లీ చోంగ్ వీపై డోపింగ్ ఆరోపణలు!
పరీక్షలో విఫలమైన బ్యాడ్మింటన్ స్టార్
కౌలాలంపూర్: బ్యాడ్మింటన్ ప్రపంచాన్ని దిగ్భ్రమకు గురి చేసే వార్త ఒకటి బయటికి వచ్చింది. ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) డోపింగ్ పరీక్షలో విఫలమైనట్లు మలేసియా మీడియా వెల్లడించింది. ఇటీవల డెన్మార్క్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో జరిపిన డ్రగ్ టెస్టులో లీచోంగ్‌కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినట్లు సమాచారం. ఈ టోర్నీ ఫైనల్లో లీ... చెన్ లాంగ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. ‘నిషేధిత ఉత్ప్రేరకం వాడిన మా దేశపు ఒక అథ్లెట్ పరీక్షలో పాజిటివ్‌గా తేలాడు. అయితే తదుపరి పరీక్షలు కొనసాగుతున్నాయి కాబట్టి అతని పేరు నేను చెప్పలేను’ అని మలేసియా క్రీడాశాఖ మంత్రి ఖైరీ జమాలుద్దీన్ వెల్లడించాడు. మీడియా మాత్రం ఆ ఆటగాడు లీ చోంగ్ వీ అని బయటపెట్టింది.
ఒలింపిక్ స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్ ఒక్కసారి కూడా గెలవకపోయినా నిలకడగా సుదీర్ఘ కాలం పాటు నంబర్‌వన్‌గా కొనసాగుతున్న లీ చోంగ్ వీకి ఆ దేశంలో జాతీయ హీరోగా మంచి గుర్తింపు ఉంది. అంతర్జాతీయ క్రీడా సమాఖ్యనుంచి మలేసియా డోపింగ్ వ్యతిరేక సంస్థకు ఈ నెల 1న దీనికి సంబంధించిన లేఖ వచ్చిందని, అయితే రెండో శాంపిల్ పరీక్ష ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదని కూడా జమాలుద్దీన్ చెప్పారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆయన ఆదేశించారు.