
కౌలాలంపూర్: మలేసియా బ్యాడ్మింటన్ స్టార్ లీ చాంగ్ వీ ఆటకు వీడ్కోలు పలికాడు. గురువారం మీడియా సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన లీ చాంగ్ వీ.. 19 ఏళ్లుగా బ్యాడ్మింటన్ ఆడుతున్న తనకు గతేడాది క్యాన్సర్ సోకిందని, వైద్యుల సూచన మేరకు ఇక ఆటను కొనసాగించబోనని స్పష్టంచేశాడు. ‘ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతో కష్టంగా ఉంది. అయినా నాకు వేరే అవకాశం లేదు. ఇటీవల జపాన్‌లో వైద్యుల్ని సంప్రదిస్తే.. బ్యాడ్మింటన్ ఆడేందుకు నా శరీరం సిద్ధంగా లేదని తెలిపారు’ అని పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా తనని ఎంతగానో అభిమానించే కుటుంబ సభ్యులకు, ప్రోత్సహించిన కోచ్‌లకు, అభిమానులకు లీ ధన్యవాదాలు తెలిపాడు. లీ.. 2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో డి జెనీరో ఒలింపిక్స్‌లో మూడు రజత పతకాలు సాధించాడు. అలాగే 2011 లండన్, 2013 గ్వాంగ్‌జౌ, 2015 జకార్తాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఈ ఆరింటిలో లీ చాంగ్ నాలుగుసార్లు చైనా క్రీడాకారుడు లిన్‌డాన్ చేతిలో ఓడిపోవడం గమనార్హం. మిగతా రెండింట్లో మరో చైనా క్రీడాకారుడు చెన్ లాంగ్ చేతిలో పరాజయం చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment