లీ చోంగ్ వీకి షాక్
పురుషుల సింగిల్స్‌లో మంగళవారం పెను సంచలనం నమోదైంది. ప్రపంచ మాజీ నంబర్‌వన్, రెండో సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. బ్రైస్ లెవెర్‌డెజ్ (ఫ్రాన్స్) 21–19, 22–24, 21–17తో లీ చోంగ్ వీపై అద్భుత విజయం సాధించి ఆశ్చర్యపరిచాడు. గంటా 15 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లీ చోంగ్ వీ తొలి గేమ్‌ను కోల్పోయి, రెండో గేమ్‌లో రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్నాడు. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో లెవెర్‌డెజ్ ఏకాగ్రత కోల్పోకుండా ఆడాడు.
ఒకదశలో 11–15తో వెనుకబడిన లెవెర్‌డెజ్ పట్టువిడవకుండా పోరాడి స్కోరును సమం చేయడమే కాకుండా ఆధిక్యంలోకి వెళ్లి చివరిదాకా దానిని కాపాడుకొని గెలుపొందాడు. పదోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన 34 ఏళ్ల లీ చోంగ్ వీ ఈ మెగా ఈవెంట్ చరిత్రలో తొలి రౌండ్‌లోనే ఓడిపోవడం ఇదే తొలిసారి. 2005లో కాంస్యం నెగ్గిన ఈ మలేసియా దిగ్గజం 2011, 2013, 2015లలో రజత పతకాలు గెలిచాడు. 2014లోనూ లీ చోంగ్ వీ రజతం గెలిచినా... ఆ ఏడాది డోపింగ్‌లో పట్టుబడటంతో అతని నుంచి పతకాన్ని వెనక్కి తీసుకున్నారు.