయాడు. దీంతో కోర్టులోనే ఈ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ తన రాకెట్‌ను విరగ్గొట్టేశాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో రెండో సీడ్ అల్కరాజ్ 6–4, 6–7 (5/7), 4–6తో గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం చవిచూశాడు. గురువారం అర్ధరాత్రి జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయింది. తొలి సెట్ గెలుపొందగా, రెండో సెట్ టైబ్రేక్‌కు దారితీసింది. ఈ దశలో మ్యాచ్ ఆగిపోగా మరుసటి రోజు టైబ్రేక్‌లో పుంజుకొని మ్యాచ్‌ను వరుస సెట్లలోనే ముగించవచ్చని అల్కరాజ్ భావించాడు. కానీ 37 ఏళ్ల వెటరన్ మోన్ఫిల్స్ పట్టుదలగా ఆడటంతో రెండో సెట్ అతని వశమైంది. అదే జోరుతో ఆఖరి సెట్‌నూ నెగ్గిన మోన్ఫిల్స్ మ్యాచ్ గెలుపొందాడు. దీంతో తన ప్రదర్శన, మ్యాచ్ ఫలితంతో నిరాశచెందిన స్పెయిన్ స్టార్ రాకెట్ బద్దలుకొట్టాడు. తన కెరీర్లోనే ఇదో చెత్తమ్యాచ్ అని, దీన్ని త్వరగా మర్చిపోయి యూఎస్ ఓపెన్‌పై దృష్టిపెట్టాలనుకుంటున్నట్లు చెప్పాడు. న్యూయార్క్‌లో ఈ నెల 26 నుంచి యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ జరుగుతుంది. -
పోరాడి ఓడిన సుమిత్ నగాల్
జెనరాలి ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీనలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ పోరాటం ముగిసింది. ఆ్రస్టియాలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 80వ ర్యాంకర్ సుమిత్ 5–7, 5–7తో ప్రపంచ 45వ ర్యాంకర్ పెడ్రో మారి్టనెజ్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. 2 గంటల 36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తన సర్వస్ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. సుమిత్‌కు 10,165 యూరోల (రూ. 9 లక్షల 24 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 25 పాయింట్లు లభించాయి. -
సినెర్... కొత్త నంబర్‌వన్
పారిస్: ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇటలీ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినెర్ తన కెరీర్లో గొప్ప ఘనత సాధించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సినెర్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 9,525 పాయింట్లతో నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాడు. టెన్నిస్‌లో కంప్యూటర్ ఆధారిత ర్యాంకింగ్స్ (1973 నుంచి) మొదలయ్యాక వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్న తొలి ఇటలీ ప్లేయర్‌గా 22 ఏళ్ల సినెర్ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది సినెర్ 33 మ్యాచ్‌ల్లో గెలిచి, 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తోపాటు మయామి మాస్టర్స్ సిరీస్, రోటర్‌డామ్ ఓపెన్‌లో అతను విజేతగా నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్లో ఓడిపోయాడు. గతవారం వరకు టాప్ ర్యాంక్‌లో ఉన్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ రెండు స్థానాలు పడిపోయి మూడో ర్యాంక్‌లో నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన కార్లోస్ అల్కరాజ్ ఒక స్థానం పురోగతి సాధించి రెండో ర్యాంక్‌లో నిలిచాడు. కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో నగాల్ భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ కెరీర్ బెస్ట్ 77వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆదివారం జర్మనీలో జరిగిన నెకర్ కప్ టోరీ్నలో విజేతగా నిలిచిన సుమిత్ 18 స్థానాలు పురోగతి సాధించాడు. తాజా ర్యాంక్ కారణంగా సుమిత్ వచ్చే నెలలో జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో సింగిల్స్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం ఖాయమైంది. -
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ చాంపియన్స్ అల్కరాజ్, స్వియాటెక్
ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోరీ్నలో పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) టైటిల్ నిలబెట్టుకోగా... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) రెండోసారి విజేతగా నిలిచింది. కాలిఫోరి్నయాలో జరిగిన ఫైనల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ 7–6 (7/5), 6–1తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించగా... స్వియాటెక్ 6–4, 6–0తో మరియా సాకరి (గ్రీస్)పై గెలిచింది. 2016లో జొకోవిచ్ తర్వాత ఇండియన్ వెల్స్ టోర్నీని వరుసగా రెండేళ్లు సాధించిన ప్లేయర్‌గా అల్కరాజ్ నిలిచాడు. అల్కరాజ్ కెరీర్లో ఇది ఐదో మాస్టర్స్ సిరీస్ టైటిల్. విజేతలుగా నిలిచిన అల్కరాజ్కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... స్వియాటెక్‌కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
India Open 2024: ప్రణయ్, ప్రియాన్షు శుభారంభం
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో తొలి రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచ 9వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్, 30వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... 19వ ర్యాంకర్ లక్ష్య సేన్, 36వ ర్యాంకర్ కిరణ్ జార్జి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21–6, 21–19తో ప్రపంచ 13వ ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)ను బోల్తా కొట్టించగా... ప్రియాన్షు 16–21, 21–16, 21–13తో లక్ష్య సేన్‌కు షాక్ ఇచ్చాడు. మరో మ్యాచ్‌లో కిరణ్ జార్జి 12–21, 15–21తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, రితూపర్ణ–శ్వేతపర్ణ (భారత్) జోడీ లు తొలి రౌండ్‌ను దాటలేకపోయాయి. గాయత్రి–ట్రెసా ద్వయం 21–18, 14–21, 13–21తో నాలుగో ర్యాంక్ జోడీ నమి మత్సుయామ–íÙడా చిహారు (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. టింగ్ యెంగ్–పుయ్ లామ్ యెంగ్ (హాంకాంగ్) జంట 21–6, 21–7తో రితూపర్ణ–శ్వేతపర్ణ జోడీపై గెలిచింది. -
Australian Open: శ్రమించిన జొకోవిచ్
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. ఆదివారం మొదలైన ఈ టోరీ్నలో తొలి రౌండ్ మ్యాచ్‌లో జొకోవిచ్ 6–2, 6–7 (5/7), 6–3, 6–4తో ప్రపంచ 178వ ర్యాంకర్, క్వాలిఫయర్ డినో ప్రిజ్మిక్ (క్రొయేíÙయా)పై కష్టపడి గెలిచాడు. 4 గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 11 ఏస్‌లు సంధించాడు. 40 విన్నర్స్ కొట్టిన ఈ సెర్బియా స్టార్ 49 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. ప్రత్యర్థి సరీ్వస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సరీ్వస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు. సబలెంకా సులువుగా... మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారస్) అలవోక విజయంతో రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. రెండో సీడ్ సబలెంకా 6–0, 6–1తో 53 నిమిషాల్లో ఇలా సెడెల్ (జర్మనీ)పై గెలిచింది. ఎనిమిదో సీడ్ మరియా సాకరి (గ్రీస్), తొమ్మిదో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) కూడా రెండో రౌండ్‌కు చేరుకున్నారు. -
శ్రీకాంత్ మరో పరాజయం
లక్నో: భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. మాజీ ప్రపంచ నంబర్‌వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఈ ఏడాది తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోతున్నాడు. సొంతగడ్డపై జరుగుతోన్న సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ టోర్నీలోనూ శ్రీకాంత్ ఆటకు మొదటి రౌండ్లోనే తెరపడింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్ శ్రీకాంత్ 21–23, 8–21తో చైనీస్ తైపీకి చెందిన చియా హవొ లీ చేతిలో వరుస గేముల్లో పరాజయం చవి చూశాడు. ఇతర మ్యాచ్‌ల్లో కిరణ్ జార్జ్ 21–16, 14–21, 21–13తో భారత్‌కే చెందిన క్వాలిఫయర్ చిరాగ్ సేన్‌పై గెలుపొందగా, సమీర్ వర్మ 9–21, 21–7, 17–21తో వాంగ్ జు వి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. ప్రియాన్షు రజావత్ 21–17, 21–19తో డిమిట్రి పనరిన్ (కజకిస్తాన్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో క్లిష్టమైన డ్రా ఎదురవడంతో మాల్విక బన్సోద్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఆమె 21–18, 17–21, 10–21తో జపాన్ స్టార్ నజొమి ఒకుహర చేతిలో ఓడిపోయింది. భారత సహచరుల మధ్య జరిగిన పోరులో ఉన్నతి హుడా 15–21, 21–19, 21–18తో ఆకర్షి కశ్యప్‌పై గెలుపొందగా, క్వాలిఫయర్ కేయూర 8–21, 16–21తో ఎనిమిదో సీడ్ సంగ్ షు యున్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూసింది. మహిళల డబుల్స్ గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ జోడీ ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. తొలి రౌండ్లో గాయత్రీ–ట్రెసా జాలీ జోడీ 21–9, 21–16తో భారత్‌కే చెందిన అపూర్వ –సాక్షి గెహ్లావత్ జంటపై గెలుపొందింది. మిక్స్డ్ డబుల్స్ మొదటి రౌండ్లో కోన తరుణ్–శ్రీకృష్ణప్రియ జంటకు 14–21, 15–21తో నితిన్ కుమార్–నవధ మంగళం జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. -
శ్రీకాంత్ పరాజయం
షెన్జెన్: చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్‌లకు నిరాశ ఎదురైంది. ఈ ముగ్గురూ తొలి రౌండ్‌ను దాటలేకపోయారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 24వ ర్యాంకర్ శ్రీకాంత్ 15–21, 21–14, 13–21తో ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 17వ ర్యాంకర్ లక్ష్య సేన్ 19–21, 18–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్ షి యు కి (చైనా) చేతిలో... 30వ ర్యాంకర్ ప్రియాన్షు 17–21, 14–21తో 13వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో రితూపర్ణ–శ్వేతపర్ణ (భారత్) ద్వయం 15–21, 9–21తో షు జియాన్ జాంగ్–యు జెంగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
అల్కరాజ్ అలవోకగా...
న్యూయార్క్: గత పదిహేనేళ్లుగా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో వరుసగా రెండేళ్లు ఒకే ప్లేయర్‌కు టైటిల్ దక్కలేదు. ఈ ఘనత సాధించేందుకు ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాజ్ చేరువయ్యాడు. సీజన్ నాలుగో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఈ స్పెయిన్ స్టార్ అలవోక విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 12వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 2 గంటల 30 నిమిషాల్లో 6–3, 6–2, 6–4తో గెలుపొందాడు. మూడు ఏస్‌లు సంధించిన అల్కరాజ్ మూడు డబుల్ ఫాల్ట్‌లు కూడా చేశాడు. నెట్‌వద్దకు 35 సార్లు దూసుకొచ్చిన అతను 28 సార్లు పాయింట్లు గెలిచాడు. నాలుగుసార్లు జ్వెరెవ్ సర్విస్‌ను బ్రేక్ చేసిన అల్కరాజ్ తన సర్విస్‌ను ఒక్కసారి కూడా కోల్పోలేదు. 2020లో ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన జ్వెరెవ్ నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 35 అనవసర తప్పిదాలు చేశాడు. మరో క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) 6–4, 6–3, 6–4తో ఎనిమిదో సీడ్, తన దేశానికే చెందిన ఆండ్రీ రుబ్లెవ్‌ను ఓడించి ఈ టోర్నీలో నాలుగోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఫైనల్లో చోటు కోసం డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్తో మెద్వెదెవ్ తలపడతాడు. 2021లో చాంపియన్‌గా నిలిచిన మెద్వెదెవ్ ... 2020లో సెమీఫైనల్లో, 2019లో ఫైనల్లో ఓడిపోయాడు. వొండ్రుసోవాకు కీస్ షాక్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, ఈ ఏడాది వింబుల్డన్ చాంపియన్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) పోరాటం ముగిసింది. 17వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–1, 6–4తో వొండ్రుసోవాను బోల్తా కొట్టించి ఈ టోర్నీలో 2018 తర్వాత మళ్లీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 86 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో కీస్ మూడుసార్లు వొండ్రుసోవా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. సెమీఫైనల్స్‌లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్)తో కీస్; ముకోవా (చెక్ రిపబ్లిక్)తో కోకో గాఫ్ (అమెరికా) తలపడతారు. -
జొకోవిచ్ శుభారంభం
న్యూయార్క్: కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంతో యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ అలవోకగా రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–0, 6–2, 6–3తో అలెగ్జాండర్ ముల్లర్ (ఫ్రాన్స్)పై నెగ్గాడు. ఈ గెలుపుతో 36 ఏళ్ల జొకోవిచ్ యూఎస్ ఓపెన్ ముగిశాక తుది ఫలితంతో సంబంధం లేకుండా మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటాడు. ముల్లర్‌తో గంటా 35 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ ఆరు ఏస్‌లు సంధించాడు. నెట్ వద్దకు 23 సార్లు దూసుకొచ్చి 20 సార్లు పాయింట్లు గెలిచాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయాడు. మరోవైపు నాలుగో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ చేరిన రూనె 3–6, 6–4, 3–6, 2–6తో కార్బెలాస్ బేనా (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. ఏడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), పదో సీడ్ టియాఫో (అమెరికా), తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌లో ఆరో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) కష్టపడి రెండో రౌండ్‌కు చేరగా... రెండుసార్లు మాజీ రన్నరప్ వొజి్నయాకి (డెన్మార్క్) సులువుగా రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. కోకో గాఫ్ 2 గంటల 51 నిమిషాల్లో 3–6, 6–2, 6–4తో సిగెముండ్ (జర్మనీ)పై, వొజి్నయాకి 6–3, 6–2తో ప్రొజోరోవా (రష్యా)పై గెలిచారు. -
సంచలనాలతో బోణీ...
టోక్యో: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత అగ్రశ్రేణి క్రీడాకారులు అదరగొట్టే ప్రదర్శన చేశారు. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ పదో ర్యాంకర్ ప్రణయ్ 21–17, 21–13తో ప్రపంచ ఆరో ర్యాంకర్, ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ లీ షి ఫెంగ్ (చైనా)పై... ప్రపంచ 20వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–13, 21–13తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయాలు సాధించారు. లీ షి ఫెంగ్‌పై ప్రణయ్‌కిది వరుసగా మూడో విజయంకాగా... చౌ తియెన్ చెన్పై శ్రీకాంత్‌కిది రెండో గెలుపు. 2014లో హాంకాంగ్ ఓపెన్‌లో చౌ తియెన్ చెన్ను తొలిసారి ఓడించిన శ్రీకాంత్ ఆ తర్వాత ఈ చైనీస్ తైపీ ప్లేయర్‌తో ఆడిన ఆరుసార్లు ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్‌లో భారత రైజింగ్ స్టార్ ఆకర్షి కశ్యప్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్ అకానె యామగుచి (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో ఆకర్షి 17–21, 17–21తో ఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ 11–21, 21–15, 21–14తో సయాకా హొబారా–యు సుజు (జపాన్) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 21–18, 9–21, 18–21తో యె హోంగ్ వె–లీ చియా సిన్ (చైనీస్ తైపీ) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
వింబుల్డన్-2023లో సంచలనం.. టాప్ ప్లేయర్‌కు షాక్
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగం రెండో రౌండ్లో సంచలనం నమోదైంది. బ్రిటన్ ప్లేయర్, వైల్డ్‌కార్డ్ ఎంట్రీ, ప్రపంచ 142వ ర్యాంకర్ లియామ్ బ్రాడీ 3 గంటల 27 నిమిషాల పోరులో 6–4, 3–6, 4–6, 6–3, 6–0తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే)ను బోల్తా కొట్టించాడు. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్లలో, ఈ సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన రూడ్ వింబుల్డన్ టోర్నీలో నాలుగో ప్రయత్నంలోనూ రెండో రౌండ్‌ను దాటలేకపోయాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–7 (4/7), 6–3, 6–4, 7–5తో కరాత్సెవ్ (రష్యా)పై, వావ్రింకా (స్విట్జర్లాండ్) 6–3, 4–6, 6–4, 6–2తో ఎచెవరి (అర్జెంటీనా)పై గెలిచారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్ లో ఐదో సీడ్ గార్సియా (ఫ్రాన్స్) 3–6, 6–4, 7–6 (10/6)తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా) పై నెగ్గింది. తొలి రౌండ్ మ్యాచ్‌లో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ ముకోవా (చెక్ రిపబ్లిక్) 4–6, 7–5, 1–6తో జూలీ నిమియెర్ (జర్మనీ) చేతిలో ఓడింది. -
Wimbledon 2023: అల్కరాజ్ అలవోకగా...
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోరీ్నలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో అల్కరాజ్ 6–0, 6–2, 7–5తో జెరెమీ చార్డీ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ పది ఏస్‌లు సంధించి రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. చార్డీ సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసిన ఈ స్పెయిన్ స్టార్ తన సరీ్వస్‌ను ఒకసారి కోల్పోయాడు. నెట్ వద్దకు తొమ్మిదిసార్లు దూసుకొచ్చిన అల్కరాజ్ ఏడుసార్లు పాయింట్లు గెలిచాడు. 38 విన్నర్స్ కొట్టిన అతను 14 అనవసర తప్పిదాలు చేశాడు. మరో మ్యాచ్‌లో రెండుసార్లు చాంపియన్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే కూడా అలవోక విజయంతో రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. రియాన్ పెనిస్టన్ (బ్రిటన్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ముర్రే 6–3, 6–0, 6–1తో విజయం సాధించాడు. వర్షం కారణంగా రెండో రోజు పలు మ్యాచ్‌లకు అంతరాయం కలిగింది. పైకప్పు కలిగిన సెంటర్ కోర్టు, నంబర్‌వన్ కోర్టులోని మ్యాచ్‌లు సజావుగా సాగాయి. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ రిబాకినా (కజకిస్తాన్) కష్టపడి రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. రిబాకినా 4–6, 6–1, 6–2తో షెల్బీ రోజర్స్ (అమెరికా)పై నెగ్గింది. మరో మ్యాచ్‌లో ఆరో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునిషియా) 6–3, 6–3తో మగ్ధలినా ఫ్రెచ్ (పోలాండ్)ను ఓడించింది. సోమవారం ఆలస్యంగా ముగిసిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఏడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 4–6, 6–4, 2–6తో 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ సోఫియా కెనిన్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది.