Lee Chong Wei
-
బ్యాడ్మింటన్‌కు లీ చాంగ్ గుడ్‌బై
కౌలాలంపూర్: మలేసియా బ్యాడ్మింటన్ స్టార్ లీ చాంగ్ వీ ఆటకు వీడ్కోలు పలికాడు. గురువారం మీడియా సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన లీ చాంగ్ వీ.. 19 ఏళ్లుగా బ్యాడ్మింటన్ ఆడుతున్న తనకు గతేడాది క్యాన్సర్ సోకిందని, వైద్యుల సూచన మేరకు ఇక ఆటను కొనసాగించబోనని స్పష్టంచేశాడు. ‘ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతో కష్టంగా ఉంది. అయినా నాకు వేరే అవకాశం లేదు. ఇటీవల జపాన్‌లో వైద్యుల్ని సంప్రదిస్తే.. బ్యాడ్మింటన్ ఆడేందుకు నా శరీరం సిద్ధంగా లేదని తెలిపారు’ అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తనని ఎంతగానో అభిమానించే కుటుంబ సభ్యులకు, ప్రోత్సహించిన కోచ్‌లకు, అభిమానులకు లీ ధన్యవాదాలు తెలిపాడు. లీ.. 2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో డి జెనీరో ఒలింపిక్స్‌లో మూడు రజత పతకాలు సాధించాడు. అలాగే 2011 లండన్, 2013 గ్వాంగ్జౌ, 2015 జకార్తాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఈ ఆరింటిలో లీ చాంగ్ నాలుగుసార్లు చైనా క్రీడాకారుడు లిన్‌డాన్ చేతిలో ఓడిపోవడం గమనార్హం. మిగతా రెండింట్లో మరో చైనా క్రీడాకారుడు చెన్ లాంగ్ చేతిలో పరాజయం చెందాడు. -
బ్యాడ్మింటన్ దిగ్గజం లీ చోంగ్ వీకి క్యాన్సర్
కౌలాలంపూర్: ప్రపంచ మాజీ నంబర్‌వన్, మలేసియా బ్యాడ్మింటన్ దిగ్గజ ఆటగాడు లీ చోంగ్ వీ క్యాన్సర్ బారిన పడ్డాడు. అతనికి ముక్కు క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అది ప్రాథమిక దశలోనే ఉందని మలేసియా బ్యాడ్మింటన్ సంఘం (బీఏఎమ్) శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఇటీవలి పరీక్షల అనంతరం లీ చోంగ్ వీకి ప్రాథమిక స్థాయిలో ముక్కు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది’ అని బీఏఎమ్ అధ్యక్షుడు నోర్జా జకారియా తెలిపారు. ప్రస్తుతం అతను తైవాన్‌లో చికిత్స తీసుకుంటున్నాడని... తప్పుడు ప్రచారాలు చేయొద్దని సూచించారు. అతనికి అవసరమైన సాయం చేసేందుకు బీఏఎమ్ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఒలింపిక్స్‌లో మూడు సార్లు రజత పతకాలు గెలిచిన 35 ఏళ్ల లీ చోంగ్ వీ అనారోగ్యం కారణంగా ఈ ఏడాది జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌తో పాటు ఆసియా క్రీడల్లో పాల్గొనలేదు. -
ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడలకు లీ చోంగ్ వీ దూరం
మలేసియా బ్యాడ్మింటన్ దిగ్గజం లీ చోంగ్ వీ ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడల నుంచి వైదొలిగాడు. 35 ఏళ్ల లీ చోంగ్ వీ శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో అతను కనీసం నెలరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఫలితంగా లీ చోంగ్ వీ ఈనెల 30 నుంచి చైనాలో జరిగే ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల నుంచి... వచ్చే నెలలో ఇండోనేసియాలో జరిగే ఆసియా క్రీడల నుంచి తప్పుకున్నాడు. ఈ ఏడాది తొమ్మిది టోర్నీలు ఆడిన లీ చోంగ్ వీ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గడంతోపాటు మలేసియా ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. -
బ్యాడ్మింటన్ ఛాంపియన్ వీడియో కలకలం
కౌలాలంపూర్ : బ్యాడ్మింటన్ ఛాంపియన్ ‘లీ చోంగ్ వీ’ పేరిట సోషల్ మీడియాలో ఓ పోర్న్ క్లిప్ వైరల్ అవుతోంది. మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారటంతో ఎట్టకేలకు చోంగ్ వీ స్పందించాడు. అందులో ఉంది తాను కాదని.. దానిని వైరల్ చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నాడు. తన పేరును చెడగొట్టేందుకే కొందరు ఈ పని చేసి ఉంటారని అతను చెబుతున్నాడు. మలేసియా ఎయిర్ న్యూస్ కథనం ప్రకారం... సుమారు 15 నిమిషాల నిడివి ఉన్న వీడియో ఒకటి గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో ఉంది ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంక్ 2 ఆటగాడు అయిన లీ చోంగ్ వీ(35) అని కొందరు వైరల్ చేశారు .‘అదొక ఫేక్ వీడియో. అందులో ఉంది నేను కాదు. నా పరువును బజారుకీడ్చేందుకు కొందరు పని గట్టుకుని ఈ పని చేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాను. దయచేసి ఈ వీడియోను వైరల్ చెయ్యకండి. కష్టాలను కొని తెచ్చుకోకండి’ అంటూ చోంగ్ ఫేస్ బుక్‌లో ఓ పోస్టు ఉంచాడు. చోంగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేపట్టింది. కాగా, చోంగ్.. మలేసియన్ షట్లర్(మాజీ) వోంగ్ మ్యూ చూను వివాహం చేసుకోగా.. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడు సార్లు ఒలంపిక్ సిల్వర్ పతక విజేత అయిన చోంగ్.. ఆ మధ్య డోపింగ్ ఆరోపణలతో కూడా వార్తల్లో నిలిచాడు. వచ్చే నెలలో అతగాడి బయోపిక్ ‘లీ చోంగ్ వీ : రైజ్ ఆఫ్ ది లెజెండ్’ విడుదలకు సిద్ధమైపోయింది. ఈ నేపథ్యంలో పోర్న్ వీడియో కలకలం రేగటం గమనార్హం. -
లీ చోంగ్ వీకి షాక్
పురుషుల సింగిల్స్‌లో మంగళవారం పెను సంచలనం నమోదైంది. ప్రపంచ మాజీ నంబర్‌వన్, రెండో సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్) 21–19, 22–24, 21–17తో లీ చోంగ్ వీపై అద్భుత విజయం సాధించి ఆశ్చర్యపరిచాడు. గంటా 15 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లీ చోంగ్ వీ తొలి గేమ్‌ను కోల్పోయి, రెండో గేమ్‌లో రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్నాడు. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో లెవెర్డెజ్ ఏకాగ్రత కోల్పోకుండా ఆడాడు. ఒకదశలో 11–15తో వెనుకబడిన లెవెర్డెజ్ పట్టువిడవకుండా పోరాడి స్కోరును సమం చేయడమే కాకుండా ఆధిక్యంలోకి వెళ్లి చివరిదాకా దానిని కాపాడుకొని గెలుపొందాడు. పదోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన 34 ఏళ్ల లీ చోంగ్ వీ ఈ మెగా ఈవెంట్ చరిత్రలో తొలి రౌండ్లోనే ఓడిపోవడం ఇదే తొలిసారి. 2005లో కాంస్యం నెగ్గిన ఈ మలేసియా దిగ్గజం 2011, 2013, 2015లలో రజత పతకాలు గెలిచాడు. 2014లోనూ లీ చోంగ్ వీ రజతం గెలిచినా... ఆ ఏడాది డోపింగ్‌లో పట్టుబడటంతో అతని నుంచి పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. -
లీ చోంగ్ వీ... నాలుగోసారి
ఆల్ ఇంగ్లండ్ టైటిల్ నెగ్గిన మలేసియా స్టార్ బర్మింగ్‌హామ్: మోకాలి గాయంతో బాధపడుతూనే టోర్నీ ఆసాంతం ఆడిన మలేసియా బ్యాడ్మింటన్ స్టార్ లీ చోంగ్ వీ... ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ 21–12, 21–10తో పదో ర్యాంకర్ షి యుచి (చైనా)పై గెలిచాడు. లీ చోంగ్ వీ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ సాధించడం ఇది నాలుగోసారి. గతంలో అతను 2010, 2011, 2014లలో ఈ టైటిల్ గెలిచాడు. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) తొలిసారి టైటిల్ సాధించింది. ఫైనల్లో తై జు యింగ్ 21–16, 22–20 ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)పై నెగ్గింది. ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ పీవీ సింధుపై తై జు యింగ్ నెగ్గిన సంగతి తెలిసిందే. -
సింగిల్స్ విజేత చెన్ లాంగ్
రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ గేమ్‌లో మహిళలు నిరాశపరిచినా పురుషుల విభాగంలో ప్లేయర్స్ సత్తా చాటుతున్నారు. రియోలో స్వర్ణం కోసం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో చైనాకు చెందిన చెన్ లాంగ్ విజయం సాధించాడు. ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్, మలేసియా స్టార్ షట్లర్ లీ చోంగ్ వీ పై 21-18, 21-18 తేడాతో గెలుపొంది చైనా ఖాతాలో మరో స్వర్ణం జత చేశాడు. రెండు గేమ్స్ లోనూ మ్యాచ్ హోరాహోరాగా సాగింది. అయితే మెరుగైన ఆటతీరు ప్రదర్శించిన చెన్ లాంగ్ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ విజేతగా నిలిచాడు. ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు లీ చోంగ్ వీ గట్టి పోటీ ఇచ్చినా ఒక్క గేమ్ కూడా నెగ్గకపోవడంతో రజతంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల డబుల్స్ లోనూ చైనా ఆటగాళ్లు స్వర్ణం కొల్లగొట్టిన విషయం తెలిసిందే. -
లీ చోంగ్ వీకి సాయి ప్రణీత్ షాక్
బర్మింగ్హమ్:ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాడు సాయి ప్రణీత్ సంచలన విజయాన్ని నమోదు చేశాడు. సాయి ప్రణీత్ 24-22, 22-20 తేడాతో ప్రపంచ మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) ను బోల్తా కొట్టించాడు. ఆద్యంతం ఇరువురి మధ్య ఉత్కంఠభరితంగా సాగిన పోరులో సాయి ప్రణీత్ అంచనాలు మించి రాణించి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తొలి గేమ్‌లో లీంగ్ చో వీ 11-3, 15-7 ఆధిక్యంలో దూసుకువెళ్లినా, ప్రణీత్ నిలకడను ప్రదర్శించి ఆ గేమ్‌ను గెలిచాడు. ఆ తరువాత రెండో గేమ్‌లో కూడా లీ చోంగ్ వీ 16-10, 17-12 తేడాతో ముందంజ వేశాడు. కాగా, 19వ పాయింట్ వద్ద లీ చోంగ్ వీని నిలువరించిన ప్రణీత్ ఇక్కడ మూడు పాయింట్లను సాధించి విజయ ఢంకా మోగించాడు. దీంతో మూడుసార్లు ఆల్ ఇంగ్లండ్ ట్రోఫీ గెలిచిన లీ చోంగ్ వీ పోరు తొలి రౌండ్లోనే ముగిసినట్లయ్యింది. -
హంటర్స్‌ను ముంచిన లీ చోంగ్ వీ
న్యూఢిల్లీ: ప్రపంచ మాజీ నంబర్‌వన్... కోర్టులోకి దిగితే ఎలాంటి ప్రత్యర్థినైనా చిత్తు చేస్తాడు... అందుకే లీ చోంగ్ వీ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ లో ఖరీదైన క్రీడాకారుడు. హైదరాబాద్ హంటర్స్ ఏకంగా 65 లక్షల రూపాయలు ఇచ్చి చోంగ్ వీని కొనుక్కుంది. కానీ టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయిన లీ చోంగ్ వీ... ఈసారి కీలకమైన ట్రంప్ మ్యాచ్‌లో ఓటమితో హైదరాబాద్‌ను ముంచాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఏసర్స్ జట్టు 4-1తో హైదరాబాద్ హంటర్స్‌ను ఓడించింది. మహిళల సింగిల్స్‌లో సుపనిద (హైదరాబాద్) 12-15, 15-9, 15-13తో పి.సి.తులసి (ఢిల్లీ)పై గెలిచింది. అయితే పురుషుల సింగిల్స్‌లో కశ్యప్ (హైదరాబాద్) 9-15, 10-15తో రాజీవ్ ఊసెఫ్ (ఢిల్లీ) చేతిలో ఓడిపోవడం స్కోరు 1-1తో సమమైంది. మిక్స్డ్ డబుల్స్‌లో జ్వాల-కిడో (హైదరాబాద్) 15-7, 15-8తో అక్షయ్-అడ్కాక్పై గెలవడంతో 2-1కి ఆధిక్యం పెరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ ట్రంప్ మ్యాచ్‌లో స్టార్ ఆటగాడు లీ చోంగ్ వీ 15-9, 10-15, 14-15తో సుగియార్తో (ఢిల్లీ) చేతిలో కంగు తిన్నాడు. ఇదే టోర్నీలో శ్రీకాంత్ చేతిలో ఓడిన లీ చోంగ్ వీ ఈ మ్యాచ్‌నూ నిరాశపరిచాడు. తొలి గేమ్ సులభంగా నెగ్గిన వీ... రెండో గేమ్‌లో చేతులెత్తేశాడు. మూడోగేమ్లోనూ సుగి యార్తో చెలరేగి 14-10 ఆధిక్యం లోకి వచ్చాడు. అయితే ఈ దశలో గాయపడటంతో వీ దీనిని ఉపయోగించుకుని వరుసగా నాలుగు పాయింట్లతో హైదరాబాద్ ఆశలు పెంచాడు. అయితే సుగియార్తో చివరి వరకూ పోరాడి చివరి పాయింట్‌ను గేమ్‌ను దక్కించుకున్నాడు. ట్రంప్ మ్యాచ్‌లో ఓడటంతో హైదరాబాద్ పాయింట్ ఒకటి తగ్గింది. దీంతో ఢిల్లీ 2-1 ఆధిక్యంలోకి వచ్చింది. చివరి మ్యాచ్ పురుషుల డబుల్స్‌లో కీన్-టాన్ బూన్ (ఢిల్లీ) 15-12, 14-15, 15-13తో నందగోపాల్, రిత్విక్ సాయి (ైహైదరాబాద్)పై గెలిచారు. ఇది ఢిల్లీకి ట్రంప్ మ్యాచ్ కావడంతో రెండు పాయింట్లు వచ్చాయి. దీంతో ఢిల్లీ 4-1తో ఈ మ్యాచ్‌ను గెలుచుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ ఏసర్స్ జట్టు బెంగళూరు టాప్‌గన్స్‌తో తలపడుతుంది. -
‘ట్రంప్’తో జంప్...
* హైదరాబాద్ హంటర్స్ బోణీ * బెంగళూరు టాప్‌గన్స్‌పై 3-2 పాయింట్ల తేడాతో గెలుపు * మలుపు తిప్పిన ట్రంప్ మ్యాచ్‌లు * లీ చోంగ్ వీకి శ్రీకాంత్ షాక్ ముంబై: చివరి మ్యాచ్ వరకు ఉత్కంఠ ఉండాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘ట్రంప్ మ్యాచ్’ నిబంధన హైదరాబాద్ హంటర్స్ జట్టును గట్టెక్కించింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో ఆడిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ విజయాన్ని దక్కించుకుంది. బెంగళూరు టాప్‌గన్స్‌తో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ 3-2 పాయింట్ల తేడాతో గెలిచి శుభారంభం చేసింది. మొత్తం ఐదు మ్యాచ్‌ల్లో బెంగళూరు జట్టు మూడు మ్యాచ్‌ల్లో నెగ్గినా ఫలితం లేకపోయింది. మరోవైపు హైదరాబాద్ కీలకమైన రెండు ట్రంప్ మ్యాచ్‌ల్లో గెలిచి విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం. బెంగళూరు టాప్‌గన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ పెను సంచలనం సృష్టించాడు. హైదరాబాద్ హంటర్స్ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా)ను బోల్తా కొట్టించాడు. అంతర్జాతీయ సర్క్యూట్లో లీ చోంగ్ వీతో గతంలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిన శ్రీకాంత్ ఐదో ప్రయత్నంలో నెగ్గడం విశేషం. తొలి మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో సుపనిద (హైదరాబాద్) 8-15, 11-15తో సుయో ది (బెంగళూరు) చేతిలో ఓడిపోవడంతో హంటర్స్ జట్టు 0-1తో వెనుకపడింది. అయితే పురుషుల డబుల్స్ మ్యాచ్‌ను తమ ‘ట్రంప్ మ్యాచ్’గా పేర్కొని కార్స్టెన్ మోగెన్సన్-మార్కిస్ కిడో (హైదరాబాద్) జంట 13-15, 15-9, 15-14తో హూన్ థీమ్ హౌ-ఖిమ్ వా లిమ్ (బెంగళూరు) జోడీపై నెగ్గింది. దాంతో హంటర్స్ 2-1 పాయింట్లతో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో బెంగళూరు జట్టు వ్యూహాత్మక తప్పిదం చేసింది. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ను తమ ‘ట్రంప్ మ్యాచ్’గా నిర్ణయించింది. అయితే ఈ మ్యాచ్‌లో పారుపల్లి కశ్యప్ (హైదరాబాద్) 15-14, 15-13తో సమీర్ వర్మ (బెంగళూరు)ను ఓడించాడు. హైదరాబాద్ ఖాతాలో పాయింట్ చేరగా... తమ ట్రంప్ మ్యాచ్‌లో ఓడిన బెంగ ళూరు పాయింట్ కోల్పోయింది. దీంతో హైదరాబాద్ 3-0 ఆధిక్యంలోకి వచ్చింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-నీల్సన్ (బెంగళూరు) జంట 15-13, 15-13తో గుత్తా జ్వాల-మార్కిస్ కిడో (హైదరాబాద్) ద్వయంపై నెగ్గగా... చివరిదైన ఐదో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్ రెండో పోటీలో కిడాంబి శ్రీకాంత్ (బెంగళూరు) 15-12, 6-15, 15-7తో లీ చోంగ్ వీ (హైదరాబాద్)పై సంచలన విజయం సాధించాడు. ఈ రెండు విజయాలతో బెంగళూరు ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. ఓవరాల్‌గా హైదరాబాద్ 3-2తో విజయాన్ని దక్కించుకుంది. పీబీఎల్‌లో నేడు లక్నో x ఢిల్లీ రా. గం. 7.00 నుంచి స్టార్‌స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం చెన్నై స్మాషర్స్ శుభారంభం మరో మ్యాచ్‌లో చెన్నై స్మాషర్స్ 4-3 పాయింట్ల తేడాతో ముంబై రాకెట్స్ జట్టును ఓడించింది. మిక్స్డ్ డబుల్స్‌లో క్రిస్ అడ్కాక్-పియా జెబాదియా ద్వయం (చెన్నై) 15-10, 7-15, 15-11తో కామిల్లా జుల్-వ్లాదిమిర్ ఇవనోవ్ (ముంబై) జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్ బ్రైస్ లెవెర్డెజ్ (చెన్నై) 8-15, 11-15తో హెచ్ఎస్ ప్రణయ్ (ముంబై) చేతిలో ఓడిపోయాడు. ‘ట్రంప్ మ్యాచ్’ పురుషుల డబుల్స్‌లో మథియాస్ బో-ఇవనోవ్ (ముంబై) జంట 15-10, 9-15, 15-13తో క్రిస్ అడ్కాక్-ప్రణవ్ చోప్రా (చెన్నై) జోడీని ఓడించి 3-1 పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. విజేతగా నిలవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో చెన్నై పైచేయి సాధించింది. మహిళల సింగిల్స్‌లో తెలుగు అమ్మాయి పీవీ సింధు (చెన్నై) 15-8, 11-15, 15-8తో హాన్ లీ (ముంబై)పై నెగ్గగా... తమ ‘ట్రంప్ మ్యాచ్’లో సిమోన్ సాంతోసో 15-9, 15-12తో గురుసాయిదత్ (ముంబై)ను ఓడించడంతో చెన్నై 4-3తో విజయాన్ని దక్కించుకుంది. -
షటిల్ సమరం
నేటి నుంచి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ లీ చోంగ్ వీ విన్యాసాలు... సైనా నెహ్వాల్ స్మాష్‌లు... సింధు డ్రాప్ షాట్స్... మళ్లీ వచ్చేస్తున్నాయి. ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రీడాకారులంతా భారత అభిమానులను తమ బ్యాడ్మింటన్ విన్యాసాలతో అలరించబోతున్నారు. సైనాతో సింధు, శ్రీకాంత్‌తో లీ చోంగ్ వీ తలపడే అరుదైన సన్నివేశాలను భారత ప్రేక్షకులు ప్రత్యక్షంగా చూడబోతున్నారు. 15 రోజుల పాటు క్రీడాభిమానులను అలరించేందుకు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ వచ్చేసింది. కొత్త సంవత్సరంలో భారత్‌లో క్రీడలు బ్యాడ్మింటన్ లీగ్‌తో ప్రారంభం కాబోతున్నాయి. భారీ అంచనాల మధ్య, అంతర్జాతీయ స్టార్ క్రీడాకారులు బరిలోకి దిగుతున్న ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) నేడు ముంబైలో ప్రారంభం కానుంది. తొలి లీగ్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న అవధ్ వారియర్స్... ముంబై రాకెట్స్‌తో తలపడుతుంది. జనవరి 17న ఢిల్లీలో జరిగే ఫైనల్‌తో ముగిసే ఈ టోర్నీలో లీగ్ దశలో 15 టీమ్ మ్యాచ్‌లు జరుగుతాయి. హైదరాబాద్‌లో 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి. అలాగే 15న రెండో సెమీఫైనల్ కూడా భాగ్యనగరంలోనే నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. మొత్తం ఆరు నగరాల నుంచి ఆరు జట్లు లీగ్‌లో బరిలోకి దిగుతున్నాయి. - సాక్షి క్రీడావిభాగం జాక్వెలిన్ డ్యాన్స్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నృత్య ప్రదర్శన ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సలీమ్-సులేమాన్ ద్వయం కూడా తమ పాటలతో హోరెత్తించనున్నారు. పీబీఎల్ పాటను కూడా వీరే రూపొందించారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభోత్సవం మొదలవుతుంది. తొలి సీజన్ 2013 ఆగస్టులో జరిగింది. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) పేరుతో దీనిని నిర్వహించారు. ఆ సీజన్లో సైనా నెహ్వాల్ ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ హాట్‌షాట్స్ విజేతగా నిలిచింది. అయితే నిర్వాహకులతో గొడవల కారణంగా ఈ లీగ్ తర్వాత రెండేళ్లు జరగలేదు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) తిరిగి అనేక రకాల ప్రయత్నాలు, ప్రతిపాదనలు చేసి ఎట్టకేలకు దీనిని తిరిగి తెచ్చింది. అయితే ఐబీఎల్ అనే పేరు తమదేనంటూ పాత నిర్వాహకులు కోర్టుకు వెళ్లడంతో... ఈ సీజన్ నుంచి పీబీఎల్ పేరుతో నిర్వహించనున్నారు. హైదరాబాద్ హంటర్స్ యజమాని: ఎజైల్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆటగాళ్లు: లీ చోంగ్ వీ, కశ్యప్, సిరిల్ వర్మ (పురుషుల సింగిల్స్); సుపనిద (మహిళల సింగిల్స్); నందగోపాల్, సాయిసాత్విక్, మార్కిస్ కిడో, కార్స్టెన్, జ్వాల, మేఘన (డబుల్స్). కోచ్: రాజేంద్ర వేలానికి ముందే రూ.65 లక్షలు చెల్లించేందుకు సిద్ధమై డ్రాలో లీ చోంగ్ వీని దక్కించుకున్న హైదరాబాద్... డబుల్స్‌లోనూ బలంగానే ఉంది. మార్కిస్ కిడో, జ్వాల మిక్స్డ్ డబుల్స్‌లో ఆడితే... కిడో, కార్స్టెన్ లేదా నందగోపాల్‌తో డబుల్స్ ఆడతాడు. మహిళల సింగిల్స్‌లో సుపనిద... సైనా, సింధులను మినహా అన్ని మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థులను ఓడించొచ్చు. మొత్తం మీద జట్టు సమతూకంతోనే ఉంది. ఢిల్లీ ఏసర్స్ యజమాని: ఇన్ఫినిట్ కంప్యూటర్ సొల్యూషన్స్ ఆటగాళ్లు: అజయ్ జయరామ్, రాజీవ్ ఉసెఫ్, టామీ సుగియార్తో (పురుషుల సింగిల్స్); తులసి, శిఖా గౌతమ్ (మహిళల సింగిల్స్); అక్షయ్ దివాల్కర్, కూ కిట్ కీన్, టాన్ బూన్, అపర్ణా బాలన్, అడ్కాక్ (డబుల్స్). కోచ్: మధుమితా బిస్త్ అజయ్ జయరామ్, రాజీవ్ ఉసెఫ్ ఇద్దరూ గత ఏడాది నిలకడగా ఆడటం వల్ల పురుషుల సింగిల్స్‌పై ఈ జట్టు ఆశలు పెంచుకుంది. ఇండోనేసియా క్రీడాకారుడు సుగియార్తో కూడా అందుబాటులో ఉన్నాడు. మహిళల సింగిల్స్‌లో తులసి, శిఖా ఏమేరకు పెద్ద క్రీడాకారిణులను నిలువరిస్తారో చూడాలి. డబుల్స్‌లో మలేసియా జోడి కూ కిట్, టాన్బూన్ చెప్పుకోదగ్గ ఆటగాళ్లు. ఇంగ్లండ్‌కు చెందిన అడ్కాక్ మిక్స్డ్ డబుల్స్‌లో ప్రమాదకర క్రీడాకారిణి. ముంబై రాకెట్స్ యజమాని: దేవయాని లీజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆటగాళ్లు: ప్రణయ్, గురుసాయిదత్ (పురుషుల సింగిల్స్), రుత్విక శివాని, హన్ లీ, లియు డి (మహిళల సింగిల్స్), మను అత్రి, చాయుత్, ఇవనోవ్, మథియాస్ బో, కమిల్లా (డబుల్స్). కోచ్: రామ్ (కెనడా) పురుషుల సింగిల్స్‌లో భారత టాప్ క్రీడాకారులు ప్రణయ్, గురుసాయిదత్ ఇద్దరే ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో చైనా క్రీడాకారిణులు ఇద్దరు అందుబాటులో ఉన్నందున తెలుగమ్మాయి రుత్వికకు పెద్దగా అవకాశం రాకపోవచ్చు. డబుల్స్‌లో ఇవనోవ్, మథియాస్ బో ఈ జట్టుకు బలం. చెన్నై స్మాషర్స్ యజమాని: ద వోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆటగాళ్లు: సోని కుంకురో, సాంటోసో, లెవర్డెజ్ (పురుషుల సింగిల్స్), సింధు, కృష్ణ ప్రియ (మహిళల సింగిల్స్), ప్రణవ్ చోప్రా, క్రిస్ అడ్కాక్, టోబీ, జెబాదియా, సిక్కిరెడ్డి (డబుల్స్). కోచ్: గంగుల ప్రసాద్ పురుషుల సింగిల్స్‌లో ఇండోనేసియా స్టార్స్ సోని కుంకురో, సాంటోసోలతో పాటు ఫ్రాన్స్ ఆటగాడు లెవర్డెజ్ అందుబాటులో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో సింధు మీద ఈ జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. పురుషుల సింగిల్స్‌లో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఆడుతున్నందున... డబుల్స్‌లో ప్రణవ్ చోప్రాను కచ్చితంగా ఆడించాల్సి రావచ్చు. సిక్కిరెడ్డి కూడా ఈ జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తోంది. బెంగళూరు టాప్‌గన్స్ యజమాని: బ్రాండ్‌ప్రిక్స్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆటగాళ్లు: శ్రీకాంత్, సమీర్ వర్మ, ఆనంద్పవార్ (పురుషుల సింగిల్స్), సువో ది (మహిళల సింగిల్స్), సుమీత్ రెడ్డి, కిమ్ వా లిమ్, హూన్ తీన్, నెల్సీ, బ్లాయెర్, అశ్విని పొన్నప్ప (డబుల్స్). కోచ్: అరవింద్ భట్ బెంగళూరు జట్టుకు పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ రూపంలో ఒక విజయం సులభంగా లభించొచ్చు. అయితే రెండో సింగిల్స్‌లో సమీర్ వర్మ, ఆనంద్ పవార్లలో ఎవరు ఆడినా విజయం సాధించగలరా అనేది అనుమానమే. మహిళల సింగిల్స్‌లో ఇండోనేసియా క్రీడాకారిణి సువో దిని కూడా తక్కువ అంచనా వేయలేం. మలేసియా పురుషుల డబుల్స్ క్రీడాకారులు కిమ్ వా, హూన్తీన్ కూడా ప్రమాదరకమైన జోడి. అశ్విని పొన్నప్ప మిక్స్డ్ డబుల్స్‌లో ఎవరితో ఆడుతుందో స్పష్టత లేదు. అవధ్ వారియర్స్ (లక్నో) యజమాని: సహారా ఆటగాళ్లు: సాయి ప్రణీత్, సౌరభ్ వర్మ, తనోంగ్సక్ (పురుషుల సింగిల్స్), సైనా నెహ్వాల్, వృశాలి (మహిళల సింగిల్స్), కెయ్ యున్, హెండ్రా గుణవన్, బొడిన్ ఇసార, మనీషా, క్రిస్టినా (డబుల్స్). కోచ్: అనూప్ శ్రీధర్ లీగ్ ఆరంభానికి ముందే సైనా నెహ్వాల్‌ను జట్టులోకి తీసుకోవడం ద్వారా ఈ జట్టు అందరి దృష్టినీ ఆకర్షించింది. 65 లక్షల రూపాయలు భారత స్టార్ క్రీడాకారిణికి ఇస్తున్న ఈ జట్టు... పురుషుల సింగిల్స్‌లో ప్రధానంగా థాయ్‌లాండ్ క్రీడాకారుడు తనోంగ్సోక్పై ఆధారపడింది. మరో సింగిల్స్‌లో సాయిప్రణీత్, సౌరభ్ వర్మలలో ఒకరు ఆడొచ్చు. డబుల్స్ విభాగంలో మిగిలిన జట్లతో పోలిస్తే బలంగా లేకపోవడం ఈ జట్టుకు లోటు. ప్రైజ్ మనీ: విజేతకు రూ.65 లక్షలు ట్రంప్ మ్యాచ్ ప్రతి ప్రత్యర్థితోనూ పోరుకు ముందు తమ ఐదు మ్యాచ్‌లలో ఒక మ్యాచ్‌ను ఆ జట్టు ట్రంప్ మ్యాచ్‌గా ప్రకటించాలి. సాధారణంగా మ్యాచ్ గెలిస్తే ఒక పాయింట్ వస్తుంది. కానీ ట్రంప్ మ్యాచ్ గెలిస్తే రెండు పాయింట్లు సాధించవచ్చు. ఇదే సమయంలో ట్రంప్ మ్యాచ్‌లో ఓడిపోతే ఒక మైనస్ పాయింట్ వస్తుంది. అయితే ట్రంప్ మ్యాచ్ ప్రతిసారీ ఒక్క ప్లేయరే ఆడటానికి లేదు. అంటే ఉదాహరణకు లక్నో తరఫున అన్ని సైనా మ్యాచ్‌లనే ట్రంప్ మ్యాచ్‌లుగా ఎంచుకునే అవకాశం లేదు. ఒక్క ప్లేయర్ లీగ్ దశలో ఐదు మ్యాచ్‌లలో కేవలం రెండు మాత్రమే ట్రంప్ మ్యాచ్‌లు ఆడాలి. నాకౌట్ దశలో ఒక మ్యాచ్‌లోనే ఈ అవకాశముంటుంది. ఒక జట్టు ట్రంప్ మ్యాచ్‌గా ఒక మ్యాచ్‌ను ఎంచుకుంటే... ప్రత్యర్థి జట్టుకు అది మామూలు మ్యాచ్ మాత్రమే. అంటే ప్రత్యర్థి గెలిస్తే ఒక పాయింట్ మాత్రమే వస్తుంది. ఒకవేళ రెండు జట్లు ఒకే మ్యాచ్‌ను ట్రంప్ మ్యాచ్‌గా ఎం చుకుంటే మాత్రం గెలిచిన వాళ్లకు రెండు పాయింట్లు, ఓడినవాళ్లకు మైనస్ పాయింట్ వస్తాయి. టోర్నీ నుంచి ఒక్క ఆటగాడు కూడా వైదొలగలేదు. అందరూ వస్తున్నారు. ప్రారంభోత్సవంతో పాటు ముంబై లెగ్‌కు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. భారత బ్యాడ్మింటన్‌కు మేలు చేసే పీబీఎల్... ట్రంప్ మ్యాచ్ నిబంధన కచ్చితంగా ప్రేక్షకులకు ఆసక్తి పంచుతుందని భావిస్తున్నాం. దేశంలో బ్యాడ్మింటన్‌ను మరింత విస్తరించడానికి పీబీఎల్ ఉపయోగపడుతుంది. - ‘సాక్షి’తో పున్నయ్య చౌదరి (పీబీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ డెరైక్టర్) ఫార్మాట్ * ఒక్కో జట్టు ఒక్కో ప్రత్యర్థితో ఒక్కసారి ఆడుతుంది. ఒక్క పోరులో ఐదు మ్యాచ్‌లు ఉంటాయి. ఇందులో పురుషుల సింగిల్స్ రెండు, మహిళల సింగిల్స్ ఒకటి, పురుషుల డబుల్స్ ఒకటి, మిక్స్డ్ డబుల్స్ ఒక మ్యాచ్ ఉంటుంది. * ప్రతి మ్యాచ్ కూడా బెస్ట్ ఆఫ్ త్రీ గేమ్స్ పద్ధతిలో జరుగుతుంది. ఒక్కో గేమ్‌లో ముందుగా ఎవరు 15 పాయింట్లు సాధిస్తే వాళ్లు గెలిచినట్లు. రెండు పాయింట్లు తేడా ఉండాలనే నిబంధన లేదు. * ఒక్కో మ్యాచ్ గెలిస్తే ఒక్క పాయింట్. అయితే ‘ట్రంప్’ మ్యాచ్‌ల వల్ల ఒక్క ప్రతర్థిపై ఒకే జట్టు ఐదు మ్యాచ్‌ల ద్వారా ఆరు పాయింట్లు సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది. * పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు సెమీస్‌కు చేరతాయి. ఒకటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌లో తలపడవు. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లను ‘డ్రా’ తీయడం ద్వారా తొలి రెండు స్థానాల జట్లకు ప్రత్యర్థులను నిర్ణయిస్తారు. * ఒక వేళ లీగ్ దశలో పాయింట్ల పట్టికలో రెండు జట్లు సమంగా నిలిస్తే... ఆ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు ముందుకు వెళుతుంది. * ప్రతి జట్టూ తమ ఐదు మ్యాచ్‌లలో కనీసం రెండింటిలో భారత క్రీడాకారులు ఆడేలా చూసుకోవాలి. అలాగే ఏ ప్లేయర్ కూడా రెండు కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడకూడదు. పురుషుల సింగిల్స్‌లో రెండు మ్యాచ్‌లు వేర్వేరు క్రీడాకారులు ఆడాలి. -
హైదరాబాద్‌కు లీ చోంగ్ వీ... లక్నోకు సైనా
న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో భారత స్టార్ సైనా నెహ్వాల్... మలేసియా మేటి క్రీడాకారుడు లీ చోంగ్ వీలకు అత్యధిక మొత్తం దక్కింది. లక్నోకు చెందిన అవధ్ వారియర్స్ సైనాను ... హైదరాబాద్ హంటర్స్ లీ చోంగ్ వీను చెరో లక్ష డాలర్లకు (రూ. 66 లక్షల 69 వేలు) సొంతం చేసుకున్నాయి. భారత్‌కే చెందిన మరో స్టార్ క్రీడాకారిణి పీవీ సింధును 95 వేల డాలర్లకు (రూ. 63 లక్షల 35 వేలు) చెన్నై స్మాషర్స్... శ్రీకాంత్‌ను 80 వేల డాలర్లకు (రూ. 53 లక్షల 35 వేలు) బెంగళూరు టాప్‌గన్స్ జట్లు తీసుకున్నాయి. సైనా నెహ్వాల్, లీ చోంగ్ వీలను కొనుగోలు చేసేందుకు అన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి చూపాయి. దాంతో ఆదివారం రాత్రే లాటరీని నిర్వహించారు. లాటరీలో అవధ్ వారియర్స్‌కు సైనా... హైదరాబాద్ హంటర్స్‌కు లీ చోంగ్ వీ దక్కారు. సోమవారం మిగతా ఆటగాళ్లకు వేలం నిర్వహించారు. పీబీఎల్ జనవరి 2న ముంబైలో మొదలై 17న న్యూఢిల్లీలో ముగుస్తుంది. మిగతా ఆటగాళ్ల వివరాలు: పారుపల్లి కశ్యప్ (హైదరాబాద్ హంటర్స్-35 వేల డాలర్లు), సుమీత్ రెడ్డి (బెంగళూరు టాప్‌గన్స్-25 వేల డాలర్లు), మనూ అత్రి (ముంబై రాకెట్స్-25 వేల డాలర్లు), గుత్తా జ్వాల (హైదరాబాద్ హంటర్స్-30 వేల డాలర్లు), అశ్విని పొన్నప్ప (బెంగళూరు టాప్‌గన్స్-30 వేల డాలర్లు), హెచ్ఎస్ ప్రణయ్ (ముంబై రాకెట్స్-47 వేల డాలర్లు), వ్లాదిమిర్ ఇవనోవ్ (రష్యా-ముంబై రాకెట్స్, 42 వేల డాలర్లు), రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్-ఢిల్లీ ఏసర్స్, 36 వేల డాలర్లు), టామీ సుగియార్తో (ఇండోనేసియా-ఢిల్లీ ఏసర్స్, 74 వేల డాలర్లు). -
లీ చోంగ్ వీకి ఊరట
కౌలాలంపూర్: డోపింగ్‌లో పట్టుబడిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ బ్యాడ్మింటన్ ఆటగాడు లీ చోంగ్ వీ (మలేసియా)పై ఎనిమిది నెలల నిషేధం విధించారు. అయితే 33 ఏళ్ల లీ చోంగ్ వచ్చే నెలలోనే తిరిగి బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) విధించిన ఈ నిషేధం గతేడాది ఆగస్టు 30 నుంచి వర్తించనుంది. దీంతో మే నెలలోనే ఈ నిషేధం తొలగిపోనుంది. ప్రపంచ చాంపియన్‌షిప్ టోర్నీ సందర్భంగా తీసిన డోపింగ్ శాంపిల్‌లో లీ చోంగ్ వీ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలడంతో నవంబర్ 11న తాత్కాలిక నిషేధం విధించారు. -
ప్రపంచ బ్యాడ్మింటన్ నెంబర్ వన్ లీ చోంగ్‌పై వేటు
కౌలాలంపూర్: ప్రపంచ బ్యాడ్మింటన్ నెంబర్ వన్ ఆటగాడు లీ చోంగ్ వీపై వేటుపడింది. డోపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) లీని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య మంగళవారం ఈ మేరకు ప్రకటించింది. లీ విషయంపై దర్యాప్తు చేయాల్సిందిగా బీడబ్ల్యూఎఫ్ డోపింగ్ విచారణ ప్యానల్‌కు సిఫారసు చేసింది. మలేసియాకు చెందిన లీ ఎన్నో అంతర్జాతీయ పతకాలు సాధించాడు. రెండు ఒలింపిక్ పతకాలు కూడా గెలిచారు. -
లీ చోంగ్ వీపై తాత్కాలిక సస్పెన్షన్
డోపింగ్ టెస్టులో విఫలం కౌలాలంపూర్: ప్రపంచ నంబర్‌వన్ బ్యాడ్మింటన్ ఆటగాడు లీ చోంగ్ వీపై వేటు పడింది. డోపింగ్ టెస్టులో విఫలం కావడం తో తాత్కాలికంగా అతడిపై సస్పెన్షన్ విధించారు. అయితే అధికారికంగా మలేసియా బ్యాడ్మింటన్ సంఘం (బీఏఎం) ఇతడి పేరును వెల్లడించడం లేదు. ‘మా ఆటగాడి ‘బి’ శాంపిల్‌లో నిషేధిత డెక్సామిథాసోన్ వాడినట్టు తేలింది. అయితే అతడి పేరును వెల్లడించేందుకు మాకు స్వేచ్ఛ లేదు. ఈ ఆటగాడు కఠోర శ్రమతో పైకి వచ్చినవాడే కాకుండా అత్యద్భుతమైన ఆటగాడు. తన విజయాలేవీ అడ్డదారులో రాలేదని నమ్ముతున్నాం’ అని బీఏఎం డిప్యూటీ అధ్యక్షుడు నోర్జా జకారియా తెలిపారు. -
వచ్చే నెలలో లీ చోంగ్ వీ ‘బి' శాంపిల్ పరీక్ష
కౌలాలంపూర్: డోపింగ్‌లో పట్టుబడిన మలేసియా బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ లీ చోంగ్ వీ ‘బి’ శాంపిల్‌ను వచ్చే నెల 4 లేదా 5న పరీక్షించనున్నారు. ఈ రెండు రోజుల్లో ఏదో ఓ తేదీని నిర్ణయించుకోవాలని అంతర్జాతీయ సమాఖ్య... తమ అసోసియేషన్‌కు సూచించిందని మలేసియా క్రీడల మంత్రి ఖైరీ జమాలుద్దీన్ తెలిపారు. అయితే ఈ అంశంపై అథ్లెట్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తేదీ ఖరారైతే అథ్లెట్ ఓస్లో వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పిన మంత్రి ‘బి’ శాంపిల్‌ను ఆటగాడి ముందరే పరీక్షిస్తారని స్పష్టం చేశారు. ‘లీకి సంబంధించిన ఇటీవలి వైద్య నివేదికలను పరిశీలిస్తాం. అసలు ఆ డ్రగ్ ఎలా వచ్చిందో కనుక్కుంటాం’ అని మంత్రి వెల్లడించారు. కోపెన్‌హగన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ సందర్భంగా లీ చోంగ్ వీ నిషేధిత ఉత్ప్రేరకం ‘డెక్సామీథసోన్’ను వాడినట్లు తేలింది. అయితే ఈ ఈవెంట్‌కు ముందు తన కండర గాయానికి స్టెమ్ సెల్స్‌తో చికిత్స చేయించుకున్నాడు. -
లీ చోంగ్ వీపై డోపింగ్ ఆరోపణలు!
పరీక్షలో విఫలమైన బ్యాడ్మింటన్ స్టార్ కౌలాలంపూర్: బ్యాడ్మింటన్ ప్రపంచాన్ని దిగ్భ్రమకు గురి చేసే వార్త ఒకటి బయటికి వచ్చింది. ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) డోపింగ్ పరీక్షలో విఫలమైనట్లు మలేసియా మీడియా వెల్లడించింది. ఇటీవల డెన్మార్క్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో జరిపిన డ్రగ్ టెస్టులో లీచోంగ్కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినట్లు సమాచారం. ఈ టోర్నీ ఫైనల్లో లీ... చెన్ లాంగ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. ‘నిషేధిత ఉత్ప్రేరకం వాడిన మా దేశపు ఒక అథ్లెట్ పరీక్షలో పాజిటివ్‌గా తేలాడు. అయితే తదుపరి పరీక్షలు కొనసాగుతున్నాయి కాబట్టి అతని పేరు నేను చెప్పలేను’ అని మలేసియా క్రీడాశాఖ మంత్రి ఖైరీ జమాలుద్దీన్ వెల్లడించాడు. మీడియా మాత్రం ఆ ఆటగాడు లీ చోంగ్ వీ అని బయటపెట్టింది. ఒలింపిక్ స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్ ఒక్కసారి కూడా గెలవకపోయినా నిలకడగా సుదీర్ఘ కాలం పాటు నంబర్‌వన్‌గా కొనసాగుతున్న లీ చోంగ్ వీకి ఆ దేశంలో జాతీయ హీరోగా మంచి గుర్తింపు ఉంది. అంతర్జాతీయ క్రీడా సమాఖ్యనుంచి మలేసియా డోపింగ్ వ్యతిరేక సంస్థకు ఈ నెల 1న దీనికి సంబంధించిన లేఖ వచ్చిందని, అయితే రెండో శాంపిల్ పరీక్ష ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదని కూడా జమాలుద్దీన్ చెప్పారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆయన ఆదేశించారు. -
లీ చోంగ్ వీ, వాంగ్‌లకు టైటిల్స్
ఇండియా ఓపెన్ న్యూఢిల్లీ: ఈ సీజన్లో తమ జోరును కొనసాగిస్తూ లీ చోంగ్ వీ (మలేసియా), షిజియాన్ వాంగ్ (చైనా) తమ ఖాతాలో మరో టైటిల్‌ను జమచేసుకున్నారు. ఆదివారం ముగిసిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ... మహిళల సింగిల్స్‌లో షిజియాన్ వాంగ్ విజేతలుగా నిలిచారు. ఫైనల్స్‌లో టాప్ సీడ్ లీ చోంగ్ వీ 21-13, 21-17తో రెండో సీడ్ చెన్ లాంగ్ (చైనా)ను ఓడించగా... షిజియాన్ వాంగ్ 22-20, 21-19తో ప్రపంచ నంబర్‌వన్ జురుయ్ లీ (చైనా)పై విజయం సాధించింది. 31 ఏళ్ల లీ చోంగ్ వీకిది 54వ టైటిల్ కాగా... ఇండియా ఓపెన్ నెగ్గడం మూడోసారి. గతంలో 2011, 2013లలో కూడా అతను ఈ టైటిల్‌ను దక్కించుకున్నాడు. మరోవైపు షిజియాన్ వాంగ్ కెరీర్లో ఇది 15వ టైటిల్. పురుషుల డబుల్స్‌లో మథియాస్ బో-మోగెన్సన్ (డెన్మార్క్) జోడి... మహిళల డబుల్స్‌లో తాంగ్ యువాన్‌తింగ్-యాంగ్ యూ (చైనా) జంట... మిక్స్డ్ డబుల్స్‌లో జోచిమ్ నీల్సన్-క్రిస్టినా పెడర్సన్ (డెన్మార్క్) ద్వయం టైటిల్స్ సాధించాయి. -
‘ఆల్ ఇంగ్లండ్’ చాంప్స్ లీ చోంగ్ వీ, వాంగ్
బర్మింగ్హమ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో లీ చోంగ్ వీ (మలేసియా), షిజియాన్ వాంగ్ (చైనా) విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ లీ చోంగ్ వీ 21-13, 21-18తో రెండో సీడ్ చెన్ లాంగ్ (చైనా)పై... మహిళల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ షిజియాన్ వాంగ్ 21-19, 21-18తో టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా)పై విజయం సాధించారు. వరుసగా ఆరో ఏడాది ఈ మెగా టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న లీ చోంగ్ వీ మూడోసారి టైటిల్‌ను అందుకున్నాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను మహ్మద్-హెంద్రా సెతియవాన్ (ఇండోనేసియా) ద్వయం దక్కించుకుంది. -
రికార్డుకు చేరువలో లీ చోంగ్ వీ
కౌలాలంపూర్: మరో విజయం సాధిస్తే... ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టైటిల్‌ను అత్యధికసార్లు నెగ్గిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టిస్తాడు. 2008 నుంచి 2010 వరకు వరుసగా మూడుసార్లు పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన లీ చోంగ్ వీ నాలుగోసారి ఈ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో లీ చోంగ్ వీ 21-14, 21-16తో జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)పై గెలిచాడు. రికార్డుస్థాయిలో మూడుసార్లు ఈ టైటిల్‌ను సాధించిన మహిళల జోడి వాంగ్ జియోలీ-యూ యాంగ్ (చైనా); పురుషుల జంట మథియాస్ బో-కార్స్టెన్ మోగెన్సన్ (డెన్మార్క్) ఈసారి సెమీఫైనల్లోనే నిష్ర్కమించాయి. దాంతో అత్యధికసార్లు ఈ టైటిల్ సాధించనున్న రికార్డుకు లీ చోంగ్ వీ మరో విజయం దూరంలో ఉన్నాడు. -
ముంబైకి రెండో విజయం
ముంబై: ‘తురుపుముక్క’ లీ చోంగ్ వీ బరిలోకి దిగడంతో ముంబై మాస్టర్స్ జట్టు మెరిసింది. గాయం కారణంగా తొలి రెండు లీగ్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ఈ ప్రపంచ నంబర్‌వన్ మూడో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. దాంతో ముంబై మాస్టర్స్ ఒక్కసారిగా బలోపేతమైంది. ఫలితంగా ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ స్మాషర్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై మాస్టర్స్ 4-1తో గెలిచింది. ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్, భారత జట్టు మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ సతీసమేతంగా... టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి తదితరులు ఈ పోటీని తిలకించారు. పురుషుల తొలి సింగిల్స్‌లో లీ చోంగ్ వీ (ముంబై) 21-12, 21-16తో డారెన్ లియూ (ఢిల్లీ)ను ఓడించి ‘మాస్టర్స్’ జట్టుకు శుభారంభం అందించాడు. రెండో మ్యాచ్‌లో ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్, మాజీ నంబర్‌వన్ టిన్ బౌన్ 21-11, 21-13తో అరుంధతి పంతవానె (ఢిల్లీ)పై అలవోకగా గెలిచింది. డబుల్స్ మ్యాచ్‌లో కీన్ కీట్ కూ-తాన్ బూన్ హోయెంగ్ (ఢిల్లీ) జోడి 14-21, 21-15, 11-7తో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (ముంబై) ద్వయంపై గెలిచింది. అయితే నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్ రెండో మ్యాచ్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ మార్క్ జ్విబ్లెర్ 18-21, 21-10, 11-9తో సాయిప్రణీత్ (ఢిల్లీ)పై నెగ్గడంతో ముంబై విజయం ఖాయమైంది. చివరిదైన మిక్స్డ్ డబుల్స్‌లో లీ చోంగ్ వీ-టిన్ బౌన్ జంట 21-18, 15-21, 11-5తో దిజు-ప్రజక్తా సావంత్ జోడిపై గెలవడంతో ముంబై 4-1తో పోటీని సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో ముంబై 11 పాయింట్లతో హైదరాబాద్ హాట్‌షాట్స్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానానికి చేరుకుంది. బుధవారం విశ్రాంతి దినం. నంబర్‌వన్ ఆట... బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే లీ చోంగ్ వీ తన స్థాయికి తగ్గ ఆటతీరుతో అందర్నీ అలరించాడు. కళ్లు చెదిరే స్మాష్‌లు... సమయానుకూలంగా డ్రాప్ షాట్లు... నెట్‌వద్ద దూకుడు... మొత్తానికి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. తొలి రెండు నిమిషాల్లో 7-2తో ఆధిక్యంలోకి వెళ్లిన ఈ మలేసియా దిగ్గజం ఆ తర్వాత దూకుడును మరింత పెంచాడు. వరుసగా ఎనిమిది పాయింట్లు నెగ్గి 20-10తో ముందంజ వేసి అదే జోరులో తొలి గేమ్‌ను 15 నిమిషాల్లో దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో లీ చోంగ్ వీ కాస్త నెమ్మదించడంతో డారెన్ లీ కొన్ని పాయింట్లు రాబట్టాడు. అయితే కీలకదశలో లీ చోంగ్ వీ చెలరేగి మ్యాచ్‌ను ముగించాడు. మ్యాచ్ అనంతరం సచిన్ టెండూల్కర్ మైదానంలోకి వచ్చి లీ చోంగ్ వీతో ముచ్చటించాడు.