హంటర్స్‌ను ముంచిన లీ చోంగ్ వీ
న్యూఢిల్లీ: ప్రపంచ మాజీ నంబర్‌వన్... కోర్టులోకి దిగితే ఎలాంటి ప్రత్యర్థినైనా చిత్తు చేస్తాడు... అందుకే లీ చోంగ్ వీ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ లో ఖరీదైన క్రీడాకారుడు. హైదరాబాద్ హంటర్స్ ఏకంగా 65 లక్షల రూపాయలు ఇచ్చి చోంగ్ వీని కొనుక్కుంది. కానీ టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయిన లీ చోంగ్ వీ... ఈసారి కీలకమైన ట్రంప్ మ్యాచ్‌లో ఓటమితో హైదరాబాద్‌ను ముంచాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఏసర్స్ జట్టు 4-1తో హైదరాబాద్ హంటర్స్‌ను ఓడించింది.
మహిళల సింగిల్స్‌లో సుపనిద (హైదరాబాద్) 12-15, 15-9, 15-13తో పి.సి.తులసి (ఢిల్లీ)పై గెలిచింది. అయితే పురుషుల సింగిల్స్‌లో కశ్యప్ (హైదరాబాద్) 9-15, 10-15తో రాజీవ్ ఊసెఫ్ (ఢిల్లీ) చేతిలో ఓడిపోవడం స్కోరు 1-1తో సమమైంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో జ్వాల-కిడో (హైదరాబాద్) 15-7, 15-8తో అక్షయ్-అడ్‌కాక్‌పై గెలవడంతో 2-1కి ఆధిక్యం పెరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ ట్రంప్ మ్యాచ్‌లో స్టార్ ఆటగాడు లీ చోంగ్ వీ 15-9, 10-15, 14-15తో సుగియార్తో (ఢిల్లీ) చేతిలో కంగు తిన్నాడు. ఇదే టోర్నీలో శ్రీకాంత్ చేతిలో ఓడిన లీ చోంగ్ వీ ఈ మ్యాచ్‌నూ నిరాశపరిచాడు. తొలి గేమ్ సులభంగా నెగ్గిన వీ... రెండో గేమ్‌లో చేతులెత్తేశాడు.
మూడోగేమ్‌లోనూ సుగి యార్తో చెలరేగి 14-10 ఆధిక్యం లోకి వచ్చాడు. అయితే ఈ దశలో గాయపడటంతో వీ దీనిని ఉపయోగించుకుని వరుసగా నాలుగు పాయింట్లతో హైదరాబాద్ ఆశలు పెంచాడు. అయితే సుగియార్తో చివరి వరకూ పోరాడి చివరి పాయింట్‌ను గేమ్‌ను దక్కించుకున్నాడు. ట్రంప్ మ్యాచ్‌లో ఓడటంతో హైదరాబాద్ పాయింట్ ఒకటి తగ్గింది. దీంతో ఢిల్లీ 2-1 ఆధిక్యంలోకి వచ్చింది. చివరి మ్యాచ్ పురుషుల డబుల్స్‌లో కీన్-టాన్ బూన్ (ఢిల్లీ) 15-12, 14-15, 15-13తో నందగోపాల్, రిత్విక్ సాయి (ైహైదరాబాద్)పై గెలిచారు. ఇది ఢిల్లీకి ట్రంప్ మ్యాచ్ కావడంతో రెండు పాయింట్లు వచ్చాయి. దీంతో ఢిల్లీ 4-1తో ఈ మ్యాచ్‌ను గెలుచుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ ఏసర్స్ జట్టు బెంగళూరు టాప్‌గన్స్‌తో తలపడుతుంది.